Showing posts with label కోకనాడ. Show all posts
Showing posts with label కోకనాడ. Show all posts

Thursday, April 2, 2020

యోగః కర్మసు కౌశలం!

అవి BTech అయ్యాక, కొత్తగా IITలో చేరిన రోజులు. Kharagpurలో అన్నిటికంటే ముందు appreciate చేసినది high speed internet and huge LAN sharing (ఆ, అదే అదే, DC++!). అవునుమరి, నా BTech పూర్తయ్యేసరికి నేను internet illiterate అనే చెప్పుకోవాలి. మొత్తం BTech అంతా కలిపి చూసినా 2-3 గంటలకంటే internet వాడిఉండను, ఆ రకంగా నా పట్టా (degree) offlineలోనే పూర్తి అయినట్లు. ఇదంతా చదివి ఎప్పుడో భూమిపుట్టినపుడు చేశానని అనుకునేరు, కాదు, మొన్నామధ్య వైస్సార్ CM అయిన తర్వాతే మొదలయ్యింది నా BTech . అప్పటికి నాకున్న internet craze వల్ల Kharagpurలో full time onlineలోనే బతికేసే వాణ్ణి. Orkut, facebook, blogging అన్నీ అక్కడే మొదలు.

వీటన్నికంటే, విపరీతంగా ఆకట్టుకున్నది అక్కడి LAN sharing, DC++.  అంటే ఏంటంటే, Simple గా, campusలోని computersని connect చేసి, అందరూ తమ తమ computersలో నుంచి, ఎంపిక చేసిన సమాచారం (files) అందరితో పంచుకునే ఒక వెసులుబాటు. ఈ వ్యవస్థ అప్పటికే చాలా పకడ్బందీగా నడుస్తూ ఉండేది. అలాగే, కొన్ని సంవత్సరాలుగా accumulate అయిన వివిధ రకాల సమాచారం sharingలో ఉండేది. ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిందంటే, అక్కడలేనిది ఏమీ లేదనేంత rich database అనమాట అది. అన్ని భాషల నవలలు, కథలు, సినిమాలు (national, international, regional) , పాటలు, పాఠ్య పుస్తకాలూ, documentaries, pdfలోకి మార్చబడిన ప్రాంతీయ మేగజైన్లు (చందమామ నుంచి స్వాతి వరకు దాదాపు అన్ని తెలుగు magazines, అన్ని సంచికలు దొరికాయి నాకు అక్కడ), cricket videos, cartoons, video lectures, ఇంకా ఎన్నెన్నో లభించేవి. సినిమాల మీద PhD చేసే ఒకాయన అక్కడ ఉన్న తన friend hostel roomలో unofficialగా ఉంటూ, తనకి కావాల్సిన సినిమాలని collect చేస్కుంటూ కొన్ని నెలలు campusలోనే  ఉన్నాడంటే అర్థంచేసుకోవచ్చు అక్కడి collection size గురించి. వీటన్నికన్నా ఎక్కువ porn కూడా దొరికేది, అది వేరే విషయం. నిజానికి ఇన్ని ఉన్నపుడు ఏం చేయాలో, ఎక్కడినుంచి మొదలు పెట్టాలో తెలియక తబ్బిబ్బయినంత పనైంది. సినిమా అంటే ఉన్న ప్రత్యేకాభిమానం వల్ల world cinemaలోకి తొంగిచూసే కిటికీ దొరికినందుకు సంతోషించి, వాటితోనే మొదలు పెట్టా. IMDB top 200 listతో మొదలైన ఆ సినిమోత్సవం రెండేళ్ల తర్వాత Kharagpur నుంచి వచ్చేవరకూ కొనసాగిందనే చెప్పాలి. అలా ఒకరోజు నేను ఎంపిక చేసి చూసిన సినిమా Philadelphia. USAలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అది. Unfairగా fire (wrongful dismissal) చేశారని ఒక lawyer (Andrew) తాను పనిచేసిన law firm మీద caseపెట్టి గెలుస్తాడు. చాలా అద్భుతమైన, తప్పకుండా చూడాల్సిన సినిమా.

ఇలాంటి హత్తుకునే సినిమాలు చూసినప్పుడు intensityని బట్టి కొంత సమయం కోల్పోతూ ఉంటాను, ఆ spell అంతా పోయి తిరిగి మాములు మనిషిని  అవడానికి 1-2 రోజులు కూడా పడుతుంది ఒక్కోసారి. "అబ్బా! ఏమన్నా చెప్పాడా? అంతకన్నా గొప్పగా నటించాడుగా!" అనుకుంటూనే మరుసటిరోజు Embedded systems labకి వెళ్ళా. 3 గంటల తర్వాత కూడా ఆవాల్టి experiment పూర్తవలేదు. తీసుకున్న components అన్ని return చేస్తున్నపుడు అక్కడి lab technician అన్నాడు, "రేపు ఉదయం 11 నుంచి lab ఖాళీగా ఉంటుంది, నేను కూడా freeగానే ఉంటాను. కావాలంటే అప్పుడు వచ్చి పూర్తి చేస్కోండి" అని. అరే, ఈయన గమనిస్తూ ఉన్నాడన్నమాట. అయినా, experiment పూర్తిచేస్కోడానికి మేము ఆయన్ని అడగాలి కదా, ఎప్పుడు వచ్చి extra time చేస్కోవచ్చు అని, కానీ, ఆయనే చెబుతున్నాడు అడగకుండానే. ఆయనకేంటి అవసరం, అయన కేవలం technician, కావాల్సిన electronic componentsని studentsకి ఇవ్వడమే ఆయన బాధ్యత. అప్పటివరకు నేను చూసిన lab technicians అందరూ వాళ్ల బాధ్యతలే సరిగ్గా నిర్వర్తిస్తారని చెప్పలేని రకం. సాధారణంగా labs మధ్యాహ్నాలు ఉంటాయి. కాబట్టి, అయ్యేసరికి, ఈ technicians ఇంటికెళ్లే హడావుడిలో అందర్నీ తొందర పెడుతూ ఉంటారు. Experiment పూర్తయినా, కాకపోయినా, తొందరగా componentsని return చేయడమే వాళ్ళకి కావాలి. కానీ ఈయన మాత్రం differentగా ఉన్నాడు. Time అయ్యాక మేమే return చేసేవరకూ ఉండి, తర్వాత కూడా extra time మాకోసం ఇస్తా అంటున్నాడు. చెప్పడంకూడా ఎలాగ, సంతోషంగా నవ్వుతూ చెబుతున్నాడు. "తన jobని మరీ ఇంత seriousగా తీసుకుంటున్నాడేంటి ? ఈయన కూడా an excellent lab technician కదా!" అనుకుంటూ hostelకి బయల్దేరా. cycle తీసుకుంటూ ఆలోచిస్తున్నా, what makes us good at something? అని.  Am I a good _____? ఏదైనా సరే, Am I a good Son? Am I a good Engineer? Am I a good Farmer? Am I a good boyfriend? Am I a good Cricketer? Am I a good Scientist? Am I a good citizen? Am I a good Plumber? Am I a good Student?
 How to answer?

ముందురోజు చూసిన సినిమాలోని సన్నివేశం ఒకటి గుర్తొచ్చింది. Wrongful dismissalకి సంబంధించిన వాదప్రతివాదాల్లో, కింది సంభాషణ జరుగుతుంది. case పెట్టిన వ్యక్తి Andrewకి, తన తరపున వాదించే lawyer Joeకి మధ్య (courtలో అందరి ముందు) నడుస్తుంది.

Joe: Are you a good lawyer, Andrew?
Andrew: I am an excellent lawyer. (చాలా ధీమాగా, తృప్తిగా చెబుతాడు.)
Joe: What makes you an excellent lawyer? (అంతే ఇష్టంగా అడుగుతాడు Denzel Washington, భవిష్యత్తులో ఈ సన్నివేశాన్ని అసంఖ్యాకులు పదే పదే చూస్తారని ముందే తెలిసినట్లు!)
Andrew: I love the law. (small silence). I know the law. (small silence). And I excel at practicing it. (తప్పకూండా చూడండి, Academy Award వచ్చింది ఆ పాత్ర వేసిన Tom Hanksకి. ఈ scene మాత్రం కావాలంటే ఇక్కడ చూడొచ్చు)

Competent అయినప్పటికీ వేరే కారణం (Homosexuality and AIDS ) వల్ల unfairగా fire చేశారని నిరూపించేలా, చాలా సామాన్యమైన సన్నివేశంలా అనిపించినా, చాలా సార్వత్రికమైన సందేశం ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. తాను law studentగా సాధించిన ఘనతలు, medals, grades, ఆ తర్వాత careerలో గెలిచిన గొప్ప caseలు, సాధించిన achievementsని అర్హతలుగా చూపించి తానొక గొప్ప lawyer అని చెప్పుకోకుండా, అంతకంటే చాలా fundamental ingredients వల్ల తనకా యోగ్యత ఉందని చెప్పుకుంటాడు Andrew.

అవును,  ఆ lawyer సమాధానంలో స్పష్టంగా ఉంది, అన్ని ప్రశ్నలకి సమాధానం. మొదట మనం చేస్తున్న పనిని ప్రేమించాలి. అంతేకదా!, ఇష్టంలేకుండా చేస్తున్న పనిలో గొప్ప achiever అవడం చాలా కష్టం, అరుదు. కేవలం ఇష్టం ఉన్నా సరిపోదు. చేస్తున్న పని గురించి పూర్తి అవగాహనా ఉండాలి. బాధ్యతలనెరిగి నడుచుకోవాలి. అప్పుడే ఆ పాత్రని సమర్థవంతంగా పోషించగలుగుతాం. ఇష్టమూ, అవగాహనా ఉన్నా సరిపోదు, అనుభవం పెరుగుతన్న కొద్దీ, ఆపనిలో మన నైపుణ్యం మెరుగవుతూ ఉండాలి కూడా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండకుండా, దినదిన ప్రవర్ధమానం చెందాలనమాట.  అప్పుడే, one can become good at something, in fact anything. ఆ lab technician కూడా, తన పనిని ప్రేమించబట్టి proactiveగా ఉండి మమ్మల్ని గమనించడం, పిల్లలు మొహమాట పడే అవకాశముంది అని, extra time and help తానే offer చేయడం అనేవి automaticగానే అలవడి ఉండొచ్చు. అవే ఆయన్ని ఒక మంచి lab technicianగా (కనీసం నాకు) గుర్తుండిపోయేలా చేశాయి.

