Showing posts with label నాకోసం. Show all posts
Showing posts with label నాకోసం. Show all posts

Thursday, January 30, 2020

నాకు భయమేస్తోంది, రేపు నాకు పెళ్లి !

చిన్నప్పుడు ఇంట్లోనో, బళ్ళోనో చెప్పినపని చేయకపోతే, "నీకుందిలే, మీ అమ్మ నీకు పెళ్లి చేస్తుంది!", "సోషల్ ఐవారు నీ పెళ్లి చేస్తాడు!"  అని భయపెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు, 'కావాలి, కావాలి!' అనుకొని మరీ చేసుకుంటున్న పెళ్లి వల్ల వేస్తోంది భయం.

అవును, పెళ్లంటే ఎవరి నిర్వచనాలు వాళ్లకున్నా, అందరూ నిర్ద్వందంగా  అంగీకరించేది, 'అదొక పెద్ద మార్పు' అని. ఉదాహరణకి, ఇకమీద ఎప్పుడు పడితే అప్పుడు, ఏదిపడితే అది తినలేం. ఇంకొకరు తిన్నారోలేదో తెలుసుకొని కూచోడం ఇంతవరకూ అలవాటు లేని పని.

అప్పుడెప్పుడో Steve Harvey చెప్పాడు, "మగవాళ్ళకి పెళ్లయ్యాక, I like *** కాస్తా , we hate *** అవుతుం"దని.  ఆ dashలో ఏ బుజ్జిముండని కుర్చోపెట్టాలో అని తలచుకుంటేనే భయమేస్తోంది. "నన్నొద్దు, please, నన్నొద్దు!" అని మనకున్న అన్ని మాం....చి అలవాట్లు, ఇష్టాలు, tasteలు, preferenceలు వేడుకుంటున్నాయ్.

కాళ్ళు చేతులు ఆడటం మొదలైనప్పటి నుంచి ఆడుతున్న Cricketని ఆపాల్సివస్తే? ఇంకేమన్నా ఉందా, ball తగిలి వేళ్ళు విరిగినప్పుడు కూడా ఆపలేదే!

మీసం రాకముందటి నుంచే మొదలైన మరో hobby, 'సౌందర్యారాధన' సంగతేంటి?

పనికిమాలిన పరిచయాలనుంచి, పనిగట్టుకొని మరీ పలకరించే friends వరకూ అన్నీ affect అవుతాయిగా.

అన్నదమ్ముల అనుబంధం సినిమా కాస్తా, దాయాదుల పోరై, కురుక్షేత్రంగా convert అవుతుందా?

వీణపాటలు వినడం కుదరక పోతే? మామ feel అవడూ?

మనకి నచ్చే సొరకాయ, బీరకాయలే వాళ్ళకి నచ్చాలని లేదుగా!

"తల్లా, పెళ్ళామా?" సినిమాకి రోజూ tickets కొన్నట్లే కదా పెళ్లంటే! కాదా?

Sitting settingలకి, సంభాషణలకీ ఇక సెలవా? దేవుడా! సగం జీవితం వాటితోనే కదా మన romancing; మిగిలిన సగం జీవితానికీ సరిపడా promise చేస్తుందా ఈ పెళ్లి? అబ్బే, అనుమానమే సుమా!

నంజుకోడానికి సరైన మాటలు లేకపోతే మనకి టీ-కాఫీలు కూడా సహించవే, ఇకమీద మనం తినే సగంపైగా భోజనాలు కేవలం ఒకే వ్యక్తితో కదా, manage చేయగలమా?

కొండలూ గుట్టలూ ఎక్కలేమా, No more trekking ? Oh my God! మన "Heights are Healthy" ఉద్యమం ఇక ముందుకు నడవదా?

Cycleకి, Bikeకి bye-bye చెప్పాల్సిందేనా? మనకి కారుల్లో ప్రపంచం సరిగా కనపడదే! గాలి తగలందే soul చిక్కదే!

కొన్ని కొన్ని conversationsలో replacement సాధ్యపడని బూతుల సంగతేంగానూ? కొన్నాళ్లే అయినా, వాడకుండా ఉండగలమా? weekend శివగాడో, KKనో call చేస్తే, చాటుగానే మాట్లాడాలా? లేక censor చేయాలా? నా మాటలకి నేనే కత్తెరేయాలా?

హతవిధీ! ఎంతటి కాలము దాపురించునో కదా! వైవాహికములనిన మావంటి స్వేచ్చా జీవులకి వెరపు గాక ఇంకేమి!

Thursday, September 5, 2019

వేరు మూలాలు

మూలాలకి కట్టుబడి batting చేయాలి అని test cricket గురించి చాలా చిన్నప్పుడు news paperలో ఎవరో చెబితే చదివినట్టు గుర్తు. 'మూలాలు' (Fundamentals), చాలా ప్రత్యేకమైన మాట అనిపిస్తుంది నాకు. Cricket లాంటి  sportsలోనే కాదు, తర్వాత రాసిన చాలా పరీక్షల్లో  problems solve చేస్తూ over action వల్ల చేతులు కాల్చుకున్నప్పుడు, researchలో అంతుచిక్కని ప్రశ్నలకి సమాధానాలు వెదుకుతూ తెల్లవారుఝాముల్లో తల బద్దలు కొట్టుకున్నప్పుడు, బంధుమిత్రుల దగ్గరినుంచి సమాజంలోని పలురకాల వ్యక్తులతో వ్యవహారాలు చక్కబెట్టాల్సి వచ్చినప్పుడు, ఇలా జీవితంలో అన్ని సందర్భాల్లోనూ, సమస్య ఎదురైనప్పుడల్లా, fundamentals నుంచి సమాధానం కోసం వెదకడం బాగా సహాయపడింది నాకు. Clarity వచ్చి, ముందుకెళ్లడం సాధ్యపడింది చాలాసార్లు. So, ఆరకంగా, జీవితం మొత్తాన్ని కూడా ఒక ప్రశ్నలాగానో, ఒక gameలాగానో, ఒక ప్రక్రియలాగానో అనుకుంటే, same సూత్రం దీనికి కూడా వర్తిస్తుంది కదా! జీవితంలో ఏ సమయంలోనైనా, "ఏం చేస్తున్నా? ఎక్కడ నిలుచున్నా? సరిగ్గానే సాగుతోందా ప్రయాణం?" ఇలాంటి ప్రశ్నలు ఉదయించినపుడు, వెంటనే, ఒక్కసారి "అసలు ఇపుడు ఎటువైపు వెళ్తున్నా? దేనికోసం అని వెతుకుతున్నా? ఎటు వెళ్లాలని అనుకున్నా?  అటువైపే వెళ్తున్నానా?" అని నన్ను నడిపించే (నా జీవిత) మూలాల్ని మరొక్కసారి గుర్తుచేసుకోవడం అలవాటు అయ్యింది.

I think, మనలో చాలామందికి, చిన్నప్పటినుంచే, మనకి జీవితంలో ఏం కావాలో,  ఆలోచించడం మొదలు పెడతాం. అంటే, నా ఉద్దేశం 'మన జీవిత పరమార్ధం ఏమిటి?' అని కాదు. ఎప్పటికప్పుడు, మనకి ఏదోటి నచ్చేసి, నాకిది కావాలి, నేను కూడా ఇలా చేస్తాను, నేనెప్పటికైనా ఇది అవ్వాలి,అనిపించే ఆలోచనలమాట. స్పష్టత లేకపోయినా, అవే ఆ తర్వాత నచ్చకపోయినా, ఇంకేవో ఎక్కువగా నచ్చడం మొదలైనా, వాటిని పొందడానికి మనం ప్రయత్నించక పోయినా, ఇలాంటి ఆలోచనలు కలగడం ఐతే సామాన్యమే (అనుకుంటున్నా). కానీ, కొంతమందికి చాలా చిన్నప్పుడే, జీవితం చివరి వరకు నడిపించేంత గట్టి ఇష్టాలు ఏర్పడినా ఆశ్చర్యం లేదు. మనం చాలా మంది interviews చూసినప్పుడు, ఎంతవరకూ నిజమో తెలియదు కానీ, వారి ఇప్పటి స్థితికి, చాలా చిన్నప్పుడే పడిన బీజాల గురించి చెబుతూ ఉంటారు. ఈ మూలాలు అంతటి అమూల్యమైనవి అనమాట. నేను celebrityని కాకపోయినా, interview ఇవ్వకపోయినా, మనందరం మన జీవితాలని నడిపించే మూలాలని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవడం మంచిదని అనిపించి, పైగా, ఇవాళ అలాంటి ఒక అవకాశం, అవసరం వచ్చింది కాబట్టి, ఆ పని చేస్తున్నా. 

చాలా చాలా తక్కువమందికే దక్కే అదృష్టం, అవకాశం నాకు దక్కింది. అదేంటంటే, నాకు మా నాన్న, వాళ్ళ నాన్న, అంటే మా అబ్బ కూడా చదువు చెప్పారు, నా చిన్నప్పుడు. మా ప్రాంతంలో, తండ్రివైపు తాతని అబ్బ అంటారు. అవును, నేనంటోంది, జీవితంలో పాఠాలు కాదు, తరగతి గదిలోపాఠాల గురించే. నేను మాఊరి high school (ఉన్నత పాఠశాల)లో చదువుకున్నపుడు మా నాన్న, primary school (ప్రాథమిక పాఠశాల)లో ఉన్నపుడు మా అబ్బ (ప్రయివేటు masterగా) నాకు చదువు చెప్పినవాళ్లే. నేను పుట్టిన 3 రోజులు అటుఇటుగా మా అబ్బ మా ఊరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదవీవిరమణ చేసాడంట (verify చెయ్యలేదు, చిన్న జ్ఞాపకం అంతే). So, బడిలో పాఠాలు చెప్పలేదు, కేవలం ప్రయివేటులోనే. దాదాపు పాతికేళ్ల నా సుదీర్ఘమైన academicsలో, నాకు చాలా మంది మంచి ఉపాధ్యాయులు ఎదురుపడ్డారు, అది ఇంకో అదృష్టం, ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. మళ్ళీ, distract అయ్యేలోపే, మూలాల దగ్గరికి వద్దాం. విషయం ఏంటంటే, నేను ఉహించుకుంటున్న, తద్వారా నిర్మించుకుంటున్న నా జీవితానికి, మూలాలు, నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు మరియు వారు నాపై వదిలిన ముద్రలు. అలా నన్ను ప్రభావితుణ్ణి చేసిన చాలామంది ఉపాధ్యాయుల్లో, మొదటివాడు మా అబ్బ. అవును, నేనోదో sentimentalగా  ఉంటుందని చెప్పడంలేదు, నిజంగానే అయన నన్ను influence చేసిన teacher. మా అబ్బ అవడంవల్ల తరగతి పాఠాలతో పాటు, బయటకూడా నేను ఆయనతో గడిపిన సమయం గుర్తుండి పోయింది. ఇవాళ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం, కాబట్టి, నా బాధ్యతగా నా గురువుల్ని తలచుకొని, నాకు ఒకానొక ఆత్మీయ గురువు, ఇంకోరకంగా, తొలి గురువు లాంటి మా అబ్బని మరింత దగ్గరగా (zoomలో) తలుచుకునే ప్రయత్నం చేస్తున్నాను.

