Tuesday, March 30, 2021

మా బానుమతి ఆంటీ సైలెన్సు (Episode-3)

(అన్ని Episodes ఇక్కడ దొరుకుతాయి.)
 
పక్కనింట్లో రోంత సప్పుడొచ్చినా, కొత్త కారు గేటుముందర ఆగినా మా ఆంటీ సేచ్చాండే పని ఆపేసి మరీ కిటికీలోంచి తొంగిసూడాల్సిందే. అందికే పక్కింట్లోకి వొచ్చిన బంధువులుగూడ ఆయమ్మను ఎచ్చరిచ్చారు 'బాగుండావా?' అని. ఆమద్య, జగ్గూ గాడి అక్కాబావ వాళ్లు రింగురోడ్డు పైన రోంత స్థలం కొన్న్యారని తెల్సింది మా అంటీకి, వాన్నే అడిగి కనుక్కుందిలే, 'పొద్దన్నుంచి యాడికో తిరుగుతానారే?' అని. 'కలుగులోంచి ఎలక చూసినట్లు చూసింటాది ఆంటీ' అనుకున్న జగ్గూకి సెప్పక తప్పలేదు, ఎక్కడ కొన్న్యారో, ఎంతకి కొన్న్యారో.

అప్పుడు కొట్టడం మొదులు బెట్టింది సుత్తి, వాడి నెత్తిమింద. వాళ్ల అల్లుడు వాళ్లకి శా...నా ఆస్తులు ఉండాయంట. మొత్తం ఎన్నుండాయో కూడా చెప్పలేమంట.  Income tax వాళ్లు వొచ్చారని ఆస్తుల లెక్కలు ఎవురికీ చెప్పరంట, ఆఖరికి పిల్లనిచ్చిన వీళ్లకు కూడా. అంతా ఇన్న్యాక, జగ్గూ గాడు "ఎన్నుండాయో, యాడుండాయో గూడా తెలీకుంటే ఎట్ల ఆంటీ, మట్టసంగ అడగండి, మీకేమన్నా టోకరా ఏసినారేమో అనిపిచ్చాంది సూచ్చాంటే" అన్న్యాడంట. ఆంటీకి కాల్తుంది కదా మరి, "Income tax గురించి మనకేం తెలుచ్చాదిలే జగ్గూ, వాళ్లకు దండిగా లెక్కుండాది గాబట్టి తెలుచ్చాది గాని" అనిందంట మూతిముడుసుకుంటా. 'నీ బడాయి బండ్లకెత్త' అనుకొని, "నాకు పనుండాదిలే ఆంటీ" అని ఆన్నుంచి లేసొచ్చినాడంట జగ్గూ గాడు. 

ఇది జరిగినాక రెండు వారాలకు జగ్గూ వాళ్ళక్కకి సీమంతం చేసినారు. బానుమతి ఆంటీ వచ్చిందిగానీ, శానా సైలెంటుగా ఉన్నింది. భోజనాల దగ్గరకూడా పేరు పెట్టకుండా తినింది అన్నీ. 'ఏమైందిబ్బా ఆంటీకి?' అనుకున్న్యారు సందులోని వాళ్లంతా. మరుసటిరోజు సాయంత్రం మిక్చరు కొండయ్య దగ్గర పార్సిల్ కట్టించుకుంటాంటే జగ్గూకి వాళ్ళ స్కూలు ఫ్రెండు తగిలి, ఒక వార్త చెప్పినాడు. జగ్గూ వాళ్ళ కాలనీలో ఉండే కాంట్రాక్టరు ఒకాయప్పకి ఈ ఫ్రెండు వాళ్ళు అప్పిచ్చారంట, ఆయన IP పెట్టి పరారయినాడంట. జగ్గూ వాళ్ళకేమైనా ఆ కాంట్రాక్టరు వాళ్లు తెల్సునేమోనని ఆ ఫ్రెండు అడిగినాడు, మరి రాబట్టుకోవల్ల కదా ఎంతోకొంత. తెల్దని చెప్పి ఇంటికొచ్చినాడు జగ్గూ. ఇంటికొచ్చేసరికి, హాలుమద్యలో పనిమనిషి పరక పట్టుకొని ఏదో చెబుతాంటే ఇంట్లోని అందురూ చాగంటి చెప్పే ప్రవచనం విన్నట్లు వింటానారు. తీరా చూస్తే, మిక్చరు అంగడికాడ జగ్గూ విన్న వార్తలే ఇక్కడకూడా వినపడతానాయ్. తనుకూడా వాళ్లతో కలిసి కూర్చున్న్యాడు జగ్గూ. TV9 దేవీ నాగవల్లిని మించిపోయిన ఈ పనిమంచి సంబరమెందిరా అంటే, మన బానుమతి ఆంటీ గూడ ఓ పదహైదు లచ్చలు ఇచ్చిందంట ఆ కాంట్రాక్టరుకి. 'ఓహో! ఆంటీకి పెద్ద టోకరా ఏసినారే' అనుకున్న్యాడు మన జగ్గూ. అసలే తనని పనినుంచి తీసేసినప్పటినుంచి ఈ పనిమంచికి బానుమతి ఆంటీ అంటే శానా కచ్చ. అందుకనే, ఆయమ్మ ఆనందానికి హద్దూపద్దూ లేకుండాపోయింది. 'ఇంగ సాల్లే పొయ్ పని చుస్కోపొమ్మని' చెప్పినా ఆయమ్మకి పోవాలని లేదు, కానీ, తొందరగా ఇక్కడ పని అయిపోజేసుకుంటే వేరే ఇండ్లల్లో కూడా చాటింపు వెయ్యొచ్చని గుర్తొచ్చి, ఆయమ్మ పనికి వంగింది. 

