Showing posts with label పులివెందుల. Show all posts
Showing posts with label పులివెందుల. Show all posts

Tuesday, March 30, 2021

మా బానుమతి ఆంటీ సైలెన్సు (Episode-3)

(అన్ని Episodes ఇక్కడ దొరుకుతాయి.)
 
పక్కనింట్లో రోంత సప్పుడొచ్చినా, కొత్త కారు గేటుముందర ఆగినా మా ఆంటీ సేచ్చాండే పని ఆపేసి మరీ కిటికీలోంచి తొంగిసూడాల్సిందే. అందికే పక్కింట్లోకి వొచ్చిన బంధువులుగూడ ఆయమ్మను ఎచ్చరిచ్చారు 'బాగుండావా?' అని. ఆమద్య, జగ్గూ గాడి అక్కాబావ వాళ్లు రింగురోడ్డు పైన రోంత స్థలం కొన్న్యారని తెల్సింది మా అంటీకి, వాన్నే అడిగి కనుక్కుందిలే, 'పొద్దన్నుంచి యాడికో తిరుగుతానారే?' అని. 'కలుగులోంచి ఎలక చూసినట్లు చూసింటాది ఆంటీ' అనుకున్న జగ్గూకి సెప్పక తప్పలేదు, ఎక్కడ కొన్న్యారో, ఎంతకి కొన్న్యారో.

అప్పుడు కొట్టడం మొదులు బెట్టింది సుత్తి, వాడి నెత్తిమింద. వాళ్ల అల్లుడు వాళ్లకి శా...నా ఆస్తులు ఉండాయంట. మొత్తం ఎన్నుండాయో కూడా చెప్పలేమంట.  Income tax వాళ్లు వొచ్చారని ఆస్తుల లెక్కలు ఎవురికీ చెప్పరంట, ఆఖరికి పిల్లనిచ్చిన వీళ్లకు కూడా. అంతా ఇన్న్యాక, జగ్గూ గాడు "ఎన్నుండాయో, యాడుండాయో గూడా తెలీకుంటే ఎట్ల ఆంటీ, మట్టసంగ అడగండి, మీకేమన్నా టోకరా ఏసినారేమో అనిపిచ్చాంది సూచ్చాంటే" అన్న్యాడంట. ఆంటీకి కాల్తుంది కదా మరి, "Income tax గురించి మనకేం తెలుచ్చాదిలే జగ్గూ, వాళ్లకు దండిగా లెక్కుండాది గాబట్టి తెలుచ్చాది గాని" అనిందంట మూతిముడుసుకుంటా. 'నీ బడాయి బండ్లకెత్త' అనుకొని, "నాకు పనుండాదిలే ఆంటీ" అని ఆన్నుంచి లేసొచ్చినాడంట జగ్గూ గాడు. 