చిన్నప్పటి నుంచి, మావూళ్ళో మరియు చుట్టుపక్కల ఒకటి రెండు దగ్గరి పల్లెల్లో కూడా, మా cousins అందరికి గుర్తింపు, 'భైరవ కొండా రెడ్డి ఐవారు మనవళ్లు'గా, మా అబ్బ పేరుమీదే.  అప్పట్లో, కొన్నిచోట్ల ఇప్పటికి, teachersని అయ్యవారు (ఐవారు) అనేవాళ్లు, గుళ్లో పూజారుల లాగ. మరియు, సమాజానికి teachers అంటే భయభక్తులు సమపాళ్లలో ఉండేవి. నా పేరుకూడా అయన పేరుమీదే రావడం (పెట్టడం కాదు) జరిగింది, అదంతా ఒక పెద్దకథ (కొంచెం ఇక్కడ ఉంది). అయన ఏమి చదువుకున్నారో నాకు తెలీదు, కానీ, నాకు తెలుగు, లెక్కలు చెప్పారు, English కూడా (నేను ఉన్నత పాఠశాలకి వచ్చాక). ఆ తర్వాత 'తెలుగు పంచాంగానికి primer' లాగా, పంచాంగం అంటే ఏంటి, ఎలా చూడాలి లాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేర్పించాడు. అయన పెళ్లి ముహుర్తాలు నుంచి, శంకుస్థాపనల వరకు చాలా చేయగలడు. మా ఊర్లో, గొల్ల అన్నదమ్ములు కట్టుకున్న పెద్ద మేడలకి శంకుస్థాపన చేస్తున్నప్పుడు, పడమటి దాని ఆయుస్సు (97 సంవత్సరాలు అని జ్ఞాపకం) calculate చేసింది నేనే, అయన సమక్షంలో, అప్పుడు నా వయసు ~10. చెప్పానుగా, he was my teacher in many ways. నాకు Englishలో articles (a, an, and the) విశదీకరించి చెప్పింది కూడా ఆయనే. ఎక్కడ శంకుస్థాపన, ఎక్కడ ఆంగ్ల వ్యాకరణం. ఇలాంటివి చాలానే. 

తెలుగులో చల్దులారగించుట అనే పాఠం ఒకటి ఉండేది. అందులో, శ్రీమద్భాగవతం నుంచి శ్రీకృష్ణుని బాల్యంలోని కొన్ని లీలలు ఉండేవి. ఆ సందర్భంలో కింది పద్యం వచ్చింది 

ఓయమ్మ నీకుమారుడు 
మాయిండ్లను పాలు పెరుగు మననియడమ్మ, 
పోయెదమెక్కడికైనను 
మాయన్నుల సురభులాన మంజులవాణి

చాలా సులభమైనదే, అంతా అర్థమైనట్లే ఉంది, సురభి అంటే ఆవు అని, ఆన అంటే ఒట్టు అని, కానీ,   'మా అన్నుల' సురభులు దగ్గర ఆగిపోయా, అక్కడే నాకు మా అబ్బకి చర్చ start అయింది. ఎక్కడనుకున్నారు, ఇంటి బయట, మా చిన్నాన్న park చేసిన ఎడ్లబండి కాఁడిమ్రాను మీద నేను seesaw ఆడుతూ ఆయనతో వాదిస్తున్నా, ఆ చివరి పాదం గురించి. ఆయన నడవలోనుంచి, "కాదురా, అన్నల ఆవులు, తమ్ముళ్ల ఆవులు కాదు, అన్నుల సురభులు అంటే, ఇష్టమైన ఆవులు అని అర్థం" అంటున్నాడు నవ్వుతూ. అబ్బే, నాకు పూర్తిగా అర్ధమైనట్లు లేదు (వాళ్ళ అన్నల ఆవుల మీద ఒట్టువేయ్యడం ఎందుకు? వాళ్ళకి ఆవులు ఉన్నాయిగా అనే ఆలోచిస్తున్నా, kiddish :-) ). అలానే ఉండిపోయింది. చాన్నాళ్ళకి, చంటి సినిమాలో 'అన్నుల మిన్నల, అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే' అనే పాట వినేప్పుడు, ఓరినీ, ఇదేకదా అప్పట్లో, అర్థంకాలేదు అని అనుకున్నా, అయన చాలా కష్టపడ్డాడు పాపం చెప్పడానికి అని. ఆ తర్వాత, ఆ పదం ఎక్కడ వచ్చినా,  ఈ సన్నివేశం గుర్తుకొస్తుంది నాకు. 

చాలామందే చదువుకునేవారు అయన ప్రయివేటులో. అందరం math puzzles, పొడుపు కథలు, ఇలా చాలానే నేర్చుకున్నాం. మా జేజి (నాయనమ్మ) అంటే మాత్రం పిల్లలకి హడలు, నెల మొత్తం ఎవర్నో ఒకరిని ఫీజు అడుగుతూనే ఉండేది, నన్ను కాదులెండి, మిగిలిన వాళ్లనే. 

మా అన్నకి, కదిరిలో coaching తీసుకున్నాక, లేపాక్షి నవోదయ schoolలో seat వచ్చాక, నాకు (రాములయ్యగారి ప్రసాద్ గాడితో కలిపి) తానే, ఇంటి దగ్గరే coaching ఇచ్చి, exam crack చేయించాలని గట్టిగానే ప్రయత్నం చేశాడు పాపం. మాకున్న matterతో అదో సాహసమే అని చెప్పుకోవాలి. అయినా, ప్రయత్నించిన అయన సాహసం గురించి నేను మర్చిపోలేను. ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆయనకి ఇంకెవరో అవార్డు ఇవ్వడం ఎందుకు, నేనుప్పుడో ఇచ్చేశా, ఆయనకున్న అంకితభావానికి. పులివెందులలో ఆ పరీక్ష రాస్తుంటే, this is true story, no kidding, ఆ invigilator, hall ticketలో నా పేరు చూసి (ఇంటి పేరుతో కూడా ఉంటుంది కదా) ఊరిపేరు అడిగికనుక్కొని, 'ఐవారు మనవడివా?' అని అడిగాడు. Exam అయ్యాక, రోడ్డుమీద ఆయన మమ్మల్ని చూసి, దగ్గరికొచ్చి పలకరించాడు మా అబ్బని, తెలిసిన వాడంట. ఇవన్నీ కేవలం accidents ఎందుకు కాదంటే, వాటి ప్రభావం అంతటితోనే మాసిపోకుండా, ఇన్నేళ్ళుగా నాలో ఇంకా బ్రతికే ఉన్నందుకు.

మనిషి వయసొచ్చాక చాలావాటి వెంట పరిగెత్తినా, ప్రపంచం తెలియని పసివయసులో మనమందరం వెంటపడేది 'ఏంటో ఇది, తెలుసుకుందాం' అనే జ్ఞానంకోసం. చుట్టూ అంతా కొత్తదైన సృష్టిలో, తెలియజెప్పి, మనలోని కుతూహలాన్ని (curiosity) తృప్తి పరచి, ప్రపంచం ఎంతో తెలిసిందనిపించి, ఇంకొంచెం తెలుసుకుందామనే కోరిక రగిలించే ఉపాధ్యాయులందరూ ధన్యజీవులే, మా అబ్బతో సహా!

ఏ స్థాయిలో విద్యగరిపినా, ఉపాధ్యాయులందరూ ధన్యజీవులే, కానీ, మూలాలు ఏర్పర్చిన ప్రాథమిక గురువులు ప్రత్యేకంగా ప్రాత:స్మరణీయులు కదా!

ఆ తర్వాత్తర్వాత మానాన్నతో కలుపుకొని, నిన్నమొన్న video lecturesలో బోధించిన పరిచయమేలేని ఆచార్యుల వరకూ ఎందరో మహానుభావులు, అందరూ గొప్పవారే నాకు. వారందరూ నా కలల జీవితానికి మూలాలు. నామటుకు, ఒక వయసు వచ్చాక తారసపడిన, విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో లోతైన విషయాలు బోధించే ఆచార్యులకన్నా, ఎక్కడో ఒక సాధారణ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పిన ఉపాధ్యాయులే నా జీవితాన్ని ఎక్కువ ప్రభావింపజేయ గలిగారేమో. ఎందుకంటే, వీరు పైనుండే శాఖల లాంటి వారు, మరి వారేమో వేరు మూలాలలాంటి వారు.

Monday, August 19, 2019

చికిత్స లేని రోగం

ఇదివరకే ఎన్నోసార్లు బాధించింది.

ఎన్నిసార్లు వచ్చిపోయినా, మరోమారు సంక్రమించదని పూచీ లేదు.
ఎందుకంటే, ఇది మనపై మనమే ఎక్కుపెట్టుకునే సుపరిచిత ప్రతిజీవి.

వింతేమిటంటే, ప్రతిరక్షకము కూడా సుపరిచితమే.
అయినా, ఏం చేయలేం. అలవాటైన అశక్తత; కదూ!

అవును, ఇదొక, టీకా, చికిత్స, ఏవీ లేని రోగం. 
ఇంతకీ, ఆ రోగమేమిటంటారా?

ధూర్జటిని బాధించిన శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధా (సంపదలనెడి మెఱుపుతీగెలతో గూడిన సంసారమనెడి మేఘముల నుండి కురిసిన, పాపములనెడి నీటిధార) నుంచి, Officeలోపని చేస్కుంటుండగా, ఉన్నట్లుండి ఇలాంటిదేదో రాసుకోవాలని పీడించే నా అన్యమనస్కత వరకూ, ఈ రోగాలు పలురకాలు. 

Sunday, July 14, 2019

విగతంబయ్యె నొక్క వర్షకాలపు weekend!