అలా ఆలోచించుకుంటూ hostel వైపు వెళ్తున్న నాకు, ఒకవారంలో జరగబోతున్న స్నాతకోత్సవం (convocation) కోసం ఏర్పాటుచేసిన పెద్ద posterలో, IIT Kharagpur logo ఎదురయ్యింది. అప్పటికే తెగ చూసేసి మురిసిపోయి ఉన్నా, ఈసారి  కిందున్న motto "యోగః కర్మసు కౌశలం" ఒకసారి అలా తళుక్కున మెరిసింది. ఆహా! "చేసే పనుల (కర్మల) యందు కుశలత (skill, నైపుణ్యము) కలిగిఉన్నవాడే యోగి" అని భగవద్గీతలో పెద్దాయన చెప్పే ఉన్నాడుకదా అని గుర్తొచ్చి, "అయితే ఇవాళ అలాంటి ఒక కర్మయోగిని కలుసుకున్నా అనమాట" అనుకున్నా. ఆ mottoని అర్థంచేసుకోడం కోసం అప్పుడెప్పుడో ప్రయత్నం చేసినా, ఇప్పుడీ దెబ్బతో బాగా అర్థమైందనమాట. ఇంతకీ, "అప్పుడంటే ఎప్పుడు?" అనుకుంటున్నారా, ఎప్పుడంటే, offline  పట్టా రోజుల్లో. ఎందుకంటే, నా previous university motto కూడా చాలా యాదృశ్చికంగా అదే!

           


Tuesday, November 26, 2019

మర్చిపోవాల్సింది, మర్చిపోకూడనిదీ రెండూ మేలే!

నీతులూ సూక్తులూ చెప్పడం నాకూ ఇష్టముండదు, వీలైనంత వరకూ హాస్యం రాయడానికే  తపిస్తాను, కష్టం కూడా కాబట్టి. అయినా, కొన్నిసార్లు జీవితం కూడా comedyతో కప్పి చెప్పలేనంత serious అవుతుంది, తప్పదు, మరి మిగిలిన రసాలని కూడా ఆస్వాదించాలి కదా!

ఎక్కడో చదివానో, ఎవరో చెబితే విన్నానో, లేదా, నా ఆలోచనల ఫలితంగా మనసులో రాసిపెట్టుకున్నానో, తెలీదు కానీ, "మనం జీవితంలో మర్చిపోవాల్సింది, మర్చిపోకూడనిదీ కూడా మేలే" అని ముద్రపడి పోయింది. కొంచెం confusingగా ఉంది కదా, ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం.

మొన్నామధ్య, ఒకానొక important conferenceకి work submit చేద్దామని, team అందరం బాగా కష్టపడుతున్నాం. Servers సచ్చిపోతున్నాయ్, జనాలు రాత్రుళ్లు కూడా work చేస్తున్నారు, deadline వరకూ కొంచెం relaxedగా ఉండటం వల్ల  last minuteలో అందరం కొంచెం హడావుడి పడాల్సివచ్చింది.  Anyway, నేను కూడా బాగా burnout అయ్యి ఉన్నా. శనివారం  పొద్దున, officeలో ఉండగా,  program run చేసి, gapలో Facebook check చేస్తున్నా. ఇంతలో ఒక message వచ్చింది, గుర్తుపట్టా, కాకినాడలో junior, మా branch కాదు, పెద్ద పరిచయం కూడా లేదు. ఈ messageకి ముందు ఎప్పుడు మాట్లాడానో అని చూస్తే, last message 2010లో, దాదాపు దశాబ్దం గడిచింది. "ఏంటబ్బా, ఇంత suddenగా ఈ message?" అనుకొని reply ఇవ్వడం start చేశా.  సారాంశం ఏంటంటే, తను ఈ weekendకి Edinburghలో ఉన్నట్లు, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని Facebookలో check చేస్తే, నేను దొరికాను, so, నాకు వీలైతే కలుద్దామని. తానున్న hotel మా officeకి కొంచెం దగ్గరే, కానీ, ఎక్కడైనా మంచి Biryani దొరికే చోట lunchకి కలుద్దాం అని అడిగాడు.  సర్లే, మనం కూడా ఎలాగూ lunch తెచ్చుకోలేదు, officeకి దగ్గర్లో ఉండే Tanjore restaurantకి రమ్మని చెబుదాం అనుకొని location share చేశా. Time fix చేసుకున్నాక, bye చెప్పి, తన profile చూడటం మొదలు పెట్టా. Amazon Germany(Berlin)లో work చేస్తున్నాడు, అంతకు ముందు Amazon  India, ఇంకా ముందు IIT Madrasలో CSE MTech, ఆ ఇంకా ముందు కాకినాడ JNTU CSE BTech. Impressive అనుకొని, పెద్దగా పరిచయంలేని వాడుకదా, అసలే wifeని వెంటబెట్టుకొని Scotland చూద్దామని వచ్చాడు, meeting awkwardగా ఉంటుందేమో అని కొంచెం అనుమానపడ్డా. అయినా, తనే propose చేసాడు కదా కలుద్దామని, so పర్లేదులే అనుకొని convince అయ్యా. Time అయ్యాక office నుంచి వెళ్లి restaurantలో కలిశా.

సీమవాడు కూడా అవ్వడం చేత, ఇంకొంచెం connectivity పెరిగి, బాగా తొందరగానే comfort zoneలో  పడింది conversation. ఏదో తెలీని welcoming తెలుస్తోంది నాకు ఇద్దరి body languageలో. Abroadలో ఉన్నారు కదా, మన జనాలు కనిపించేసరికి కొంచెం connect అయ్యారేమోలే అనుకున్నా. అసలే Berlinలో Indian food దొరకడం లేదంట, మొహం వాచి ఉన్నారు ఇద్దరు. chicken, lamb, biryani, masala dosa, నా prawns, ఇలా order చేసిన list పెద్దగానే ఉంది. "Green sauce, red sauce తిని తిని నాలుక చచ్చిపోయిందండి, UK చాలా better, ఇక్కడ Indian foodకి ఇబ్బందే లేదు, మా దగ్గర అస్సలు దొరకడం లేదు, వేరే cityకి వెళ్లి తిని వస్తూ ఉంటాం అప్పుడప్పుడు" అన్నారు. జగన్ policies నుంచి, Europeలో living వరకూ ఏదీ వదలకుండా discuss చేసాం, particularగా, పెళ్లయ్యాక వాళ్లు Germanyకి move అవడం, ఆ అమ్మాయి ఉద్యోగం, difference in life style, working conditions,etc.

అన్నీ అయ్యాక, "సార్ (కాకినాడలో juniors, seniorsని ఆలా పిలిచేవాళ్ళు) మిమ్మల్ని ఇవాళ కలవడానికి ఒక particular reason ఉంది" అన్నాడు.

"అవునా, చెప్పు, ఏంటది!"

"ఇంత suddenగా వీడెందుకు message చేశాడు, కలుద్దాం అంటున్నాడు, మనకి ఆమాత్రం పరిచయం కూడా లేదే అని అనుకోలేదా మీరు?"

"In fact అనుకున్నా, but, వేరే countryలో ఉన్నాం కదా అని, weekend, కలవడం కూడా easy కదా, Benguluruలో లాగా 2 గంటలు ప్రయాణం చేయక్కర్లేదు అని పిలిచావేమో అనుకున్నా"

"Actually, నా BTech final yearలో మీరు నాకు చాలా పెద్ద help చేసారు, అప్పటినుంచీ మీకు Thanks చెప్పడం కుదరలేదు నాకు. మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇక్కడెక్కడో, ఇలా unexpectedగా కలిసి చెప్పే అవకాశం దొరికింది"

"ఓ!"

"నేను 2010లో GATE రాసినప్పుడు, నా hall ticketలో పేరు తప్పుగా వచ్చింది. Sadly, examకి 2 days ముందు realise అయ్యా నేను. అసలే నేను panic party, అందులో, నా friends కొంతమంది rank వచ్చినా కూడా ఈ issue వల్ల admission అప్పుడు ఇబ్బంది అవుతుంది అని భయపెట్టారు. ఒక్కసారి, కష్టపడి prepare అయ్యిందంతా waste అని బాధపడ్డాను. ఏం చేయాలో తెలీలేదు."

"ఓ, అవునా!"

"మన కాకినాడ Kharagpur administration zoneలోకి  వస్తుంది కాబట్టి, అక్కడి officeని reach అయ్యి, correct చేస్కోవచ్చు అని తెలిసింది. Phone ద్వారా try చేశా, కుదరలేదు. అక్కడ నాకు తెలిసిన వాళ్ళుకూడా ఎవరూ లేరు. RR Nagar friend ఒకడు, వాడికి తెలిసిన senior ఉన్నాడని చెప్పి, రోజంతా నానా చాకిరీ చేయించుకొని, hand ఇచ్చాడు. వాడితో పని అవ్వదని decide అయ్యి, ఏంచేసినా ఒక్కరోజే ఉంది  అని బాధపడుతూ ఉంటే, మా classmate, మీ junior, kamalakar reddy (మా junior ఎలా అయ్యాడో అర్థమైందనుకుంటా) విషయం తెలుసుకొని వాడే నా దగ్గరికొచ్చి Kharagpurలో ఉన్న మీ contact ఇచ్చాడు. మీకు call చేసి, help అడగ్గానే, అక్కడి office కెళ్లి, మాట్లాడి, forms చూపించి correct చేసిన hall ticket ఆ రోజే mail చేయించారు."

"Really! caste గ్రూపులు ఇలాకూడా ఉపయోగపడ్డాయన్నమాట!"

"ఆ! కొత్త hall ticket చూసుకొని, ప్రశాంతంగా పడుకున్నా ఆరోజు. Next day exam కూడా సరిగ్గా రాయగలిగా"

"Honestly, నాకివేమీ గుర్తులేవు, ఇంత జరిగిందా?"

"నేనేం ఆశ్చర్యపోను, మీ వరకూ just ఒక గంట పని, Kharagpur GATE officeకి వెళ్లి explain చేసి correct చేయించి ఉంటారు, అంతే, ఆ తర్వాత మర్చిపోవచ్చు. నేను కదా అక్కడ sufferingలో ఉన్నది, ఆ తర్వాత బయటపడినది. కాబట్టి, నాకు అది పెద్ద విషయం. ఆ correction వల్లే GATE rank వచ్చింది, ఐఐటీఎం లో చదివాను, amazonలో place అయ్యాను, తర్వాత Germany వచ్చాను అని చెప్పడం లేదు, అసలు అది admission అప్పుడు issue అయ్యేదోలేదో కూడా confirmగా తెలీదు. మహా ఐతే, next year రాసేవాణ్ణేమో, but, ఆ panic momentలో, కలిగిన reliefకి value ఉందిగా. పరిచయం లేకపోయినా, మీ junior చెప్పాడని help చేసారు, నేను కూడా నావైపు story, మరియు నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా, దేశంకాని దేశంలో, అనుకోకుండా ఇప్పటికి, ఇలా కుదిరింది."

"You are welcome!"

అనుకొని, దగ్గర్లో ఉన్న మా officeకి తీసుకెళ్లి, అక్కడి నుంచి కొన్ని దర్శనీయ ప్రదేశాలవైపుకి guide చేసి, next day కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి, మళ్లీ కలవడానికి decide అయ్యి, వీడ్కోలు తీసుకున్నాం ఆవాళ్టికి.


అవును, మనం జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడనిది, "మనం పొందిన మేలు", వెంటనే మర్చిపోవాల్సింది "మనం చేసిన మేలు". ఇదన్నమాట పై confusionకి వివరణ.  Also, చిన్న helpయే కదా, మనం చేయకపోయినా పర్లేదు, ఇంకెవరైనా చేస్తారులే , పెద్ద farak పడదు అనుకోకూడదన్నమాట, ఏమో, అవతలి వాళ్లకి అది ఎంత పెద్దదో!  కాబట్టి, వీలైనంత చేద్దాం మేలు!