ఇది జరిగినాక రెండు వారాలకు జగ్గూ వాళ్ళక్కకి సీమంతం చేసినారు. బానుమతి ఆంటీ వచ్చిందిగానీ, శానా సైలెంటుగా ఉన్నింది. భోజనాల దగ్గరకూడా పేరు పెట్టకుండా తినింది అన్నీ. 'ఏమైందిబ్బా ఆంటీకి?' అనుకున్న్యారు సందులోని వాళ్లంతా. మరుసటిరోజు సాయంత్రం మిక్చరు కొండయ్య దగ్గర పార్సిల్ కట్టించుకుంటాంటే జగ్గూకి వాళ్ళ స్కూలు ఫ్రెండు తగిలి, ఒక వార్త చెప్పినాడు. జగ్గూ వాళ్ళ కాలనీలో ఉండే కాంట్రాక్టరు ఒకాయప్పకి ఈ ఫ్రెండు వాళ్ళు అప్పిచ్చారంట, ఆయన IP పెట్టి పరారయినాడంట. జగ్గూ వాళ్ళకేమైనా ఆ కాంట్రాక్టరు వాళ్లు తెల్సునేమోనని ఆ ఫ్రెండు అడిగినాడు, మరి రాబట్టుకోవల్ల కదా ఎంతోకొంత. తెల్దని చెప్పి ఇంటికొచ్చినాడు జగ్గూ. ఇంటికొచ్చేసరికి, హాలుమద్యలో పనిమనిషి పరక పట్టుకొని ఏదో చెబుతాంటే ఇంట్లోని అందురూ చాగంటి చెప్పే ప్రవచనం విన్నట్లు వింటానారు. తీరా చూస్తే, మిక్చరు అంగడికాడ జగ్గూ విన్న వార్తలే ఇక్కడకూడా వినపడతానాయ్. తనుకూడా వాళ్లతో కలిసి కూర్చున్న్యాడు జగ్గూ. TV9 దేవీ నాగవల్లిని మించిపోయిన ఈ పనిమంచి సంబరమెందిరా అంటే, మన బానుమతి ఆంటీ గూడ ఓ పదహైదు లచ్చలు ఇచ్చిందంట ఆ కాంట్రాక్టరుకి. 'ఓహో! ఆంటీకి పెద్ద టోకరా ఏసినారే' అనుకున్న్యాడు మన జగ్గూ. అసలే తనని పనినుంచి తీసేసినప్పటినుంచి ఈ పనిమంచికి బానుమతి ఆంటీ అంటే శానా కచ్చ. అందుకనే, ఆయమ్మ ఆనందానికి హద్దూపద్దూ లేకుండాపోయింది. 'ఇంగ సాల్లే పొయ్ పని చుస్కోపొమ్మని' చెప్పినా ఆయమ్మకి పోవాలని లేదు, కానీ, తొందరగా ఇక్కడ పని అయిపోజేసుకుంటే వేరే ఇండ్లల్లో కూడా చాటింపు వెయ్యొచ్చని గుర్తొచ్చి, ఆయమ్మ పనికి వంగింది. 

మిక్చరుతిని, టీతాగి, సందు చివర జనాలు షటిల్ ఆడుతూ కనపడితే వెళ్లి కూచున్నాడు జగ్గూ. ఆంటీకి కాంట్రాక్టరు టోకరా వేసిన సంగతి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తానాడు. కానీ, వాళ్ళింట్లో కూడా పనిమంచి చదివిన వార్తలు విన్న జగ్గూ ఫ్రెండుగాడు ఒకడు ఇదే విషయం మొదలుపెట్టినాడు, పోన్లే అని జగ్గూ కుదుటపడినాడు. ఆడుతున్న జనాలు కూడా ఆపేసిమరీ విన్నారు ఆ వార్తలు.

'అందుకేరా మొన్న మీ ఫంక్షన్లో సైలెంటుగా ఉన్నింది ఆంటీ' అన్నాడొకడు జగ్గూతో.
'ఎందుకుండదు మరి, అంకుల్ కి కూడా తెలీకుండా వడ్డీకి తిప్పిన లెక్కంటరా' ఇంకోడు చెబుతున్నాడు.
'పాపంరా, ఎవురితో చెప్పుకుని బాధపడుతుందో ఆంటీ?'
'అంకుల్ కి చెప్పుకోలేకపోతే, అల్లుడితో చెప్పుకుంటుందిలేరా!' 
'రేయ్ జగ్గూ, ఈసారి కలిసినప్పుడు, income tax గురించి కాదు, IP గురించి అడుగురా ఆంటీని'.  

---------------------------
* రోంత = రవ్వంత 
**ఎచ్చరించు = పలకరించు (e.g. బాగున్నారా? ఇదేనా రావడం? etc. )

Thursday, April 30, 2020

మా బానుమతి ఆంటీ కరోనా కష్టాలు (Episode-2)

(అన్ని Episodes ఇక్కడ దొరుకుతాయి.)
 
బిడ్డ పెండ్లి ఆలబము వచ్చినాల ముంచి, మా ఆంటీకి నిద్దర్రాడంల్యా. సందులోండే అందరికీ జూపిచ్చి, "బిడ్డా అల్లుడూ బాగొచ్చినార్లే" అనిపిచ్చుకోవల్లని ఇంతవరకూ ఆశగా ఎదురుజూచ్చా ఉన్న్యాది. పా.....పం, తీరా వచ్చినాక, ఎవురికి జూపీడానికీ కాడంల్యా. ఏమంటే, కరోనా. ఎవురూ యాడికీ పోగుడ్దని గవర్నమెంటోళ్లు మొత్తుకొని జెప్తాండారు.

