Friday, May 10, 2019

(అ)సంపన్న దాతృత్వం ?

సన్నివేశం 1: ద్వాపర యుగం, ద్వారక

శ్రీ కృష్ణుడు తన సిరిసంపదలతో, భార్యలతో ద్వారకానగరంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నపుడు, తనని కలవడానికి, బాల్యస్నేహితుడు, నెచ్చెలి, సహపాఠి, సద్బ్రాహ్మణుడు అయిన కుచేలుడు (సుదాముడు) వచ్చాడు. ఆ సమయంలో కుచేలుడు అత్యంత కఠినమైన దారిద్య్రంతో సతమతమౌతూ ఉన్నాడు. ఇంట్లో ఉన్న పసిపాప(ల)కి పెట్టడానికి కూడా సరిపడనంత మిక్కిలి లేమిలో ఉన్నాడు. సాయం కోసం, తన భార్య, స్నేహితుడైన శ్రీకృష్ణుని దగ్గరకి వెళ్లమని చెప్పడంతో (అడగడంతో?) అక్కడికి వచ్చాడనమాట. ధరించడానికి సరైన బట్టలుకూడా లేని కుచేలుడు, చిరిగిన బట్టలతోనే శ్రీకృష్ణుని కలవడానికి కాలినడకన వచ్చాడు. ద్వారందగ్గర ఉన్న భటులు ఆపితే, తాను వారి స్వామికి బాల్యమిత్రుడని చెబుతాడు. వారికి అనుమానమొచ్చినా, లోపలికి వెళ్లి, రుక్మిణీదేవి శయన మందిరంలో ఉన్న వారి యజమానికి (బయటినుంచే) విన్నవించారు. పేరు వినగానే, చయ్యన ద్వారం దగ్గరికి వెళ్లి, తానే స్వయంగా కుచేలుణ్ణి సాదరంగా పట్టుకొచ్చి, తానూ, రుక్మిణి తప్ప, అన్యులకి ప్రవేశంలేని శయన మందిరంలోకి తీసుకెళ్లి, తీసుకెళ్లడమేమిటి, అక్కడున్న 'వారి' పాన్పుమీద కూర్చోబెట్టి, అన్నీ తానై,సపర్యలతో మిత్రుడికి సేదతీర్చి మురిసిపోతున్నాడు. శ్రీకృష్ణుడంతటి వాడేమిటి, అన్నీ ఆపేసి, ఇలా ఒక పేదవాణ్ణి కూచోబెట్టి, ఎక్కడ? ఎవరికీ అనుమతిలేని పట్టమహిషి శయన మందిరంలో, ఇతర భార్యల సమక్షంలో; పాదాలుకడిగి, గంధంపూసి, విసనకర్రతో విసరడమేంటి; అసలు, సేవలు చేయించు కోవడం తప్ప, చేయడం ఎరగని ప్రభువు ఇలా ప్రవర్తించడమేంటి అని అక్కడున్న అందరూ నోళ్లు వెళ్ళబెట్టుకొని ఆశ్చర్యపడుతున్నారు. ఇంతా పొందడానికి ఈ కుచేలుడు చేసుకున్న పుణ్యవిశేషాలేమిటో  అని ఆలోచిస్తున్నారు. ఇంతలో, శ్రీకృష్ణుడు మిత్రుడైన తనకోసం ఏం తెచ్చావని కుచేలుణ్ణి అడుగుతాడు. పేదవాడైన కుచేలుడు ఏం తేగలడు? వస్తూ, వస్తూ తన భార్య మూటగట్టిన అటుకులు గుర్తుతెచ్చుకున్నాడు. కానీ, ఇంత సిరిసంపదలతో తులతూగుతున్న మిత్రునికి కేవలం అటుకులివ్వగలనా అని తెగ మథనపడతున్నాడు.  నీళ్లు నములుతున్న మిత్రునిచూసి, చొరవతో, శ్రీకృష్ణుడు కుచేలుని అంగవస్త్రంలోనున్న ఆ మూట చేతపుచ్చుకొని ఏముందోనని విప్పుతాడు. బయటపడిన ఆ అటుకులని చూసి ఆనందంతో ఒక పిడికెడు నోట్లోపోసుకొని తృప్తిగా నములుతాడు. ఈ సన్నివేశాన్ని బమ్మెర పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు.

మురహరుడు పిడికెడటుకులు గరమొప్పగ నారగించి కౌతుకమతియై (కౌతూహలియై  ?)
మరియును (మరియొక ?) పిడికెడుగొన దత్కర మప్పుడు బట్టె గమల కరకమలములన్

భావం: శ్రీకృష్ణుడు, పిడికెడు అటుకులని తిని, ఇంకొన్ని తిందామని మరో పిడికెడు తీసుకుంటుండగా, ఇంక చాలు, వద్దని రుక్మిణి తనచేత్తో, శ్రీకృష్ణుని చెయ్యిపట్టుకొని ఆపింది.