Friday, October 4, 2019

మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా!

మొన్నామధ్య సామజ వరగమనా పాట వింటుంటే, "మనసుమీద వయసుకున్న అదుపు చెప్ప తగునా!" అనే expression వినగానే, ఒక తృప్తి అనుభవించినట్లినిపించి, సహజమైన చిరునవ్వు లాగా వ్యక్తమయ్యా, నాకు నేనే. మరి conceptకి connect అయితే అంతే కదా!

దేనిగురించైనా, "చెప్పనలవికాదు!" అనడమే దానిగురించి గొప్పగా చెప్పడం. అదో అలంకారం. ఆరకంగానే, "చెప్పడం అవుతుందా?" అని అడగటం కూడా. ఇదంతా day-to-day కవిత్వం.

శాస్త్రిగారి భావం, "చెప్పలేమురా నాయనా, it's immense" అని అర్థమైనా, "అలాంటివి చెప్పడమే కదా కవిత్వం!" అని సరదాగా challenge స్వీకరించి చేస్తున్న సాహసమిది.


అపుడెపుడో, ఓ పాత పాటలో, "మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా" అని అడిగితే, "అద్దమంటి మనసు ఉంది, అందమైనా వయసు ఉంది" అని మహానటి అభినయించగా, 'అందమైన వయసా?' అని అలోచించి, అదేదో  అర్థమైనట్లుగా అనిపించినప్పుడు కలిగిన కుదుపుతో మొదలైన 'ఆ' అదుపు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అంటే, ఎంతో చెప్పడం కుదరదని అర్థం, అయినా కొంత చెప్పుకుందాం.

శ్రీచైతన్య నుంచి విడుదలయ్యాక, engineeringలో, అమ్మాయిలంటే కచ్చి ఉన్న ఒక maths lecturer, classలోని top-3 beautiesలో ఓపిల్లని board దగ్గరికి వచ్చి లెక్కచేయమంటే, ఆరోజు బోర్డుముందర సాక్షాత్కరించిన geography, తద్వారా నాలో కట్టలు తెంచుకున్న chemistry, 'మనసు'లో దాచుకునేందుకు, తొలకరి 'వయసి'చ్చిన ఒకానొక చెరిగిపోని జ్ఞాపకం!

కొత్తగా ప్రపంచం పరిచయం అవుతున్న కాకినాడ రోజుల్లో, phoneలో మాట్లాడిన ప్రతిసారి, పెట్టేసేముందు, నాన్నకి దూరంగా వచ్చి, లోగొంతుకలో "సక్కగ దార్లోపోయి, సక్కగ దార్లో రా, పక్క సూపులు సూడకుండా!" అని అమ్మ ఇచ్చే regular warningలో వినిపించేది కూడా 'ఆ' అదుపు పట్ల భయమే!

"మహా మహా ఋషులకే తప్పలేదు జీవితం reset చేసుకోవడం erotic episodes తర్వాత. ఇక మనమెంత" అనుకుంటూ handsetలో history clear చేసిన ప్రతిసారి 'ఆ' అదుపేగా మనల్ని ఆడించేది.

"Engineeringలో stamp (just pass marks) కోసం చదవడానికి కూడా దొరకని time, స్వాతిలో వచ్చే సరసమైన కథలనుంచి, కాళిదాసు కుమార సంభవం వరకూ మళ్లీ మళ్లీ చదవడానికి మాత్రం ఎలా దొరికేదో?" అని ఆలోచిస్తే అర్థమవదా 'ఆ' అదుపు!

ఇంతెందుకు, నర్తనశాల సినిమా చూస్తూ, "పతివ్రతల పొందుకోరి పాపాగ్నిలో పడి భస్మం అవ్వొద్ద"ని ఉదాహరణలతో పాంచాలి హెచ్చరిస్తే, "ఏడిశావ్!అయినా సరే, భరించరాని ఈ విరహాగ్నికన్నా, మాకా పాపాగ్నే సమ్మతము" అని కీచకుడు అప్పుడే చెప్పేశాడే 'ఆ' అదుపు గురించి. అదంతాచూస్తూ, "ఔరా!" అనుకున్నప్పుడే అర్థమైందిగా అందరికీ అదేంటో.

ఒకానొక timeలో "ఏం రాస్తున్నావ్ రా, articles నిండా, నువ్వూ , నీ కామం తప్ప. మనసుని divert చెయ్ కొంచెం" అని ఒక స్నేహితుడి honest feedback. ఇదైతే, అదుపుతప్పుతున్నావేమో చూసుకోమని, 'ఆ'యొక్క అదుపు గురించి అరిచిమరీ చెప్పడం. నిజమేమరి, "నవరసాలా?అన్నెందుకు?" అని 'వయసు'కి నచ్చిన రసరాజం ఒక్కటే జీవితాన్ని రసవత్తరం చేసేదని 'మనసు'ని నమ్మించిన 'ఆ' అదుపుని గురించి ఎంత చెప్పినా చెప్పినట్లు కాదేమో!

Sunday, June 23, 2019

పేరు, ప్రపంచం, फरक: ఓ పే....ద్ద కథ!

High Schoolలో ఉన్నప్పుడు, మా seniorsకి, Hindiలో ఒక పాఠం ఉండేది, "नाम में क्या है?" అని. క్లుప్తంగా కథ ఏంటంటే (నాకు గుర్తు ఉన్నంత వరకూ), ఒక బాల యువకుడు (young adult) గురుకులంలో చదువుకుంటూ ఉంటాడు. అతనికి, ఒక గొప్ప పేరు పెట్టుకోవాలనిపించి, గురువుగారితో చెబుతాడు. అప్పటికే పేరు ఉందో లేదో నాకు గుర్తు లేదు, ఉందనే అనుకుందాం, కానీ, నచ్చలేదో ఏమో, ఇంకో గొప్పపేరు పెట్టుకుందాం అనుకున్నాడు పాపం. అదివిన్న గురువుగారు, 'ఓహో అలాగా! అయితే, అలా వెళ్లి, దేశంలో తిరిగిరా, నీకేమైనా నచ్చేపేర్లు వినిపిస్తాయేమో చూద్దాం' అని పంపిస్తారు. మనవాడు, చాలా ఉత్సాహంగా బయల్దేరతాడు. అలా వెళ్తున్న వాడికి, ఒకానొక ఊర్లో, గౌతమబుద్ధునికి కనిపించినట్లే, శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తున్న ఒక గుంపు ఎదురవుతుంది. సరే చూద్దాం అని, ఒకరి దగ్గరికి వెళ్లి అడుగుతాడు, 'ఆ చనిపోయిన ఆయన పేరేంటని?' ఆయన పేరు అమర్ (अमर) అని తెలుస్తుంది. 'ఓహో' అని ముందుకెళ్తాడు. ఇంకోచోట, కడుదీనావస్థలో ఉన్న ఒక బిచ్చగత్తె కనిపిస్తే, ఆమెనీ అడుగుతాడు, తన 'పేరేంటని?' ఆమె, 'దౌలత్ (दौलत)' అని చెబుతుంది. ఇలాగా, ఇంకొన్ని సన్నివేశాలు అయ్యాక, ఆలోచించడం మొదలు పెడతాడు. అంటే, మరణం లేనివాడు (అమరుడు) అని పేరున్న వాడు కూడా చనిపోతాడు. సంపద (దౌలత్) అని పేరున్న మాత్రాన, ఆవిడకి అడుక్కునే అవస్థ తప్పలేదు. అప్పుడు, మనవాడికి మబ్బులు విడిపోయి, వెనక్కి తిరిగి, గురుకులం చేరుకుంటాడు. గురువుగారికి, తన అనుభవాలు విన్నవించుకొని, 'అబ్బే, పేరులోనేమీ లేదండి' అంటాడు. (సరిగ్గా గుర్తులేదు, కథ ఇలా ముగుస్తుందనే జ్ఞాపకం.)

ఇప్పుడు నా కథ. భాషమీదున్న మమకారం వల్లనో ఏమో, చిన్నప్పటి నుంచి, నాక్కూడా, నాపేరంటే కొంచెం అసంతృప్తి, 'ఏదైనా, అర్థం ఉండి ఏడిస్తే బావుండేది' కదా అని. అయినా, మనమేం చేస్తాం, అలీ ఏదో సినిమాలో అన్నట్లు, నేనప్పుడు బాగా చిన్నవాన్ని అవడం వల్ల, నాకు తెలీకుండా జరిగిపోయింది, ఆపలేక పోయాను. మా జిల్లాలో ఉన్నంతవరకూ, నా అసంతృప్తి మినహా, పెద్ద బాధలేం పడలేదు. కానీ, పది పాసయ్యి, ప్రపంచంలో మన పరిధి పెంచుకోవడం మొదలుపెట్టినప్పటినుంచి, మొదలయ్యాయి మన సన్నివేశాలు.

బెజవాడ శ్రీచైతన్య కళాశాలలో, అడిగిన వాళ్లలో సగానికి పైగా వాళ్లకి, రెండు కంటే ఎక్కువసార్లే చెప్పాల్సివచ్చింది నా పేరు. అలా అని, నా పేరేదో Tongue twister అనుకుంటారేమో, అబ్బే, ఒత్తులు గట్రా ఏమాత్రం లేని, చాలా simple పదం. దీనికంటే, ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అలాంటి పేర్లు, మూడు తెలుగు ప్రాంతాల్లోనూ ఉంటాయి. సరేలే, ఈ English Medium high schoolsలో, modern పేర్ల మధ్యలో, ఎక్కడా తగల్లేదేమో అనుకొని, light తీసుకున్నా. పైగా, General Knowledge లేకుండా సాగిపోయిన వాళ్ల బాల్యాన్ని చూసి కొంచెం జాలిపడ్డ మాట వాస్తవం. అంటే, నా పేరేదో GK bitకి answer అనుకుంటారేమో. కాదు, నా ఉద్దేశం, Newspapers, కథలు, చదవడం, news, movies, చూడటం, etc.ల వల్ల ఎక్కడైనా ఇలాంటివి ఎదురయ్యి, పరిధి పెరిగి ఉండేది కదా అని. (ప్రతి తెలుగు కుటుంబంలో కనీసం ఒక్క శీనుగాడు (శ్రీనివాస్) అయినా ఉంటాడు కదా, ఆ rangeలో కాకపోయినా, నా పేరు మా areaలో world famous, అనగా, సర్వసాధారణం.) పోనిలే, వీళ్లకి అదేదో (పరిధి పెరగడం), చివరికి నా పరిచయం వల్ల జరిగింది అనుకొని సర్దుకున్నా. 