దానవాధికృతయైన దివిజపురియట్లు,
మొగులుగప్పిన మార్తాండునియట్లు,

దాశరథిని వీడిన దశరథునియట్లు,
పచ్చదనమింకిన పర్యావరణంబట్లు,

చినుకుజాడలేని సీమచేలయట్లు,
విపన్నని గావగలేని విజయుని వీరంబట్లు,

Monday, July 8, 2019

ఎంత పనిచేసావ్ మచ్చా, ShanLanj!

మచ్చా ,
ఎంత పనిచేసావ్ మచ్చా!

"అన్న, తమ్ముడు, బావ, బామ్మర్ది, ఏంది భయ్యా ఇదంతా?
KR అనేస్తా ఎంచక్కా, పిచ్చ light!" అన్నోడివి, ఆనాటినుంచి నన్ను KRని చేసినోడివి, open mindedగా ఉండాలన్నోడివి, ఉన్నోడివి,
ఇంత పిచ్చి పని, అసలు ఎవరికీ నమ్మకమే కుదరడంలేని పని, ఎలా చేసావ్ మచ్చా ?

ఆరేళ్లుగా, అత్యంత సన్నిహితంగా, తిన్నాం-తిరిగాం, cricket ఆడాం-కబుర్లూ ఆడాం, కూర్చున్నాం-ఖాళీ చేసాం, సినిమా కెళ్ళాం-సైకిల్ తొక్కామ్, బైక్ రైడ్ కెళ్ళాం-hikeలు trekలు చేసాం, ఈతకొట్టాం-eager గా wait చేశాం, పనికొచ్చే పనులు-పనికిమాలిన పనులూ చేసాం, publications గురించి మాట్లాడుకున్నాం-police station experience గురించీ comedy చేసుకున్నాం, సమాజం గురించి చర్చించాం - substance abuse చేసాం, భవిష్యత్తు గురించి-బాధల గురించీ బొచ్చెడుసార్లు మంతనాలు జరిపాం, hot stuff-cold stuff తేడాలేకుండా share చేసుకున్నాం, ఇంకా కలిసి ఏం చేయలేదని నాకు చెప్పుకోకుండా ఇలాంటి పనిచేసావ్ మచ్చా నువ్వు?

అయినా నువ్వు గొప్పోడివి మచ్చా. నువ్వు కలిసి మనందరి timeని happy time చేసావ్, కలిసి లేనప్పుడు, నీ happy timesని share చేసి మమ్మల్ని సంతోష పెట్టావ్. కానీ, నువ్వు బాగాలేవని మాత్రం, ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేక పోయావ్ మచ్చా ?
మేము బాధ పడతామనా ?
అయితే ఇప్పుడేం చేసావో చూడు; ఒకేసారి అందర్నీ గొప్ప దుఃఖంలో తోసేసావ్.

"No free lunch భయ్యా!" అనేవాడివి; కానీ, నువ్వు మాకందరికి చాలా easyగా దొరికేశావే అనుకున్నాం. ఆ price ఇప్పుడు pay చేస్తున్నాం, నువ్వింక లేకుండా పోయాక;
నువ్వు కూడా postpaid plan లాంటోడివే మచ్చా, always hated them.

మొన్నటికి మొన్న, మూడు గంటలు call మాట్లాడి, stone అయ్యి చేసిన తుంటరి experiments కూడా చర్చించుకున్నాక, చెప్పుకోడానికి ఇంకేం లేవని పెట్టేసాం అనుకున్నా కానీ, చెప్పుకోలేక పెట్టేశావ్ అనుకోలేదు మచ్చా.

ఆర్నెల్లప్పుడే, A-Mess పైన, dry day అయినా కూడా, యశ్వంతపూర్ లో shutter కొట్టి సాధించుకొచ్చిన cheapest liquor తాగలేక తాగుతూ, నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయ్ మచ్చా, అదంతా నువ్వు చెప్పలేక చెప్పుకున్న అంతరంగమని. ఇంకొంచెం తెలివిగా ప్రవర్తించాల్సిందేమో అనిపిస్తున్నా, ఇప్పుడిక ఏమీచేయలేను.

 2012లో, ఇంకా పిల్లబచ్చాగా ఉన్నపుడే,  football groundలో, నిక్కరేసుకొని నా teamలో cricket  ఆడినప్పుడు వర్మని మింగడంతో start చేసిన మన రచ్చ, ఆ మధ్య మా ఊర్లో గడిపిన holiday, ఇంట్లో తిన్న సంగటి-సీలు, కుంటలో కొట్టిన ఈత, నిన్న మొన్న European winter nightsలో share చేసుకున్న పొగ పరిమళం వరకూ అన్నీ పచ్చిగానే ఉంటాయి నాకు, ఎప్పటికీ.

జ్ఞాపకం వచ్చాక నన్నింతగా కదిలించిన బ్రతుకూ, చావూ రెండూ నీవే మచ్చా.


(To one of our best friends, from the rest of the pack)

Sunday, June 23, 2019

పేరు, ప్రపంచం, फरक: ఓ పే....ద్ద కథ!

High Schoolలో ఉన్నప్పుడు, మా seniorsకి, Hindiలో ఒక పాఠం ఉండేది, "नाम में क्या है?" అని. క్లుప్తంగా కథ ఏంటంటే (నాకు గుర్తు ఉన్నంత వరకూ), ఒక బాల యువకుడు (young adult) గురుకులంలో చదువుకుంటూ ఉంటాడు. అతనికి, ఒక గొప్ప పేరు పెట్టుకోవాలనిపించి, గురువుగారితో చెబుతాడు. అప్పటికే పేరు ఉందో లేదో నాకు గుర్తు లేదు, ఉందనే అనుకుందాం, కానీ, నచ్చలేదో ఏమో, ఇంకో గొప్పపేరు పెట్టుకుందాం అనుకున్నాడు పాపం. అదివిన్న గురువుగారు, 'ఓహో అలాగా! అయితే, అలా వెళ్లి, దేశంలో తిరిగిరా, నీకేమైనా నచ్చేపేర్లు వినిపిస్తాయేమో చూద్దాం' అని పంపిస్తారు. మనవాడు, చాలా ఉత్సాహంగా బయల్దేరతాడు. అలా వెళ్తున్న వాడికి, ఒకానొక ఊర్లో, గౌతమబుద్ధునికి కనిపించినట్లే, శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తున్న ఒక గుంపు ఎదురవుతుంది. సరే చూద్దాం అని, ఒకరి దగ్గరికి వెళ్లి అడుగుతాడు, 'ఆ చనిపోయిన ఆయన పేరేంటని?' ఆయన పేరు అమర్ (अमर) అని తెలుస్తుంది. 'ఓహో' అని ముందుకెళ్తాడు. ఇంకోచోట, కడుదీనావస్థలో ఉన్న ఒక బిచ్చగత్తె కనిపిస్తే, ఆమెనీ అడుగుతాడు, తన 'పేరేంటని?' ఆమె, 'దౌలత్ (दौलत)' అని చెబుతుంది. ఇలాగా, ఇంకొన్ని సన్నివేశాలు అయ్యాక, ఆలోచించడం మొదలు పెడతాడు. అంటే, మరణం లేనివాడు (అమరుడు) అని పేరున్న వాడు కూడా చనిపోతాడు. సంపద (దౌలత్) అని పేరున్న మాత్రాన, ఆవిడకి అడుక్కునే అవస్థ తప్పలేదు. అప్పుడు, మనవాడికి మబ్బులు విడిపోయి, వెనక్కి తిరిగి, గురుకులం చేరుకుంటాడు. గురువుగారికి, తన అనుభవాలు విన్నవించుకొని, 'అబ్బే, పేరులోనేమీ లేదండి' అంటాడు. (సరిగ్గా గుర్తులేదు, కథ ఇలా ముగుస్తుందనే జ్ఞాపకం.)

ఇప్పుడు నా కథ. భాషమీదున్న మమకారం వల్లనో ఏమో, చిన్నప్పటి నుంచి, నాక్కూడా, నాపేరంటే కొంచెం అసంతృప్తి, 'ఏదైనా, అర్థం ఉండి ఏడిస్తే బావుండేది' కదా అని. అయినా, మనమేం చేస్తాం, అలీ ఏదో సినిమాలో అన్నట్లు, నేనప్పుడు బాగా చిన్నవాన్ని అవడం వల్ల, నాకు తెలీకుండా జరిగిపోయింది, ఆపలేక పోయాను. మా జిల్లాలో ఉన్నంతవరకూ, నా అసంతృప్తి మినహా, పెద్ద బాధలేం పడలేదు. కానీ, పది పాసయ్యి, ప్రపంచంలో మన పరిధి పెంచుకోవడం మొదలుపెట్టినప్పటినుంచి, మొదలయ్యాయి మన సన్నివేశాలు.

బెజవాడ శ్రీచైతన్య కళాశాలలో, అడిగిన వాళ్లలో సగానికి పైగా వాళ్లకి, రెండు కంటే ఎక్కువసార్లే చెప్పాల్సివచ్చింది నా పేరు. అలా అని, నా పేరేదో Tongue twister అనుకుంటారేమో, అబ్బే, ఒత్తులు గట్రా ఏమాత్రం లేని, చాలా simple పదం. దీనికంటే, ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అలాంటి పేర్లు, మూడు తెలుగు ప్రాంతాల్లోనూ ఉంటాయి. సరేలే, ఈ English Medium high schoolsలో, modern పేర్ల మధ్యలో, ఎక్కడా తగల్లేదేమో అనుకొని, light తీసుకున్నా. పైగా, General Knowledge లేకుండా సాగిపోయిన వాళ్ల బాల్యాన్ని చూసి కొంచెం జాలిపడ్డ మాట వాస్తవం. అంటే, నా పేరేదో GK bitకి answer అనుకుంటారేమో. కాదు, నా ఉద్దేశం, Newspapers, కథలు, చదవడం, news, movies, చూడటం, etc.ల వల్ల ఎక్కడైనా ఇలాంటివి ఎదురయ్యి, పరిధి పెరిగి ఉండేది కదా అని. (ప్రతి తెలుగు కుటుంబంలో కనీసం ఒక్క శీనుగాడు (శ్రీనివాస్) అయినా ఉంటాడు కదా, ఆ rangeలో కాకపోయినా, నా పేరు మా areaలో world famous, అనగా, సర్వసాధారణం.) పోనిలే, వీళ్లకి అదేదో (పరిధి పెరగడం), చివరికి నా పరిచయం వల్ల జరిగింది అనుకొని సర్దుకున్నా. 

