Showing posts with label గురిజాల. Show all posts
Showing posts with label గురిజాల. Show all posts

Tuesday, December 3, 2019

Best scrap

"మనలోని వెధవని వెలికితీసి చూపించేవాళ్లే మన best friends" అని ఒక పెద్దాయన ఎపుడో చెబితే విన్నట్టు గుర్తు. ఆ వెధవని మనకే చూపిస్తారనుకున్నా, కాని, బయటి ప్రపంచానికని తెలీలేదు. Thanks to some of my scrap friends, నాకు బాగా కావాల్సినవారి ముందు (మరి వారేగా మన ప్రపంచం) బాగా embarrass అయిన సందర్భాలు కొన్నున్నాయి. అందులో కొన్ని comedyగా ఉన్నవి చెప్పుకుందాం.

సన్నివేశం-1

ఆ మధ్య PhD రోజుల్లో, ఏదోపని మీద బెంగుళూరొచ్చిన మా అన్న నన్ను కలిసి, ఒక రాత్రి IIScలో నాతో ఉండి పొద్దున్న ఇంటికి వెళ్లేలా plan చేసుకున్నాడు. అందరు తెలుగు యువకుల్లాగే, రాత్రి భోజనానికి దగ్గర్లోని మంచి బిర్యానీ దొరికే restaurantకి వెళదామని KKకి call చేసి రమ్మన్నా, మా home restaurant Akshaya Deluxeకి వెళదామని. బండేసుకుని వచ్చాడు. ముగ్గురం కలిసి, BEL roadలో traffic వాళ్ళకి కట్టిన చలానాలు బాగా గుర్తుండటం వల్ల, మత్తికేరే సందుల్లోంచి వెళ్ళాం, అదో సరదా.

అందరూ, ఆ వయసులో chic magnet అవ్వాలనుకుంటారు, అదేంటో నేను cop magnet అయ్యా. బెంగుళూరులో bike trip వెళ్లిన 90+% సమయాల్లో నేను నడిపిన బండిని traffic cops ఆపారు, (కనీసం) అన్ని వందలూ వదిలాయి, అంత కన్నడ practice కూడా అయింది. 5-6 bikes కలిసి వెళ్లినా, అందరూ తప్పించుకున్నా, నాకు మాత్రం hi చెప్పితీరే వాళ్లు మామలు.  అన్ని సరిగ్గా ఉన్న సందర్భాల్లో కూడా, insurance expire  అయిందని కొన్నిసార్లు,  అది కూడా సరిగ్గా ఉన్నపుడు, bike history check చేసి ఇంతకు ముందు మన వెధవలు చేసిన signal jumpsకి నాతో కట్టించుకునే వాళ్ళు fine. తిరుపతి దేవుడిలాగా  క్రితం జన్మలో ఏ cop దగ్గరో, అప్పుచేసి ఏదో ఘనకార్యం చేసినట్లున్నా, దాని వడ్డీ ఇప్పుకూడా కట్టించుకుంటున్నారు. అలా నేను మా జనాల్లో notorious అయ్యా, cop magnet లాగా.


Akshayaకి reach అయ్యి, ఎముకలు ఉండే బిర్యానీ, లేని బిర్యానీ, మిరియం chicken order చేసి కూచున్నాం. ఇంతలో మనవాడు KK మొదలు పెట్టాడు. మా అన్న doctor అని తెలిసి ఆ directionలో సంభాషణ మొదలుపెట్టడం మంచిదే, ఒక విధం. కానీ, మన వాడికి వాళ్ల నియోజక వర్గం doctor గారి అక్రమాలు, దారుణాలు పూనాయో ఏమో కానీ, ఇవాళ్టి సమాజంలో doctors చేస్తున్న మోసాలు, medical expenses మధ్య తరగతి సమాజంపై గుదిబండలా మారిన తీరు గట్రా మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడికి, మా అన్నే వెనకుండి అంతా నడిపిస్తున్నట్లు.  Hospital chains తో (నిస్సహాయ స్థితిలో కూడా కావొచ్చు) doctors కుమ్మక్కై జనాలని ఎలా ఇబ్బందికి గురిచేస్తున్నారో ఒక అర్ణబ్ గోస్వామి rangeలో దేశసేవ చేస్తున్నవాడిలా  feel అయ్యి వివరిస్తున్నాడు ఆయనకే.

"ఏందిరా అయ్యా ఇది, మొదటిసారి lifeలో కలవడం ఆయన్ని; మొదటి మాటలు  గొప్ప encouragingగా, memorableగా లేకపోయినా పర్లేదు, కానీ, పనిలేని TV channel వాళ్ళు పిలిచి చేసే పనికిమాలిన interviewకి ఏమాత్రం తీసిపోకుండా ఉందేంది సామి నీ పనితీరు" అని నేను  భయపడుతున్నా. అయినా, మన వాడు మెదడు ఇందాక వచ్చేప్పుడు labలోనే పెట్టివచ్చినట్లు  రెచ్చిపోతున్నాడు ferformanceతో. ఆపుదామని conversation divert చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తున్నాడు. అక్కడికి మా అన్నేదో ఇటీవలే అక్రమమేదో చేసి పట్టుబడినట్లు class పీకుతున్నాడు. Food వచ్చినా, నేను గిచ్చినా, వినే స్థితిలో లేడు. అసలు మేము కలిసేదే సంవత్సరానికి ఏ 3-4 సార్లో (PhD మరియు medicine పుణ్యమా అని). అలాంటిది, plan చేస్కోకుండా కుదిరింది కదాని కలవడానికి వస్తే, ఇదీ నా ద్వారా  ఆయన పొందిన welcome.

అప్పుడప్పుడే PG గట్రా అవజేస్కొని, "హమ్మయ్య! ఇప్పటికి కొంచెం free అయ్యాం" అనుకుంటూ పాపం మాములు సమాజంలోకి వస్తున్న time ఆయనకి. మనదేముంది భయ్యా, EAMCET రాస్తే చాలు Engineer అయిపోయినట్లే, అన్ని కాలేజీలు, సీట్లు, reimbursements. మధ్య తరగతిలో పుట్టి, Open categoryలో government medical seat సంపాదించి, doctor అవ్వాలంటే ఎంత కష్టమో ఎలా మరిచిపోయాడో మన scrap మచ్చా అని ఆలోచిస్తున్నా. అవునులే, 21 ఏళ్లకే డిగ్రీ తెచ్చుకొని, ఏ branchలో BTech చేసినా వచ్చే 30వేల software ఉద్యోగం ఒకటి తెచ్చుకుని, హైదరాబాద్, బెంగుళూరుల్లో ఆఫీసుల్లో కూచుని FBలో pics upload చేస్కుంటూ మర్చిపోయామేమోలే అనుకుంటున్నా. వెనక పుట్టిన పిల్ల బచ్చాగాళ్లందరూ engineering చేసి ఉద్యోగాలు చేస్తూ, పండగలకి ఇంటికొచ్చినపుడు పల్లెల్లో touch screen phonesతో హడావుడి చేస్తున్నా, పాపం ఆరేళ్ళ డిగ్రీ అవజేసుకుని, దానివల్ల గొప్ప పని (surgery), సంపాదన కుదరదని, కోటి రూపాయలు పోసి private PG seat కొనలేక, సమాజాన్ని, కుటుంబాన్ని, వెలివేసి, హైదరాబాద్ పద్మారావు నగర్లో తలుపులేసుకుని, entranceకి prepare అయ్యి seat కొట్టి, మూడేళ్ళకి ఆ torture కూడా అవజేసుకొని ఇంకో సంవత్సరం rural service పేర మళ్ళీ సమాజానికే almost free సేవ చేయడానికి రెడీ అవుతున్న అయన మనల్ని చూడటానికి వచ్చి, బిర్యానీ ఒకటి పెట్టించరా అంటే, నేనేమో మాంచి scrapని serve చేస్తున్నానా, ఛీ దీనమ్మ జీవితం! అనుకుంటున్నా. అబ్బే, మచ్చా ఇవేమి పట్టించునే స్థితిలో లేడు. అదేదో అమ్మాయి ముందర impression కోసం కష్టపడుతున్నట్లు లేని జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ పరువు తీస్తున్నాడు. తీరా చూస్తే, ఆ మధ్య health center కెళ్లడానికి G బద్ధకం వల్ల, 'మచ్చా మీ అన్నని అడిగి prescription కనుక్కో మచ్చా' అన్నపుడు మాత్రం ఈ so called doctors చేసే అక్రమాలు గుర్తురావు. ఇలా చెప్పుకుంటూ పోతే మచ్చా చేసిన చిల్లర చాలానే ఉంది, but point అర్థమైంది కదా!