పాపం, ఈ కాయలా వచ్చి మా ఆంటీకి కాళ్ళూచేతులూ కట్టేసినట్టుండాది. యవ్వారాలన్నీ ఏటికిబోయినాయి. పొద్ధచ్చం ఇంట్లోనే ఉండల్ల. అల్లుడు జెప్పినాడని పనిమంచినిగూడా రావాకన్న్యారు. ఇంగెవురికి జెప్పుకుంటాదీ వాళ్ల బడాయి? ఆయ్మ సావు సెప్పలేం. కడుపుబ్బి పోతాంటాది ఈమంతన.

ఎట్టుండేది; ఎట్టైపోయింది ఆంటీ! అప్పట్లో, ఆరుబయట సాయంత్రం యవ్వారం మొదులుబెడితే, పొద్దుగునికి ఇంటాయన పిల్చినా పట్టిచ్చుకునేది కాదు. ఆయప్ప సావు ఆయప్పదే, ఈయమ్మ యవ్వారం ఈయమ్మదే. ఎప్పుడో ఆయప్పకున్న సుగరు సంగతి గుర్తొచ్చే, "రైసు కుక్కరు ఆన్ జెయ్ బ్బ అట్ట"  అంటుంది. ల్యాకుంటే, అయప్పే రొండు సెపాతీలు తిరగేసుకుంటాడు. ఇంకొన్నిసార్లు, బాగా లేటయితే బయటికిబొయ్ ఇడ్లీలు కట్టిచ్చక రమ్మంటాది, అంతేగాని, యవ్వారం దగ్గర కాంప్రమైజే కాదు. "మొగుడు దొడ్డమంచి గాబట్టి ఈయమ్మ యవ్వారాలు సాగుతానయ్" అనుకున్న్యారు సందంతా.

మరిప్పుడో, పొద్దన ముగ్గేసే టైములో ఎవురన్నా కనబడితే యాడ మాట్టాడాల్సి వచ్చుందోనని బెరిగ్గెన ముగ్గుగీకి లోపలికి పోతాది. ఖర్మగాలి ఎవరన్నా ఎచ్చరిచ్చే, రొండు మూడు పొడి మాటలు, అంతే. "మాయల్లుడు జెప్పినాడు" అనుకుంట మూతికి కొంగు అడ్డం పెట్టుకుంటాది ఆ మాట్లాడిన రోంచేపూగుడ. ఎప్పుడన్నా సాయంత్రం, బిడ్డా అల్లుడు వీడియో కాల్ జేచ్చే, సందంతా ఇనపడాలని కావాలనే కాంపౌండు లోకొచ్చి గెట్టిగా మాట్లాడతాది. ఒక్కోరోజు, మిద్దెక్కి మాట్లాడతాది, ఎక్కువమందికి ఇనపడతాదని. జగనన్న ఇంటింటికీ మాస్కులిచ్చినాక, అల్లుణ్ణి impress జెయ్యడానికి ఓరోజు ఇంకా పొద్దుండగానే మిద్దెక్కి మాస్కు కట్టుకొని మాట్లాడతాంటే, జగ్గుగాడు చూసి నవ్వినాడంట. అంతేనా, సందంతా అంటిచ్చినాడు. బైటికిపోతే పెట్టుకోవల్లగాని, మిద్దెపైనగూడ పెట్టుకుంటే నగరామల్ల! మరుసటిరోజు పొద్దన ముగ్గేచ్చా, బయటికి పోడానికి బండితీచ్చున్న జగ్గుగాణ్ణి నిలబెట్టి అడిగింది ఆంటీ. మాస్కు మ్యాటర్ కాదులే, దుబాయిలో ఉన్న జగ్గు అక్కాబావల గురించి. బాగున్నారని జెప్పి, అడగకపోతే బాగుండదు గాబట్టి, ఆంటీ వాళ్ల బిడ్డ అల్లుడి గురించి జగ్గు అడిగినాడు రివర్సులో. ఎన్నాళ్లనుంచో ఊదుకొని ఉందేమో కడుపు, "వాళ్లకేం, లెస్సగుండారు! మాయల్లుడు తెల్లార్దాన్నే లేసి రొంచేపు ఆఫీసు పంజేసుకుంటాడు, మల్ల రడీ అయ్యి, అక్కనిలేపి కార్ను ఫ్లేక్సు కలిపిచ్చాడు టిఫిన్ జెయ్యమని" అని దినచర్య మొత్తం జెప్పడానికి రడీ అయ్యింది. ఆంటీ సంగతి బాగా తెల్సుగాబట్టి, జగ్గుగాడు, "ఇడ్లి, దోశ ఏసేది నేర్సుకోమను ఆంటీ బావను, ఎన్నాళ్లని తింటాది అక్క కార్ను ఫ్లేక్సు, పాపం బోరు గొట్టదూ?" అని కిక్కుకొట్టి సర్రన వచ్చినాడంట ఆన్నుంచి.