అలా, ప్రపంచంలో ఇంకొంచెం ప్రయాణం చేసాక, కాకినాడలో ఆగాల్సి వచ్చింది. అసలు problem అక్కడ ఎదురైందండి, ఆయ్! ప్రపంచం పెద్దది అవడం వల్ల ఎదురయ్యే సమస్య ఒకటి, నా General knowledgeని బాగా.... పెంచేసింది. ఒకే భాషలోని పదాలే అయినా, ఒక్కోసారి, కొన్ని పదాలకి, వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు అర్థాలు ఏడుస్తాయన్నమాట. అలా, నా పేరుకి కూడా, కోస్తాలో, మరీ అంత గర్వపడలేని అర్థం ఒకటి ఉంది. బెజవాడలోనే అటువంటి knowledge కలిగినా, కాకినాడలో మరీ ఎక్కువ అనుభవంలోకి వచ్చిందన్నమాట. అందువల్ల, కొండకచో, embarrassment feel అవ్వాల్సివచ్చింది. అదన్నమాట మదీయ వేదన. అదలా ఉంచితే, ఒకసారి, ఒకానొక ఘనుడు, నా పేరు చెప్పగానే, 'ఏంటీ, గూండా రెడ్డా?' అన్నాడు. 'ఓర్నియయ్య, ఏమడుగుతున్నావో తెలుస్తోందా నీకు?' అనాలని ఉన్నా, 'కాదు, *******' అని మళ్ళీ repeat చేస్తే అర్ధమైనట్లు ఊకొట్టాడు. కాబట్టి, నేను కొట్టకుండా తప్పించుకున్నాడు. ఇలాంటి కారణాల వల్ల, నా పేరులో 'నా' వివరాలన్నీ cut చేస్కొని, కేవలం Reddy అని, ఒక 'పేరుకాని పేరు'తో చెలామణి అయ్యాను (అంతేగా మరి, అది నా ఒంటి పేరు కాదు, ఇంటి పేరు కూడా కాదు). కొంతకాలం క్రితం వరకూ నా Facebook పేరు 'Mopuri K Reddy'. ఇప్పటికీ, ఈ blog పేరు M K Reddy's Blog, mail IDతో పాటు, అన్ని usernames, mkreddy***. అది మరి, నాపేరంటే నాకుండిన ఇష్టం. అవన్నీ జీర్ణం చేసుకుంటూ అలా ఇంకా ముందుకెళ్లడం మూలాన, ఈసారి West Bengalలో  halt వచ్చింది.

మన previous encounters దృష్ట్యా, బాగా అలోచించి, ఈ కొత్త ప్రపంచంలో, మనకి మనమే నామకరణం చేసుకొని, కొత్త lifeనే start చేయొచ్చని అలోచించి, so called గొప్ప పేర్లు (కనీసం ఇబ్బంది పడని అర్థాలున్నవి) వెదకడం ప్రారంభించా. కానీ, పూర్వజన్మ వాసనలాగా, కాకినాడ నుంచి మన జాన్ జిగిరి అయిన యశ్వంత్ గాడు కూడా నాతోపాటు వచ్చాడు west bengalకి. ఇలా అని నా ఆలోచన గురించి చెప్పాక, 'రేయ్, ఎందుకురా ఇదంతా! చెబుతున్నా విను, బొక్కరా ఇవన్ని' అని వాడిదైన వైరాగ్యంతో అనేసరికి, అలాంటి ప్రయత్నమేమి చేయకుండా ఆగిపోయా. కానీ, ఎప్పుడూ లాగుతూ ఉండేది, అలాంటిది ఏమైనా చేసిఉండాల్సింది అని.

ఆతర్వాత, బెంగాల్ నుంచి బెంగుళూరుకి మకాం మార్చాక, ఒక సంవత్సరం వరకూ, నా ఈ plans ఏవీ execute చేయలేకపోయాను. ఇందుకు కారణం, ఇంకో BTech వాసన, శివ గాడు, నా అప్పటి room-mate, ఇక్కడికొచ్చాక Flat-mate. అందువల్ల, నేను అనుకున్న పేరు కేవలం (నా చాలా accountsకి) password లాగానే మిగిలిపోయింది. మరి మనకి లవ్వయినా, పువ్వైనా, అన్నీ మనమేగా. అలా ఉండగా, IIScలో seat వచ్చింది. అనగా, కొత్త జీవితం ఆరంభించడానికి ఇంకొక కొత్త అవకాశం వచ్చింది. ఈసారి 'ఎవరిమాటా వినేదిలే' అని fix అయ్యి, నన్ను నేను సిద్ధం చేసుకున్నా. తర్వాతి రోజు reporting అనగా, ముందురోజు సాయంత్రమే cabలో luggage అంతా వేసుకొని campusకి వెళ్ళా. Hostel ముందు దిగి, joining order hostel securityకి చూపించి, luggage move చేస్తున్నా. ఇంతలో ఎవరో ఎదురయి, 'new admission ఆ?' అనేసరికి, 'అవును, హాయ్, I am *****' అన్నా, నాకు నేను పెట్టుకున్న కొత్తపేరుని. ఇంతలో, వెనకనుంచి 'పెహ్' మని నవ్వులు వినిపిస్తే వెనక్కి తిరిగి చూశా. నన్ను drop చేయడానికి మరియు luggageతో help చేయడానికి వచ్చిన, మా నిమ్మగడ్డవారు, కాకొల్లు వారి పరిస్థితి ఇదిగో కిందిలా ఉంది.

Vikramarkudu Movie Brahmanadam Comedy Scene

మరి, యశ్వంత్ గాడూ, శివ గాడేమో నా క్రితం జన్మ వాసనలై తే, వీళ్ళు నా latest జన్మలో add అయిన వాసనలు, నాకు West Bengalలో  తోడైన జాన్ జిగిరీలు. నాయొక్క అనుభవాలని, previous attemptsని ఎరిగిన వాళ్ళు. 'ఛీ, జీవితం!' అనుకొని, స్వీయనామకరణ ప్రయత్నాన్ని మరోసారి విరమించుకున్నా. 

ఆ తర్వాత, ఇంకొన్నాళ్ళకి, పరిధి ఇంకొంచెం పెంచుకొని, ఖండాలు దాటేసి, వేరే దేశంలో పనికోసం వచ్చా. ఇక్కడ, నేను కూడా చాలా మంది పేర్లని మళ్ళీ చెప్పమని అడిగా. effect of globalisation; భాష, సంసృతి, etc. differences ఉన్నాయిగా, తప్పదు. correctగా పలకాలంటే, స్పష్టంగా వినేవరకూ, పదే పదే repeat చేయమనాల్సిందే. మనకి (కాకినాడ, etc. లలో) ఎదురైన differencesకి చాలా రెట్ల difference అనమాట. కానీ, 'ఏంటీ, గింటీ'ల్లాంటి వేషాలేమీ వెయ్యకుండా, ఓపిగ్గా మరియు genuineగా మళ్ళీ చెప్పమని అడగటమే. ఇన్ని అనుభవాలు, ప్రయత్నాల తర్వాత, ఇప్పుడిక, ఒక నిర్వికార, నిశ్చలమైన, పూర్తి acceptance modeలో operate అవుతున్నా. Happyగా, ఇంటిపేరు, మరియు ఇందాక అనుకున్న 'పేరుకాని పేరు', అన్నీ పక్కన పెట్టి, కేవలం, ఒంటిపేరునే, విపరీతంగా వాడుతున్నా. In fact, ఆ 'పేరుకాని పేరు'ని, పేరునుంచి పెకలించి, ఒంటి పేరు, ఇంటిపేరు మాత్రమే కొనసాగిస్తున్నా. Because, now I don't care any more. అంటే, నేనుకూడా, ఇందాకటి కథలో శిష్యుడిలా, 'పేరులో పెద్దగా ఏమీ లేనట్లే'నని చెబుతున్నా అనిపించొచ్చు. కానీ, నేను అనుభవించిన అసౌకర్యం మాత్రం, ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపించవచ్చు. నామటుకు, నేను రాజీకి వచ్చేసా. నచ్చే పేరు కలిగి ఉండటం మంచిదే, అదృష్టం ఉంటే అలా జరగొచ్చు కూడా. కానీ, ఎప్పుడన్నా, 'ఏంటీ, రాంబాబా? ఎబ్బే, లాభంలేదు. Vibration లేదే!' అనే మాటలు వినిపించొచ్చు, లేదా మనసులోనే అనేసుకోవచ్చు, లేదా, ఇంకొంతమందికి funnyగా అనిపించొచ్చు. లేదూ, ఆశ్చర్యంగా, " కొత్తదనంలో కొట్టుకుపోకుండా, సంస్కృతి, చరిత్రలతో సంబంధం ఉన్న పేరులా ఉందే" అని rareగా appreciate చేసే జనాలూ తగలొచ్చు. ఏదేమైనా, in the end, పెద్ద फरक పడక పోవచ్చు అంటున్నా.

Confusion పొయ్యేలా, summary ఇచ్చే ప్రయత్నం చేస్తా, చుడండి: World is a bigger place, నీకు weird అనిపించింది ఇంకొకరికి సర్వసాధారణం అయిఉండొచ్చు (e.g. మన arranged marriages గురించి మా Russian flat-mateకి చెప్పా, సచ్చిపోయాడు ఎదవ!). నీకు world famous అయినది, ఇంకొకరు అసలు వినే ఉండకపోవచ్చు. కాబట్టి, ఇలాంటివి ఎదురైనప్పుడు, 'ఛీ ఛి ఛి ఛి ఛి! అలా ఎలాగా?' అని వేషాలు వెయ్యకుండా, 'ఓహో, ప్రపంచము బాగా పెద్దదనమాట' అని మన పరిధి పెంచుకోవాలన్నమాట.

కాబట్టి, పిల్లలకి పేరు పెట్టేటప్పుడు, కొంచెం, ఇవన్నీ మనసులో పెట్టుకోండి, లేదా, ఖలేజా సినిమాలోలాగా, 'చిచు' లాంటి పేరు పెట్టారేంటని పెద్దయ్యాక పిల్లలు నిలదీసే అవకాశముంది.

Friday, May 10, 2019

(అ)సంపన్న దాతృత్వం ?