అరెరే, అదేమిటి, ఇంకొన్ని తింటే ఏమౌతుంది, పాపం మిత్రుడు ప్రేమగా తెచ్చాడు, తిననివ్వాల్సింది, రుక్మిణి ఎందుకలా చేసింది అని ఆలోచిస్తున్నారా? లేక, already, పరిస్థితిని అర్థం చేసుకుని, పేద మిత్రునికి శ్రీకృష్ణుడు మరీ ఎక్కువ సాయం చేసేస్తాడేమో అని, కఠినంగా, వారిద్దరినీ విడదీయడానికి అలా చేసిందని అనుమానిస్తున్నారా?

సన్నివేశం 2: ప్రస్తుతం, బెంగుళూరు

ఆమధ్య PhD అయిపోతున్నపుడు, మా జనాలు చిన్న సైజు farewell party తీసుకుంటూ, 'KRతో కాసేపు' (tag line - 'order చేసిన బిర్యానీలు వచ్చేదాకా') అని ఒక ముఖాముఖి entertainment plan చేశారు. అప్పుడు ఒక interesting question అడిగారు. 'జీవితంలో సాధించలేనేమో అనిపించే ఆశయాలు ఏమైనా ఉన్నాయా?' అని. దానికి జవాబుగా, చాలా రోజులుగా నాలో ఉన్న ఒక ఆలోచన గురించి బయట పెట్టా.

నా అభిప్రాయంలో, దాతృత్వము అనేది చాలా గొప్ప మానవీయ అభివ్యక్తి (Manifestation of Humanity). మన పురాణాలు, ఇతిహాసాలు కూడా దాతృత్వాన్ని ఉదారమైన లక్షణంగా, శీలాలంకారిగా చెప్పడం మనకు తెలుసు. తరువాతి తరాలు (యుగాలు అనాలేమో) కూడా అప్పటి సుభాషితాల్లో, తత్వాల్లో మొదలుకొని, ఇప్పటి ప్రవచనాల దాకా, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, దధీచి, మొ||వారిగురించి గుర్తుచేసుకోవడం విన్నాం. ఇప్పుడైతే ప్రేమజీ, Tatas, బఫెట్, బిల్ గేట్స్, షకీరా, సచిన్, నానా, etc.ల దాతృత్వం గురించి చూస్తున్నాం. ఏకంగా గ్రామాలనే దత్తత తీసుకునే Reel-life శ్రీమంతులని, real-life శ్రీమంతులనికూడా చూస్తున్నాం (వాటి వెనకాల కారణాలు ఏమైనా, దానం జరగడం చూస్తున్నాం). పురాణేతిహాసాలను పక్కన పెడితే, ఈ కాలానికి గొప్ప దాతలని ఓసారి గమనిస్తే, అందరూ (at least చాలామంది) సుప్రసిద్ధ శ్రీమంతులే. ఇంకోరకంగా, చాలామంది ఏదో ఒక రంగంలో ప్రతిభ ప్రదర్శించి (వ్యాపారంలో కూడా ప్రదర్శించాలనే అనుకుంటున్నా), పేరు గడించి, తద్వారా సంపద గడించినవాళ్ళే. సంపద అంటే సామాన్యమైన మొత్తంలో కాదు, మధ్యతరగతి వర్గం ఊహించనంత అసాధారణమైన సంపద అనమాట. అనగా, కొన్ని వందల కోట్లు (వందల కోట్లు అయినపుడు, రూపాయలు అయినా, డాలరులు అయినా పెద్ద తేడా ఉండదుగా). ఇలా గొప్ప సంపన్నులు కొంతమంది, వాళ్ల సంపదలో కొంతభాగం (కొంత మంది చాలా భాగం) దానధర్మాలకు వెచ్చించడం అనేది వాదన అవసరంలేని మంచిపని. కానీ, ఎక్కువ పరిశోధన కూడా అవసరం లేకుండా గమనించగలిగే విషయం ఏంటంటే, వీళ్లలో చాలామంది (అందరూ?) క్రీడలు, వ్యాపారం, వినోదం లాంటి వేగంగా సంపద పోగేయగల వృత్తుల వాళ్లే. Notice my reader, నెలజీతాలవాళ్ళు లేరు. అనగా, జీతానికి పనిచేసే సాధారణ ఉద్యోగులు అనమాట. (కొంతమంది అసాధారణ నెలజీతగాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇందాక చెప్పుకున్న వేగంగా సంపద పోగెయ్యగల వారయివుంటారు. ఉదాహరణకి, ముకేశ్ అంబానీ నెల జీతం, 21వ శతాబ్దపు మొదటి దశకంలో, దాదాపుగా 3M USD). కొంచెం అనుభవం తర్వాత ఆరంకెల జీతం తీసుకున్నా, సాధారణ నెలజీతగాళ్ళు విపరీతమైన సంపద పోగెయ్యడం చాలా కష్టం అని నా అభిప్రాయం. మహా అయితే, అయిదో, పదో కోట్లు గడించగలరేమో, అంతే. అది కూడా అనుమానమే. ఒకవేళ సాధ్యపడినా, ఎప్పుడో జీవితం చివరిలో తప్ప, యవ్వనంలోనే పోగెయ్యగలరు అని చెప్పడం కూడా కష్టం.