అలా, ప్రపంచంలో ఇంకొంచెం ప్రయాణం చేసాక, కాకినాడలో ఆగాల్సి వచ్చింది. అసలు problem అక్కడ ఎదురైందండి, ఆయ్! ప్రపంచం పెద్దది అవడం వల్ల ఎదురయ్యే సమస్య ఒకటి, నా General knowledgeని బాగా.... పెంచేసింది. ఒకే భాషలోని పదాలే అయినా, ఒక్కోసారి, కొన్ని పదాలకి, వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు అర్థాలు ఏడుస్తాయన్నమాట. అలా, నా పేరుకి కూడా, కోస్తాలో, మరీ అంత గర్వపడలేని అర్థం ఒకటి ఉంది. బెజవాడలోనే అటువంటి knowledge కలిగినా, కాకినాడలో మరీ ఎక్కువ అనుభవంలోకి వచ్చిందన్నమాట. అందువల్ల, కొండకచో, embarrassment feel అవ్వాల్సివచ్చింది. అదన్నమాట మదీయ వేదన. అదలా ఉంచితే, ఒకసారి, ఒకానొక ఘనుడు, నా పేరు చెప్పగానే, 'ఏంటీ, గూండా రెడ్డా?' అన్నాడు. 'ఓర్నియయ్య, ఏమడుగుతున్నావో తెలుస్తోందా నీకు?' అనాలని ఉన్నా, 'కాదు, *******' అని మళ్ళీ repeat చేస్తే అర్ధమైనట్లు ఊకొట్టాడు. కాబట్టి, నేను కొట్టకుండా తప్పించుకున్నాడు. ఇలాంటి కారణాల వల్ల, నా పేరులో 'నా' వివరాలన్నీ cut చేస్కొని, కేవలం Reddy అని, ఒక 'పేరుకాని పేరు'తో చెలామణి అయ్యాను (అంతేగా మరి, అది నా ఒంటి పేరు కాదు, ఇంటి పేరు కూడా కాదు). కొంతకాలం క్రితం వరకూ నా Facebook పేరు 'Mopuri K Reddy'. ఇప్పటికీ, ఈ blog పేరు M K Reddy's Blog, mail IDతో పాటు, అన్ని usernames, mkreddy***. అది మరి, నాపేరంటే నాకుండిన ఇష్టం. అవన్నీ జీర్ణం చేసుకుంటూ అలా ఇంకా ముందుకెళ్లడం మూలాన, ఈసారి West Bengalలో  halt వచ్చింది.

మన previous encounters దృష్ట్యా, బాగా అలోచించి, ఈ కొత్త ప్రపంచంలో, మనకి మనమే నామకరణం చేసుకొని, కొత్త lifeనే start చేయొచ్చని అలోచించి, so called గొప్ప పేర్లు (కనీసం ఇబ్బంది పడని అర్థాలున్నవి) వెదకడం ప్రారంభించా. కానీ, పూర్వజన్మ వాసనలాగా, కాకినాడ నుంచి మన జాన్ జిగిరి అయిన యశ్వంత్ గాడు కూడా నాతోపాటు వచ్చాడు west bengalకి. ఇలా అని నా ఆలోచన గురించి చెప్పాక, 'రేయ్, ఎందుకురా ఇదంతా! చెబుతున్నా విను, బొక్కరా ఇవన్ని' అని వాడిదైన వైరాగ్యంతో అనేసరికి, అలాంటి ప్రయత్నమేమి చేయకుండా ఆగిపోయా. కానీ, ఎప్పుడూ లాగుతూ ఉండేది, అలాంటిది ఏమైనా చేసిఉండాల్సింది అని.

ఆతర్వాత, బెంగాల్ నుంచి బెంగుళూరుకి మకాం మార్చాక, ఒక సంవత్సరం వరకూ, నా ఈ plans ఏవీ execute చేయలేకపోయాను. ఇందుకు కారణం, ఇంకో BTech వాసన, శివ గాడు, నా అప్పటి room-mate, ఇక్కడికొచ్చాక Flat-mate. అందువల్ల, నేను అనుకున్న పేరు కేవలం (నా చాలా accountsకి) password లాగానే మిగిలిపోయింది. మరి మనకి లవ్వయినా, పువ్వైనా, అన్నీ మనమేగా. అలా ఉండగా, IIScలో seat వచ్చింది. అనగా, కొత్త జీవితం ఆరంభించడానికి ఇంకొక కొత్త అవకాశం వచ్చింది. ఈసారి 'ఎవరిమాటా వినేదిలే' అని fix అయ్యి, నన్ను నేను సిద్ధం చేసుకున్నా. తర్వాతి రోజు reporting అనగా, ముందురోజు సాయంత్రమే cabలో luggage అంతా వేసుకొని campusకి వెళ్ళా. Hostel ముందు దిగి, joining order hostel securityకి చూపించి, luggage move చేస్తున్నా. ఇంతలో ఎవరో ఎదురయి, 'new admission ఆ?' అనేసరికి, 'అవును, హాయ్, I am *****' అన్నా, నాకు నేను పెట్టుకున్న కొత్తపేరుని. ఇంతలో, వెనకనుంచి 'పెహ్' మని నవ్వులు వినిపిస్తే వెనక్కి తిరిగి చూశా. నన్ను drop చేయడానికి మరియు luggageతో help చేయడానికి వచ్చిన, మా నిమ్మగడ్డవారు, కాకొల్లు వారి పరిస్థితి ఇదిగో కిందిలా ఉంది.

Vikramarkudu Movie Brahmanadam Comedy Scene

మరి, యశ్వంత్ గాడూ, శివ గాడేమో నా క్రితం జన్మ వాసనలై తే, వీళ్ళు నా latest జన్మలో add అయిన వాసనలు, నాకు West Bengalలో  తోడైన జాన్ జిగిరీలు. నాయొక్క అనుభవాలని, previous attemptsని ఎరిగిన వాళ్ళు. 'ఛీ, జీవితం!' అనుకొని, స్వీయనామకరణ ప్రయత్నాన్ని మరోసారి విరమించుకున్నా. 

ఆ తర్వాత, ఇంకొన్నాళ్ళకి, పరిధి ఇంకొంచెం పెంచుకొని, ఖండాలు దాటేసి, వేరే దేశంలో పనికోసం వచ్చా. ఇక్కడ, నేను కూడా చాలా మంది పేర్లని మళ్ళీ చెప్పమని అడిగా. effect of globalisation; భాష, సంసృతి, etc. differences ఉన్నాయిగా, తప్పదు. correctగా పలకాలంటే, స్పష్టంగా వినేవరకూ, పదే పదే repeat చేయమనాల్సిందే. మనకి (కాకినాడ, etc. లలో) ఎదురైన differencesకి చాలా రెట్ల difference అనమాట. కానీ, 'ఏంటీ, గింటీ'ల్లాంటి వేషాలేమీ వెయ్యకుండా, ఓపిగ్గా మరియు genuineగా మళ్ళీ చెప్పమని అడగటమే. ఇన్ని అనుభవాలు, ప్రయత్నాల తర్వాత, ఇప్పుడిక, ఒక నిర్వికార, నిశ్చలమైన, పూర్తి acceptance modeలో operate అవుతున్నా. Happyగా, ఇంటిపేరు, మరియు ఇందాక అనుకున్న 'పేరుకాని పేరు', అన్నీ పక్కన పెట్టి, కేవలం, ఒంటిపేరునే, విపరీతంగా వాడుతున్నా. In fact, ఆ 'పేరుకాని పేరు'ని, పేరునుంచి పెకలించి, ఒంటి పేరు, ఇంటిపేరు మాత్రమే కొనసాగిస్తున్నా. Because, now I don't care any more. అంటే, నేనుకూడా, ఇందాకటి కథలో శిష్యుడిలా, 'పేరులో పెద్దగా ఏమీ లేనట్లే'నని చెబుతున్నా అనిపించొచ్చు. కానీ, నేను అనుభవించిన అసౌకర్యం మాత్రం, ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపించవచ్చు. నామటుకు, నేను రాజీకి వచ్చేసా. నచ్చే పేరు కలిగి ఉండటం మంచిదే, అదృష్టం ఉంటే అలా జరగొచ్చు కూడా. కానీ, ఎప్పుడన్నా, 'ఏంటీ, రాంబాబా? ఎబ్బే, లాభంలేదు. Vibration లేదే!' అనే మాటలు వినిపించొచ్చు, లేదా మనసులోనే అనేసుకోవచ్చు, లేదా, ఇంకొంతమందికి funnyగా అనిపించొచ్చు. లేదూ, ఆశ్చర్యంగా, " కొత్తదనంలో కొట్టుకుపోకుండా, సంస్కృతి, చరిత్రలతో సంబంధం ఉన్న పేరులా ఉందే" అని rareగా appreciate చేసే జనాలూ తగలొచ్చు. ఏదేమైనా, in the end, పెద్ద फरक పడక పోవచ్చు అంటున్నా.

Confusion పొయ్యేలా, summary ఇచ్చే ప్రయత్నం చేస్తా, చుడండి: World is a bigger place, నీకు weird అనిపించింది ఇంకొకరికి సర్వసాధారణం అయిఉండొచ్చు (e.g. మన arranged marriages గురించి మా Russian flat-mateకి చెప్పా, సచ్చిపోయాడు ఎదవ!). నీకు world famous అయినది, ఇంకొకరు అసలు వినే ఉండకపోవచ్చు. కాబట్టి, ఇలాంటివి ఎదురైనప్పుడు, 'ఛీ ఛి ఛి ఛి ఛి! అలా ఎలాగా?' అని వేషాలు వెయ్యకుండా, 'ఓహో, ప్రపంచము బాగా పెద్దదనమాట' అని మన పరిధి పెంచుకోవాలన్నమాట.

కాబట్టి, పిల్లలకి పేరు పెట్టేటప్పుడు, కొంచెం, ఇవన్నీ మనసులో పెట్టుకోండి, లేదా, ఖలేజా సినిమాలోలాగా, 'చిచు' లాంటి పేరు పెట్టారేంటని పెద్దయ్యాక పిల్లలు నిలదీసే అవకాశముంది.

Saturday, January 16, 2016

దశాబ్ద కాలానికి తీరిన ఓ దాహం!

అంతగా ఆమోదయోగ్యంకాని ఈ నా అనుబంధానికి (నాకు, "తన"కి) అప్పుడే పదేళ్లునిండాయంటే కొంత ఆశ్చర్యమే. కానీ, త(న)ద్వారా పొందిన చాలా by-products, కొన్ని side effects తలుచుకుంటే కొంత విస్మయము, ఇంకొంత ఆనందమూనూ. దాన్నే జీవితం అంటారేమో (మా జనాలు). అయినా, "అతి సర్వత్ర వర్జ్యయేత్" అన్న పెద్దల మాట (కొంతమంది) పట్టించుకోక గానీ, లేకపోతే నా(మా) మోదానికి ఆమోదం లేకపోవడమేంటి? నాలాంటోళ్లు ఎంత సాధరణమంటే (common), సనాతనమైన (ancient) నా(మా) ఈ బంధం, సార్వకాలికము (eternal) మరియు సార్వజనీనము (universal). చరిత్రలు నాలాంటి "ఉన్మత్తులని" ఎందరినో ఎరిగి ఉండవచ్చుగాక, నా ఈ కథ పాతదే అయిఉండొచ్చుగాక, కానీ కొత్త సీసాలాంటి నాది కూడా ఓ చిత్రమైన ప్రెజెంటేషన్. మరొక ముఖ్య గమనిక, నా ఈ కథ చదివాక, మీరు నా అనుబంధాన్ని appreciate చెయ్యొచ్చు లేదా అసహ్యించుకోవచ్చు (మీ పూర్వాభిప్రాయాలకి భిన్నంగా!). ఇక మీఇష్టం.