సన్నివేశం 1: ద్వాపర యుగం, ద్వారక

శ్రీ కృష్ణుడు తన సిరిసంపదలతో, భార్యలతో ద్వారకానగరంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నపుడు, తనని కలవడానికి, బాల్యస్నేహితుడు, నెచ్చెలి, సహపాఠి, సద్బ్రాహ్మణుడు అయిన కుచేలుడు (సుదాముడు) వచ్చాడు. ఆ సమయంలో కుచేలుడు అత్యంత కఠినమైన దారిద్య్రంతో సతమతమౌతూ ఉన్నాడు. ఇంట్లో ఉన్న పసిపాప(ల)కి పెట్టడానికి కూడా సరిపడనంత మిక్కిలి లేమిలో ఉన్నాడు. సాయం కోసం, తన భార్య, స్నేహితుడైన శ్రీకృష్ణుని దగ్గరకి వెళ్లమని చెప్పడంతో (అడగడంతో?) అక్కడికి వచ్చాడనమాట. ధరించడానికి సరైన బట్టలుకూడా లేని కుచేలుడు, చిరిగిన బట్టలతోనే శ్రీకృష్ణుని కలవడానికి కాలినడకన వచ్చాడు. ద్వారందగ్గర ఉన్న భటులు ఆపితే, తాను వారి స్వామికి బాల్యమిత్రుడని చెబుతాడు. వారికి అనుమానమొచ్చినా, లోపలికి వెళ్లి, రుక్మిణీదేవి శయన మందిరంలో ఉన్న వారి యజమానికి (బయటినుంచే) విన్నవించారు. పేరు వినగానే, చయ్యన ద్వారం దగ్గరికి వెళ్లి, తానే స్వయంగా కుచేలుణ్ణి సాదరంగా పట్టుకొచ్చి, తానూ, రుక్మిణి తప్ప, అన్యులకి ప్రవేశంలేని శయన మందిరంలోకి తీసుకెళ్లి, తీసుకెళ్లడమేమిటి, అక్కడున్న 'వారి' పాన్పుమీద కూర్చోబెట్టి, అన్నీ తానై,సపర్యలతో మిత్రుడికి సేదతీర్చి మురిసిపోతున్నాడు. శ్రీకృష్ణుడంతటి వాడేమిటి, అన్నీ ఆపేసి, ఇలా ఒక పేదవాణ్ణి కూచోబెట్టి, ఎక్కడ? ఎవరికీ అనుమతిలేని పట్టమహిషి శయన మందిరంలో, ఇతర భార్యల సమక్షంలో; పాదాలుకడిగి, గంధంపూసి, విసనకర్రతో విసరడమేంటి; అసలు, సేవలు చేయించు కోవడం తప్ప, చేయడం ఎరగని ప్రభువు ఇలా ప్రవర్తించడమేంటి అని అక్కడున్న అందరూ నోళ్లు వెళ్ళబెట్టుకొని ఆశ్చర్యపడుతున్నారు. ఇంతా పొందడానికి ఈ కుచేలుడు చేసుకున్న పుణ్యవిశేషాలేమిటో  అని ఆలోచిస్తున్నారు. ఇంతలో, శ్రీకృష్ణుడు మిత్రుడైన తనకోసం ఏం తెచ్చావని కుచేలుణ్ణి అడుగుతాడు. పేదవాడైన కుచేలుడు ఏం తేగలడు? వస్తూ, వస్తూ తన భార్య మూటగట్టిన అటుకులు గుర్తుతెచ్చుకున్నాడు. కానీ, ఇంత సిరిసంపదలతో తులతూగుతున్న మిత్రునికి కేవలం అటుకులివ్వగలనా అని తెగ మథనపడతున్నాడు.  నీళ్లు నములుతున్న మిత్రునిచూసి, చొరవతో, శ్రీకృష్ణుడు కుచేలుని అంగవస్త్రంలోనున్న ఆ మూట చేతపుచ్చుకొని ఏముందోనని విప్పుతాడు. బయటపడిన ఆ అటుకులని చూసి ఆనందంతో ఒక పిడికెడు నోట్లోపోసుకొని తృప్తిగా నములుతాడు. ఈ సన్నివేశాన్ని బమ్మెర పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు.

మురహరుడు పిడికెడటుకులు గరమొప్పగ నారగించి కౌతుకమతియై (కౌతూహలియై  ?)
మరియును (మరియొక ?) పిడికెడుగొన దత్కర మప్పుడు బట్టె గమల కరకమలములన్

భావం: శ్రీకృష్ణుడు, పిడికెడు అటుకులని తిని, ఇంకొన్ని తిందామని మరో పిడికెడు తీసుకుంటుండగా, ఇంక చాలు, వద్దని రుక్మిణి తనచేత్తో, శ్రీకృష్ణుని చెయ్యిపట్టుకొని ఆపింది.

అరెరే, అదేమిటి, ఇంకొన్ని తింటే ఏమౌతుంది, పాపం మిత్రుడు ప్రేమగా తెచ్చాడు, తిననివ్వాల్సింది, రుక్మిణి ఎందుకలా చేసింది అని ఆలోచిస్తున్నారా? లేక, already, పరిస్థితిని అర్థం చేసుకుని, పేద మిత్రునికి శ్రీకృష్ణుడు మరీ ఎక్కువ సాయం చేసేస్తాడేమో అని, కఠినంగా, వారిద్దరినీ విడదీయడానికి అలా చేసిందని అనుమానిస్తున్నారా?

సన్నివేశం 2: ప్రస్తుతం, బెంగుళూరు

ఆమధ్య PhD అయిపోతున్నపుడు, మా జనాలు చిన్న సైజు farewell party తీసుకుంటూ, 'KRతో కాసేపు' (tag line - 'order చేసిన బిర్యానీలు వచ్చేదాకా') అని ఒక ముఖాముఖి entertainment plan చేశారు. అప్పుడు ఒక interesting question అడిగారు. 'జీవితంలో సాధించలేనేమో అనిపించే ఆశయాలు ఏమైనా ఉన్నాయా?' అని. దానికి జవాబుగా, చాలా రోజులుగా నాలో ఉన్న ఒక ఆలోచన గురించి బయట పెట్టా.

నా అభిప్రాయంలో, దాతృత్వము అనేది చాలా గొప్ప మానవీయ అభివ్యక్తి (Manifestation of Humanity). మన పురాణాలు, ఇతిహాసాలు కూడా దాతృత్వాన్ని ఉదారమైన లక్షణంగా, శీలాలంకారిగా చెప్పడం మనకు తెలుసు. తరువాతి తరాలు (యుగాలు అనాలేమో) కూడా అప్పటి సుభాషితాల్లో, తత్వాల్లో మొదలుకొని, ఇప్పటి ప్రవచనాల దాకా, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, దధీచి, మొ||వారిగురించి గుర్తుచేసుకోవడం విన్నాం. ఇప్పుడైతే ప్రేమజీ, Tatas, బఫెట్, బిల్ గేట్స్, షకీరా, సచిన్, నానా, etc.ల దాతృత్వం గురించి చూస్తున్నాం. ఏకంగా గ్రామాలనే దత్తత తీసుకునే Reel-life శ్రీమంతులని, real-life శ్రీమంతులనికూడా చూస్తున్నాం (వాటి వెనకాల కారణాలు ఏమైనా, దానం జరగడం చూస్తున్నాం). పురాణేతిహాసాలను పక్కన పెడితే, ఈ కాలానికి గొప్ప దాతలని ఓసారి గమనిస్తే, అందరూ (at least చాలామంది) సుప్రసిద్ధ శ్రీమంతులే. ఇంకోరకంగా, చాలామంది ఏదో ఒక రంగంలో ప్రతిభ ప్రదర్శించి (వ్యాపారంలో కూడా ప్రదర్శించాలనే అనుకుంటున్నా), పేరు గడించి, తద్వారా సంపద గడించినవాళ్ళే. సంపద అంటే సామాన్యమైన మొత్తంలో కాదు, మధ్యతరగతి వర్గం ఊహించనంత అసాధారణమైన సంపద అనమాట. అనగా, కొన్ని వందల కోట్లు (వందల కోట్లు అయినపుడు, రూపాయలు అయినా, డాలరులు అయినా పెద్ద తేడా ఉండదుగా). ఇలా గొప్ప సంపన్నులు కొంతమంది, వాళ్ల సంపదలో కొంతభాగం (కొంత మంది చాలా భాగం) దానధర్మాలకు వెచ్చించడం అనేది వాదన అవసరంలేని మంచిపని. కానీ, ఎక్కువ పరిశోధన కూడా అవసరం లేకుండా గమనించగలిగే విషయం ఏంటంటే, వీళ్లలో చాలామంది (అందరూ?) క్రీడలు, వ్యాపారం, వినోదం లాంటి వేగంగా సంపద పోగేయగల వృత్తుల వాళ్లే. Notice my reader, నెలజీతాలవాళ్ళు లేరు. అనగా, జీతానికి పనిచేసే సాధారణ ఉద్యోగులు అనమాట. (కొంతమంది అసాధారణ నెలజీతగాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇందాక చెప్పుకున్న వేగంగా సంపద పోగెయ్యగల వారయివుంటారు. ఉదాహరణకి, ముకేశ్ అంబానీ నెల జీతం, 21వ శతాబ్దపు మొదటి దశకంలో, దాదాపుగా 3M USD). కొంచెం అనుభవం తర్వాత ఆరంకెల జీతం తీసుకున్నా, సాధారణ నెలజీతగాళ్ళు విపరీతమైన సంపద పోగెయ్యడం చాలా కష్టం అని నా అభిప్రాయం. మహా అయితే, అయిదో, పదో కోట్లు గడించగలరేమో, అంతే. అది కూడా అనుమానమే. ఒకవేళ సాధ్యపడినా, ఎప్పుడో జీవితం చివరిలో తప్ప, యవ్వనంలోనే పోగెయ్యగలరు అని చెప్పడం కూడా కష్టం.