మిక్చరుతిని, టీతాగి, సందు చివర జనాలు షటిల్ ఆడుతూ కనపడితే వెళ్లి కూచున్నాడు జగ్గూ. ఆంటీకి కాంట్రాక్టరు టోకరా వేసిన సంగతి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తానాడు. కానీ, వాళ్ళింట్లో కూడా పనిమంచి చదివిన వార్తలు విన్న జగ్గూ ఫ్రెండుగాడు ఒకడు ఇదే విషయం మొదలుపెట్టినాడు, పోన్లే అని జగ్గూ కుదుటపడినాడు. ఆడుతున్న జనాలు కూడా ఆపేసిమరీ విన్నారు ఆ వార్తలు.

'అందుకేరా మొన్న మీ ఫంక్షన్లో సైలెంటుగా ఉన్నింది ఆంటీ' అన్నాడొకడు జగ్గూతో.
'ఎందుకుండదు మరి, అంకుల్ కి కూడా తెలీకుండా వడ్డీకి తిప్పిన లెక్కంటరా' ఇంకోడు చెబుతున్నాడు.
'పాపంరా, ఎవురితో చెప్పుకుని బాధపడుతుందో ఆంటీ?'
'అంకుల్ కి చెప్పుకోలేకపోతే, అల్లుడితో చెప్పుకుంటుందిలేరా!' 
'రేయ్ జగ్గూ, ఈసారి కలిసినప్పుడు, income tax గురించి కాదు, IP గురించి అడుగురా ఆంటీని'.  

---------------------------
* రోంత = రవ్వంత 
**ఎచ్చరించు = పలకరించు (e.g. బాగున్నారా? ఇదేనా రావడం? etc. )

Sunday, February 14, 2021

ఎడబాటన్నది ఎవరికి వేడుక?

నాజీవితంలో జరగని కొన్ని సన్నివేశాల్ని నేనే సృష్టించుకొని, నన్ను actorగా పెట్టి, నేనే దర్శకత్వం, రచన బాధ్యతలు కూడా వహించి, ఆయా సందర్భాల్లో కాసేపు జీవించి ఇలాగ పదిల పరచుకోవడం అనేది ఒక సరదా ఛాలెంజ్. మరి మనకి పూరి జగన్నాథ్ వచ్చి script ఇవ్వనప్పుడు, మనమే త్రివిక్రమ్ లాగా dialogues రాసుకొని, clap కొట్టుకోవాలి కదా. అలాంటి ఒక ఛాలెంజింగ్ breakup సన్నివేశం ఇక్కడ ప్రదర్శిస్తాను. నిజానికి నిజజీవితంలో breakup scene ఎంతమందికి ఇష్టముంటుంది? ఎడబాటన్నది ఎవరికి వేడుక? ఏదో నాలాంటి వాళ్లకి మాత్రమే మనలోని కళాకారుణ్ణి తృప్తి పరచుకోవడం కోసం తప్ప. అలాగే, article అవడంతో మీరు కేవలం చదవగలరు, నేను మరియు నాతో సన్నిహితంగా మెలిగిన వారు మాత్రమే ఈ sceneలో నన్నూహించుకొని నా నటనని అనుభవించగలరు. చుడండి మరి నా ferformance!


"ప్రేమించడం పిచ్చ easy, ఇప్పటికే నేను బొచ్చెడు మందిని ప్రేమించా"నని చెప్పుకుని తిరిగిన నేను, నీ పరిచయం తర్వాత ఒక్కరిని ప్రేమిస్తున్నాని అనుకోవడానికే సాహసించలేక పోతున్నా. ఎందుకంటే, నీకోసం తపించినంత నేనెవరికోసం, దేనికోసమూ తపించలేదు; లేనేమో కూడా! ప్రేమంటే అంతటి తపనా?

నీతలపుల్లో వసించి, విహరించి, పులకించినంతగా నన్నెవరూ, ఏ విషయమూ మైమరపించలేదు; ప్రేమంటే అంతటి మైమరపా?

ఇకమీద నిన్ను తలచుకున్నప్పుడల్లా, కారణాలేమైనా, ఒకటవలేకపోయామనే నిజం వేదనై నన్ను నిలువునా కలచివేస్తుంది. ప్రేమంటే వేదనా?

కానీ, నీ జ్ఞాపకాలు తీపి స్మృతులుగా జీవితాంతం నన్ను వెంటాడుతాయని మాత్రం తెలుస్తోంది. ప్రేమంటే ఆ మధుర స్మృతా?

ఇవన్నీ అవునోకాదో నాకు తెలీదు, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయో లేదో కూడా తెలీదు, కానీ నాకు మాత్రం ప్రేమంటే నువ్వే. ఒకానొక వసంతకాలపు సాయంత్రం ఈ కోటలోకి వీచి, గెలిచి వెళ్లిపోయిన సుగంధపు మరకలా గోడలమీద నువ్వుండిపోతావు, కూలిపోయేదాకా. 
----------

Title: సమ్మోహనం చిత్రంలోని 'కనులలో తడిగా' (రచయిత: రామజోగయ్య శాస్త్రి) పాట నుంచి.

Tuesday, November 17, 2020

నా కథ, మొదటిది!

నేను రాసిన 'సెకండ్ ఇన్నింగ్స్ ' అనే కథ, కౌముది అనే web monthlyలో (November, 2020) ప్రచురించబడింది.
  






Sunday, September 13, 2020

Agenda లేని నీరాగార నివిష్ట పాంథులమవుదాం!