మా మొదటి పరిచయం, simple, short and sweet అంటాను. నాకప్పటికి  (ఇప్పటికి దాదాపు పదేళ్ల క్రితం, కాకినాడ నాకింకా కొత్తగా ఉన్నపుడు) ఓటు హక్కు కూడా రాలేదు, అయితేనేం అనుభవైకవేద్యమైన "ఆ" అనుభవాన్ని ఆనందించగలిగాను. ఆస్వాదనానంతరం నాలో చోటుచేసుకున్న రసాయనిక చర్యల్ని ఇప్పటికీ గుర్తుంచుకోగలిగానంటే, అది కేవలం నా రసజ్ఞత మాత్రమే అనలేను, "తన" స్పర్శలోని పరిమళం, పనితనమూనూ. In fact, రసావిష్కరణకి "తన"కన్నా ఉత్ప్రేరకం (catalyst) (ఉందేమో!?) నాకైతే ఇంకా పరిచయం కాలేదు. "తనతో" అలా మొదలుపెట్టిన ఈ ప్రయాణం, దశాబ్దకాలంగా కొనసాగుతూ...నే ఉంది. నాగమల్లితోట జంక్షన్‌లో ఒకానొక శుక్రవారం సాయంత్రం, కాలేజ్‌కి కూడా తీసుకెళ్లని bagని, "తన"కోసం వీపున తగిలించుకుంటే, ("తన" కోసం తగిలించుకున్నానని తెలియక, వీడు వీకెండ్ కూడా చదువుకుంటాడేమో అనుకుని)  "అబ్బో!" అని ఆశ్చర్యపోయిన మా క్లాసు అమ్మాయి చూపులు నాకింకా గుర్తే. "తన"కోసం వెళ్లడానికే seniors దగ్గర (నడపటం రాకపోయినా) bike తీసుకునెళ్లి, వేసిన skids కూడా గుర్తే. ప్రశాంతంగా ఉండే రమణయ్యపేట-విశాలంగా ఉండే second floor terrace-చల్లగా ఉండే వేసవికాలపు సాయంత్రం-తుళ్లి వీచే బంగాళాఖాతపు సమీరము-చిక్కని వెన్నెల-వేడిగా యతి రొయ్యల బిర్యాని-నచ్చే company, perfect date కాదనగలమా! "fashionగా ఉండటం కోసం, hipగా కనిపించడం కోసమే ఈ affair" అని చాలామంది అన్నా, అనుకున్నా, "తన"తో నా అనుబంధం మాత్రం వీటన్నికీ అందని ఓ passionగా, ఇంకో పిపాసగా రూపాంతరం చెందుతూ వచ్చింది. నెలకో, మూడు పక్షాలకో ఒకసారి "తన"ని ఇలా కలుసుకోవడం నా అలవాటయ్యింది.

అటునించి వచ్చేశాక, వంగదేశాన నా ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అనగా, నేను "తన" సాహచర్యాన్ని అత్యంత ఆనందదాయకంగా, ఆత్మీయంగా, ఇవన్నీ కాదు ,చాలా అద్భుతంగా అనుభవించడం అలవరుచుకున్నది అక్కడే అనమాట. ఆర్థిక స్వాతంత్ర్యము కారణంగా, ఋతువుకి తగ్గట్టు, చిత్తవృత్తి (mood) ననుసరించి, "తన"లోని పలు పార్శ్వాలను ప్రయత్న పూర్వకంగా పలుకరించి, పలవరించీ మరీ నా ప్రేమని వ్యక్తపరచ గలిగాను. ఆ సమయంలోనే ఈ నా అనుబంధానికి అనుబంధంగా వచ్చిన by-products కొన్ని, జీవితాన్ని స్నేహపురితం చేశాయనగలను. "తన"తోటి సాగించిన ఆ స్వల్ప వ్యవధి సాహచర్యంలోనే, ఎన్ని కామెడీలు, ఎన్ని cricket కబుర్లు, (ఎన్ని అందమైన!? కబుర్లు), ఎన్ని teasingలు, ఎన్ని interviewలు, ఎన్ని పంచులు, ఎన్ని సారీలు, ఎన్ని జలసీలు, ఎన్ని congratsలు, ఎన్ని పాటలు, ఎన్ని సినిమా రివ్యూలు, ఎంత పొయెట్రీ, ఇంకెన్ని ప్రబోధాలు- జీవితం ఓసారి గిర్రున తిరగలేదూ!? దాంతో మా కలయిక పౌనఃపున్యం (frequency) పక్షానికో, పదిరోజులకో ఓసారికి పెరిగింది. తాజ్ బిర్యాని (బినా ఆలూ) విత్ మటన్ ఖీమా, tech market నించి వంకాయ బజ్జీలు, పైన చెప్పుకున్న మంచింగ్ మాటలు, అంతా అయ్యాక చల్లగాలిలో బ్ల్యాక్‌లు, scholars' avenue వెంబడి late night patrols, ఇవి, తనతో నేను రాసుకున్న Midsummer nights. (ఎంత ఆర్థిక స్వాతంత్ర్యమున్నా, ఒక్కోసారి మా వారాంతపు వేడుకలకి విరాళల కోసం సాగించిన వేటలు ఓ మధుర జ్ణాపకం. "డబ్బులదేముందిరా, కుక్కని కొడితే రాల్తాయి, సరైన కుక్కని పట్టుకోవడమే మన talent", ఒక wolf of winestreet.)

ఆ తర్వాత ఇటొచ్చి ఈ కన్నడ రాజ్యాన పడ్డాక....
పాలో కొయిలోకి వత్తాసా అన్నట్లుగా, మా ఈ అనుబంధపు తీవ్రతకి, ఇక్కడి పరిసరాలు (అనగా మట్టికాదు, మనుషులే)
కూడా దాన్ని మరింత బలోపేతం చేయడానికి గూడుపుఠాణీ (conspire) చేశాయనడనంలో ఆశ్చర్యమేమీ లేదు. తద్వారా పెరిగిన సంఘవృత్తపు (social circle) వ్యాసంలో ఇమిడిన పరిచయాలు, పంచుకున్న భావాలు, పెంచుకున్న (అ!?)జ్ఞానం, సమర్పించుకున్న సమయం, అవగొట్టిన ఆరోగ్యం, వాయిదా పడ్డ పనులు, పొందిన ఫలితాలు....ఇవి, జీవితపు పుస్తకంలో పదే పదే పునరావృతమైన పాఠాలు.

When did I fall so deeply under "తన" spell ? మొదలయ్యానని తెలుసుకునేలోపే, మధ్యలో ఉన్నానని అర్థమవుతోంది. ఇంతా జరగడానికి కారణమైన ముహూర్తం, ప్రదేశం, పరిసరాలూ ఏవీ నా ఊహకందడం లేదు. What a blind fool I was! కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా iterate అవుతోంది. మనిషి చాలా diligentగా acquire చేసుకునే wealth is health and అంతే carefulగా invest చేసుకునే wealth is time. అంటే, ఇప్పుడేదో నా healthకి or wealthకి తీరని నష్టం వాటిల్లిందని కాదు, for I don't want to suffer an immortal wound (ఈ మధ్యనే Pride and Prejudice చదవడం పూర్తిచేశా!).

దశాబ్ద కాలంగా తీరని ఒక దాహం వల్ల కోల్పోయినదాన్ని వెనక్కి తీసుకురాలేనన్న కఠినమైన నిజాన్ని ఎదుర్కొంటూ... మరియు, ఈసారి, సుసంపన్నం (enrich) చేయు మరో తృష్ణని వెదుక్కుంటూ....
మరదేగదా జీవితం!

నేనే.



Thursday, April 4, 2013

కొన్నుంటాయ్, ఈ శాస్త్రాలూ - అవీ, ఉంటాయ్...!


My sincere and special thanks to Rhonda Byrne,  Trivikram Sreenivas and Sreenu Vaitla.

ఇవాళ్టికి(అంటే ఇది రాసుకున్నప్పటికి; upload చేసినప్పటికి కాదని మనవి) మూడు రోజుల ముందు :

ఆవేళ ఎందుకో మన yashwanthగాడు గుర్తొచ్చాడు (sittingలాంటివేం plan చేసుకోలేదు లెండి; అయినా గుర్తొచ్చాడు). System,mobile మొత్తం వెదికాను, ఎక్కడా వాడూ,నేనూ ఉన్న జ్ఞాపకాలు(అనగా photoలు) దొరకలేదు. Suddenగా గుర్తొచ్చింది, అంతే, అప్పుడెప్పుడో మర్చిపోయిన orkut openచేసి KGPలో ఉన్నపుడు upload చేసిన అన్ని photos(ఇప్పటికీ ఉన్నయ్, కావాలంటే చూసుకోవచ్చు) మనసారా చూసుకున్నాను. Image Processingకి భగవద్గీత  అయినటువంటి Gonzalez పుస్తకం గుర్తొచ్చింది. అందులో మొదటి chapter introductionలో  "One picture is worth more than ten thousand words" గుర్తుకొచ్చింది. మనసుని ముంచెత్తే జ్ఞాపకాల వరదొకటి మొదలైంది. అందులో కొన్ని తుంపరలు ఇక్కడ విదిల్చుతున్నాను(కంగారు పడకండి,  మీ screenలకేమీ కాదు). 

yashwanthగాన్ని తలచుకుంటే మొట్టమొదట గుర్తొచ్చేది cricket. Indian cricket కి sachin-ganguly, sehwag-gambhir ల pairs ఎలాగో, మన JNTUK ECE05-09 cricket teamకి నేను-yashwanthగాడు అలాగ. అదేంటో మన captain peelid(వాడు నా slam bookలో అలాగే రాశాడు), first overలోనే ఎవరో ఒకరు (maximum yashwanthగాడు, కనీసం నా satisfaction కోసం!!) out అవుతారని తెలిసినా, కాకినాడలో ఆడిన (దాదాపు ) అన్నిmatchలకి మా opening pairని disturb చెయ్యలేదు. అంటే basicగా మన team కూడా అలా అలవాటు పడిపోయారు లే. First year లో అయితే, sunday ఒకటే holiday అవడం వల్లనూ, అప్పట్లో అందరూ class లకి attend అవడం వల్లనూ sunday మాత్రమే ఆడుకునే వాళ్లం. సరిగ్గా ఆరోజే, yashwanth గాడింట్లో పూజలుండేవి. వాడికోసం ఇంటికి phoneలు, వచ్చేదాకా ground లో waiting లు(ఏంటి, ఇవన్నీ ఎలాగూ first overలోనే out అవుతాడని తెలిసినా). వాడేమో late గా వచ్చి, ఆ black ax n dx సైకిల్ park చేస్తూ "ఏం చెయ్యనురా, ప్రసాదమన్నా తీసుకోవాలిగా, అందుకే పూజ అయ్యేదాకా ఆపారు" అనేవాడు.(పాపం ఆ cycle, GATE exam ముందు, రమణయ్యపేటలోని మా room దగ్గర park చేసి, పోగొట్టుకున్నాడు).

cricket అంటే చెప్పుకోవాల్సింది మన yashwanthగాడి keeping .వాడు మనకి దొరికిన ఓ  మంచి keeper. అందుకనే KGPలో నేను captaincy చేసిన (~)100  matchల్లో (ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు), >50 matchలకి వాడే మా keeper, ఆ మిగిలిన < 50 కూడా, వాడు  TT, shuttle ఆడుకున్నాడు కాబట్టి, నేను వేరే వాళ్లతో చేయించుకోవాల్సి వచ్చింది.
ఇక్కడ ప్రేక్షకులు చదవాల్సింది ఏమిటంటే, actualగా ఆ మొదటి >50 matchలు కూడా, నేను phoneచేసి బలవంతంగా రమ్మండం మూలాన వచ్చాడేమో అని నా అనుమానం. (కారణం, ఆ time లో, వాణ్ణి phoneలో ఇబ్బంది పెట్టిన పిల్ల వల్ల కావచ్చు, guide AB వల్ల కావచ్చు, లేదూ TT మీద మక్కువ ఎక్కువ అవడం కావొచ్చు)
ఇలా yashwanthగాడు నా cricket lifeలో కీలకమైన role ఆడాడనమాట.