సన్నివేశం-2

ఇంకొన్నాళ్ళకి, PhD చివరి రోజుల్లో, సరదాగా friendsని తీస్కుని ఇంటికి వెళ్దాం, సీమ చూపిద్దాం అనిపించి, దగ్గరే (200 Kms) కాబట్టి,  one dayకి zoom car ఒకటి book చేసి రచ్చ చేద్దాం అని decide అయ్యాం. అప్పటికి మా gangలో ఒక pro driver (BBT), ఒక amateur driver (Mehi), ఇంకో trainee driver (Shan), మరియు నేనూ ఉన్నాం.  ఒకానొక ఆదివారం అంతా సిద్ధం చేసుకొని, అనంతపురం మీదుగా వెళ్లాలని పొద్దున్నే start అయ్యాం. ఎందుకంటే, అప్పటికి అనంతపురం General Hospitalలో పనిచేస్తున్న మా అన్నని కూడా ఎక్కించుకొని, అందరం కలిసి మధ్యాహ్నం భోజనం timeకి మాఊరెళ్ళొచ్చని. హమ్మయ్యా, ఈసారి మన KK మచ్చా లేడులే అని కంగారులేకుండా వెళ్తున్నాం. అంతా బానే ఉంది, highwayలో lightగా మబ్బుకప్పిన environmentలో memorable trip సాగుతోంది. Pro-driver, amateur-driver ఎక్కువగా నడుపుతున్నారు, కొద్దిగా attitude ఉన్న trainee driver (shan) just కాసేపు నడిపి నాతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. మిగిలిన drivers rideని enjoy చేస్తున్నారు. ఇంతలో అనంతపురం వచ్చాం. అప్పుడేదో flyover construction జరుగుతోంది, రోడ్డుమీద traffic గట్టిగా ఉంది, ఇలాంటి conditionsలో practice చేస్తేనే improve అవుతాం అని Mehi కొంచెం risk ఉన్నా తానే drive చేస్తున్నాడు. పెద్దవాడు కాబట్టి, సాహసం కంటే consequence గుర్తొచ్చి BBT కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ, మేమందరం Mehiని support చేస్తూంటే కాదనలేక uncomfortableగానే ఒప్పుకున్నాడు. ఎటువంటి incidents జరగకుండానే hospital చేరుకున్నాం. Parkingలో car పెట్టి, మా అన్న luggage carలో నింపుకున్నాం. అంతా అయ్యాక, driver seat లో ఉన్న Mehi దగ్గరికొచ్చి BBT "ఇంక లే మచ్చా, నేను తీస్తా car" అని అడిగాడు. "లేదులే మచ్చా, నేనే continue చేస్తా బానే తీస్తున్నా కదా!' అన్నాడు Mehi. car parking నుంచి reverse చేస్తే guide చేయాలని అందరం బయట ఉన్నాం, ఇదంతా చూస్తూ. అక్కడ మొదలైంది రచ్చ. "కొత్త బిచ్చగాడు పొద్దెరగడ"నే చందాన driver seatలో settle అయిన Mehi excitedగా drive చేయాలనీ,  "ఇందాక cityలో driveచేయనివ్వడమే చాలా ఎక్కువ నీకు" అన్న ఉద్దేశంలో BBT, ఒకరంటే ఒకరు నేనే drive చేస్తా అని గొడవ start చేసారు. చిన్నపిల్లలు కొట్టుకున్నట్లు seriousగా పోట్లాడుకుంటున్నారు మాటలతో. బయటున్న trainee driver shan "come on Mehi, తగ్గొద్దు అస్సల!" అని serious గా encourage చేసి, కామెడీగా నా వైపు చూస్తూ, "సమ్మగుందా?' అని నాలుక బయటపెట్టి తల అడ్డంగా ఊపుతున్నాడు, silent గా నవ్వుతూ.

చూస్తుండగానే వాతావరణం వేడెక్కింది. ఇద్దరి దగ్గరికెళ్లి, వీలైనంత మెల్లిగా సర్ది చెప్పడానికి try చేశా. పిచ్చ light తీసుకున్నారు ఇద్దరు నన్ను. "అంతా చూస్తున్న అన్న ముందర Already  వీళ్ల పిల్లతనం వల్ల మన పరువు పోయింది, ఇప్పుడు సర్దిచెబుదాం అని వెళ్లి విఫలమై ఇంకా అయ్యాం" అని బాధ పడటం తప్ప అక్కడ నేను చేయగలిగేదేం లేదని అర్థమైంది. వీళ్ళు మాత్రం రచ్చ ఆపడం లేదు, ఉన్న పరువునైనా కాపాడుకోవాలంటే ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నా, shan మాత్రం encourage చేస్తూ ఇద్దరినీ ఎగదోస్తున్నాడు. ఇంతలో driver door దగ్గరున్న BBT carకి ఉన్న keys లాక్కొని Mehiని దిగమంటున్నాడు. "నువ్వు keys తీసుకుంటే మాత్రం నేను దిగుతాననుకున్నావా, పిచ్చ light, తీస్తే నేనే తియ్యాలి, లేకుంటే నువ్వు  keysతో, నేను steeringతో ఆడుకోవాల్సిందే" అంటున్నాడు Mehi. "ఓర్నీ పాసుకూలా, ఇదేం బేరం రా నాయనా! మిమ్మల్ని బెంగుళూరు నుంచి తెచ్చిమరీ మా సీమలో వెధవని అవుతున్నా" అనుకుంటూ ఓసారి మా అన్న వైపు చూసా, ఏ భావాలూ లేకుండా blank గా ఉన్నాడు, "మీరే తేల్చుకోండి" అన్నట్లు.  అప్పుడే, లోపల parkingలో ఉన్న car తీసుకోడానికి senior doctor ఒకాయన ఈ sceneని చీల్చుకుంటూ వెళ్తూ మా అన్నకి Hi చెప్పాడు. మిగిలిన వాళ్ళమెవరం అది పట్టించుకునే స్థితిలో లేము, అయన car బయటికి వెళ్ళడానికి మా car అడ్డంగా ఉంది, so మాదాకా వచ్చి wait చేస్తున్నాడు, తీస్తామని. మనవాళ్ళు coolగా "ఇంకా చర్చలు కొలిక్కిరాలేదు, నీ ఖర్మ, చావు అలాగే!" అన్నట్లు వదిలేసారు ఆయన్ని. ఇప్పటి వరకూ నన్నే ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మా అన్నని కూడా పెడుతున్నారు.  "ఏంది మచ్చా, ఇప్పుడేం చేయాలి?" అని shanని అడిగితే, "మనకున్న best chance Mehiనే" అన్నాడు. So, fastగా Mehi దగ్గరికెళ్లి, "మచ్చా, తప్పదు, పరిస్థితిని అర్థం చేస్కో"  అనంగానే, చాలా చిరాగ్గా driver seat లోంచి లేచి, fastగా వెనక్కెళ్ళి కూచున్నాడు పాపం. నా ఆరేళ్ళ పరిచయంలో, తనని అంత చిరాగ్గా నేనెప్పుడూ చూడలేదు. Sittingలో 9:45PMకి ఉన్నసరుకు సరిపోక ఇంకా తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు వద్దని ఆపినప్పుడు కూడా, ఉన్నదాన్నే మెల్లిగా తీసుకుందాంలే అనుకున్నాడు గానీ, ఇంత చిరాకు పడలేదు పాపం. మొత్తానికి, BBT car reverse చేసి ఆ doctorని పంపించాడు. అందరం car ఎక్కి కూచున్నాక మా ఊరికి ప్రయాణమయ్యాం. అన్న "దున్నపోతుల్లా ఎదిగినా పిల్ల చేష్టలు పోలేదు, ఎదవలకి" అనుకుంటున్నాడేమో అనుకుంటూ నేను BBTని guide చేస్తున్నా. ముందే మా అన్నముందు ఏమీ censor చేయాల్సిన అవసరంలేదని తెలుసుకున్న shan, ఇందాకటి గొడవ గురించి ఇద్దర్ని దొబ్బడం మొదలుపెట్టి sadistic pleasureని enjoy చేస్తున్నాడు. కాసేపటికి city దాటాక BBT car ఆపి, Mehi ని drive చేయమనేసరికి "హమ్మయ్యా, ఇద్దరి మొహాలు చూడలేకపోయాం, పోన్లే ఇప్పటికైనా రాజీ పడ్డార"ని ఉపిరిపీల్చుకున్నాం. వెనకాల చేరిన BBT, మగవాళ్ల సమస్యలైన prostate cancer గురించి చర్చించడం మొదలుపెట్టేసరికి, "నీకవసరమేలే మచ్చా" అని చురకేశాడు shan.

అరగంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకొని, చికెన్, మటన్, సంగటి, పూరీ, పులావ్ అన్నీ దొబ్బితిని, మాడీ (మేడ) పైకెళ్లి, పుచ్చకాయలు తినేసి, వెంటనే పక్కేసాం. అలసిపోయి ఉన్నాడేమో BBT తొందరగానే నిద్రపోయాడు. ఇంతలో మా family friend ఒకాయన వచ్చి, "పొలాల్లో కుంటలు అన్నీ నిండుగా, కళ కళ లాడుతున్నాయి, ఈత కొడతారా?"అని అడిగేసరికి, మాకు sugar ఆగలేదు. మరి BBT చూస్తే నిద్రపోతున్నాడు, ఇప్పుడెలా అని ఆలోచిస్తుండగా, return ప్రయాణం ఆరోజు రాత్రికే కాబట్టి, ఒక active driver అవసరం అనుకొని, ఆయన rest తీస్కోడమే మంచిదని, పైగా, BBTకి ఈత రాదని మాకు ఇదివరకే తెలుసు కాబట్టి, మేము మాత్రమే పొలాల్లోకి వెళ్లిపోయాం మా అన్నతో కలిసి. అరగంట తర్వాత మా family friend bike మీదనుంచి BBT ఆవేశంగా దిగుతూ కనిపించే సరికి, సర్లే చూద్దామని వచ్చాడేమో అనుకున్నాం. మగ సూర్యకాంతంలాగా మీదపడి మాటలతో కరిచేస్తున్నాడు. "ఏంది మచ్చా, నన్ను పడుకోబెట్టి మీరు మాత్రమే ఇలా enjoy చేయడానికి వచ్చేస్తారా?" అని కడిగేస్తున్నాడు. మేమనుకున్న reason చెప్పి, disturb చేయకుండా వచ్చాంలే అని చెబుతున్నా వినకుండా అవసరంలేనంత అల్లరి, scene create చేస్తున్నాడు. తీరా చూస్తే, తాను కూడా ఈత కొట్టడానికి, పెద్ద తాడు కూడా తెచ్చుకున్నాడు. 5 feet లోతులో నిల్చుని, మమ్మల్ని (particularగా నన్ను) ragging చేస్తున్నాడు. "సర్లే మచ్చా, మర్చిపో ఇంక, వచ్చావ్ గా happyగా enjoy చెయ్" అంటే వినడే, అరగంట దాకా, "నన్ను మోసం చేసారు, వదిలేసి వచ్చారు, నేనంటే మీకు లెక్కేలేదు, మీరంతా కుమ్మక్కయ్యారు" అంటున్నాడు. అందరూ కలిసి holidayకి friend ఊరికి వచ్చారు, వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ జనాల ముందు,  ఇంత రచ్చ బాగోదనే ఆలోచనే లేకుండా, సావగొట్టాడు. Hospital దగ్గర చిల్లర, ఇక్కడ అల్లరి కలిసి, మొత్తానికి, అన్న అనేసుకుని ఉంటాడు "వీడూ, వీడి friends, బాగున్నారా బాబు" అని సిగ్గుతో సచ్చిపోయినంత పనైంది నాకు. చివరికి, "మచ్చా, నన్ను క్షమించు, నీ కాళ్ళమీద పడమంటావా? అప్పుడైనా ఆపుతావా?" అంటే, అప్పటికి, అరవడం ఆపేసి, లోపల గొణగడం మొదలు పెట్టాడు మా నానమ్మ లాగ. అక్కడ కాసేపు ఆడుకొని, ఇంకో scenery దగ్గరికెళ్లి అక్కడ కూడా భవిష్యత్తులో post చేయడం కోసం ఇంకొన్ని pics తీసుకున్నాక కాస్త normal మనిషి అయ్యాడు. ఇంటికెళ్లి, coffee తాగుతూ, car hire duration extend చేసుకొని, మిగిలిన వంటలు దార్లో తినడానికి pack చేసుకొని కుండపోత వర్షంలో start అయ్యాం. 30Kms వరకూ, అస్సలు visibilityయే లేకపోయినా, BBT wonderfulగా drive చేసాడని Mehiనే compliment ఇచ్చాడు. అప్పటికి ఆ కథ సుఖాంతమైంది.

కానీ, నాకు మాత్రం 2008లో TCSలో select అయినప్పుడు, offer letter ఇస్తూ HR అన్న మాటలు గుర్తొచ్చాయి. "Welcome to TATA family, ఇవాల్టినుంచి మీరందరూ members of the TATA family. వీధిచివర అంగట్లో పాల pocket కొన్నపుడు, busలో conductor చిల్లర ఇచ్చినపుడు కూడా thanks చెప్పడం దగ్గర్నుంచి, professional and personal lifeలో మన valuesని reflect చేయాలి మీ behaviour" అన్నాడు. మరి మేమేం చేసాం, భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన పరిశోధనా సంస్థగా జనాల్లో తెలిసిన TATA Instituteని (IISc పాత పేరు) represent చేస్తూ కూడా చాలా scrapగా behave చేశామ్, చిల్లర రచ్చ చేశాం. ఇదంతా చెప్పాననుకో, "ticket ఇవ్వకుండా తక్కువ డబ్బులు తీస్కొని వాళ్ల జేబుల్లో వేసుకునే బెంగుళూరు conductorsకి చెప్పలేదేమోగానీ, complimentaryగా ఉంచుకోమని whiskey గ్లాసులిచ్చిన మత్తికేరే spirits వాడికి చెప్పాంలే మచ్చా Thanks!" అంటారు మావాళ్లు.

ఇంతకీ, best friends గురించి పైన చెప్పిన పెద్దాయన ఎవరోకాదు, మా అన్నే. So, problem లేదు, ఆయనకి తెలుసు best friends అంటే ఎలా ఉంటారో.

Thursday, September 5, 2019

వేరు మూలాలు

మూలాలకి కట్టుబడి batting చేయాలి అని test cricket గురించి చాలా చిన్నప్పుడు news paperలో ఎవరో చెబితే చదివినట్టు గుర్తు. 'మూలాలు' (Fundamentals), చాలా ప్రత్యేకమైన మాట అనిపిస్తుంది నాకు. Cricket లాంటి  sportsలోనే కాదు, తర్వాత రాసిన చాలా పరీక్షల్లో  problems solve చేస్తూ over action వల్ల చేతులు కాల్చుకున్నప్పుడు, researchలో అంతుచిక్కని ప్రశ్నలకి సమాధానాలు వెదుకుతూ తెల్లవారుఝాముల్లో తల బద్దలు కొట్టుకున్నప్పుడు, బంధుమిత్రుల దగ్గరినుంచి సమాజంలోని పలురకాల వ్యక్తులతో వ్యవహారాలు చక్కబెట్టాల్సి వచ్చినప్పుడు, ఇలా జీవితంలో అన్ని సందర్భాల్లోనూ, సమస్య ఎదురైనప్పుడల్లా, fundamentals నుంచి సమాధానం కోసం వెదకడం బాగా సహాయపడింది నాకు. Clarity వచ్చి, ముందుకెళ్లడం సాధ్యపడింది చాలాసార్లు. So, ఆరకంగా, జీవితం మొత్తాన్ని కూడా ఒక ప్రశ్నలాగానో, ఒక gameలాగానో, ఒక ప్రక్రియలాగానో అనుకుంటే, same సూత్రం దీనికి కూడా వర్తిస్తుంది కదా! జీవితంలో ఏ సమయంలోనైనా, "ఏం చేస్తున్నా? ఎక్కడ నిలుచున్నా? సరిగ్గానే సాగుతోందా ప్రయాణం?" ఇలాంటి ప్రశ్నలు ఉదయించినపుడు, వెంటనే, ఒక్కసారి "అసలు ఇపుడు ఎటువైపు వెళ్తున్నా? దేనికోసం అని వెతుకుతున్నా? ఎటు వెళ్లాలని అనుకున్నా?  అటువైపే వెళ్తున్నానా?" అని నన్ను నడిపించే (నా జీవిత) మూలాల్ని మరొక్కసారి గుర్తుచేసుకోవడం అలవాటు అయ్యింది.

I think, మనలో చాలామందికి, చిన్నప్పటినుంచే, మనకి జీవితంలో ఏం కావాలో,  ఆలోచించడం మొదలు పెడతాం. అంటే, నా ఉద్దేశం 'మన జీవిత పరమార్ధం ఏమిటి?' అని కాదు. ఎప్పటికప్పుడు, మనకి ఏదోటి నచ్చేసి, నాకిది కావాలి, నేను కూడా ఇలా చేస్తాను, నేనెప్పటికైనా ఇది అవ్వాలి,అనిపించే ఆలోచనలమాట. స్పష్టత లేకపోయినా, అవే ఆ తర్వాత నచ్చకపోయినా, ఇంకేవో ఎక్కువగా నచ్చడం మొదలైనా, వాటిని పొందడానికి మనం ప్రయత్నించక పోయినా, ఇలాంటి ఆలోచనలు కలగడం ఐతే సామాన్యమే (అనుకుంటున్నా). కానీ, కొంతమందికి చాలా చిన్నప్పుడే, జీవితం చివరి వరకు నడిపించేంత గట్టి ఇష్టాలు ఏర్పడినా ఆశ్చర్యం లేదు. మనం చాలా మంది interviews చూసినప్పుడు, ఎంతవరకూ నిజమో తెలియదు కానీ, వారి ఇప్పటి స్థితికి, చాలా చిన్నప్పుడే పడిన బీజాల గురించి చెబుతూ ఉంటారు. ఈ మూలాలు అంతటి అమూల్యమైనవి అనమాట. నేను celebrityని కాకపోయినా, interview ఇవ్వకపోయినా, మనందరం మన జీవితాలని నడిపించే మూలాలని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవడం మంచిదని అనిపించి, పైగా, ఇవాళ అలాంటి ఒక అవకాశం, అవసరం వచ్చింది కాబట్టి, ఆ పని చేస్తున్నా. 