Weekend కావడంతో, evening walkకి Amarతో కలిసి అలా కాలువ గట్టుకి వెళ్లా. అంతా నడిచి ఊరి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక interesting conversation నడిచింది. "మనిషి purest formలో ఎప్పుడు దొరుకుతాడు?" అని. 'Colleagues, relatives, neighbors, ఎరిగినవారు, చాలామంది friends కూడా ఏదో ఒక hidden agenda పెట్టుకొనే మాట్లాడుతున్న కాలమిది. మాటలెక్కడున్నాయి? అంతా Manipulation మయమే కదా. తెలిసినా తెలియనట్లు వ్యవహరించడం, కుదిరితే misinform చేసి ఇబ్బందికి గురిచేయడం, ఇందులో నాకేముంది అని ఆలోచించడం, వీలైనంత రాలగొడదాం అనుకోవడం, వాడు బాగుపడి పోతున్నాడే అని అసూయ, లేని బడాయిలు పోవడం, పబ్బం గడుపుకోవడానికి వీరి దగ్గర వారిని, వారి దగ్గర వీరిని తూలనాడటం, లేదా ఎవరి దగ్గర వారి భజన చేయడం, ఇవేకదా ఇవాళ జనాల మాటలు' అనుకున్నాం. "అవునన్నా, మనం నాగరికతలో ముందుకెళ్తున్నాం అనుకోడమేగానీ, actualగా ఇలాంటివన్నీ observe చేస్తే ఇంతేనా మన పరిపక్వత అనిపిస్తుందన్నా" అన్నాడు అమర్. 

సరదాగా ఎవరూ తెలీని ఊర్లోకెళ్లి, ఇంకా కుదిరితే, అక్కడి భాష తెలీని చోటికెళ్లి, టీకొట్టు దగ్గర టీనో, కాఫీనో తాగుతూ అక్కడ కూచున్న వాళ్లతో మాటకలిపితే, మనలోని స్వచ్ఛత బయల్పడుతుందేమో. వారెవరో, మనమెవరో. No hidden agenda. కాసేపటి తర్వాత జీవితంలో మళ్లీ కలిసే అవకాశమే ఉండదు. ఇంత చేయాలన్నమాట మనలోని స్వచ్చతని బయటకి తీయాలంటే. అప్పుడు మాట్లాడతాం మనిషిలాగా. ఉన్నది ఉన్నట్లు, అనిపించింది అనిపించినట్లు, దాయకుండా. అప్పు అడగరు కాబట్టి, మనం చేసే వ్యాపారంలో ఆదాయం ఎంతో చెబుతాం, వారికి దీని గురించి బయట ప్రచారం చేయాల్సిన పని ఉండదు కాబట్టి, ఆ వ్యాపారంలో మనం చేసే tricks గురించికూడా మాట్లాడతాం. రాసిపెట్టుకొని మళ్లీ మళ్లీ దీనిద్వారా వారిని exploit చేసే ఉద్దేశంతో కాకుండా genuineగా ఎదుటివారిమీది concernతో విషయాలు మాట్లాడతాం. తెలియని వాళ్లముందర బడాయికి పోవాల్సిన పనిలేదు, మరియు వాళ్లొచ్చి మనఊర్లో దండోరా వెయ్యరు కాబట్టి,  మన వృత్తిలోనో, సంసారంలోనో ఉన్న కష్ట నష్టాలు మాట్లాడటానికీ వెనుకాడం. ఎదుటివారి సమస్యలూ, ఆశక్తతల పట్ల  గెలిచేయాలని అనిపించదు, ఎత్తిపొడవాలని అనిపించదు.  Judge చేయాలనిపించదు, మనల్ని చేస్తారన్న consciousness ఉండదు. Ego ఊసే ఉండదు. కాళ్ళమీద పడదు కాబట్టి కాసేపు కడుపు చింపుకుంటాం. అసలక్కడ మనకి పేరే ఉండదు, శాస్త్రిగారు చెప్పినట్లు, అందరం, మనిషి అనే సంద్రాన కెరటాలైపోతాం. అప్పటివరకూ లోపల కప్పిఉంచిన మానవత్వంతో ఎగసిపడతాం. Rat race నుంచి relax అయ్యి, మనుషులమయ్యే ఆ కొంత సమయం కోసమే నేను మా జనాలని ప్రయాణాలు చేయడానికి, కొత్త చోట్లని, అక్కడి ప్రజలని, సంస్కృతులని తెలుసుకోడానికి తీసుకెళ్లేది. ప్రపంచంఎరిగిన వాళ్ళు, they don't hesitate to keep it real, కుంచించుకుపోయిన బుడగల్లాంటి ప్రపంచాల్లో బ్రతికేవారు they will end up living fake. అందువల్ల, సాటి ప్రజలతో deal చేసేటప్పుడు hidden agenda లేకుండా genuineగా జీవించడానికి ప్రయత్నిద్దాం. అందరం అందరితో, అలా టీకొట్టులో కలిసే జనాలతో ఉండేంత స్వచ్ఛంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. 

Title గురించి:

శ్రీమద్భాగవతంలో,  ఒక సందర్భంలో, హిరాణ్యాక్షుడి శవం దగ్గర పడి ఏడుస్తున్న బంధు జనాలనుద్దేశించి, ఆయన అన్నగారైన హిరణ్యకశిపుడు ఇలా అంటాడు  

నీరాగార నివిష్ట పాంథుల  క్రియన్ సంసార సంచారుల్ వత్తురు, గూడి విత్తురు, సదా సంగంబు లేదొక్కచో !

నీరాగారము = చలివేంద్రము; నివిష్ట = ప్రవేశించిన; పాంథులు = బాటసారులు; క్రియన్ = లాగా; సంసార సంచారుల్ = సంసారాల్లోని జనాలు; వత్తురు=వస్తారు; కూడి = కలిసి; విత్తురు = విడిపోతారు; సదా = ఎల్లప్పుడూ; సంగము లేదొక్కచో = కలిసి ఉండరు;  

"చలివేంద్రంలో నీరు తాగడానికి వచ్చిన బాటసారులలాగా సంసారంలో మనుషులు కలుస్తారు, కాసేపు కలిసుంటారు, తర్వాత విడిపోతారు (చనిపోతారు), అంతేగానీ ఎల్లకాలమూ కలిసి ఉండరు" కాబట్టి ఇంక ఏడుపులు ఆపండి అంటాడు. కానీ, ఇంత చెప్పిన ఈ dirty fellow, అంతా అయ్యాక ఘోరమైన తపస్సు చేసి వరం అడుగుతాడు, ఏమని? మరణం లేకుండా. వీడి అసాధ్యం కూల! వీడు చెప్పిందేమిటి, చేసిందేమిటి? అది వేరే విషయం, మనమిప్పుడు చెప్పుకుంటున్న concept కొంచెం దూరం.