Next గురొచ్చేది sitting setting; ఆగండాగండి, పాపం వాడేం పుచ్చుకునేవాడు కాదు.

మా sittingలంటే ఆషామాషీ యవ్వారమమేం కాదు. Planning ఎంత perfectగా ఉండేదంటే ఆమీర్ఖాన్ cinema తీసినట్లుగా ఉండేది. మా batchలో ఎవడికి మూడొచ్చినా, 4 నిమిషాల్లో 5 calls వెళ్లేవి, 6 నిమిషాల్లో  ఇద్దరు ద్రవాహారం తేవడానికీ, ఇంకో ఇద్దరు ఘణాహారం తేవడానికి వెళ్లేవాళ్లం. నేనెప్పుడూ ఆ  ద్రవాహారం  batchలోనే ఉండేవాడిని (మరి, మా జనాలు stuff select చేసే విషయంలో నాయొక్క అభిమానులు). అంతా సర్దుకుని రమారమి 8గంట్లకి కూర్చుని మెల్లిగా మొదలుపెట్టి, ఓ మూడు మిగిల్చే లోపు, ఒకన్ని తర్వాత ఒకన్ని center చేసి celebrate చేసుకుంటూ, ఒక్కోడి performance  మాంచి peakలో ఉన్నపుడు cool drink(అనగా, Sprite )అయిపోతుంది. అప్పటికే 11 కొట్టేసుంటుంది. అంటే కొట్లు కట్టేసుంటాయని కాదు. ఎవడికీ కిందకెళ్లి(మా room 4th floorలో ఉంటుంది లెండి) తెచ్చే ఇది ఉండదు. Cool drink లేకపోతే ముందుకి కదలలేని పరిస్థితి. అందులో ఓ నలగరం cool drink లేకపోయినా waterతో "ఓ! yes" అనేవాళ్లం, కానీ మిగిలిన ఆ ఒక్కడూ cool drink లేకపొతే చాలా  కష్టపడే వాడు. కురు సభలో దుశ్శాసనుడు చీరలాగుతున్నపుడు, ద్రౌపది అదే సభలో ఓ మూలన ఉన్న తన భర్తలు ధర్మ రాజు దగ్గిర నుంచి, సహాదేవుని వరకూ ఒక్కొకరి వైపూ  చూసి కాపాడమని వేడుకుని, ఎవరూ ముందుకు రాకపోయేసరికి, చివరకి "అన్నా'"అని wireless లో శ్రీ కృష్ణుని వేడుకున్నట్లు, మేమెవరం కదలక పోయేసరికి నా mobile నా ముందు పడేసి, నా వైపు ఆర్ద్రంగా చూసేవాడు. ఇంక తప్పదనుకుని అప్పటికో గంట ముందే పడుకున్న మన yashwanth గాడికి call చేసి లేపి, వాడి చేత తెప్పించేవాళ్లం. వాడొచ్చాక వాడి కాళ్లమీద పడ్డంత పంజేసే వాళ్లం. ఓసారైతే, నేను మరుసటి రోజు ఉదయం పదింటికి మజ్జిగ packet కూడా తెప్పించుకున్నాను. అది పరాకాష్ట. Packet చేతికిచ్చాక చాలా చిరాగ్గా face పెట్టి మన yashwanth గాడన్నాడు"నువ్వింక మానాల్రా" అని .(Sceneలో sentiment ఎక్కువైందని censor చెయ్యడం జరిగింది, కానీ గ్రహించ వలసిన విషయం ఏంటంటే, extra అయ్యిందనుకున్న మొదటిసారే  వాడు నిర్మొహమాటంగా నాకా విషయం చెప్పడం).

అలా మన yashwanth గాడు, మా sitting cinema climax sceneలో శ్రీకృష్ణుని అవతారమెత్తేవాడు.

Next గుర్తొచ్చే scene మా ఊళ్లో. 2011 May 14, KGP నుంచి జైత్రయాత్ర ముగించుకుని, మా ఊళ్లో పడ్డాను. అప్పుడు మాఇంటికి తీవ్రమైన మరమత్తులు చేస్తున్నాం. Juneలో అనుకుంటా, మన yashwanth గాడు ఇడుపులపాయ IIIT లో join అయ్యాడు. నేనోరోజు ఇంటికి రమ్మని phone చేశాను. వాడు ఓ శనివారం సాయంత్రం call చేశాడు, రేపు బయల్దేరుతున్నానని. నేను మా అమ్మకి చెప్పాను రేపు వాడొస్తున్నాడని. పక్కనే ఉన్న మా పాలేరు విని, సందకాడ నాటుకోడి తెస్తాను, జొల్ల(అనగా,పెద్ద వెదురు గంప) బయట పెట్టమన్నాడు. లేదు, వాడు vegetarian అన్నా. Brahmin ఏమో అనుకుని మా అమ్మ కంగారుపడిపోయింది.(అంటే, మరి మా ఇల్లు repair లో ఉండటం మూలాన, దగ్గర్లోనే ఓ చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని(అదో పాతబడ్డ ఇల్లు) అందులో ఉంటున్నాం, అక్కడ వసతులేం సరిగాలేవ్) .మరి, సద్బ్రాహ్మనుడు  శివుడితో సమానంగదా. .ఇంతలో నేను వాడు brahmin కాదని చెప్పేసరికి కుదుట పడింది. సుబ్బరంగా పప్పు, రసం, ఇంకో కూరతో పాటూ ఓ sweet చెయ్యమన్నా. (ఇంటి)పనికొచ్చే కూలోల్లకీ, ఇంటోల్లకీ ఒకే అన్నం కుండ కాబట్టి, వాడిక్కూడా అందులోనే వండేసింది. మా పక్కూరికి బండేసుకెళ్లి మన yashwanth గాన్ని ఎక్కించుకొచ్చాను. (మా ఊరికి bus లేదనుకునేరు, అరగంటకోటుంది. కానీ వాడికి, నేను ఈత నేర్చుకున్న కుంటలూ, ఆడుకున్న బీళ్లు, రేగుపళ్లు ఏరుకున్న గుట్టలూ, గేదెల్ని తోలుకెళ్లిన బయళ్లూ చూపించొచ్చని నా plan). అలా, అవన్నీ చూపించి, మా ఇంటిముందు దింపాను. మరి మనవాడు top to bottom Reebokలో ఉన్నాడు. Laser treatment అవజేసుకుని కళ్లజోడు తీసేసి Reebok goggles పెట్టుకున్నాడు, కిందేమో Reebok shoes, మధ్యలో Reebok back pack, చేతికి fast track. ఇది వాడి అవతారం(Actualగా, నాలాంటోడు ఆగిపోయేవాడేమో, కనీ...సం ఆలోచించేవాడేమో,కానీ మన yashwanth గాడు చాలా clearగా చెప్పాడు, అవన్నీ offer లో వాళ్ల Daddy కొన్నారని.). అలా వచ్చినవాడు, fresh అవడానికి వెళ్లేసరికి పరుగుపరుగున వచ్చిన మా అమ్మ, నాకో లుంగీ, వాడికో టవల్ ఇస్తూ "బాగా సావుకార్లా ?" అని  (నన్ను)అడిగింది(లోగొంతుకలో). నేనన్నాను"మరేమనుకున్నావ్, రాజమండ్రిలో రెండిళ్లున్నాయ్, కాకినాట్లో కూడా కొన్నారు ఇంకో రెండు flatలు ".
"మరి, నీకెలా పరిచయం ?".
"నాతో Cricket ఆడేవాడులే, వాళ్లమ్మ కాకినాడ కలక్టరేట్లో పంజేస్తార"ని చెప్పా. ఇంక చూస్కో, బాపణోన్నేమిటి, బ్రహ్మ దేవున్నే చుసినట్లు feel అయ్యిందంటే నమ్మాలి. అలా భోజనమవజేసుకుని, మళ్లీ బండేసుకుని, నేను చదువుకున్న బడి, మా పొలాలు, ఊరి బయట శివాలయం అన్నీ చూపించి తీసుకొచ్చాను. అదో మరచిపోలేని రోజు. చివరగా మరమత్తులు జరుగుతున్న మా ఇంటికి తీసుకెళ్లాను. అక్కడ మా నాన్న ని పరిచయం చేసేలోపే "నమస్కారం  uncle" అనేసరికి, అక్కడ పంజేసుకుంటున్న వాళ్లకి ఏదో cinema చూస్తున్నట్లు ఉంది.మరలాంటి మర్యాదలు మేము పుస్తకాల్లో చదువుకోడమూ, cinemaల్లో చుసుకోవడమే.
సాయంత్రం మళ్లీ పక్కూరికి తీసుకెళ్లి, పులివెందుల bus ఎక్కించాను. ఇంటికొచ్చిన నాతో మా అమ్మ, ఇంటి పని పుర్తయ్యాక ఇంకోసారి తప్పకుండా రమ్మనమని చెప్పింది. మరి వాడి simplicity అటువంటిది and  మా అమ్మని మొట్టమొదటి సారి Aunty అని పిలిచినవాడు కూడా  మన yashwanth గాడే. అయితే, అసలే గోదావరి యాసకి తోడు,మన వాడి speedకి, వాడేమ్మాట్లాడు తున్నాడో మాత్రం మావాళ్లకి అర్థమవ్వలేదు, అది వేరే విషయం.
అన్నట్లుగానే, ఇళ్లు ready అయ్యాక కూడా మరోసారి మా ఇంటికొచ్చాడు మన yashwanthగాడు.
(Actualగా ఇంకా చాలా incidents ఉన్నాయ్, కానీ ఇక్కడ type చేసీ చేసీ వేళ్ల కీళ్లు నొప్పిస్తున్నాయి,కాబట్టి వాటిని గురించి ఇంకెప్పుడైనా విప్పుకుందాం)
ఇలా గుర్తొచ్చిన yashwanthగాన్ని, బాగా miss అవుతున్నానని feel అవుతూ orkutలోనుండి, వాడు examకి kerchief మీద formulae రాసుకెళ్లినపుడు తీసుకున్న photo లు downloadచేసి facebookలో మన group లో post చేశా.