చాలా చాలా తక్కువమందికే దక్కే అదృష్టం, అవకాశం నాకు దక్కింది. అదేంటంటే, నాకు మా నాన్న, వాళ్ళ నాన్న, అంటే మా అబ్బ కూడా చదువు చెప్పారు, నా చిన్నప్పుడు. మా ప్రాంతంలో, తండ్రివైపు తాతని అబ్బ అంటారు. అవును, నేనంటోంది, జీవితంలో పాఠాలు కాదు, తరగతి గదిలోపాఠాల గురించే. నేను మాఊరి high school (ఉన్నత పాఠశాల)లో చదువుకున్నపుడు మా నాన్న, primary school (ప్రాథమిక పాఠశాల)లో ఉన్నపుడు మా అబ్బ (ప్రయివేటు masterగా) నాకు చదువు చెప్పినవాళ్లే. నేను పుట్టిన 3 రోజులు అటుఇటుగా మా అబ్బ మా ఊరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదవీవిరమణ చేసాడంట (verify చెయ్యలేదు, చిన్న జ్ఞాపకం అంతే). So, బడిలో పాఠాలు చెప్పలేదు, కేవలం ప్రయివేటులోనే. దాదాపు పాతికేళ్ల నా సుదీర్ఘమైన academicsలో, నాకు చాలా మంది మంచి ఉపాధ్యాయులు ఎదురుపడ్డారు, అది ఇంకో అదృష్టం, ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. మళ్ళీ, distract అయ్యేలోపే, మూలాల దగ్గరికి వద్దాం. విషయం ఏంటంటే, నేను ఉహించుకుంటున్న, తద్వారా నిర్మించుకుంటున్న నా జీవితానికి, మూలాలు, నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు మరియు వారు నాపై వదిలిన ముద్రలు. అలా నన్ను ప్రభావితుణ్ణి చేసిన చాలామంది ఉపాధ్యాయుల్లో, మొదటివాడు మా అబ్బ. అవును, నేనోదో sentimentalగా  ఉంటుందని చెప్పడంలేదు, నిజంగానే అయన నన్ను influence చేసిన teacher. మా అబ్బ అవడంవల్ల తరగతి పాఠాలతో పాటు, బయటకూడా నేను ఆయనతో గడిపిన సమయం గుర్తుండి పోయింది. ఇవాళ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం, కాబట్టి, నా బాధ్యతగా నా గురువుల్ని తలచుకొని, నాకు ఒకానొక ఆత్మీయ గురువు, ఇంకోరకంగా, తొలి గురువు లాంటి మా అబ్బని మరింత దగ్గరగా (zoomలో) తలుచుకునే ప్రయత్నం చేస్తున్నాను.

చిన్నప్పటి నుంచి, మావూళ్ళో మరియు చుట్టుపక్కల ఒకటి రెండు దగ్గరి పల్లెల్లో కూడా, మా cousins అందరికి గుర్తింపు, 'భైరవ కొండా రెడ్డి ఐవారు మనవళ్లు'గా, మా అబ్బ పేరుమీదే.  అప్పట్లో, కొన్నిచోట్ల ఇప్పటికి, teachersని అయ్యవారు (ఐవారు) అనేవాళ్లు, గుళ్లో పూజారుల లాగ. మరియు, సమాజానికి teachers అంటే భయభక్తులు సమపాళ్లలో ఉండేవి. నా పేరుకూడా అయన పేరుమీదే రావడం (పెట్టడం కాదు) జరిగింది, అదంతా ఒక పెద్దకథ (కొంచెం ఇక్కడ ఉంది). అయన ఏమి చదువుకున్నారో నాకు తెలీదు, కానీ, నాకు తెలుగు, లెక్కలు చెప్పారు, English కూడా (నేను ఉన్నత పాఠశాలకి వచ్చాక). ఆ తర్వాత 'తెలుగు పంచాంగానికి primer' లాగా, పంచాంగం అంటే ఏంటి, ఎలా చూడాలి లాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేర్పించాడు. అయన పెళ్లి ముహుర్తాలు నుంచి, శంకుస్థాపనల వరకు చాలా చేయగలడు. మా ఊర్లో, గొల్ల అన్నదమ్ములు కట్టుకున్న పెద్ద మేడలకి శంకుస్థాపన చేస్తున్నప్పుడు, పడమటి దాని ఆయుస్సు (97 సంవత్సరాలు అని జ్ఞాపకం) calculate చేసింది నేనే, అయన సమక్షంలో, అప్పుడు నా వయసు ~10. చెప్పానుగా, he was my teacher in many ways. నాకు Englishలో articles (a, an, and the) విశదీకరించి చెప్పింది కూడా ఆయనే. ఎక్కడ శంకుస్థాపన, ఎక్కడ ఆంగ్ల వ్యాకరణం. ఇలాంటివి చాలానే. 

తెలుగులో చల్దులారగించుట అనే పాఠం ఒకటి ఉండేది. అందులో, శ్రీమద్భాగవతం నుంచి శ్రీకృష్ణుని బాల్యంలోని కొన్ని లీలలు ఉండేవి. ఆ సందర్భంలో కింది పద్యం వచ్చింది 

ఓయమ్మ నీకుమారుడు 
మాయిండ్లను పాలు పెరుగు మననియడమ్మ, 
పోయెదమెక్కడికైనను 
మాయన్నుల సురభులాన మంజులవాణి

చాలా సులభమైనదే, అంతా అర్థమైనట్లే ఉంది, సురభి అంటే ఆవు అని, ఆన అంటే ఒట్టు అని, కానీ,   'మా అన్నుల' సురభులు దగ్గర ఆగిపోయా, అక్కడే నాకు మా అబ్బకి చర్చ start అయింది. ఎక్కడనుకున్నారు, ఇంటి బయట, మా చిన్నాన్న park చేసిన ఎడ్లబండి కాఁడిమ్రాను మీద నేను seesaw ఆడుతూ ఆయనతో వాదిస్తున్నా, ఆ చివరి పాదం గురించి. ఆయన నడవలోనుంచి, "కాదురా, అన్నల ఆవులు, తమ్ముళ్ల ఆవులు కాదు, అన్నుల సురభులు అంటే, ఇష్టమైన ఆవులు అని అర్థం" అంటున్నాడు నవ్వుతూ. అబ్బే, నాకు పూర్తిగా అర్ధమైనట్లు లేదు (వాళ్ళ అన్నల ఆవుల మీద ఒట్టువేయ్యడం ఎందుకు? వాళ్ళకి ఆవులు ఉన్నాయిగా అనే ఆలోచిస్తున్నా, kiddish :-) ). అలానే ఉండిపోయింది. చాన్నాళ్ళకి, చంటి సినిమాలో 'అన్నుల మిన్నల, అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే' అనే పాట వినేప్పుడు, ఓరినీ, ఇదేకదా అప్పట్లో, అర్థంకాలేదు అని అనుకున్నా, అయన చాలా కష్టపడ్డాడు పాపం చెప్పడానికి అని. ఆ తర్వాత, ఆ పదం ఎక్కడ వచ్చినా,  ఈ సన్నివేశం గుర్తుకొస్తుంది నాకు. 

చాలామందే చదువుకునేవారు అయన ప్రయివేటులో. అందరం math puzzles, పొడుపు కథలు, ఇలా చాలానే నేర్చుకున్నాం. మా జేజి (నాయనమ్మ) అంటే మాత్రం పిల్లలకి హడలు, నెల మొత్తం ఎవర్నో ఒకరిని ఫీజు అడుగుతూనే ఉండేది, నన్ను కాదులెండి, మిగిలిన వాళ్లనే. 

మా అన్నకి, కదిరిలో coaching తీసుకున్నాక, లేపాక్షి నవోదయ schoolలో seat వచ్చాక, నాకు (రాములయ్యగారి ప్రసాద్ గాడితో కలిపి) తానే, ఇంటి దగ్గరే coaching ఇచ్చి, exam crack చేయించాలని గట్టిగానే ప్రయత్నం చేశాడు పాపం. మాకున్న matterతో అదో సాహసమే అని చెప్పుకోవాలి. అయినా, ప్రయత్నించిన అయన సాహసం గురించి నేను మర్చిపోలేను. ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆయనకి ఇంకెవరో అవార్డు ఇవ్వడం ఎందుకు, నేనుప్పుడో ఇచ్చేశా, ఆయనకున్న అంకితభావానికి. పులివెందులలో ఆ పరీక్ష రాస్తుంటే, this is true story, no kidding, ఆ invigilator, hall ticketలో నా పేరు చూసి (ఇంటి పేరుతో కూడా ఉంటుంది కదా) ఊరిపేరు అడిగికనుక్కొని, 'ఐవారు మనవడివా?' అని అడిగాడు. Exam అయ్యాక, రోడ్డుమీద ఆయన మమ్మల్ని చూసి, దగ్గరికొచ్చి పలకరించాడు మా అబ్బని, తెలిసిన వాడంట. ఇవన్నీ కేవలం accidents ఎందుకు కాదంటే, వాటి ప్రభావం అంతటితోనే మాసిపోకుండా, ఇన్నేళ్ళుగా నాలో ఇంకా బ్రతికే ఉన్నందుకు.