చెప్పొచ్చేదేంటంటే అధ్యక్షా, "నీరాగార నివిష్ట పాంథుల" లాగా మనం ఒకరితో ఒకరం మరింత స్వచ్ఛంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. 

Friday, July 24, 2020

ప్రపంచం 'పని'చేయడం మానేసి చాలాకాలమైంది

ఎందుకంటే అది డబ్బులు సంపాదించడంలో చాలా బిజీగా ఉంది. అవును, పేరుకు మాత్రమే మనం సమాజంలో వివిధ రకాల 'పనులు' చూస్తూ ఉంటాం, కానీ, మనమందరం ఒకే పని చేస్తూ ఉన్నాం: డబ్బులు సంపాదించడం, ఆస్తులు వెనకేయడం. ఇప్పుడు అదే అందరి పని, మోజు, లక్ష్యం. ఆ కిక్కులో మనం మన 'పనులు' (professions)  ఎలా చేయాలో ఎప్పుడో మర్చిపోయాం. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, డబ్బులు సంపాదించడాన్ని,  సంపద పోగెయ్యడాన్ని నేను తప్పు పట్టడం లేదు, కేవలం, ప్రతీ వస్తు/సేవ వినిమయం దగ్గరా 24X7 పని చేసే complaint cells మరియు customer service ఎందుకు ఉన్నాయో ఆలోచించమంటున్నా, అంతే! 'విస్తరణ (expansion) మీదున్న importance, నాణ్యత (quality) మీద లేదేమో?' అంటున్నా. 

ఉదాహరణకి నాకే ఎదురైన ఒక సంఘటన చెప్పుకుందాం. మా అమ్మ కొన్ని సంవత్సరాల నుండి ఒక Mobile Phone వాడుతోంది. పల్లెటూరే అయినా tower ఉండటం వల్ల signals ఎప్పుడూ strongగా ఉండి అంతా సాఫీగా సాగింది, కొన్ని వారాల క్రితం వరకూ. కానీ, ఈ మధ్య calls వచ్చినపుడు మరియు చేసినప్పుడు ఒకటిరెండు rings అవగానే cut అవుతోంది, సరైన వివరణ లేకుండా. Restart చేయడం, SIM వేరే mobileలో వేయడం లాంటి అన్ని basic checks చేసి, issue SIMలోనే ఉందని తేల్చుకున్నాం. అయినా,  fix అవుతుందేమోనని కొన్నాళ్లు చూసి, అవ్వకపోవడంతో వేరే networkకి porting పెట్టా. పెట్టినరోజే source network వాడు call చేశాడు. చిత్రమేమిటంటే నేనేమీ చెప్పకుండానే, "sir, మీరు వాడుతున్న SIM card చాలా పాతది, ఏదో circuitry issuesఉన్నాయి, అందుకే మీ calls అన్ని automaticగా reject అవుతున్నాయి. కాబట్టి nearest storeకి వెళ్తే కొత్త SIM card ఉచితంగా ఇస్తారు, కావాలంటే మీరు onlineలో కూడా order చేయొచ్చు" అన్నాడు. 'మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే solve చేసేందుకు ప్రయత్నిస్తాం చెప్పండి, అలానే porting requestని cancel చేస్కోండి' అని చివర్లో request చేశాడు. "అలాకాదు భయ్యా, నేనేమీ చెప్పకుండానే SIM కార్డు issues ఉన్నాయ్, అందువల్ల ఫలానా సమస్యలు వస్తున్నాయి అని చెబుతున్నావే, ఇదేదో ముందే చెప్పిఉండాల్సింది కదా, ఇందాకే వేరే networkకి port చేశా, already first recharge కూడా చేశానే" అన్నా. అంటే, మా SIM cardకి ఏదో problem ఉందని తెలుసుకోగలడు, కానీ కొన్నివారాలు ఊరికే ఉండగలడు. అయితే, వేరే networkకి port అవుతున్నామని తెలిసిన వెంటనే తనే call చేసిమరీ విషయం ఏంటో వివరిస్తాడు వెళ్ళొద్దని request చేస్తాడు. 

అంతా విన్నాక, నేను అసంతృప్తి చెందానని, కుదరదని చెప్పేశా. సారాంశం: customer (business)ని కోల్పోతున్నపుడు వాళ్లు పెట్టుకున్న RED ALERT, అదే customerకి service provide చేయడంలో (కొన్ని వారాల వరకూ) ఇబ్బంది కలిగినపుడు పెట్టుకోలేదు, priorities అలా ఉన్నాయంటున్నా! మళ్లీ adsలో మాత్రం మంచి విశ్వాసమున్న జంతువుని చూపిస్తారు.

ఇలాంటి ఇంకో సంఘటన మందుల కొట్టులో కూడా జరిగింది నాకే. వాళ్లకి వాళ్ల sales target reach అవడమే కావాలి, వచ్చినవాడికి correct medicine ఇవ్వడంవాళ్ల 'పని' అని మర్చిపోయారు. జాగ్రత్తగా చూడకుండా ఇంకో medicine ఇచ్చిపంపారు. రెండుసార్లు. వాళ్లకి తెలియాలి, "apple బదులు pine-apple ఇవ్వలేదు, ఒక medicine  బదులు ఇంకోటి ఇచ్చారు" అని. చూసుకోకుండా వాటిని వేసుకుంటే ఏమవుతుందో మనకంటే వాళ్ళకే బాగా తెలుసు కదా? దీనిగురించి ఒక Doctorతో discuss చేశాక తెలిసింది, Exactగా prescribed medicine లేకపోయినా, కాస్త అటుఇటుగా ఉందని (customerకి చెప్పో చెప్పకుండానో) వేరే medicine ఇవ్వడానికి కూడా వీళ్లు వెనుకాడరని. Again, priorities!