ఇటువంటి సందర్భంలో, సమీప భవిష్యత్తులో, ఒక నెలజీతగాడిగానే కనిపిస్తున్న నేను, బాధ్యతాయుతమైన గృహస్తుగా ఉండికూడా, ఒక పెద్దమొత్తం (ఉదా|| ఒకటి రెండు కోట్లు) దానం చేయగలనా అనేదే ఇందాకటి నా ఆలోచన. సంపన్నులుగా ఉండి, ఉదారంగా దానం చేయడం ఒకటి, ఖచ్చితంగా గొప్పదే, అనుమానమేం లేదు; కానీ, సాధారణ జీతాలు, జీవితాలతో కూడా అలాంటి అనుభవాలు సాధ్యమేనా అన్నదే నా ఆలోచన. నాకూ ఒక రుక్మిణి వస్తుంది (ఒక్కతేలెండి); తప్పకుండా ఇలాంటి నా ఆలోచనలని దివ్యదృష్టి లాంటివేం లేకుండానే తెలుసుకుంటుంది (మనం చెప్పేస్తాం). మరప్పుడు (ఆలోచన తెలుసు కున్నప్పుడే), చేత్తో ఆపేస్తుందో, కాళ్ళు చేతులు విరిచేస్తుందోనని కొద్దిగా అనుమానం. ఆవిడ సంగతి పక్కన పెట్టినా, అసలు, ముందు నేను అంత నిస్వార్థంగా ఉండగలనా, almost impossible. అందుకేగా, సాధించలేనేమో అనే ఆశయాల్లో దీన్ని archive చేసింది. తెలుగులో అసంపన్న అనే పదం లేదేమో(?) (నా searchలో నాకు దొరకలేదు). ఈ ఆలోచన ఆచరించడం ఎంత అసంభావ్యమో సూచించడానికే అన్నట్లు, అలాంటి పదం వాడానేమో!

సన్నివేశం 3: ద్వాపర యుగం, ద్వారక  

(శ్రీకృష్ణుని చెయ్యిపట్టుకొని తినకుండా ఆపేసిన సన్నివేశం)

అవును, రుక్మిణి నిజంగానే, పరిస్థితిని అర్థంచేసుకుంది (ఆవిడ ఎవరు? మనం ఇంతసేపూ చర్చించుకున్న "సంపద"; లచ్చిందేవి). ఇక్కడ ఒక్క పిడికెడు అటుకులు తిన్నందుకే, అడగక పోయినా, దరిద్ర పీడితుడైన కుచేలునికి అక్కడ (కుచేలుని ఇంటి దగ్గర) కొన్ని తరాలు తిన్నా తరిగిపోని ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. ఇంకొన్ని తింటే, మమ్మల్ని (భార్యల్ని), తనని కూడా దాసులకింద ఇచ్చేస్తాడేమో అని భయపడి, శ్రీకృష్ణుడు తినకుండా ఆపేసిందన్నమాట. అంతేకానీ, పాత సినిమాలో సూర్యకాంతం, ఛాయాదేవి లాగా కాదన్నమాట.
(అలా శ్రీకృష్ణుడు తినగా మిగిలిన అటుకులని అక్కడున్న మిగిలిన వాళ్ళందరూ ప్రసాదంలాగా పంచుకున్నారు. తర్వాత ఇవన్నీ ఏమీ తెలియని కుచేలుడు, శ్రీకృష్ణుని ఏమీ అడగకుండానే మిత్రుని దగ్గర సెలవు తీసుకొని ఇంటికి తిరుగు పయనమవుతాడు. దారిలో, వచ్చిన పని నెరవేర్చుకోకుండానే తిరుగుపయనం అయ్యానే అని కొంచెం చింతిస్తాడు, కానీ, తర్వాత ఇంటికెళ్లి విషయం తెలుసుకొని సంతోషిస్తాడు.)

Thursday, February 7, 2019

నాకివేమీ వద్దు


నాకీ స్పర్శలూ, ముద్దులూ, ఏ...వీ వద్దు. మాటలైతే మరింకొద్దు.
ఒకేసారి హత్తుకోవాలి; గాలికి కూడా చోటులేనంత, మనసులు మాటాడుకునేంత, ఇవేం సరిపోవు.
ఎంతంటే, నువ్వు నాలోకి వెళ్ళిపోయేంత. కాదు, నేనే నువ్వయ్యేంత;
ఇక అంతటితో నువ్వు-నేను అని రెండు లేవు,  అసలు నువ్వు కాని నేను వద్దు నాకు; నన్ను మొత్తం తీసేసుకొని నువ్వైపోవా, please.
ఎముకలు విరుచుకుంటూ, మాంసం చీల్చుకుంటూ నీలోకి వచ్చేస్తాను; నువ్వైపోతాను.
తీగలకే, పెనవేసుకోవడం నేర్పుదాం; ఊహుం, సరిపోదు; అనంతానికే ఐక్యం అవ్వడం నేర్పుదాం.

Monday, November 12, 2018

Missing Mathikere, మిస్సమ్మ సాక్షిగా!

జ్ఞాపకమొచ్చినప్పటి నుంచీ ఇంత ఒంటరిగా ఎప్పుడూ లేనేమో అనిపిస్తోంది😶. I know; ఊరు మారిన  ప్రతిసారీ కొత్తలో అనిపించేదే ఐనా, ఆరేళ్ళ తర్వాత మారానేమో, మనసు పొరల్లోని Mathikere వేళ్లని పెకలించిన బాధ. దాచి ఉంచిన memories అన్నీ తిరిగిపడుతున్నాయి చెల్లాచెదురుగా.

వారం ఆరు దినాలూ ఆనందంగా పనిచేసింతర్వాత (Saturday కూడా work చేసేవాన్ని), ఆరో రోజు సాయంత్రం ఏడింటికళ్లా meetingలో ఉండగానే మొదలయ్యే missed callలు, messageలు అన్నీ ఒక్కొక్కటే గుర్తొస్తున్నాయ్. Peak timeలో KR weekends, 3/4 weeks advanceగా book అయ్యేవి. అలా ఉండేది  యవ్వారం. 'ఈ వారం కుదరదేమో రా' అంటే, జనాలు గొడవ పెట్టే వాళ్లు, time ఇవ్వడం లేదని. ఆ ముచ్చట్లు అంత మురిపెం. మనసులు తప్ప, మనుషులు ఎక్కడ ఉండేవాళ్లు మా మీటింగుల్లో. మాటలు కావవి, మనసుల కౌగిలింతలు. ఆ time లో అడగాలి ఎవరైనా వరాలు, ఆపడానికి అర డజను మంది రుక్మిణులు కావాలేమో. అలాంటిది, ఇవాళ Edinburghలో, ఎవరూ లేక, సాయం సంధ్య జారిపోతుంటే, mobile phoneతో నిద్రపోబోతున్న Indiaని కదపడం ఇష్టంలేక, ఈ missing feelingని పక్కకి నెట్టడానికి 'మిస్సమ్మ' cinema start చేశానేగాని.....



MSR రోడ్డంతా పరుచుకున్న ప్రాణం రానంటే రానంటోంది. రోజుకు ఒకసారైనా వెళ్లే వాడినే, ఇకమీద పోలేనంటే తట్టుకోగలదా? It takes a lot of time and effort to build genuine friendships, luckily, అలాంటివి చాలానే దొరికాయ్ mathikereలో. IIScలో అనొచ్చు, కానీ, maximum తినింది, తిరిగింది, తాగింది mathikereలోనే కదా! ఒక్క, దొరికింది మాత్రం మల్లేశ్వరంలో.

సరదాగా సాయంత్రం బండిమీద వెళ్లి తిన్న MTC పునుగులు, తాగిన మలయాళీ టీలు, mess miss అయ్యాక హడావుడిగా తినొచ్చే pot బిర్యానీలు, amzad bhai అర ఉడికిన hyderabadi బిర్యానీ, plan వేసుకొని వెళ్లొచ్చే Akshaya Deluxe, rice పెట్టుకొని తెచ్చుకునే రంగెక్కువైన 'రుచి' curries, ఈ మధ్య Mehi&Co అలవాటు చేసిన అనఘ mess, మరీ lateగా అలవాటైన BEL road restobars, నిలబడి పలకరించే నేస్తంలాంటి NIAS gate, ఆ రెండు దున్నపోతుల్లాంటి speed breakersలు, campusలో మాత్రమే నడిచే లాగా cheapగా repair చేయగల మన yash bikes, messలో భోంచేసి, 9:10కి ఆరాంగా బయల్దేరి cinema చూసొచ్చే మన home theater మురళీ గోకుల, అప్పుడప్పు అలరించే Orion మాల్, త్రివేణి టీలు, చివరగా వారానికింత చొప్పున installmentsలో కొన్ని వేలు తగలేసిన Wholesale spirits, ఇలా తెలీకుండానే జీవితాన్ని పెనవేసుకున్న ప్రదేశాలు, వ్యక్తులు screen మీద కనిపిస్తున్నాయ్. ఇంతకీ, ఆ వ్యక్తులు కనపడటం లేదని వెతుకుతున్నారా! వారి కోసం వెదికితే మీరు వారు కాదని అర్థం. ఆ వారికి, ఈ పాటికి వారు కనిపించే ఉంటారు, ఆ అన్ని ప్రదేశాల్లో నాతో కలిసి. ఇది వారికోసం, వారి నేను రాసుకున్నది, కాబట్టి వారెవరో వేరేవాళ్లకి చెప్పకుండానే ముగిస్తా.

మరేం పర్లేదు, తొందర్లోనే settle అయిపోతా, కంగారేం అక్కర్లేదు, కొద్దిగా time పడుతుంది అంతే. తర్వాత Edinburgh గురించి రాద్దాం ఇంకోచోట కూచుని, ఇంకొకరితో.

Thursday, August 9, 2018

మెఱుగు చెంగట లేని మేఘము



అంతకుముందు వరకు చాలా frequnetగా మాట్లాడుతూ ఉండి, ఈ మధ్య పెళ్లి అవడం వల్ల (?) మాట్లాడుకోవడం కుదరని ఒక friend, మొన్నామధ్య call చేసి, "ఎలా ఉన్నావ్ రా?" అని అడిగాడు. అపుడు ఆలోచించా, "one lineలో, అసాధారణంగా అమామూలుగా  (అనగా, poeticగా) చెప్పడం ఎలా?" అని. అక్కడే, పోతనగారి దయ వలన తట్టింది ఈ title, "మెఱుగు చెంగట లేని మేఘంబు కైవడి1". After all , sincere conversations కోసం call చేసే friendsకి కొంచెం కవిత్వం కొసరడం బావుంటుంది, try చేయండి (అంటే, ఇప్పుడు అందరూ నాకు call చేయకండి).