మనిషి వయసొచ్చాక చాలావాటి వెంట పరిగెత్తినా, ప్రపంచం తెలియని పసివయసులో మనమందరం వెంటపడేది 'ఏంటో ఇది, తెలుసుకుందాం' అనే జ్ఞానంకోసం. చుట్టూ అంతా కొత్తదైన సృష్టిలో, తెలియజెప్పి, మనలోని కుతూహలాన్ని (curiosity) తృప్తి పరచి, ప్రపంచం ఎంతో తెలిసిందనిపించి, ఇంకొంచెం తెలుసుకుందామనే కోరిక రగిలించే ఉపాధ్యాయులందరూ ధన్యజీవులే, మా అబ్బతో సహా!

ఏ స్థాయిలో విద్యగరిపినా, ఉపాధ్యాయులందరూ ధన్యజీవులే, కానీ, మూలాలు ఏర్పర్చిన ప్రాథమిక గురువులు ప్రత్యేకంగా ప్రాత:స్మరణీయులు కదా!

ఆ తర్వాత్తర్వాత మానాన్నతో కలుపుకొని, నిన్నమొన్న video lecturesలో బోధించిన పరిచయమేలేని ఆచార్యుల వరకూ ఎందరో మహానుభావులు, అందరూ గొప్పవారే నాకు. వారందరూ నా కలల జీవితానికి మూలాలు. నామటుకు, ఒక వయసు వచ్చాక తారసపడిన, విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో లోతైన విషయాలు బోధించే ఆచార్యులకన్నా, ఎక్కడో ఒక సాధారణ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పిన ఉపాధ్యాయులే నా జీవితాన్ని ఎక్కువ ప్రభావింపజేయ గలిగారేమో. ఎందుకంటే, వీరు పైనుండే శాఖల లాంటి వారు, మరి వారేమో వేరు మూలాలలాంటి వారు.

Sunday, June 23, 2019

పేరు, ప్రపంచం, फरक: ఓ పే....ద్ద కథ!

High Schoolలో ఉన్నప్పుడు, మా seniorsకి, Hindiలో ఒక పాఠం ఉండేది, "नाम में क्या है?" అని. క్లుప్తంగా కథ ఏంటంటే (నాకు గుర్తు ఉన్నంత వరకూ), ఒక బాల యువకుడు (young adult) గురుకులంలో చదువుకుంటూ ఉంటాడు. అతనికి, ఒక గొప్ప పేరు పెట్టుకోవాలనిపించి, గురువుగారితో చెబుతాడు. అప్పటికే పేరు ఉందో లేదో నాకు గుర్తు లేదు, ఉందనే అనుకుందాం, కానీ, నచ్చలేదో ఏమో, ఇంకో గొప్పపేరు పెట్టుకుందాం అనుకున్నాడు పాపం. అదివిన్న గురువుగారు, 'ఓహో అలాగా! అయితే, అలా వెళ్లి, దేశంలో తిరిగిరా, నీకేమైనా నచ్చేపేర్లు వినిపిస్తాయేమో చూద్దాం' అని పంపిస్తారు. మనవాడు, చాలా ఉత్సాహంగా బయల్దేరతాడు. అలా వెళ్తున్న వాడికి, ఒకానొక ఊర్లో, గౌతమబుద్ధునికి కనిపించినట్లే, శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తున్న ఒక గుంపు ఎదురవుతుంది. సరే చూద్దాం అని, ఒకరి దగ్గరికి వెళ్లి అడుగుతాడు, 'ఆ చనిపోయిన ఆయన పేరేంటని?' ఆయన పేరు అమర్ (अमर) అని తెలుస్తుంది. 'ఓహో' అని ముందుకెళ్తాడు. ఇంకోచోట, కడుదీనావస్థలో ఉన్న ఒక బిచ్చగత్తె కనిపిస్తే, ఆమెనీ అడుగుతాడు, తన 'పేరేంటని?' ఆమె, 'దౌలత్ (दौलत)' అని చెబుతుంది. ఇలాగా, ఇంకొన్ని సన్నివేశాలు అయ్యాక, ఆలోచించడం మొదలు పెడతాడు. అంటే, మరణం లేనివాడు (అమరుడు) అని పేరున్న వాడు కూడా చనిపోతాడు. సంపద (దౌలత్) అని పేరున్న మాత్రాన, ఆవిడకి అడుక్కునే అవస్థ తప్పలేదు. అప్పుడు, మనవాడికి మబ్బులు విడిపోయి, వెనక్కి తిరిగి, గురుకులం చేరుకుంటాడు. గురువుగారికి, తన అనుభవాలు విన్నవించుకొని, 'అబ్బే, పేరులోనేమీ లేదండి' అంటాడు. (సరిగ్గా గుర్తులేదు, కథ ఇలా ముగుస్తుందనే జ్ఞాపకం.)

ఇప్పుడు నా కథ. భాషమీదున్న మమకారం వల్లనో ఏమో, చిన్నప్పటి నుంచి, నాక్కూడా, నాపేరంటే కొంచెం అసంతృప్తి, 'ఏదైనా, అర్థం ఉండి ఏడిస్తే బావుండేది' కదా అని. అయినా, మనమేం చేస్తాం, అలీ ఏదో సినిమాలో అన్నట్లు, నేనప్పుడు బాగా చిన్నవాన్ని అవడం వల్ల, నాకు తెలీకుండా జరిగిపోయింది, ఆపలేక పోయాను. మా జిల్లాలో ఉన్నంతవరకూ, నా అసంతృప్తి మినహా, పెద్ద బాధలేం పడలేదు. కానీ, పది పాసయ్యి, ప్రపంచంలో మన పరిధి పెంచుకోవడం మొదలుపెట్టినప్పటినుంచి, మొదలయ్యాయి మన సన్నివేశాలు.

బెజవాడ శ్రీచైతన్య కళాశాలలో, అడిగిన వాళ్లలో సగానికి పైగా వాళ్లకి, రెండు కంటే ఎక్కువసార్లే చెప్పాల్సివచ్చింది నా పేరు. అలా అని, నా పేరేదో Tongue twister అనుకుంటారేమో, అబ్బే, ఒత్తులు గట్రా ఏమాత్రం లేని, చాలా simple పదం. దీనికంటే, ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అలాంటి పేర్లు, మూడు తెలుగు ప్రాంతాల్లోనూ ఉంటాయి. సరేలే, ఈ English Medium high schoolsలో, modern పేర్ల మధ్యలో, ఎక్కడా తగల్లేదేమో అనుకొని, light తీసుకున్నా. పైగా, General Knowledge లేకుండా సాగిపోయిన వాళ్ల బాల్యాన్ని చూసి కొంచెం జాలిపడ్డ మాట వాస్తవం. అంటే, నా పేరేదో GK bitకి answer అనుకుంటారేమో. కాదు, నా ఉద్దేశం, Newspapers, కథలు, చదవడం, news, movies, చూడటం, etc.ల వల్ల ఎక్కడైనా ఇలాంటివి ఎదురయ్యి, పరిధి పెరిగి ఉండేది కదా అని. (ప్రతి తెలుగు కుటుంబంలో కనీసం ఒక్క శీనుగాడు (శ్రీనివాస్) అయినా ఉంటాడు కదా, ఆ rangeలో కాకపోయినా, నా పేరు మా areaలో world famous, అనగా, సర్వసాధారణం.) పోనిలే, వీళ్లకి అదేదో (పరిధి పెరగడం), చివరికి నా పరిచయం వల్ల జరిగింది అనుకొని సర్దుకున్నా. 

అలా, ప్రపంచంలో ఇంకొంచెం ప్రయాణం చేసాక, కాకినాడలో ఆగాల్సి వచ్చింది. అసలు problem అక్కడ ఎదురైందండి, ఆయ్! ప్రపంచం పెద్దది అవడం వల్ల ఎదురయ్యే సమస్య ఒకటి, నా General knowledgeని బాగా.... పెంచేసింది. ఒకే భాషలోని పదాలే అయినా, ఒక్కోసారి, కొన్ని పదాలకి, వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు అర్థాలు ఏడుస్తాయన్నమాట. అలా, నా పేరుకి కూడా, కోస్తాలో, మరీ అంత గర్వపడలేని అర్థం ఒకటి ఉంది. బెజవాడలోనే అటువంటి knowledge కలిగినా, కాకినాడలో మరీ ఎక్కువ అనుభవంలోకి వచ్చిందన్నమాట. అందువల్ల, కొండకచో, embarrassment feel అవ్వాల్సివచ్చింది. అదన్నమాట మదీయ వేదన. అదలా ఉంచితే, ఒకసారి, ఒకానొక ఘనుడు, నా పేరు చెప్పగానే, 'ఏంటీ, గూండా రెడ్డా?' అన్నాడు. 'ఓర్నియయ్య, ఏమడుగుతున్నావో తెలుస్తోందా నీకు?' అనాలని ఉన్నా, 'కాదు, *******' అని మళ్ళీ repeat చేస్తే అర్ధమైనట్లు ఊకొట్టాడు. కాబట్టి, నేను కొట్టకుండా తప్పించుకున్నాడు. ఇలాంటి కారణాల వల్ల, నా పేరులో 'నా' వివరాలన్నీ cut చేస్కొని, కేవలం Reddy అని, ఒక 'పేరుకాని పేరు'తో చెలామణి అయ్యాను (అంతేగా మరి, అది నా ఒంటి పేరు కాదు, ఇంటి పేరు కూడా కాదు). కొంతకాలం క్రితం వరకూ నా Facebook పేరు 'Mopuri K Reddy'. ఇప్పటికీ, ఈ blog పేరు M K Reddy's Blog, mail IDతో పాటు, అన్ని usernames, mkreddy***. అది మరి, నాపేరంటే నాకుండిన ఇష్టం. అవన్నీ జీర్ణం చేసుకుంటూ అలా ఇంకా ముందుకెళ్లడం మూలాన, ఈసారి West Bengalలో  halt వచ్చింది.