సాయంత్రం సందుచివర క్రికెట్టు ఆడతా, మాకుజెప్పి భయపడినాడు పాపం, ఆంటీ వానిమింద కచ్చకట్టింటాదని. మొత్తానికి, మా జగ్గుగాడు వాళ్ల కారుని బుడ్డ కారు అన్నందుకు ఆంటీమింద ప్రతీకారం తీర్చుకున్న్యాడు. ఆంటీ మాత్రం ఎప్పుడు lockdown ఎత్తేచ్చారా, ఎప్పుడు యవ్వారాలు మొదలుపెడదామా అని ఎదురు జూచ్చాంది. సందులో జనమేమో lockdownలో కాలుష్యం, రొద ల్యాక బాగుపడ్డ సిటీల మాదిరి ఆయ్మ బెదడలేక బా...గుండారు. 

Saturday, March 7, 2020

మా బానుమతి ఆంటీ బడాయి (Episode-1)

(అన్ని Episodes ఇక్కడ దొరుకుతాయి.)
 
 మా సందులో ఒగ ఆయ్మ ఉండాది, ఆయ్మ పేరు బానుమతి. మేమంతా బానుమతి ఆంటీ అంటాం. ఆయ్మ బడాయి బండ్లమీద పోతాదనుకో. అంటే, ఆంటీ శానా బడాయి పడ్తాది అని అర్తం.  గోరోజనం అంటారుజూడు అది. ఈపుద్దు ఆయ్మ కత జెప్తా, బో... కామెడీగుంటాది. తులసి సిన్మాలోండే  కోకాపేట ఆంటీకి యామాత్రం తగ్గదు మాంటీగూడ. జీవిత చెరిత్ర మాదిరిగాకుండా, నాకు మతికుండే తమాసలు మాత్తరం మాట్టాడుకుందాం.

ఈమద్యనే వాల్ల పెద్దబిడ్డ  రింకూ రెడ్డి పెండ్లి ఐంది. ఓయ్మ! సెప్పవట్టదులే ఆయ్మ సెకలూ, ఆయ్మ బిడ్డ సెకలు.  ఓ రెణ్ణెల్ల ముందర మాసందులో ఇంగో పాప పెండ్లిగుడక ఐంది. ఆ పాప పేరు బుజ్జి. ఇంగజూడు, వాల్ల దగ్గరకే పొయ్ వీల్ల పెండ్లి గురించి బడాయి పడ్తాంది. ఆంటీ వాల్లు బానే ఉన్నోల్లేగాని, బుజ్జి వాల్లు ఇంగా రొంత ఎక్కువ ఉన్నోల్లు, కాబట్టి పెండ్లి గ్రాండుగా జేసినారు. బుజ్జి పెండ్లిలో బాగా పిల్సుకున్న్యారు గాబట్టి దగ్గరదగ్గర ఓ మూడువేల మంది కల్సినారు. అంతగాకపోయినా రింకూ రెడ్డి పెండ్లికి కూడా బానే వచ్చినారు జనం. ఐనాగాని, బానుమతి ఆంటీ "బుజ్జి పెండ్లి కంటే మా రింకూ పెండ్లికే బాగా వచ్చినారుగదా!" అని బుజ్జి వాల్లనే అడుగుతుంది. మరి తెల్సి అడుగుతుందో, తేలీక అడుగుతుందోగానీ, ఆంటీకి గట్స్ ఎక్కువేబ్బ. 'ఆయ్మతో ఎందుకులేబ్బా, తలకాయ నొప్పి' అని, "వచ్చిన్న్యారులే ఆంటీ" అని సెప్తారు.