మొన్న:

సాయంత్రం 4గంట్లకి meetingలో ఉన్నపుడు మన yashwanth గాడి నుంచి call వచ్చింది, cut చేశా. Meeting అయ్యాక వాడి సంగతి మర్చిపొయా. మళ్లీ రాత్రి 10:30 కి చేశాడు. అప్పటికే మన group లో comments అవీ జరుగుతూ ఉండడంతో, సరదాగా మాట్లాడాలని పించిందేమో అనుకుంటూ pick చేశా. "ఒరే banglore వస్తున్నా, bus లో ఉన్నా"అన్నాడు. సర్ప్రయిజే మరి. ఏదో interview ఉంది morning 9కి, అయ్యాక instituteకి వస్తాను అన్నాడు.

నిన్న:

అన్నట్టుగానే interview అయ్యాక కలిశాడు, కలిసి మా room కి వెళ్లి చాలా కబుర్లు చెప్పుకున్నాం. మధ్యానం భోజనం చేశాక నేను labకి వెళ్తూ rest తీసుకోమని చెప్పా. సాయంత్రం 6:30 కి వచ్చేసరికి మన yashwanthగాడు పడుకుని ఉన్నాడు. లేపి,Yashwanthpur market లో కొద్దిగా తిరిగి, snacks తిని, room కొచ్చి, మళ్లీ మరిన్ని కబుర్లు చెప్పుకుని, 9:30 కి బయల్దేరి బయట mushroom masala, Naans తిని, వర్షం లో Majestic bus ఎక్కించి(వాడికి 11 కి వేంపల్లి కి bus ఉంది) room కొచ్చాను. వర్షం పడుతూ ఉండడంతో, labకి light తీసుకుని ఆలోచించడం మొదలుపెట్టా, మూడురోజులప్పుడు వీడిగురించి ఆలోచించడమేంటి, ఓసారి కలిస్తే బావుండు అనుకోడమేంటి(పెద్ద కష్టమేం కాదు,ఉగాదికి ఇంటికొచ్చినపుడు,వాన్ని మా ఇంటికి రమ్మనొచ్చు ), sudden గా వీడే call చేసి వస్తున్నానని దిగిపోడమేంటి అనుకుంటూ, కుర్చీ మీద కూర్చుందామని, cot మీద ఉన్న దిండు లాకున్నాను. దాని వెనక నుంచీ 3 పుస్తకాలు కింద పడ్డాయ్. వాటిలో మొదటిది The secret, రెండవది The power ,మూడవది Train your brain. మధ్యాహ్నం మన yashwanth గాడు చదవడానికి shelf నుంచీ తీసిన్నట్లు ఉన్నాడనుకుని, వాటిని సర్దేసి కుర్చీ లో కూర్చునే సరికి తట్టింది sequence.

మొదటి scene, ఖలేజా లో అలీ, మహేష్ బాబుని అడుగుతాడు "The Secret" అనే పుస్తకం చదివావా అని. బాబు అప్పటికేదో comedy చేశాడుగానీ, Trivikram లాంటోడు అడిగించాడు కదా అని ఆలోచించి, cinemaఅయ్యాక చదివాడనమాట. ఆనక scene, శ్రీను వైట్ల దూకుడు లో, వెన్నెల కిషోర్ వాళ్ల బామ్మ power తెలుసుకుని అంటాడు "అవునోయ్ శాస్త్రి, కొన్నుంటాయ్, ఈ శాస్త్రాలూ - అవీ, ఉంటాయ్...!" అని.


Wednesday, November 28, 2012

ఒక particular చూపు


నాకదేంటో మాంచి peak timeలో ఉన్నపుడే, off the track వెళ్దామని అన్నీ లాగుతుంటాయ్, అంటే ఒక్కోసారి ఒక్కోటనమాట లెండి.
మచ్చుక్కి మూడొదలమంటారా,
సరే సరదాగా ముడున్నర్రేల్లు ఎనక్కెళ్తే, 2009 Feb 5, evening 5PM, అదేదో కాకినాడ మొత్తం మునిగి పోతున్నట్లు, అప్పటికప్పుడు mobileలో ఉన్న ఒక్కగానొక్క ఆడ నంబర్ కి కాల్ చేసి, అప్పటికి ఆరేళ్ల క్రితం (అంటే, రాజా బాబు పదవ తరగతి లో) interest ఉన్న ఇద్దరమ్మాయిల phone నంబర్లు అంది పుచ్చుకుని,
కాకినాడ రమణయ్య పేట లో రెండవ అంతస్తులో ఉండే మా రూం బయటకి వచ్చి, వాకాలపూడి మీదుగా ఉప్పాడ బీచ్ మీంచి వీచే గాలి పీలుస్తూ, వారసత్వంగా సీనియర్లనుంచి చదువుకోడానికని  సంక్రమించిన స్టడీ చైర్ మీద కూచుని, పిట్టగోడ మీద కాళ్లు పెట్టి, "ముందు ఎవరికి చేద్దామా ?" అని ఇస్రో వాళ్లు చంద్రయాన్ కి చేసినంత మేథో మథనం చేసి ఒక అమ్మాయ్ ని డిసైడ్ అయ్యాను.

ఈ particular పిల్ల గురించి కొంత చెప్పుకోవాలి. పాపకి పిల్లోలందరూ ఫాలోఅర్సే, పైకి చెప్పుకునేవారు కాదంతే, పిల్లతనానికే చిన్నతనం మరి. నాకైతే ఆడ పిల్లలు అందంగా కూడా ఉండగలరని(:P) ఆ ట్యూషన్ కెళ్లాకే అర్థమైంది. ఒకసారి నేర్చుకుంటే ఇక మర్చిపోలేరు, అలాంటి పాఠమా పిల్ల.
ఇంతకీ ఆ ట్యూషన్ మా పక్కూర్లో. అది మా మండల కేంద్రం. ఆ ట్యూషన్ మాష్టారు మా ఉళ్లో ఉన్న పదవ తరగతి పిల్లల ఇళ్లకొచ్చి, చేర్పించమని వాళ్ల పెద్దలని అడిగి మరీ పట్టుకెళ్తున్నాడు. అలా మా ఇంటికొచ్చినపుడు, 500 మార్కులు  (600కి) గ్యారెంటీగా తెప్పిస్తామని మా నాన్నతో చెప్పి, సరదగా Englishలో ఒక active voice sentence చెప్పి, passiveలో చెప్పమన్నారు. నేను చెప్పలేక పోయాను. అది చూసి ఆ మాష్టారు మా నాన్నకి బంపర్ ఆఫర్ ప్రకటించాడు పాస్ ఐతేనే ఫుల్ ఫీ, లేకపోతే సగమే చాలన్నాడు. అని వెళ్లిపోయాక, నన్నెప్పూడూ ఒక్క మాట కూడా అనడానికి ఇష్టపడని మా నాన్న "అది కూడా చెప్పకపొతే ఎలాగరా?" అని కొద్దిగా కోపం (బాధ?) పడ్డాడు, మరి ఆయన ఒక స్కూల్ టీచరు, పైపెచ్చు నాకు సెవంతు క్లాసులో English కూడా చెప్పాడు. మొత్తానికి నన్ను ఆ ట్యూషన్ కి వెళ్లమన్నాడు. అక్కడ నేర్చుకున్న పాఠాల్లో ఒకటి  పైన్నే మీకు ఒప్పజెప్పాను.

కొన్నాల్లకి నేను ఆ ట్యూషన్ మానేసి,వేరే స్కూల్లో చేర్తున్నానని తెలిసి ఆ ట్యూషన్ మాష్టారు , మా ఇంటికొచ్చి, మా నట్టింటికొచ్చి, నాన్నకి నచ్చజెప్పి అక్కడే ఊంచుకుందామని విశ్వ ప్రయత్నాలూ చేశి, వీలుకాక వెళ్లి పోయాడు. అది వేరే విషయం.
అయినా కానీ ఆ particular పిల్ల తో కలిసి కొన్నిcompititive examలు రాసే అవకాశం దొరకడం చేతనూ, కొన్ని ప్రయాణాలు కలిసి (వాళ్ల HM కూడా ఉన్నాడు లెండి) చేయడం చేతనూ, బాగా చదువుతానని (అప్పుడు లెండి) మా మండలమంతా (అంటే 5 హైస్కూల్లనమాట) పేరుండడంచేతనూ, పెద్ద బాధపడ లేదులెండి.
రోజులు అలా గడుస్తున్న సమయంలో, ఒకానొక ఆదివారం అల్లాంటి ఒక exam రాయడానికి పులివెందుల వెళ్లాం, మా ఇద్దరితో పాటూ నాకు బాగా ఇష్టమైన ఇంకో ఫ్రెండూ (ఆ పిల్ల వాళ్ల ఊరివాడే), వాళ్ల HM కూడా ఉన్నారు (అంట!)  నాకు వాళ్లేం కనిపించలేదు, అప్పుడప్పుడూ వినిపించే వాళ్లు అంతే. ఆరోజు ఆపిల్ల్ల అల్లుకొచ్చిన జడ చూసి ( ఒక డీప్  breath ) జిల్లుమన్నాను, కానీ మా స్కూల్ టీచర్లే ఘొల్లుమన్నారు, తాలుకాలో సెకండ్ వచ్చినాగానీ, ఒక్క మార్కులో ఫస్టు పోయిందనీ వాళ్ల ఏడుపు. నేనవేం పట్టీంచుకునే స్థితిలో లేను.
ఇంటికెళ్లిన నేను, సాయంత్రం అమ్మతో కలిసి గేదెలకి గడ్డికోసుకు రావడానికి వెళ్లాను. నల్లరేగడి చేలల్లో మట్టినిచూసి, దీన్ని మంచి నూనెతొ తడిపి, అమ్మ చపాతికి గోధుమ పిండిని కలిపినట్లు కలిపి సాగదీసి, లేపాక్షి నుంచి కళాకారుల్ని రప్పించి (లక్షINR అయినా), దానిమీద కురుల పాయలు చిత్రించినా ఆపిల్ల జడకి సాటి రాదని డిసైడ్ అయ్యాను. అంతలో ఆగెట్టు నుంచి అమ్మ పిలిస్తే,కాదు కాదు అరిస్తే, కోసిన గడ్డి సందిట్లో ఎత్తుకుని పరుగెత్తుంటూ వెళ్లాను. ఎంత గడ్డి కోసినా మొత్తం తనే ఎత్తుకొచ్చేది ఇంటిదాకా, నన్ను అస్సలు మోయనిచ్చేదికాదు అమ్మ. కానీ, దార్లో వచ్చేటపుడు ఊపుకుంటా రావడం నాకు నచ్చక, ఆపై వారం అమ్మతో వాదించైనా ఒక సందెడు మోసుకొద్దామని అనుకున్నా. కానీ ఆపై వారమ్ నుంచీ అటువైపెళ్లడమే మానేశాను, పబ్లిక్ పరీక్షల్లో మండలం ఫస్టు రావాలని, ఆదివారంకూడా extraగా లెక్కలు చెప్పించేవాడు మా శ్రీనివాస రెడ్డి (మా కరెస్పాండెంట్ లెండి).

