Friday, February 24, 2012

ఓ మిట్టమధ్యాహ్నపు మైమరపు....!




ప్రదేశము: PDC ప్రయోగశాల (అనియే ఙ్ఞాపకమున్నది, కానియెడల మాకు తెలుపుటకు, మమ్మానందింపుటకు(ఇచ్చట   మేము సిగ్గువడితిమి, మీరు నవ్వుతుండిరని మా మధురోహ) బిడియము వలదని మనవి).

సమయము: క్రీ.శ. 2005-09 మధ్య ఓ మాఘమాసానంతరం, మండు వేసవిలో ఓ మంగళవారం( పై మనవిని ఇక్కడకూడా మన్నింపగలరు )


విషయం, విశేషం: కళాశాల వారికి ఆ యొక్క గణనయంత్రముల మీదుండెడి కనికరమైననూ మా మీదుండెడిదిగాదు, మేమా ఎండలకి అటులనే మాడుచుంటుమి. కోవెలయందలి మూర్తిని పూజారులు వింజామరలతో సేవించినట్లు, అ నిర్జీవ రాశులకు చలువమరలతో సేదతీర్చెడి వారు. అవియిన్ను ఆ పెరుమాళ్లకు మల్లే; వారానికో మారు అర్చించినా, అఖరకు విధి పేర వంచించెడివి.
అట్టి ఓ మిట్ట మధ్యాహ్న సమమున, చేయడమేమో తెలియక, పరిశీలనా పుస్తకము పట్టుకుని కొట్టుమిట్టాడుచుండ......
హిమాలయాన ప్రవరాఖ్యుని పలుకరించిన వింత పరిమళమోలె,
ప్రేమపాటల పల్లవులన్నీ పనిగట్టుకొని మరీ మమ్ములను పలుకరించగా,
మేము పరవశ ప్రపంచమున ప్రవేశించబోతూ.....ఉన్నాము.
అంతట ఓ దుష్ట మానవుడు (ఆతనిని ఆంగ్లమున friend అందురు, హతవిధీ!) ఒకింత విసుగుతో(అది వాని ఏడ్పు వలన సంభవించెనని మా ఘట్టి విశ్వాసము), మీరెందులకో మము పిలుచు చున్నారని మాకందించెను. అది మేమురగమనా? ఆ మూర్ఖుడి మూఢత్వముగాక. పోనిమ్ము, ఆతని మస్తిష్కమున ప్రణయ ప్రదేశము బహు పల్లముగాబోలని పరిత్యజింతిమి. జింతి, మేము మళ్లీ ఆ ప్రపంచ ప్రవేశద్వారమున చొరబడుటకు సకల యత్నములు సలుపుచుంటిమి.
మెదలని మమ్ము, ఈమారు వాడు మరింత ఆవేశముతోడ, చేయిపట్టి కుదిపెను. అతగాణ్ణి అలరించుట అంతటితో ఆపి, "ఏమని" విసిగితిమి. వాడు, విలయ కాలపు వయోలిన్ వలే వెర్రి నవ్వోటి నాపై రువ్వి,అధ్యాపకురాలి వైపు దారిచూపెను. అప్పుడర్థమాయెను మాకసలు సన్నివేశము. పిలిచినదెవరో, పలకనిదెవరో. ఆ సమయమున ఆ ప్రాంగణమంతయూ యమలోకము వలే, త్రోవజూపిన ఆనా మిత్రుడు యమునిముందుకి తోసిన చిత్రగుప్తులవారి వలే తోచెను. ఆ పాలరాతి గచ్చుపై వణుకుచున్న మదీయ స్వరుపము, అంకాళమ్మ చుట్టు ప్రదక్షిణలు సమర్పించు మేకపొతునే స్ఫురింపజేసెను. దానికితోడు, క్రితము దినము ఆమె ఫెట్టిన పరీక్ష ఎగ్గొటితిమని ఙ్ఞప్తికి వచ్చి చచ్చెను. ఆమెకి మాత్రము రావలదని ఇష్తదైవము రాముల వారిని వేడితిమి. ఆయన కష్టము తప్పదనెను.అంతేనా యంటిమి(ఇంకేం కావలని అడుగుతారని)."కాక, మీ కేశసంపదపై మాకేమాత్రము వ్యామోహము లేద"నెను, నిర్దక్షిణ్యముగా. అని, ఆమె చేత అదియే అడిగించెను.
తడుముకొనుట మాకవమానముగాన, టక్కున ఉత్తరమిచ్చితిమి "చదువని కారణాన, పరీక్షకి హాజరు కాలేకపోతిమని". అందులకామె కళ్లు కాసారములవలే విచ్చుకొన, "ఇప్పుడిటుల కూడా సమాధానములు(సాకులని కాబోలు) చెప్పుచుండిరా" యనెను. "కాక, ఇంకనూ అనారోగ్యమనియో, ఊరేగితిమనియో, అని చెప్పెదమనుకొంటిరా" అనుకుని మా సృజనని మేమే మెచ్చుకొంటిమి.అంత ఇంకొక అధ్యాపకుడు వచ్చి పిలువగా,చెరనుండి నన్ను విముక్తుని గావించి, ఆమె ఆతనితో చనెను(బహుశా, మేయుటకని మేమనుకుంటిమి). మేము విజయగర్వాన, సహాధ్యాయీల (అసూయతో అలంకరింపబడిన)చిరునవ్వుల నడుమ మా మేజా చేరితిమి. విజయొత్సవాలు సలిపితిమి.


మీకు మాత్రమే(ఆంతరంగికులైననూ, అనుంగులైననూ వారి సమక్షమున మీరిది చదువుట మాకసమ్మతము): కానీ, మునుపటి మా మైమరపుకి కారణమైన మీ చుర చూపు మాత్రము, మా కళ్లను చీల్చుకుని, మనసును చేరి, మధుర ఙ్ఞాపకమై నిలిచెను. అప్పుడప్పుడు మా మనోఫలకమందు ప్రదర్శింపబడు ఈ చిత్రరాజమును మీకీదినము మిక్కిలి మక్కువతో ప్రదర్శించితిమి. మ్మిమ్ములను మీరు కాంతురని.

2 comments:

  1. ప్రదేశము: PDC ప్రయోగశాల;
    పరిశీలనల పుస్తకము = observations book;

    ReplyDelete