ఇవన్నీ target driven corporate worldలో common అనుకుందామన్నా, మనచుట్టూ ఉండే మాములు జనాల్లోకూడా కనిపిస్తోంది ఈ attitude.  

మన parents వయసున్న పెద్దలు, చుట్టాలబ్బాయి (లేదా, సహోద్యోగి కొడుకు) ఏం పనిచేస్తాడో చెప్పలేరేమో గానీ, ఎంత సంపాదిస్తాడో మాత్రం చెప్పగలరు. ఎందుకంటే prioritiesలో 'పని' ఎప్పుడో వెనకబడింది, అసలది అక్కర్లేదు. అందుకనే, ఎక్కడైనా కలిసినప్పుడు పలకరించగానే, పనిచేసే ఊరు, జీతం మాత్రం అడుగుతారు. 'పని' గురించి అడగరు, అవసరంలేదు. ఏదో సినిమాలో అన్నట్లు, అవార్డులు ఎవరికి కావాలీ?, రివార్డులే మన అజెండా. (కానీ, ఇంకా బుర్రలు పాడుకాని అమాయకపు పిల్లలు మాత్రం అడుగుతారు). ఈ priorities మారుతున్న క్రమంలోనే కొన్ని వృత్తులకి  సమాజంలో మునుపున్నగుర్తింపు ఇప్పుడులేదు, అలాగే  గర్హ్యమైన ఇంకొన్ని వృత్తులు ఇప్పుడు కొత్త favorites అనడం అతిశయోక్తి కాదు. అంటే, వృత్తులు వాటి విశిష్టతని కోల్పోయాయా? అవునో-కాదో, మంచిదో-కాదో కూడా నాకు తెలీదు, కేవలం ఒక పరిశీలన. మనం ఫలానా 'పని' చేయడానికి, ఆ 'పని'కన్నా ఏమైనా 'పనే'తర కారణాలు బలంగా పనిచేస్తూ ఉండటాన్ని గురించి ఆలోచిద్దాం అంటున్నా. Especially, మనలో చాలామందికి ఇప్పుడు survival పెద్ద matter కాదు కాబట్టి. 

Again, నన్ను అపార్థంచేసుకో వద్దని మనవి, packagesని రివార్డులని తప్పుపట్టడంలేదు. అవన్నీ మంచిదే. కానీ, ప్రోత్సాహకాలు (incentives) ఎలాంటివైనా, 'పని'లో సృజనాత్మకత (creativity)ని, ఉత్పాదకత (productivity)ని పెంపొందించేందుకు ఉద్దేశింపబడినవని, అంతేకానీ, వాటికోసం ఆ  'పని'నే పణంగా పెట్టే attitude మాత్రం వినాశకారి అని నా అభిప్రాయం. Now, మనిషి జీవితం అనేది ఒక 'పని'లా చూస్తే (ఈ భూమ్మీదకి మనం అందుకోసమే వచ్చాం కదా!),  దానికి మనం పెట్టుకున్న ప్రోత్సాహకాలు, జీవించడం అనే 'పని'నే వెనక్కుతోసేశాయేమో ఎవరికి వాళ్లే తేల్చుకోవాలి. అది మాత్రం గుర్తుచేస్తున్నా!

Sunday, May 10, 2020

बाप बाप होता है, बेटा बेटा होता है

ఎప్పటికప్పుడు తండ్రులని outsmart చేశాం అనుకుని పప్పులో కాలేసే కొడుకులు కొంతమందైతే, accidentalగా దొరికిపోయిన కొడులకి తామెంత స్మార్టో చూపించే తండ్రులు కొంతమంది, వెరసి, बाप बाप होता है, बेटा बेटा होता है. అలాంటి కొన్ని real-life smart stories .

------------------------------------------------------
"ఎన్నిసార్లు చెప్పా లక్ష్మీ నీకు! వడ్డించే ముందే నెయ్యి కాచిపెట్టుకోమని, తీరా అడిగిన తర్వాత వెళ్లి వేడిచేసి పట్టుకురావడం అలవాటయి పోయింది నీకు. అందాకా plateలోకి తొంగిచూస్తూ ఉండమంటావా మమ్మల్ని?" కరోనా విధించిన lockdownలో కూడా, మధ్యాహ్నం భోజనాల దగ్గర భార్యమీద తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నాడు శ్రీనివాసరావు. Stove వెలిగించడానికి హడావిడిగా అగ్గిపెట్టె వెదుకుతున్న లక్ష్మికి సలహా ఇచ్చాడు, ఈమధ్యే M Tech పూర్తిచేసిన వాళ్ల ఒక్కగానొక్క కొడుకు అర్జున్, "ఒక lighter కొనుక్కోవచ్చుగా  mummy, stove దగ్గరే పడుంటుంది, అగ్గిపెట్టె కోసం అటూఇటూ వెళ్లకుండా".

"అందాకా, వీడి దగ్గర ఉన్న lighter తీస్కో లక్ష్మి, పనికొస్తుంది నీక్కూడా" నింపాదిగా అన్నాడు శ్రీనివాసరావు అర్జున్ ముఖంలోకి చూస్తూ.

తింటున్నది గొంతులో పడేసరికి, ఖల్లుమని దగ్గుతూ తండ్రివైపు షాకయ్యినట్లు చూస్తున్నాడు అర్జున్, తనకేం అర్థం కాలేదన్నట్లు.