ఇటువంటి సందర్భంలో, సమీప భవిష్యత్తులో, ఒక నెలజీతగాడిగానే కనిపిస్తున్న నేను, బాధ్యతాయుతమైన గృహస్తుగా ఉండికూడా, ఒక పెద్దమొత్తం (ఉదా|| ఒకటి రెండు కోట్లు) దానం చేయగలనా అనేదే ఇందాకటి నా ఆలోచన. సంపన్నులుగా ఉండి, ఉదారంగా దానం చేయడం ఒకటి, ఖచ్చితంగా గొప్పదే, అనుమానమేం లేదు; కానీ, సాధారణ జీతాలు, జీవితాలతో కూడా అలాంటి అనుభవాలు సాధ్యమేనా అన్నదే నా ఆలోచన. నాకూ ఒక రుక్మిణి వస్తుంది (ఒక్కతేలెండి); తప్పకుండా ఇలాంటి నా ఆలోచనలని దివ్యదృష్టి లాంటివేం లేకుండానే తెలుసుకుంటుంది (మనం చెప్పేస్తాం). మరప్పుడు (ఆలోచన తెలుసు కున్నప్పుడే), చేత్తో ఆపేస్తుందో, కాళ్ళు చేతులు విరిచేస్తుందోనని కొద్దిగా అనుమానం. ఆవిడ సంగతి పక్కన పెట్టినా, అసలు, ముందు నేను అంత నిస్వార్థంగా ఉండగలనా, almost impossible. అందుకేగా, సాధించలేనేమో అనే ఆశయాల్లో దీన్ని archive చేసింది. తెలుగులో అసంపన్న అనే పదం లేదేమో(?) (నా searchలో నాకు దొరకలేదు). ఈ ఆలోచన ఆచరించడం ఎంత అసంభావ్యమో సూచించడానికే అన్నట్లు, అలాంటి పదం వాడానేమో!

సన్నివేశం 3: ద్వాపర యుగం, ద్వారక  

(శ్రీకృష్ణుని చెయ్యిపట్టుకొని తినకుండా ఆపేసిన సన్నివేశం)

అవును, రుక్మిణి నిజంగానే, పరిస్థితిని అర్థంచేసుకుంది (ఆవిడ ఎవరు? మనం ఇంతసేపూ చర్చించుకున్న "సంపద"; లచ్చిందేవి). ఇక్కడ ఒక్క పిడికెడు అటుకులు తిన్నందుకే, అడగక పోయినా, దరిద్ర పీడితుడైన కుచేలునికి అక్కడ (కుచేలుని ఇంటి దగ్గర) కొన్ని తరాలు తిన్నా తరిగిపోని ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. ఇంకొన్ని తింటే, మమ్మల్ని (భార్యల్ని), తనని కూడా దాసులకింద ఇచ్చేస్తాడేమో అని భయపడి, శ్రీకృష్ణుడు తినకుండా ఆపేసిందన్నమాట. అంతేకానీ, పాత సినిమాలో సూర్యకాంతం, ఛాయాదేవి లాగా కాదన్నమాట.
(అలా శ్రీకృష్ణుడు తినగా మిగిలిన అటుకులని అక్కడున్న మిగిలిన వాళ్ళందరూ ప్రసాదంలాగా పంచుకున్నారు. తర్వాత ఇవన్నీ ఏమీ తెలియని కుచేలుడు, శ్రీకృష్ణుని ఏమీ అడగకుండానే మిత్రుని దగ్గర సెలవు తీసుకొని ఇంటికి తిరుగు పయనమవుతాడు. దారిలో, వచ్చిన పని నెరవేర్చుకోకుండానే తిరుగుపయనం అయ్యానే అని కొంచెం చింతిస్తాడు, కానీ, తర్వాత ఇంటికెళ్లి విషయం తెలుసుకొని సంతోషిస్తాడు.)