ఇంతలో వచ్చిన SMS సౌండ్ కి, మా ఊళ్లో ఉన్న నేను కాకినాట్లో మేల్కొన్నాను. ఒక చిరునవ్వుకుని, ఆ particular పిల్లకి కాల్ చేశాను. మోగుతోంది. కొన్ని క్షణాల్లో ఆ routine ట్రింగ్ ట్రింగ్ కి బదులు మెత్తని మెలోడి వింటానని ఉర్రూతలూగిపోతున్నాను.
ఇంతలో "హలో", ఆ particular పిల్లే
"Hi, ఎలా ఉన్నావ్?", అదేదో నా కాల్ కోసం ఎదురుచూస్తున్నట్లు.
"ఎవరు?"
"<నా పేరు> ని"
"ఆ..,ఎవరు?" , పావు ప్రాణం పైకెళ్లి పోయింది.
పిట్టగోడ మీది కాళ్లు కిందకి దిగినయ్, చైర్లోని వీపు విశ్రాం నుచి సావధన్ లోకి వచ్చింది.
"నేను,<మల్లి  నాపేరు>ని,టెంత్ క్లాస్, ట్యూషన్,....."ఇలా చెప్పుకుంటూ ఒక 2 నిముషాలు నన్ను నేను బ్రతికించు కునే ప్రయత్నం చేశాక కూడా గుర్తురాలేదు, నిముషానికి పావు చొప్పున మొత్తం ముప్పావు ప్రాణం పోయింది(తీసేసింది). అయినా సరే, until my last blood drop goes blue అనుకుంటూ టెంత్ క్లాస్లో ఎవరూ touchలో లేరా అని అడిగా.
"ఆ, <ఒక పేరు>ఒక్కడితోనే అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉంటా"నంది.
ఆ ఒక్కణ్ణి నాకు bold, italicలో వినిపించి, మొత్తం ముగించేసింది (మిగిలిన పావు ప్రాణం).
సర్లే ఇంకెప్పుడైనా చేస్తానని చెప్పి cut చేసి, నా గర్వము సర్వమూ ఖర్వము అయినందుకు బాధపడి, ఆ ఒక్కణ్ణి తలచుకున్నాను. వాడెవరనుకున్నారూ, మాతో పాటూ ఆ exams రాయడానికొచ్చిన వాళ్ల స్కూల్ టాపర్. (వీడెవడోగాదు, విష్ణు భక్తుడే, విజయుడే అన్నట్లు). మంచోడు, మనలాగ్గాదు. వాళ్లూరెల్లినపుడు వాళ్లింటికి కూడా వెళ్తూంటాను (అతనొక Doctor ఇపుడు), కానీ ఎప్పుడూ ఆ particular పిల్ల ప్రస్తావన మాత్రం తేలేదు, పూర్తిగ చచ్చేక ఇంకా suicide ఎందుకని.

ఇంతలో మెట్లమీంచి "అయ్యకి తెలియకుండ అమ్మా అనిపిస్తవా, వస్తవా, వస్తవా"  అనుకుంటూ పైకొచ్చాడు, మా రూమ్మేట్ (మా వాడు విక్రమార్కుడు, అనుకుంటున్నారా, అదేంగాదు ఆ cinema ని 5సార్లు చూశాడు anand complexలో). "ఏంట్రా exam దగ్గరికొచ్చేసరికి భయం పెరిగిందా ఏంటి? face లో ప్రేతకళ తాండవిస్తొంది" అని అడిగాడు.
"మరి చచ్చిపొతే అంతే కదరా" అన్నాను మొహం మాసిపొయి ఉన్న నేను.
చేతిలో ఫోనూ, మొఖంలో బాధ, నోట్లో ఇలాంటి పదాలూ  చూసి, ఊర్లో ఎవరో ఉష్ ఫటాక్ అనుకుని "ఏమైందిరా?" అని మెల్లిగా అడిగాడు మావాడు. ఆ యొక్క telephone episode మొత్తం telecast చేశాక, "థూ, నువ్వూ నీ కామం, మూర్రోజుల్లో (Feb 8) GATE పరీక్ష పెట్టుకుని, ఏంట్రా నీ కుప్పిగంతులు? కరువు నా ....." (తర్వాత వినిపించలేదు), అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్లి పొయాడు. నామీద నాకే చిరాకేసి వెళ్లి, ACE material ముందు కుర్చున్నాను.మొహం తుడుచుకుంటూ బయటికొచ్చిన మావాడు, "నిజంగానే గుర్తు పట్టలేదంటావొరే ఆ పిల్ల??" అని అన్నాడు. "ఏమో లేరా ఇంకా అదెందుకు, ఉంకో నంబర్ ఉంది దానికి చేద్దామేంటి?" అని వాడి వైపు చూశాను.
నవ్వాలో ఏడవాలో తెలీక వాడు నన్ను చూసిన ఒక particular చూపు ఉంది చూశారూ,అదే ఈ post కి title అనమాట. ఆయ్ ఉంటానండి, మిగిలిన అరెండూ ఇంకెప్పుడైన చెప్పుకుందాం.

Friday, February 24, 2012

ఓ మిట్టమధ్యాహ్నపు మైమరపు....!




ప్రదేశము: PDC ప్రయోగశాల (అనియే ఙ్ఞాపకమున్నది, కానియెడల మాకు తెలుపుటకు, మమ్మానందింపుటకు(ఇచ్చట   మేము సిగ్గువడితిమి, మీరు నవ్వుతుండిరని మా మధురోహ) బిడియము వలదని మనవి).

సమయము: క్రీ.శ. 2005-09 మధ్య ఓ మాఘమాసానంతరం, మండు వేసవిలో ఓ మంగళవారం( పై మనవిని ఇక్కడకూడా మన్నింపగలరు )


విషయం, విశేషం: కళాశాల వారికి ఆ యొక్క గణనయంత్రముల మీదుండెడి కనికరమైననూ మా మీదుండెడిదిగాదు, మేమా ఎండలకి అటులనే మాడుచుంటుమి. కోవెలయందలి మూర్తిని పూజారులు వింజామరలతో సేవించినట్లు, అ నిర్జీవ రాశులకు చలువమరలతో సేదతీర్చెడి వారు. అవియిన్ను ఆ పెరుమాళ్లకు మల్లే; వారానికో మారు అర్చించినా, అఖరకు విధి పేర వంచించెడివి.
అట్టి ఓ మిట్ట మధ్యాహ్న సమమున, చేయడమేమో తెలియక, పరిశీలనా పుస్తకము పట్టుకుని కొట్టుమిట్టాడుచుండ......
హిమాలయాన ప్రవరాఖ్యుని పలుకరించిన వింత పరిమళమోలె,
ప్రేమపాటల పల్లవులన్నీ పనిగట్టుకొని మరీ మమ్ములను పలుకరించగా,
మేము పరవశ ప్రపంచమున ప్రవేశించబోతూ.....ఉన్నాము.
అంతట ఓ దుష్ట మానవుడు (ఆతనిని ఆంగ్లమున friend అందురు, హతవిధీ!) ఒకింత విసుగుతో(అది వాని ఏడ్పు వలన సంభవించెనని మా ఘట్టి విశ్వాసము), మీరెందులకో మము పిలుచు చున్నారని మాకందించెను. అది మేమురగమనా? ఆ మూర్ఖుడి మూఢత్వముగాక. పోనిమ్ము, ఆతని మస్తిష్కమున ప్రణయ ప్రదేశము బహు పల్లముగాబోలని పరిత్యజింతిమి. జింతి, మేము మళ్లీ ఆ ప్రపంచ ప్రవేశద్వారమున చొరబడుటకు సకల యత్నములు సలుపుచుంటిమి.
మెదలని మమ్ము, ఈమారు వాడు మరింత ఆవేశముతోడ, చేయిపట్టి కుదిపెను. అతగాణ్ణి అలరించుట అంతటితో ఆపి, "ఏమని" విసిగితిమి. వాడు, విలయ కాలపు వయోలిన్ వలే వెర్రి నవ్వోటి నాపై రువ్వి,అధ్యాపకురాలి వైపు దారిచూపెను. అప్పుడర్థమాయెను మాకసలు సన్నివేశము. పిలిచినదెవరో, పలకనిదెవరో. ఆ సమయమున ఆ ప్రాంగణమంతయూ యమలోకము వలే, త్రోవజూపిన ఆనా మిత్రుడు యమునిముందుకి తోసిన చిత్రగుప్తులవారి వలే తోచెను. ఆ పాలరాతి గచ్చుపై వణుకుచున్న మదీయ స్వరుపము, అంకాళమ్మ చుట్టు ప్రదక్షిణలు సమర్పించు మేకపొతునే స్ఫురింపజేసెను. దానికితోడు, క్రితము దినము ఆమె ఫెట్టిన పరీక్ష ఎగ్గొటితిమని ఙ్ఞప్తికి వచ్చి చచ్చెను. ఆమెకి మాత్రము రావలదని ఇష్తదైవము రాముల వారిని వేడితిమి. ఆయన కష్టము తప్పదనెను.అంతేనా యంటిమి(ఇంకేం కావలని అడుగుతారని)."కాక, మీ కేశసంపదపై మాకేమాత్రము వ్యామోహము లేద"నెను, నిర్దక్షిణ్యముగా. అని, ఆమె చేత అదియే అడిగించెను.
తడుముకొనుట మాకవమానముగాన, టక్కున ఉత్తరమిచ్చితిమి "చదువని కారణాన, పరీక్షకి హాజరు కాలేకపోతిమని". అందులకామె కళ్లు కాసారములవలే విచ్చుకొన, "ఇప్పుడిటుల కూడా సమాధానములు(సాకులని కాబోలు) చెప్పుచుండిరా" యనెను. "కాక, ఇంకనూ అనారోగ్యమనియో, ఊరేగితిమనియో, అని చెప్పెదమనుకొంటిరా" అనుకుని మా సృజనని మేమే మెచ్చుకొంటిమి.అంత ఇంకొక అధ్యాపకుడు వచ్చి పిలువగా,చెరనుండి నన్ను విముక్తుని గావించి, ఆమె ఆతనితో చనెను(బహుశా, మేయుటకని మేమనుకుంటిమి). మేము విజయగర్వాన, సహాధ్యాయీల (అసూయతో అలంకరింపబడిన)చిరునవ్వుల నడుమ మా మేజా చేరితిమి. విజయొత్సవాలు సలిపితిమి.


మీకు మాత్రమే(ఆంతరంగికులైననూ, అనుంగులైననూ వారి సమక్షమున మీరిది చదువుట మాకసమ్మతము): కానీ, మునుపటి మా మైమరపుకి కారణమైన మీ చుర చూపు మాత్రము, మా కళ్లను చీల్చుకుని, మనసును చేరి, మధుర ఙ్ఞాపకమై నిలిచెను. అప్పుడప్పుడు మా మనోఫలకమందు ప్రదర్శింపబడు ఈ చిత్రరాజమును మీకీదినము మిక్కిలి మక్కువతో ప్రదర్శించితిమి. మ్మిమ్ములను మీరు కాంతురని.