"ఆపరా నీ నాటకాలు, పొద్దుటే నీ బ్యాగులో దొరికింది ఈ cigarette lighter. బ్యాగులన్నీ ఖాళీచేసి పైన cupboardలో పడేసినట్లు cutting ఇస్తే కనుక్కో లేరనుకున్నావా?" అని జేబులోంచి తీసి చూపించాడు.

అక్షరాలా తనదే. చేసేదేమి లేక, "అమ్మనా బాబోయ్, ఇంకా జాగ్రత్తగా ఉండాలనమాట నీతో" అనుకుంటూ, అమ్మకి అగ్గిపెట్టె వెదకడంలో సాయం చేయడానికి అన్నట్లు అక్కడి నుంచి లేచి వంటగదిలోకి వెళ్ళిపోయాడు.
------------------------------------------------------
సంతోష్ convocationకి Vizag నుంచి బెంగుళూరు వచ్చిన  తన family అందరూ evening flightకి return అవుతున్నారు. పొద్దున Convocation అయ్యాక, అక్కడే భోజనాలు అవజేసుకొని, Campus అంతా తిరిగి, అన్నిచోట్లా photos తీసుకొని, Messలో టీ, snacks తీస్కొని హాస్టల్లో తన roomకి వచ్చి ఒక్కొక్కరే రెడీ అయ్యారు.

Winterలో Europe వెళ్లి PhD join అయ్యేదాకా,  తనిప్పుడు అదే campusలో Research  Assistant గా work చేస్తున్నాడు. కాబట్టి, అమ్మానాన్న, పెద్దక్క బావ, చిన్నక్క కలిసి మొత్తం ఐదుగురికి మాత్రమే tickets book చేసారు.  అందరూ కలిసి airportకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూంటే, సంతోష్ వాళ్ళ నాన్న అన్నారు, "నేనూ సంతోష్ బండి మీద వస్తాం, మీరంతా Cab తీస్కొని వెళ్ళండి" అని. అలానే బయలుదేరారు అందరూ.

బండిమీద వెళ్తున్న  తండ్రీకొడుకులు దేవనహళ్ళి toll gate దాటేశారు. అప్పుడు, తండ్రి, "ఓసారి బండి ఆపరా !" అనేసరికి, side తీస్కొని కొద్దిదూరంలో ఆపేశాడు సంతోష్. ఏం జరుగుతోందో అర్థంకాక, "Flightకి time అవుతోంటే, ఇక్కడ ఆపమంటాడేంటి ఈయన?" అనుకున్నాడు సంతోష్. బండిదిగి, పక్కకివెళ్లి జేబులోంచి సిగరెట్, అగ్గిపెట్టె తీసి వెలిగించాడు తండ్రి. "ఓర్నీ, దీనికా!" అనుకున్నాడు సంతోష్.

ఓ ఐదునిముషాలు మెల్లిగా సిగరెట్ ఆస్వాదించిన తండ్రి, దాన్ని పడేసి, బండి దిగకుండా కూర్చున్న సంతోష్ దగ్గరికొచ్చాడు. Mobile phone jeans లోపల పెడుతూ, 'ఇంక బండితీనా?' అన్నట్లు చూస్తున్న సంతోష్ మొహంలోకి లోతుగా చూస్తూ, "ఇదిగో ఇదుంచు" అని ఇందాక అయన వాడిన అగ్గిపెట్టె చేతిలో పెట్టాడు. Flight ఎక్కేటప్పుడు ఇలాంటివి ఉండకూడదు కదా, అందుకని ఇచ్చారేమోలే అనుకున్నాడు సంతోష్. కాదన్నట్లు ఇంకా తీక్షణంగా చూస్తూనే ఉన్నాడు తండ్రి. 'ఏంటా?' అని దానివైపు చూసిన సంతోష్ ఇట్టే గ్రహించాడు, అది తన roomలో cricket kit అడుగున దాచిందని. కొన్ని క్షణాలు ఇద్దరూ మాట్లాడుకోలేదు. కానీ, అనాల్సినవన్నీ అనేసినట్లు ఒకరికి, వినాల్సిందంతా విన్నట్లు ఇంకొకరికి అనిపించింది. మెల్లిగా తండ్రిగారొచ్చి బండిమీద వెనకాల కూచున్నారు. బండి airport వైపు దూసుకెళ్లింది, సంతోష్ గుండెలమీద (జేబులో) ఉన్న అగ్గిపెట్టె మాత్రం తెగ అదురుతోంది.
------------------------------------------------------

పొద్దున్నే ఏడుగంటలయ్యి, మొహంమీద ఎండ పడేసరికి, మేడ మీద పడుకున్న చందు మెల్లిగా నిద్రలేచాడు. Lockdownకి ముందే చెల్లెలు engagementకని వచ్చి, తిరిగి Benguluru వెళ్ళలేక ఇంటినుంచే work  చేస్తున్నాడు. కళ్లు నులుముకుంటూ కిందకొస్తూ, మెట్లమీద కూచొని కాబోయే బావగారితో phoneలో మాట్లాడుతున్న చెల్లెల్ని దాటుకొని, కొత్తగా కొన్న plastic chairలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న నాన్నగారి ముందు, ఇంకో కుర్చీలో కూలబడ్డాడు. నిద్రమత్తులో ఉన్నా, తనవేపు కొత్తగా చూస్తున్న నాన్నగారిని గమనించాడు కానీ, ఏమీఅనలేదు. ఇంతలో, చట్నీకని కొబ్బరి తీస్తున్న అమ్మ చూసి, "లేచావా, coffee తెస్తా ఉండు" అని వంటింట్లోకెళ్లింది. వెనకాలే తనూ వెళ్లి అడిగాడు "ఏమైందమ్మా, నాన్నగారు ఎప్పటిలాగా Mobile phoneలో Jagan videos పెట్టుకోకుండా, పొద్దున్నే చిరాగ్గా అలా చూస్తున్నారు నన్ను?" అని. "అవునా, ఏమోరా తెలీదు, అడగకపోయావా?" అంది పాలు కాస్తున్న అమ్మ.  "ఏమోలే" అనుకుంటూ, గబగబా coffee తాగేసి, ready అవ్వడానికి bathroomలోకి దూరిపోయాడు. 