Back to the title: నిజమే, జీవితం, "cooperation లేని kohli contribution" లాగా wasteగా  పడి ఉందేమోనని అనుమానం కలుగుతోంది ఈ మధ్య.  మొన్నామధ్య ఇంటికెళ్ళినపుడు మా అమ్మ కూడా అంది నాతో, "90s లో సచిన్, ఇప్పట్లో kohli  గొప్ప ఇన్నింగ్స్ ఆడినా, సరైన తోడు(partner)లేక మనం బయట గెలవలేక పోతున్నాం" అని (exactగా ఇలానే కాకపోయినా, ఈ అర్థం వచ్చేలా).  అమూల్యమైన youthful energy అంతా (అంటే 'అ'దొక్కటే కాదు; మంచి ఆరోగ్యం, vigour , ఇంటెలిజెన్స్, humour, willingness to explore, etc. ) freeగా friends మాత్రమే enjoy చేస్తున్నారు (office hours అయ్యాక ), వెధవలు. అదే, మనల్ని కట్నానికి కొనుక్కున్న వాళ్లు ఉండిఉంటే, చాలా happyగా feelఅయి ఉండేవారేమోనని అంటున్నా, Bumper offer కదా! ఏమోలే, scene మొత్తం reverse అయ్యి,  కోడెనాగు లాంటి వాడు, వానపాము అయిన పాటలు కూడా ఉన్నాయి మనకు.

ఏదేమైనా, ప్రపంచంలో male domination ఉందేమోగానీ, poetryలో మాత్రం ఆడవారికే పట్టం కట్టబడిందేమో (దానికి కూడా మగ వెధవలే కవులవడం కారణమేమో).  మరదేకదా! Madam గారిని మెరుపు అనేసి, మనమేమో మేఘంలా మిగిలిపోయి మరీ మురిసిపోతాం.


1. పోతన గారి శ్రీమదాంధ్ర మహా భాగవతము లోని ఒక సీస పద్యం నుండి, link 

Friday, January 26, 2018

All it takes is one good innings!


అవును, bad formలో ఉన్న batsmen తమకి తాము పదే పదే చెప్పుకునే phrase. In fact, ఈ మధ్య match కోసం room నుంచి బయల్దేరినప్పటి నుంచి groundకి reach అయ్యేదాకా దాన్నే జపిస్తున్నా, మంత్రం లాగా. Stupid shotకి out అయ్యాక ఆ రోజంతా ఎంత చిర్రాగ్గా ఉంటుందో, అంతో ఇంతో cricket ఆడిన మనదరికీ అర్థమైపోతుందనుకుంటా. "అలా ఎలా ఆడాన్రా?" అని department toilet లోపలి అద్దం ముందర ఎన్నిసార్లు అడిగానో, house keeping staffకే తెలుసు. Lunchకి వెళ్తూ cycle మీద, labకి వెళ్తూ liftలో, room నుంచి వస్తూ corridorలో, ఇలా రోజంతా ఎన్నిసార్లు మనల్ని మనమే ఆ question వేసుకుంటామో అందరికీ జ్ఞాపకమే కదా!

It's such a bad feeling, right! మత్తికెరె petrol bunkలో మూడోసారి మోసపోయినట్టు. అదే పనిగా, అంతకు ముందు ఆడిన అద్భుతమైన inningsలు, bowlers ఇచ్చిన compliments, captains మనపై ఉంచుకున్న confidence, వెనక్కి తిరిగితే కనిపించే కొన్ని వందల మ్యాచ్లు చూసుకుని, గుర్తు తెచ్చుకుని, "All it takes is one good innings from you!" అని మనల్ని మనమే ఓదార్చుకుని, మాములు మనుషులయ్యేందుకు ప్రయత్నిస్తాం. అదీ సరిపోక, మధ్యాహ్నం messలోనో, రాత్రి గ్లాసుల దగ్గర friendsతోనో, ఆ యొక్క sitting setting పీకేశాక, whatsappలో "బంగారం"తోనో చెప్పుకున్నాక గానీ సల్లబడం.

మనక్కొద్దిగా fans ఎక్కువ కాబట్టి, ఇలా blogలో global audienceని reach అవుతామనమాట!
Remember, all it takes is one good innings!

Tuesday, November 7, 2017

దేవుడి బొమ్మ - ఇది నా రామాయణం!


రిలీజ్ రోజునే సినిమా చూడ్డం మానేసి కొన్నేళ్ళయింది, పెద్దోళ్లం అయిపోయంగా. కానీ ఈ మధ్యనే ఆ పనిచేసి మళ్ళీ బాల్యంలోకెళ్ళొచ్చా. అంతా ఆ దేవుడి దయ!

అందరూ కేరళ వెళ్లి FBలో post చేస్తారు, "Landed in God's own country!" అని. కానీ, నేను, Mumbai వెళ్ళినపుడు చెప్పా, "God's own cityలో ఉన్నా" అని. ఈపాటికి అర్థమై ఉంటుంది మీకు, ఆ నా  దేవుడు సచిన్ టెండూల్కర్ అని.

ఇప్పటికే చాలామంది చెప్పేసున్నారు, ఆయనెందుకు దేవుడో. కానీ ఈ రోజు నేను కూడా చెబుతా. మరి మనకి కొన్ని వందల రామాయణాలున్నాయిగా, ఎవరి భక్తి వారిది. సరే ఇలా మొదలుపెట్టాం కనక, ఇలానే continue అవుదాం. Sachinకి, రాముడికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని నా గట్టి నమ్మకం. మొన్నే ఓ friendతో అంటే, "అవునా, ఎలాగా?" అని వేళ్ళు మడిచి, లెక్క పెట్టడానికి ready అయిపోయాడు, వెటకారంగా. అప్పుడే చెప్పా,  "నువ్వు కంగారుపడకు, పెద్ద article రాసి మరీ చెబుతా!" అని. ఇది నా రామాయణానికి పీఠిక.

నామటుకి, sachin ఈ యుగంలో పుట్టిన రాముడే. అక్కడా అంతే, రాముడిలాంటి ఓ అద్భుతం జరగడానికి ఓ పెద్ద కాన్స్పిరేషనే జరిగింది. దేవదేవుడు దిగిరావడం అంటే మాటలా? దేవతలంతా directగా, indirectగా  కిందకొచ్చి అంతా సిధ్ధం చేశారుకదా! ఇక్కడా, రెండున్నర దశాబ్దాల పాటు చోటుచేసుకున్న ఓ అద్భుతం కోసం జరిగిన arrangements చర్చించి, నాకు నేనే promotion ఇచ్చుకుంటా.

రాముడికి ఎన్నో పేర్లున్నా, దాశరథి అంటేనే ఇష్టపడతాడు, అది ఆయనకి తండ్రి మీద ఉన్న భక్తి, ఇష్టం. sachinకి కూడా అంతే, 50గానీ, 100గానీ అయిన వెంటనే, ఆకాశం వంక చూసి, తన తండ్రికి అంకితమిస్తాడు. ఎన్నిసార్లు? ప్రతీసారి. అది మన సచిన్ "రమేశ్ " టెండూల్కర్.

రాముణ్ణీ, సోదరుడు లక్ష్మణున్నీ విడదీసి చెప్పడం వీలుకాదంటే అతిశయోక్తి కాదు. దశరథుడు చనిపోయాడని తెలిసాక, అడవిలో ఉన్న రాముడు, లక్ష్మణుడితో అంటాడు "తమ్ముడూ , నీకింక తండ్రి లేడు!" అని. మరి ఆయనకో? లక్ష్మణుడు ఉన్నాడుగా, తండ్రిలాగా కాపాడుకోవడానికి. సచిన్ లాంటి ఓ అద్భుతాన్ని create చేసిందీ, అన్ని సమయాల్లో తోడుండి ముందుకి నడిపింది, సోదరుడు అజిత్ టెండూల్కర్. కోచ్ దగ్గరికి తీసుకెళ్లడం దగ్గరి నుంచి, పాకిస్థాన్ పేస్ బౌలింగుకి ముక్కు చితికిపోయినప్పుడు, career ని దెబ్బతీసే గాయాల బారినపడినప్పుడ్డు, ఇలా ఎన్నోసార్లు. వీళ్ళని కూడా లోకంలోని సోదరులకు ఆదర్శం అనడంలో అతిశయోక్తిలేదు.

ఇప్పుడు అమ్మవారి గురించి. ఈ part నాపాలిటి "సౌందర్యలహరి". అంజలి. నిజంగానే దండం పెట్టాలి, తల్లికి. "మన పెళ్లి గురించి మా ఇంట్లో నేను మాట్లాడలేను, నువ్వే వెళ్లి అడగమంటే", వెళ్ళిపోయి అడిగేసిందంట, "మీ అబ్బాయీ , నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం " అని. అలా....ఒప్పేసుకున్నారు, మరెందుకు ఒప్పుకోరు? మాలక్ష్మి, తానే,  "మీ ఇంటికొద్దామనుకుంటున్నాను" అంటే. ఈ particular సంగతి వినగానే, నాకు వనవాసం ముందు scene గుర్తొచ్చింది. కైకమ్మ మందిరం నుంచి వార్త తెలుసుకొన్న రాముడు, సీతమ్మ దగ్గరకి వచ్చి, "నేను వనవాసం కోసం వెళ్తాను"  అని చెబుతాడు. "సరే పదండి, నేనూ వస్తాను" అంటుంది. "నువ్వెందుకు ? అక్కడ చాలా కష్టం, క్రూర మృగాలు కూడా ఉంటాయి, వద్దు" అని వారిస్తాడు. "క్రూరమృగాలా?, మా నాన్న, నన్ను ఒక మగాడికిచ్చి చేశాడనుకున్నానే ?" అంటుంది. "అనగలుగుతుంద"నమాట. సాక్షాత్తూ, వాల్మీకి మహర్షే ఇలా రాశాడని చెబితే మనలో చాలామంది నమ్మలేరేమో.

"రామో విగ్రహవాన్ ధర్మః" అన్నాడు రాక్షసుడైన మారీచుడు, రాముడి గురించి. 'రా'తో మొదలయ్యే పదం వినపడగానే, భయపడిపోయేవాడు. ఎంతో విధ్వంసకరంగా batting చేయగలిగిన batsmen చరిత్రలో చాలా మందే ఉన్నా, ఇలాంటి సంఘటనలు మాత్రం సచిన్ గురించే చెప్పుకున్నాం, shane warne సహకారంతో. Hayden ఐతే, ఏకంగా "ఇండియా వెళ్లి దేవున్ని చూసొచ్చాను, 4లో batting ఆడుతున్నాడు అక్కడ" అన్నాడంట.

ఆ కాలంలో, పూర్వభాషి అని చెప్పుకున్నా, సత్యమే పలికాడని చెప్పుకున్నా, దయాళు అన్నా, పరాక్రమశాలి అన్నా, ఏకపత్ని కలిగిన రాజు అన్నా, ఈ కాలంలో Alcoholని endorse చేయకుండా చాలా నష్టపోయాడనుకున్నా, controversy లేకుండా క్రమశిక్షణతో సుదీర్ఘమైన careerని కట్టుకున్నాడన్నా, ఉదాత్తమైన నడవడితో ఆదర్శంగా నిలిచాడన్నా, కాలాన్ని, కదిలే రైళ్లని, పెరిగే వయసుని (తనది, మనది కూడా) ఆటతో ఆపాడన్నా, వేరు కాదేమో!