మన previous encounters దృష్ట్యా, బాగా అలోచించి, ఈ కొత్త ప్రపంచంలో, మనకి మనమే నామకరణం చేసుకొని, కొత్త lifeనే start చేయొచ్చని అలోచించి, so called గొప్ప పేర్లు (కనీసం ఇబ్బంది పడని అర్థాలున్నవి) వెదకడం ప్రారంభించా. కానీ, పూర్వజన్మ వాసనలాగా, కాకినాడ నుంచి మన జాన్ జిగిరి అయిన యశ్వంత్ గాడు కూడా నాతోపాటు వచ్చాడు west bengalకి. ఇలా అని నా ఆలోచన గురించి చెప్పాక, 'రేయ్, ఎందుకురా ఇదంతా! చెబుతున్నా విను, బొక్కరా ఇవన్ని' అని వాడిదైన వైరాగ్యంతో అనేసరికి, అలాంటి ప్రయత్నమేమి చేయకుండా ఆగిపోయా. కానీ, ఎప్పుడూ లాగుతూ ఉండేది, అలాంటిది ఏమైనా చేసిఉండాల్సింది అని.

ఆతర్వాత, బెంగాల్ నుంచి బెంగుళూరుకి మకాం మార్చాక, ఒక సంవత్సరం వరకూ, నా ఈ plans ఏవీ execute చేయలేకపోయాను. ఇందుకు కారణం, ఇంకో BTech వాసన, శివ గాడు, నా అప్పటి room-mate, ఇక్కడికొచ్చాక Flat-mate. అందువల్ల, నేను అనుకున్న పేరు కేవలం (నా చాలా accountsకి) password లాగానే మిగిలిపోయింది. మరి మనకి లవ్వయినా, పువ్వైనా, అన్నీ మనమేగా. అలా ఉండగా, IIScలో seat వచ్చింది. అనగా, కొత్త జీవితం ఆరంభించడానికి ఇంకొక కొత్త అవకాశం వచ్చింది. ఈసారి 'ఎవరిమాటా వినేదిలే' అని fix అయ్యి, నన్ను నేను సిద్ధం చేసుకున్నా. తర్వాతి రోజు reporting అనగా, ముందురోజు సాయంత్రమే cabలో luggage అంతా వేసుకొని campusకి వెళ్ళా. Hostel ముందు దిగి, joining order hostel securityకి చూపించి, luggage move చేస్తున్నా. ఇంతలో ఎవరో ఎదురయి, 'new admission ఆ?' అనేసరికి, 'అవును, హాయ్, I am *****' అన్నా, నాకు నేను పెట్టుకున్న కొత్తపేరుని. ఇంతలో, వెనకనుంచి 'పెహ్' మని నవ్వులు వినిపిస్తే వెనక్కి తిరిగి చూశా. నన్ను drop చేయడానికి మరియు luggageతో help చేయడానికి వచ్చిన, మా నిమ్మగడ్డవారు, కాకొల్లు వారి పరిస్థితి ఇదిగో కిందిలా ఉంది.

Vikramarkudu Movie Brahmanadam Comedy Scene

మరి, యశ్వంత్ గాడూ, శివ గాడేమో నా క్రితం జన్మ వాసనలై తే, వీళ్ళు నా latest జన్మలో add అయిన వాసనలు, నాకు West Bengalలో  తోడైన జాన్ జిగిరీలు. నాయొక్క అనుభవాలని, previous attemptsని ఎరిగిన వాళ్ళు. 'ఛీ, జీవితం!' అనుకొని, స్వీయనామకరణ ప్రయత్నాన్ని మరోసారి విరమించుకున్నా. 

ఆ తర్వాత, ఇంకొన్నాళ్ళకి, పరిధి ఇంకొంచెం పెంచుకొని, ఖండాలు దాటేసి, వేరే దేశంలో పనికోసం వచ్చా. ఇక్కడ, నేను కూడా చాలా మంది పేర్లని మళ్ళీ చెప్పమని అడిగా. effect of globalisation; భాష, సంసృతి, etc. differences ఉన్నాయిగా, తప్పదు. correctగా పలకాలంటే, స్పష్టంగా వినేవరకూ, పదే పదే repeat చేయమనాల్సిందే. మనకి (కాకినాడ, etc. లలో) ఎదురైన differencesకి చాలా రెట్ల difference అనమాట. కానీ, 'ఏంటీ, గింటీ'ల్లాంటి వేషాలేమీ వెయ్యకుండా, ఓపిగ్గా మరియు genuineగా మళ్ళీ చెప్పమని అడగటమే. ఇన్ని అనుభవాలు, ప్రయత్నాల తర్వాత, ఇప్పుడిక, ఒక నిర్వికార, నిశ్చలమైన, పూర్తి acceptance modeలో operate అవుతున్నా. Happyగా, ఇంటిపేరు, మరియు ఇందాక అనుకున్న 'పేరుకాని పేరు', అన్నీ పక్కన పెట్టి, కేవలం, ఒంటిపేరునే, విపరీతంగా వాడుతున్నా. In fact, ఆ 'పేరుకాని పేరు'ని, పేరునుంచి పెకలించి, ఒంటి పేరు, ఇంటిపేరు మాత్రమే కొనసాగిస్తున్నా. Because, now I don't care any more. అంటే, నేనుకూడా, ఇందాకటి కథలో శిష్యుడిలా, 'పేరులో పెద్దగా ఏమీ లేనట్లే'నని చెబుతున్నా అనిపించొచ్చు. కానీ, నేను అనుభవించిన అసౌకర్యం మాత్రం, ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపించవచ్చు. నామటుకు, నేను రాజీకి వచ్చేసా. నచ్చే పేరు కలిగి ఉండటం మంచిదే, అదృష్టం ఉంటే అలా జరగొచ్చు కూడా. కానీ, ఎప్పుడన్నా, 'ఏంటీ, రాంబాబా? ఎబ్బే, లాభంలేదు. Vibration లేదే!' అనే మాటలు వినిపించొచ్చు, లేదా మనసులోనే అనేసుకోవచ్చు, లేదా, ఇంకొంతమందికి funnyగా అనిపించొచ్చు. లేదూ, ఆశ్చర్యంగా, " కొత్తదనంలో కొట్టుకుపోకుండా, సంస్కృతి, చరిత్రలతో సంబంధం ఉన్న పేరులా ఉందే" అని rareగా appreciate చేసే జనాలూ తగలొచ్చు. ఏదేమైనా, in the end, పెద్ద फरक పడక పోవచ్చు అంటున్నా.

Confusion పొయ్యేలా, summary ఇచ్చే ప్రయత్నం చేస్తా, చుడండి: World is a bigger place, నీకు weird అనిపించింది ఇంకొకరికి సర్వసాధారణం అయిఉండొచ్చు (e.g. మన arranged marriages గురించి మా Russian flat-mateకి చెప్పా, సచ్చిపోయాడు ఎదవ!). నీకు world famous అయినది, ఇంకొకరు అసలు వినే ఉండకపోవచ్చు. కాబట్టి, ఇలాంటివి ఎదురైనప్పుడు, 'ఛీ ఛి ఛి ఛి ఛి! అలా ఎలాగా?' అని వేషాలు వెయ్యకుండా, 'ఓహో, ప్రపంచము బాగా పెద్దదనమాట' అని మన పరిధి పెంచుకోవాలన్నమాట.

కాబట్టి, పిల్లలకి పేరు పెట్టేటప్పుడు, కొంచెం, ఇవన్నీ మనసులో పెట్టుకోండి, లేదా, ఖలేజా సినిమాలోలాగా, 'చిచు' లాంటి పేరు పెట్టారేంటని పెద్దయ్యాక పిల్లలు నిలదీసే అవకాశముంది.

Thursday, April 4, 2013

కొన్నుంటాయ్, ఈ శాస్త్రాలూ - అవీ, ఉంటాయ్...!


My sincere and special thanks to Rhonda Byrne,  Trivikram Sreenivas and Sreenu Vaitla.