Tiffin అయ్యాక మేడమీది గదిలోకి వెళ్లి, teamతో daily objectives meeting కోసం TV పక్కన పెట్టిన తన laptop bag  తీస్కొని  మేడ ఎక్కేసాడు. ఓ పావుగంటయ్యాక, "అమ్మా, నా earphones కనపడట్లేదు, bagలోనే ఉండాలి తీసారా ఎవరైనా?" అంటూ కిందకొచ్చి వెదకడం మొదలు పెట్టాడు హడావుడిగా. "అవున్రా, మర్చిపోయా చెప్పడం, రాత్రి మీ నాన్నగారు పడుకునేముందు కూడా ఆ సోది వీడియోలు చూస్తూ విసిగిస్తున్నారని నేనే నువ్వు చెవిలో పెట్టుకునేవి తీసుకోమన్నాను. ఆ TV దగ్గరే పెట్టారేమో చూడు" అంది. "ఆ, దొరికింది లే" అని తీసుకోని వెళ్ళిపోయాడు మేడ మీదకి.

మధ్యాహ్నం భోజనాల టైమయ్యేసరికి అందరూ dining table దగ్గర హాజరవుతున్నారు. అమ్మ వంటింట్లోంచి ఒక్కోటీ table మీదకి సర్దుతోంది. ఇంతలో చందు water bottle తీసుకోబోతూ, పక్కనే ఉన్న వేడి రసం  గిన్నె తాకి "అబ్బా!" అని, ఉఫ్ఫుమంటూ  చెయ్యి ఊదుకున్నాడు. అంతా చూస్తున్న నాన్నగారు, "ఒళ్లు కాస్త దగ్గర పెట్టుకుంటే మంచిది" అన్నారు ఘాటుగా. 'అరే, ఇంత చిన్నదానికే అంతమాట ఎందుకబ్బా!' అనుకున్నారు మిగిలిన అందరూ, కానీ ఎవరూ ఏమీ అనలేదు. భోజనాలు నిశ్శబ్దంగా అయిపోయి, చందు fastగా మేడెక్కేసాడు.   

పొద్దున్నించీ ఈయనేంటి చిరాగ్గా ఉన్నాడు మనమీద, కొంపదీసి బడ్డీ కొట్టు దగ్గర సిగరెట్ కొంటున్నపుడు చూసిన ప్రభాకర్ uncle గానీ ఆపుకోలేక ఈయన దగ్గర పిత్తేశాడా? చెప్పేవాడైతే మొన్న పొద్దున్న walkingలోనే చెప్పేసేవాడేమో, ఇవాళ్టిదాకా ఎందుకు ఆగుతాడు? ఎందుకైనా మంచిది జాగ్రత్త పెంచాలి అనుకుంటూ, mobile charger కోసం laptop bagలో వెదుకుతున్నాడు. shampoo packet లాంటివి తగిలాయి, అవేంటో వెంటనే తనకి స్ఫూరించింది. కరెంటు షాక్ తగిలినట్లు, 'వీటిని చాలా లోపల ఉన్న చిన్న zipలో కదా దాచేది, బయటి zipలోకెలా వచ్చాయి?' అనుకున్నాడు. వెంటనే earphones గుర్తొచ్చాయి. 'కొంపదీసి, రాత్రి వాటిని తీసుకునేటప్పుడు నాన్నగారు వీటిని చూసేశారా? గుండె వేగం కొంచెం పెరిగింది. అయినా, ఒకే సరంగా ఉండాలి కదా, ఇలా మూడు separateగా ఉన్నాయేంటి?  F***, దొరికిపోయాం. చూసేశానని చెప్పడానికి, ఇలా వీటిని separateగా చింపేసి తన సంతకం వదిలాడనమాట, మన బాబు. Benguluruలో ఎక్కడైనా దొరుకుతాయి కదా, ఇలా bagలో maintain చేయాల్సిన కక్కుర్తి ఎందుకురా?' అని అప్పుడెప్పుడో వీటిని bagలో దాచిన సంగతి గుర్తొచ్చి, తనని తానే తిట్టుకున్నాడు. 'పోన్లే, చేసేదేముంది, చెల్లెలి పెళ్లయ్యాక, late లేకుండా రమ విషయం బయట పెడదాం. కానీ, ఈలోపు ఈయన మనల్ని తిరుగుబోతు అనుకోకుండా ఉంటే చాలు' అనుకున్నాడు.
------------------------------------------------------------------
ఇంకొన్ని ఇంకో రోజు. 

Thursday, April 30, 2020

మా బానుమతి ఆంటీ కరోనా కష్టాలు (Episode-2)

(అన్ని Episodes ఇక్కడ దొరుకుతాయి.)
 
బిడ్డ పెండ్లి ఆలబము వచ్చినాల ముంచి, మా ఆంటీకి నిద్దర్రాడంల్యా. సందులోండే అందరికీ జూపిచ్చి, "బిడ్డా అల్లుడూ బాగొచ్చినార్లే" అనిపిచ్చుకోవల్లని ఇంతవరకూ ఆశగా ఎదురుజూచ్చా ఉన్న్యాది. పా.....పం, తీరా వచ్చినాక, ఎవురికి జూపీడానికీ కాడంల్యా. ఏమంటే, కరోనా. ఎవురూ యాడికీ పోగుడ్దని గవర్నమెంటోళ్లు మొత్తుకొని జెప్తాండారు.