మనిషి అనే ప్రక్రియకి, జీవితం అనే processకి, రాముడు ఒక ప్రమాణం. ఎలాగా? "ఔను మరి, ఈయనో శ్రీరామ చంద్రుడు", ఎన్నిసారు వినలేదు ఈమాటని? సచిన్ కూడా అంతే. ఇక మీద బాగా ఆడగలిగిన, ఆడుతున్న cricketers అందరికీ, ఈ దేవుడే ప్రమాణం. For example, ఈమధ్య, కోహ్లికి, సచిన్‌కి రోజూ జరుగుతున్న పోలిక మనకు కొత్తదేం కాదు.


Tuesday, March 24, 2015

నా కల


నాకు పుట్టిందే. నా రక్తమాంసాలు తిని బతుకుతుంది.
కానీ, నన్ను బ్రతికిస్తుంది.

Monday, March 23, 2015

కల



ఏది నేనో?, ఏది కానో?
నాదేదో?, కానిదేదో?
తెలుసుకోడానికి ఇరవయ్యేళ్లు నిజంగా సరిపోతాయా?
నాకైతే ఇప్పటికీ అనుమానమే,
నాకేం కావాలో?, నేనేం ఇవ్వగలనో?

ఇండియాలో ఇంజినీరయ్యాకే
జనాలు ఏదోటి అవ్వాలని అనుకోవడం మొదలెడతారంట!
నేను ఇంజినీరయి అఫిషియల్‌గా ఆరోఏడు.

కాలిబాటనొచ్చానో,
గాలివాటునొచ్చానో
ఇంకా వెదుక్కుంటున్నా,
నాలోపలే, చీకట్లో. 

ఇంతలో,
అల వైకుంఠపురంబులో, ఆమూల సౌధంబులో..,
అన్న చందంగా,
ఎప్పుడో సంచరించినట్ల నిపించిన ఏదో మూలన,
నూనెలేనట్లు అలమటిస్తున్న దీపమొకటి అగుపడితే, అటెళ్లా.

నే వెలిగించినదే, నేనూ గుర్తు పట్టా.
గుర్తొచ్చింది, తరచూ ఇక్కడికి వస్తూ ఉన్నట్లుగా.

కానీసారి కొత్తగా,
ఆ దీపం బాధపడింది, మళ్లీ వచ్చేసరికి తానుండదేమోనని; 
నాకు భయమేసింది. 

అంతలోనే మెలకువొచ్చింది, కానీ భయమాగలేదు.

(తెలుగు తోట 2015లో ప్రచురించబడింది)

Sunday, October 6, 2013

కత్తిపీట.... కాపురం.... లాంటి, ఓ కథ ....!


శాన్నాల్లనుంచి అనుకుంటూన్నారా శివగా, నీకో post dedicate చేద్దామని.
మరెందుకు late అయిందంటావేమో....
నిన్ను రాయడామంటే నన్ను రాసుకోడమేగదా!! (ఏంటి నమ్మవా ?  కింద చదివితే నువ్వే నమ్ముతావులేరా..!!)
పైగా మనకు publicity ఇష్టముండదు (ప్చ్, జనాలకు తెలిసిందేగదా).
అలా అయితే, ఇప్పుడు రాయడమెందు కంటున్నావా?
అంటావ్ రా,  ఈమధ్య ఎక్కువ సదువుతున్నావుగదా!! అడుగుతావ్.

ప్రతి శుక్రవారం సాయంత్రం cell phone లో balance ఉందోలేదో check చేసుకుంటున్నాను చూడు, అందుకు.
కష్టమనిపించి నపుడల్లా, కాదు కాదు...కష్టపడాలనిపించినపుడల్లా కనిపిస్తావ్ చూడు, కర్ణుడిలాగ, అందుకోసం.
అన్న ఓ సినిమాలో చెప్పాడొరే (ఇక్కడ ), మనలోని idiotని మనకి చూపించేవాడేరా మన friend అని, నువ్వు అక్కడితో ఆగిపోలేదుచూశావా, అందుకు.
బిర్యాని అన్నా, బీరన్నా, బ్రహ్మి అన్నా నువ్వే గుర్తుకొస్తావ్ చూడు అందుకు. కేవలం నిన్ను గుర్తుచేసుకోడానికే పంచతంత్రం సినిమా చూస్తాను చూడు, అందుకు.
నా familyకే తెలీకుండా నాకో familyఇచ్చావుచూడు, అందుకు.
Freeగా sociology క్లాసులెవడు చెబుతాడురా, చెప్పు !! అందుకు.
నాలుగేళ్లుగా ప్రతివారం ఓ చింతామణి నాటకం వినిపిస్తున్నావు చూడు, phoneలో, అందుకు. ( మీ పెసిడెంటు కూతురు, మూడో పాప గురించి, last week update ఇవ్వలేదు ఎదవ !!, next week మర్చిపోకొరే. )
కాదొరే, నీకు 'కమ్మ'గా ఉండడం అంటే తెలుసా? చెప్తాను చూడు.
మూడో తరగతిలోనో, నాల్గో తరగతిలోనో  ఓసారి నాకు జ్వరమొచ్చింది (పులివెందుల వాళ్లకి కూడా జ్వరాలొస్తాయ్ రోయ్ :P). వారం రోజులున్నిందనుకుంటా. జ్వరం పోయి, ఇంక బాగవుతున్న time అది. సాయంత్రం, DD తెలుగులో వార్తలొస్తున్నాయ్, urduలో. వంటింట్లో రసమన్నం నా ముందు పెట్టి పాలుకాస్తోంది అమ్మ. ఓ రెండు ముద్దలు తినంగానే ఇంక తినలేననిపించింది. పడేద్దామని పైకిలేచా, పొంగుతున్న పాలమీద నీళ్లుపోసి నాదగ్గరికొచ్చింది అమ్మ. ఎందుకు పడేస్తున్నావని అడిగితే, నోరంతా చేదుగా ఉంది, తినబుద్ధికావడంలేదని చెప్పా. అందులో కొద్దిగా గట్టి పెరుగు (అపుడు పాడి ఉండేదొరేయ్)  కలిపి కమ్మగా ఉంటుంది కూచోమని చెప్పి, మొత్తం తినిపించిది నాచేత. అప్పటినించి, 'కమ్మగా' అనే పదం వింటే, వెంటనే ఆరోజు తిన్న taste తగులుతుందిరా అబ్బాయ్ మనసులో. సరే ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటున్నావా, నువ్వు పిలిస్తే నాపేరు కూడా అంతే కమ్మగా ఉంటుందిరా సంటి.
ఇయ్యన్నీ కాదెహే, నన్ను ఎనిమేళ్లుగా ఏగుతున్నావుగదా!!  చాలదా!?!


కత్తిపీట గురించి, కాపురం గురించి చెప్పిన జనాలు, స్నేహం గురించి చెప్పలేదేంట్రా? వయసొచ్చేకొద్దీ విడుగుతూనే ఉంటుందని. పోన్లే, నేంజెప్పాననుకో...,మీ ఊరి స్కూల్లో, compound గోడలమీద రాయించొరే ...!!(నాపేరు లేకుండా ).

Thursday, March 21, 2013

అది, ఏదైనా, నీది..!


నువు సంపాదించుకునే ధన'మది'
నువు సాధించుకునే నిధాన'మది'
నువ్వెంతగానో ఇదయ్యే ను'వ్వది'
నిన్నే పెట్టుబడిగా పెట్టి పొందే ప్రతిఫల'మది'
'అది' అనర్ఘమైనప్పుడే నువు అమూల్యమయ్యేది
నువు చూడని పెళ్లిల్లు, చేయని పండగలు 'అది'
ఆడని Matchలు కూడా 'అదే'.
మరి చూస్కో, 'అదె'లా ఉండాలో....!
సమయాన్నంతా వెచ్చించి తెచ్చుకునే 'అది', తేలిపోతే,
నీ సమయానికేదీ   ఇది,
మరొక్కసారి చూస్కో, 'అదె'లా ఉండాలో,
ఇంక చేస్కో అందంగా  'అది'.

Tuesday, December 11, 2012

అలిగావా...?


ఒకసారేమో అవసరం;  బాధ పడ్డప్పుడు వెళ్లి బోరుమన్నావ్ చూడు, అపుడు;
ఒకసారేమో ఇష్టం;  సంతోషంలో చెవిలో చేరి జోరీగవైనావు చూడు, అపుడు;
ఇంకోసారి వ్యసనం; అదే weakness, అశక్తత;

అన్నీ నీవే;
బాగా ఆలోచించు,
నీ బాధలోనే,  నీకవసరమయ్యారు;
నీ సంతోషంలోనే,  నీకిష్టమయ్యారు;
నీ weakness వల్లే, నీకు వ్యసనమయ్యారు;
అంతా నువ్వే,  అన్నీ నీవే;

ఆమాత్రం దానికి,  అలక దేనికి?
అలిగేది ఆడోళ్లు కాదు. అబలులు;
బలం లేని మనసులు;
స్వార్థంతో శుష్కించిన మనసులు;
తేల్చుకో మరి నువ్వెవరో...!

Wednesday, October 17, 2012

Man Vs. Himself : Being a Man


"రాగ రాహిత్యం" అని మనసు రోదించి నపుడల్లా,
కాదు కాదు, కేవలం "మోహపు Manifestation" అని మెదడు మొత్తుకుంటూనే ఉంది.
అదేంటో, ఎప్పుడూ ఏదీ గెలిచినట్లు అనిపించదు.

<ఒకానొకప్పుడు>
మనసు: ప్రపంచం మొత్తం జయించి తన పాదాల నలంకరించాలనుంది.
మెదడు: Just to feel the smoothness of her skin?
<------------->

----:   Isn't that being a Man ?

Wednesday, September 19, 2012

పాపం, పుణ్యం ఏమీ కాను.

పా....పం నేను,  ఎవరి పుణ్యమూ కాను,
పర్లేదు నేను,  ఎవరి పాపమూ కాను.

Saturday, May 5, 2012

సర్రియలిజం, నాది.....!



మెదడు, మనసు సరిహద్దులో,
ఇప్పుడే పుట్టి, ఆదరించే అండ లేక, అప్పుడే చచ్చిన
అనాథ ఉహల అడుగుజాడలు.....,
అదో సర్రియలిజం.