ఇవాళ్టికి(అంటే ఇది రాసుకున్నప్పటికి; upload చేసినప్పటికి కాదని మనవి) మూడు రోజుల ముందు :

ఆవేళ ఎందుకో మన yashwanthగాడు గుర్తొచ్చాడు (sittingలాంటివేం plan చేసుకోలేదు లెండి; అయినా గుర్తొచ్చాడు). System,mobile మొత్తం వెదికాను, ఎక్కడా వాడూ,నేనూ ఉన్న జ్ఞాపకాలు(అనగా photoలు) దొరకలేదు. Suddenగా గుర్తొచ్చింది, అంతే, అప్పుడెప్పుడో మర్చిపోయిన orkut openచేసి KGPలో ఉన్నపుడు upload చేసిన అన్ని photos(ఇప్పటికీ ఉన్నయ్, కావాలంటే చూసుకోవచ్చు) మనసారా చూసుకున్నాను. Image Processingకి భగవద్గీత  అయినటువంటి Gonzalez పుస్తకం గుర్తొచ్చింది. అందులో మొదటి chapter introductionలో  "One picture is worth more than ten thousand words" గుర్తుకొచ్చింది. మనసుని ముంచెత్తే జ్ఞాపకాల వరదొకటి మొదలైంది. అందులో కొన్ని తుంపరలు ఇక్కడ విదిల్చుతున్నాను(కంగారు పడకండి,  మీ screenలకేమీ కాదు). 

yashwanthగాన్ని తలచుకుంటే మొట్టమొదట గుర్తొచ్చేది cricket. Indian cricket కి sachin-ganguly, sehwag-gambhir ల pairs ఎలాగో, మన JNTUK ECE05-09 cricket teamకి నేను-yashwanthగాడు అలాగ. అదేంటో మన captain peelid(వాడు నా slam bookలో అలాగే రాశాడు), first overలోనే ఎవరో ఒకరు (maximum yashwanthగాడు, కనీసం నా satisfaction కోసం!!) out అవుతారని తెలిసినా, కాకినాడలో ఆడిన (దాదాపు ) అన్నిmatchలకి మా opening pairని disturb చెయ్యలేదు. అంటే basicగా మన team కూడా అలా అలవాటు పడిపోయారు లే. First year లో అయితే, sunday ఒకటే holiday అవడం వల్లనూ, అప్పట్లో అందరూ class లకి attend అవడం వల్లనూ sunday మాత్రమే ఆడుకునే వాళ్లం. సరిగ్గా ఆరోజే, yashwanth గాడింట్లో పూజలుండేవి. వాడికోసం ఇంటికి phoneలు, వచ్చేదాకా ground లో waiting లు(ఏంటి, ఇవన్నీ ఎలాగూ first overలోనే out అవుతాడని తెలిసినా). వాడేమో late గా వచ్చి, ఆ black ax n dx సైకిల్ park చేస్తూ "ఏం చెయ్యనురా, ప్రసాదమన్నా తీసుకోవాలిగా, అందుకే పూజ అయ్యేదాకా ఆపారు" అనేవాడు.(పాపం ఆ cycle, GATE exam ముందు, రమణయ్యపేటలోని మా room దగ్గర park చేసి, పోగొట్టుకున్నాడు).

cricket అంటే చెప్పుకోవాల్సింది మన yashwanthగాడి keeping .వాడు మనకి దొరికిన ఓ  మంచి keeper. అందుకనే KGPలో నేను captaincy చేసిన (~)100  matchల్లో (ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు), >50 matchలకి వాడే మా keeper, ఆ మిగిలిన < 50 కూడా, వాడు  TT, shuttle ఆడుకున్నాడు కాబట్టి, నేను వేరే వాళ్లతో చేయించుకోవాల్సి వచ్చింది.
ఇక్కడ ప్రేక్షకులు చదవాల్సింది ఏమిటంటే, actualగా ఆ మొదటి >50 matchలు కూడా, నేను phoneచేసి బలవంతంగా రమ్మండం మూలాన వచ్చాడేమో అని నా అనుమానం. (కారణం, ఆ time లో, వాణ్ణి phoneలో ఇబ్బంది పెట్టిన పిల్ల వల్ల కావచ్చు, guide AB వల్ల కావచ్చు, లేదూ TT మీద మక్కువ ఎక్కువ అవడం కావొచ్చు)
ఇలా yashwanthగాడు నా cricket lifeలో కీలకమైన role ఆడాడనమాట.

Next గురొచ్చేది sitting setting; ఆగండాగండి, పాపం వాడేం పుచ్చుకునేవాడు కాదు.

మా sittingలంటే ఆషామాషీ యవ్వారమమేం కాదు. Planning ఎంత perfectగా ఉండేదంటే ఆమీర్ఖాన్ cinema తీసినట్లుగా ఉండేది. మా batchలో ఎవడికి మూడొచ్చినా, 4 నిమిషాల్లో 5 calls వెళ్లేవి, 6 నిమిషాల్లో  ఇద్దరు ద్రవాహారం తేవడానికీ, ఇంకో ఇద్దరు ఘణాహారం తేవడానికి వెళ్లేవాళ్లం. నేనెప్పుడూ ఆ  ద్రవాహారం  batchలోనే ఉండేవాడిని (మరి, మా జనాలు stuff select చేసే విషయంలో నాయొక్క అభిమానులు). అంతా సర్దుకుని రమారమి 8గంట్లకి కూర్చుని మెల్లిగా మొదలుపెట్టి, ఓ మూడు మిగిల్చే లోపు, ఒకన్ని తర్వాత ఒకన్ని center చేసి celebrate చేసుకుంటూ, ఒక్కోడి performance  మాంచి peakలో ఉన్నపుడు cool drink(అనగా, Sprite )అయిపోతుంది. అప్పటికే 11 కొట్టేసుంటుంది. అంటే కొట్లు కట్టేసుంటాయని కాదు. ఎవడికీ కిందకెళ్లి(మా room 4th floorలో ఉంటుంది లెండి) తెచ్చే ఇది ఉండదు. Cool drink లేకపోతే ముందుకి కదలలేని పరిస్థితి. అందులో ఓ నలగరం cool drink లేకపోయినా waterతో "ఓ! yes" అనేవాళ్లం, కానీ మిగిలిన ఆ ఒక్కడూ cool drink లేకపొతే చాలా  కష్టపడే వాడు. కురు సభలో దుశ్శాసనుడు చీరలాగుతున్నపుడు, ద్రౌపది అదే సభలో ఓ మూలన ఉన్న తన భర్తలు ధర్మ రాజు దగ్గిర నుంచి, సహాదేవుని వరకూ ఒక్కొకరి వైపూ  చూసి కాపాడమని వేడుకుని, ఎవరూ ముందుకు రాకపోయేసరికి, చివరకి "అన్నా'"అని wireless లో శ్రీ కృష్ణుని వేడుకున్నట్లు, మేమెవరం కదలక పోయేసరికి నా mobile నా ముందు పడేసి, నా వైపు ఆర్ద్రంగా చూసేవాడు. ఇంక తప్పదనుకుని అప్పటికో గంట ముందే పడుకున్న మన yashwanth గాడికి call చేసి లేపి, వాడి చేత తెప్పించేవాళ్లం. వాడొచ్చాక వాడి కాళ్లమీద పడ్డంత పంజేసే వాళ్లం. ఓసారైతే, నేను మరుసటి రోజు ఉదయం పదింటికి మజ్జిగ packet కూడా తెప్పించుకున్నాను. అది పరాకాష్ట. Packet చేతికిచ్చాక చాలా చిరాగ్గా face పెట్టి మన yashwanth గాడన్నాడు"నువ్వింక మానాల్రా" అని .(Sceneలో sentiment ఎక్కువైందని censor చెయ్యడం జరిగింది, కానీ గ్రహించ వలసిన విషయం ఏంటంటే, extra అయ్యిందనుకున్న మొదటిసారే  వాడు నిర్మొహమాటంగా నాకా విషయం చెప్పడం).

అలా మన yashwanth గాడు, మా sitting cinema climax sceneలో శ్రీకృష్ణుని అవతారమెత్తేవాడు.