పాపం, ఈ కాయలా వచ్చి మా ఆంటీకి కాళ్ళూచేతులూ కట్టేసినట్టుండాది. యవ్వారాలన్నీ ఏటికిబోయినాయి. పొద్ధచ్చం ఇంట్లోనే ఉండల్ల. అల్లుడు జెప్పినాడని పనిమంచినిగూడా రావాకన్న్యారు. ఇంగెవురికి జెప్పుకుంటాదీ వాళ్ల బడాయి? ఆయ్మ సావు సెప్పలేం. కడుపుబ్బి పోతాంటాది ఈమంతన.

ఎట్టుండేది; ఎట్టైపోయింది ఆంటీ! అప్పట్లో, ఆరుబయట సాయంత్రం యవ్వారం మొదులుబెడితే, పొద్దుగునికి ఇంటాయన పిల్చినా పట్టిచ్చుకునేది కాదు. ఆయప్ప సావు ఆయప్పదే, ఈయమ్మ యవ్వారం ఈయమ్మదే. ఎప్పుడో ఆయప్పకున్న సుగరు సంగతి గుర్తొచ్చే, "రైసు కుక్కరు ఆన్ జెయ్ బ్బ అట్ట"  అంటుంది. ల్యాకుంటే, అయప్పే రొండు సెపాతీలు తిరగేసుకుంటాడు. ఇంకొన్నిసార్లు, బాగా లేటయితే బయటికిబొయ్ ఇడ్లీలు కట్టిచ్చక రమ్మంటాది, అంతేగాని, యవ్వారం దగ్గర కాంప్రమైజే కాదు. "మొగుడు దొడ్డమంచి గాబట్టి ఈయమ్మ యవ్వారాలు సాగుతానయ్" అనుకున్న్యారు సందంతా.

మరిప్పుడో, పొద్దన ముగ్గేసే టైములో ఎవురన్నా కనబడితే యాడ మాట్టాడాల్సి వచ్చుందోనని బెరిగ్గెన ముగ్గుగీకి లోపలికి పోతాది. ఖర్మగాలి ఎవరన్నా ఎచ్చరిచ్చే, రొండు మూడు పొడి మాటలు, అంతే. "మాయల్లుడు జెప్పినాడు" అనుకుంట మూతికి కొంగు అడ్డం పెట్టుకుంటాది ఆ మాట్లాడిన రోంచేపూగుడ. ఎప్పుడన్నా సాయంత్రం, బిడ్డా అల్లుడు వీడియో కాల్ జేచ్చే, సందంతా ఇనపడాలని కావాలనే కాంపౌండు లోకొచ్చి గెట్టిగా మాట్లాడతాది. ఒక్కోరోజు, మిద్దెక్కి మాట్లాడతాది, ఎక్కువమందికి ఇనపడతాదని. జగనన్న ఇంటింటికీ మాస్కులిచ్చినాక, అల్లుణ్ణి impress జెయ్యడానికి ఓరోజు ఇంకా పొద్దుండగానే మిద్దెక్కి మాస్కు కట్టుకొని మాట్లాడతాంటే, జగ్గుగాడు చూసి నవ్వినాడంట. అంతేనా, సందంతా అంటిచ్చినాడు. బైటికిపోతే పెట్టుకోవల్లగాని, మిద్దెపైనగూడ పెట్టుకుంటే నగరామల్ల! మరుసటిరోజు పొద్దన ముగ్గేచ్చా, బయటికి పోడానికి బండితీచ్చున్న జగ్గుగాణ్ణి నిలబెట్టి అడిగింది ఆంటీ. మాస్కు మ్యాటర్ కాదులే, దుబాయిలో ఉన్న జగ్గు అక్కాబావల గురించి. బాగున్నారని జెప్పి, అడగకపోతే బాగుండదు గాబట్టి, ఆంటీ వాళ్ల బిడ్డ అల్లుడి గురించి జగ్గు అడిగినాడు రివర్సులో. ఎన్నాళ్లనుంచో ఊదుకొని ఉందేమో కడుపు, "వాళ్లకేం, లెస్సగుండారు! మాయల్లుడు తెల్లార్దాన్నే లేసి రొంచేపు ఆఫీసు పంజేసుకుంటాడు, మల్ల రడీ అయ్యి, అక్కనిలేపి కార్ను ఫ్లేక్సు కలిపిచ్చాడు టిఫిన్ జెయ్యమని" అని దినచర్య మొత్తం జెప్పడానికి రడీ అయ్యింది. ఆంటీ సంగతి బాగా తెల్సుగాబట్టి, జగ్గుగాడు, "ఇడ్లి, దోశ ఏసేది నేర్సుకోమను ఆంటీ బావను, ఎన్నాళ్లని తింటాది అక్క కార్ను ఫ్లేక్సు, పాపం బోరు గొట్టదూ?" అని కిక్కుకొట్టి సర్రన వచ్చినాడంట ఆన్నుంచి.

సాయంత్రం సందుచివర క్రికెట్టు ఆడతా, మాకుజెప్పి భయపడినాడు పాపం, ఆంటీ వానిమింద కచ్చకట్టింటాదని. మొత్తానికి, మా జగ్గుగాడు వాళ్ల కారుని బుడ్డ కారు అన్నందుకు ఆంటీమింద ప్రతీకారం తీర్చుకున్న్యాడు. ఆంటీ మాత్రం ఎప్పుడు lockdown ఎత్తేచ్చారా, ఎప్పుడు యవ్వారాలు మొదలుపెడదామా అని ఎదురు జూచ్చాంది. సందులో జనమేమో lockdownలో కాలుష్యం, రొద ల్యాక బాగుపడ్డ సిటీల మాదిరి ఆయ్మ బెదడలేక బా...గుండారు.