Friday, April 14, 2017

అవునా?

దేశ భాషలందు తెలుగు లెస్స!

ఎన్నోసార్లు విన్నా, అన్నేసార్లు గర్వంగా చెప్పుకున్నా (జనాలకి). అసలింతకీ, అది నిజమేనా? లేక, కావ్యానుసారంగా చెప్పినదేనా?  ఆ చెప్పిన కృష్ణదేవరాయలకైనా దేశంలోని అన్ని భాషలూ తెలుసా? ఆయన దేశంలో నాలుగైదు కంటే ఎక్కువ భాషలు లేవనుకుంటా, కానీ ఇప్పుడో? ఇప్పుడు లోకమంతా ఒకే భాషనుకుంటాగా! ఇప్పుడు కూడా తెలుగు భాషే లెస్సా? ఎవరి మాతృభాష వారికి తీపి కాదా?


అసలు, ఏ భాషైనా ఎందుకు గొప్పదవుతుంది? మిగిలిన భాషలు నాకెన్ని తెలుసనీ, వాటి గురించి నాకేంతెలుసనీ, నేనిన్నాళ్లు గర్వంగా చెప్పుకున్నా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడం వల్ల నాకేంటి ఉపయోగం, లేకపొతే ఏంటి నష్టం? తెలుగు చదివేంత, తెలుగు సినిమాలు చూసేంత మరియు తెలుగు రాష్ట్రాల్లో బ్రతకడానికి సరిపడేంత తెలుగు తెలిస్తే చాలదా? పండితుడు అనిపించుకునేంత తెలియాలా? కాలానుగునంగా, మారుతున్న అవసరాలకి తగ్గట్లు, తెలుగు కూడా మనకేమైనా ఉపయోగపడగలదా? లేదా, ఇంగ్లీషు రాని తెలుగువారితో మాట్లాడేందుకేనా? ఇంతకీ, ఇవాళ మన జీవితాల్లో తెలుగు పాత్ర ఎంత? అది క్రమేనా తగ్గుతోందా?


ఒకవేళ ఏ కారణం చేతనైనా, తెలుగు వాడకం నశించి, ఒక నాలుగైదు దశాబ్దాల తర్వాత తెలుగు మాట్లాడేవారే ఉండరనుకుంటే, అప్పుడు కలిగే నష్టాలేంటి? ప్రంపంచంలోంచి ఒక సంస్కృతి మాసిపోతుందా ? కొంత(ఎంత?) సాహిత్యం చనిపోతుందా ? మన భావితరాల మనుగడకేమైనా ముప్పు వాటిల్లనుందా? ఎందుకీ ప్రభుత్వాలూ, నేతలు, భాషావేత్తలూ మొత్తుకుంటున్నారు? అదంతా ఏంలేదు నాదంతా అక్కర్లేని కంగారా?


శోధించడమే జీవన విధానంగా అలవరచుకుంటున్న మనం, ఈ ప్రశ్నలకి జవాబులు సాధించగలమా?  తెలుగు భాష గొప్పదనాన్ని నిలదీయటం మా ఉద్దేశం కాదు, దాన్ని ఎరిగి ఉండటం మన బాధ్యత అని గుర్తుచేయడమే మా ఉద్దేశం.

(తెలుగుతోట 2017 సంపాదకీయం, TSS, IISc, Bangalore)

No comments:

Post a Comment