ఆఁ, అసలీ సంగద్దెలిస్తే బానుమతి ఆంటీ ఎంత కామెడీ విలనో అర్తమైతాది మీకందరికి.  బుజ్జి పెండ్లి ముందురోజు ఇంటికొచ్చిన బందువులతో "రిసెప్షన్ లో  ఏస్కోడానికి గిల్టు నగల సెట్టు తెచ్చుకుంటాననిందే బుజ్జి, తెచ్చుకుందా?" అని అడిగిందట. అసలు విసయమేందంటే, ఆ పాప, పెండ్లికని బెంగుళూరుకుబొయ్, పద్నాలుగు లచ్చలు పెట్టి డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ కమ్మలు, గాజులు తెచ్చుకుందని తెలిసి, ఓర్సలేక, ఎట్టైన గబ్బుపట్టిచ్చాలని పతకం పడిందనమాట ఆంటీ. సూసినారా, పెద్ద కంచు గదా!

జగ్గూ వాల్లక్క మొగుడు దుబాయిలో పన్జేచ్చాడు, రింకూ మొగుడు అమెరికాలో జేచ్చాడు. దాన్నిగూడ వదల్లేదు ఆంటీ. "బొంగులే, దుబాయేముంది, ద.....గ్గెర, అమెరికాకు పొయ్యే ఇమానాలన్నీ దుబాయిమీదనే పోవాలంట" అని సందులో వాల్లకు ప్రపంచపటం జూపిచ్చింది. అల్లుడు ఎంత దూరంలో పన్జేచ్చే అంత గొప్ప, మా ఆంటీకి.

తల్లే అనుకుంటే, బిడ్డ ఇంగొగాకు ఎక్కువే సదివింది, బడాయిలో. మొగం మీదుండే గుల్లలు దాసిపెట్టడానికి దిన్నం బెత్తెడెత్తు ఏస్కుంటుంది మేకప్పు. సందులోకి వొచ్చిందంటే గుప్పున కొట్తాది సందంతా సెంటువాసన. మొన్నటిదాకా హై హీల్స్ ఏసుకుంటాన్న్యాది, రొంత ఎత్తు తక్కవలే. పెళ్లికి ముందు సడెన్గా ఓరోజు సందులోకొచ్చి "హై హీల్స్ ఆరోగ్యానికి మంచివి కాదంట, మానేద్దామనుకుంటాన" అనింది. 'ఈమ్మికి ఇంత సడెన్గా ఆరోగ్యమెందుకు గుర్తొచ్చిందబ్బా?' అని ఆలోచిస్తే తెల్సింది మరుసటి రోజు, 'రింకూ రెడ్డేగాదు, కాబోయే మొగుడుగూడ పొట్టేనని'. 'ఓరి నీ ఏషాలో!' అనుకున్నాం మా సందంతా.

ఆంటీ వాల్ల కుండేది సిన్న ఆల్టో కారు. జగ్గూ వాల్ల కారు పెద్ద SUV. అయినాగాని మన అంటీ, "ఆఁ, మన కార్లేముందిలే జగ్గూ, బుడ్డ కార్లు!" అని మూడు లచ్ఛల ఆల్టోని, పదమూడు లచ్చల SUVని  ఒకగాటికే కట్టేసింది. జగ్గూ గానికి యాన్నో కాలిందిగానీ, పాపం ఏమంటాడు, "నీకు బాతెల్సు ఆంటీ కార్ల గురించి" అని ఊరకున్న్యాడు.

పాపం, ఆ మద్య మాసిన్నమ్మ బిడ్డ రమ్య, డ్రస్ మెటీరియల్ తెచ్చుకోంటే సూసి, "ఇంగా ఎవరేసుకుంటానారు రమ్యా ఇట్లా, ఇప్పుడందరూ టాపులేసుకుంటాంటే!" అనింది. 'అందరూ' అంటే ఆయ్మ కూతుర్లు అని అర్తం. ఇట్లుంటాయి మా బానుమతి ఆంటీ లీలలు.

ముద్దుగా మా సందులో "News channel" అని పిల్చుకుంటారు మా బానుమతి ఆంటీని. ఎందుకంటే అందరి యవ్వారాలు ఆయ్మకే గావల్ల. అంతేనా, నాన్స్టాపుగా నస కూడా పెడ్తాంటాది కాబట్టి.

మీసందులో గుడక ఓ బానుమతి ఆంటీ ఉండాది గదా!