Next గుర్తొచ్చే scene మా ఊళ్లో. 2011 May 14, KGP నుంచి జైత్రయాత్ర ముగించుకుని, మా ఊళ్లో పడ్డాను. అప్పుడు మాఇంటికి తీవ్రమైన మరమత్తులు చేస్తున్నాం. Juneలో అనుకుంటా, మన yashwanth గాడు ఇడుపులపాయ IIIT లో join అయ్యాడు. నేనోరోజు ఇంటికి రమ్మని phone చేశాను. వాడు ఓ శనివారం సాయంత్రం call చేశాడు, రేపు బయల్దేరుతున్నానని. నేను మా అమ్మకి చెప్పాను రేపు వాడొస్తున్నాడని. పక్కనే ఉన్న మా పాలేరు విని, సందకాడ నాటుకోడి తెస్తాను, జొల్ల(అనగా,పెద్ద వెదురు గంప) బయట పెట్టమన్నాడు. లేదు, వాడు vegetarian అన్నా. Brahmin ఏమో అనుకుని మా అమ్మ కంగారుపడిపోయింది.(అంటే, మరి మా ఇల్లు repair లో ఉండటం మూలాన, దగ్గర్లోనే ఓ చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని(అదో పాతబడ్డ ఇల్లు) అందులో ఉంటున్నాం, అక్కడ వసతులేం సరిగాలేవ్) .మరి, సద్బ్రాహ్మనుడు  శివుడితో సమానంగదా. .ఇంతలో నేను వాడు brahmin కాదని చెప్పేసరికి కుదుట పడింది. సుబ్బరంగా పప్పు, రసం, ఇంకో కూరతో పాటూ ఓ sweet చెయ్యమన్నా. (ఇంటి)పనికొచ్చే కూలోల్లకీ, ఇంటోల్లకీ ఒకే అన్నం కుండ కాబట్టి, వాడిక్కూడా అందులోనే వండేసింది. మా పక్కూరికి బండేసుకెళ్లి మన yashwanth గాన్ని ఎక్కించుకొచ్చాను. (మా ఊరికి bus లేదనుకునేరు, అరగంటకోటుంది. కానీ వాడికి, నేను ఈత నేర్చుకున్న కుంటలూ, ఆడుకున్న బీళ్లు, రేగుపళ్లు ఏరుకున్న గుట్టలూ, గేదెల్ని తోలుకెళ్లిన బయళ్లూ చూపించొచ్చని నా plan). అలా, అవన్నీ చూపించి, మా ఇంటిముందు దింపాను. మరి మనవాడు top to bottom Reebokలో ఉన్నాడు. Laser treatment అవజేసుకుని కళ్లజోడు తీసేసి Reebok goggles పెట్టుకున్నాడు, కిందేమో Reebok shoes, మధ్యలో Reebok back pack, చేతికి fast track. ఇది వాడి అవతారం(Actualగా, నాలాంటోడు ఆగిపోయేవాడేమో, కనీ...సం ఆలోచించేవాడేమో,కానీ మన yashwanth గాడు చాలా clearగా చెప్పాడు, అవన్నీ offer లో వాళ్ల Daddy కొన్నారని.). అలా వచ్చినవాడు, fresh అవడానికి వెళ్లేసరికి పరుగుపరుగున వచ్చిన మా అమ్మ, నాకో లుంగీ, వాడికో టవల్ ఇస్తూ "బాగా సావుకార్లా ?" అని  (నన్ను)అడిగింది(లోగొంతుకలో). నేనన్నాను"మరేమనుకున్నావ్, రాజమండ్రిలో రెండిళ్లున్నాయ్, కాకినాట్లో కూడా కొన్నారు ఇంకో రెండు flatలు ".
"మరి, నీకెలా పరిచయం ?".
"నాతో Cricket ఆడేవాడులే, వాళ్లమ్మ కాకినాడ కలక్టరేట్లో పంజేస్తార"ని చెప్పా. ఇంక చూస్కో, బాపణోన్నేమిటి, బ్రహ్మ దేవున్నే చుసినట్లు feel అయ్యిందంటే నమ్మాలి. అలా భోజనమవజేసుకుని, మళ్లీ బండేసుకుని, నేను చదువుకున్న బడి, మా పొలాలు, ఊరి బయట శివాలయం అన్నీ చూపించి తీసుకొచ్చాను. అదో మరచిపోలేని రోజు. చివరగా మరమత్తులు జరుగుతున్న మా ఇంటికి తీసుకెళ్లాను. అక్కడ మా నాన్న ని పరిచయం చేసేలోపే "నమస్కారం  uncle" అనేసరికి, అక్కడ పంజేసుకుంటున్న వాళ్లకి ఏదో cinema చూస్తున్నట్లు ఉంది.మరలాంటి మర్యాదలు మేము పుస్తకాల్లో చదువుకోడమూ, cinemaల్లో చుసుకోవడమే.
సాయంత్రం మళ్లీ పక్కూరికి తీసుకెళ్లి, పులివెందుల bus ఎక్కించాను. ఇంటికొచ్చిన నాతో మా అమ్మ, ఇంటి పని పుర్తయ్యాక ఇంకోసారి తప్పకుండా రమ్మనమని చెప్పింది. మరి వాడి simplicity అటువంటిది and  మా అమ్మని మొట్టమొదటి సారి Aunty అని పిలిచినవాడు కూడా  మన yashwanth గాడే. అయితే, అసలే గోదావరి యాసకి తోడు,మన వాడి speedకి, వాడేమ్మాట్లాడు తున్నాడో మాత్రం మావాళ్లకి అర్థమవ్వలేదు, అది వేరే విషయం.
అన్నట్లుగానే, ఇళ్లు ready అయ్యాక కూడా మరోసారి మా ఇంటికొచ్చాడు మన yashwanthగాడు.
(Actualగా ఇంకా చాలా incidents ఉన్నాయ్, కానీ ఇక్కడ type చేసీ చేసీ వేళ్ల కీళ్లు నొప్పిస్తున్నాయి,కాబట్టి వాటిని గురించి ఇంకెప్పుడైనా విప్పుకుందాం)
ఇలా గుర్తొచ్చిన yashwanthగాన్ని, బాగా miss అవుతున్నానని feel అవుతూ orkutలోనుండి, వాడు examకి kerchief మీద formulae రాసుకెళ్లినపుడు తీసుకున్న photo లు downloadచేసి facebookలో మన group లో post చేశా.

మొన్న:

సాయంత్రం 4గంట్లకి meetingలో ఉన్నపుడు మన yashwanth గాడి నుంచి call వచ్చింది, cut చేశా. Meeting అయ్యాక వాడి సంగతి మర్చిపొయా. మళ్లీ రాత్రి 10:30 కి చేశాడు. అప్పటికే మన group లో comments అవీ జరుగుతూ ఉండడంతో, సరదాగా మాట్లాడాలని పించిందేమో అనుకుంటూ pick చేశా. "ఒరే banglore వస్తున్నా, bus లో ఉన్నా"అన్నాడు. సర్ప్రయిజే మరి. ఏదో interview ఉంది morning 9కి, అయ్యాక instituteకి వస్తాను అన్నాడు.

నిన్న:

అన్నట్టుగానే interview అయ్యాక కలిశాడు, కలిసి మా room కి వెళ్లి చాలా కబుర్లు చెప్పుకున్నాం. మధ్యానం భోజనం చేశాక నేను labకి వెళ్తూ rest తీసుకోమని చెప్పా. సాయంత్రం 6:30 కి వచ్చేసరికి మన yashwanthగాడు పడుకుని ఉన్నాడు. లేపి,Yashwanthpur market లో కొద్దిగా తిరిగి, snacks తిని, room కొచ్చి, మళ్లీ మరిన్ని కబుర్లు చెప్పుకుని, 9:30 కి బయల్దేరి బయట mushroom masala, Naans తిని, వర్షం లో Majestic bus ఎక్కించి(వాడికి 11 కి వేంపల్లి కి bus ఉంది) room కొచ్చాను. వర్షం పడుతూ ఉండడంతో, labకి light తీసుకుని ఆలోచించడం మొదలుపెట్టా, మూడురోజులప్పుడు వీడిగురించి ఆలోచించడమేంటి, ఓసారి కలిస్తే బావుండు అనుకోడమేంటి(పెద్ద కష్టమేం కాదు,ఉగాదికి ఇంటికొచ్చినపుడు,వాన్ని మా ఇంటికి రమ్మనొచ్చు ), sudden గా వీడే call చేసి వస్తున్నానని దిగిపోడమేంటి అనుకుంటూ, కుర్చీ మీద కూర్చుందామని, cot మీద ఉన్న దిండు లాకున్నాను. దాని వెనక నుంచీ 3 పుస్తకాలు కింద పడ్డాయ్. వాటిలో మొదటిది The secret, రెండవది The power ,మూడవది Train your brain. మధ్యాహ్నం మన yashwanth గాడు చదవడానికి shelf నుంచీ తీసిన్నట్లు ఉన్నాడనుకుని, వాటిని సర్దేసి కుర్చీ లో కూర్చునే సరికి తట్టింది sequence.

మొదటి scene, ఖలేజా లో అలీ, మహేష్ బాబుని అడుగుతాడు "The Secret" అనే పుస్తకం చదివావా అని. బాబు అప్పటికేదో comedy చేశాడుగానీ, Trivikram లాంటోడు అడిగించాడు కదా అని ఆలోచించి, cinemaఅయ్యాక చదివాడనమాట. ఆనక scene, శ్రీను వైట్ల దూకుడు లో, వెన్నెల కిషోర్ వాళ్ల బామ్మ power తెలుసుకుని అంటాడు "అవునోయ్ శాస్త్రి, కొన్నుంటాయ్, ఈ శాస్త్రాలూ - అవీ, ఉంటాయ్...!" అని.


Wednesday, November 28, 2012

ఒక particular చూపు


నాకదేంటో మాంచి peak timeలో ఉన్నపుడే, off the track వెళ్దామని అన్నీ లాగుతుంటాయ్, అంటే ఒక్కోసారి ఒక్కోటనమాట లెండి.
మచ్చుక్కి మూడొదలమంటారా,
సరే సరదాగా ముడున్నర్రేల్లు ఎనక్కెళ్తే, 2009 Feb 5, evening 5PM, అదేదో కాకినాడ మొత్తం మునిగి పోతున్నట్లు, అప్పటికప్పుడు mobileలో ఉన్న ఒక్కగానొక్క ఆడ నంబర్ కి కాల్ చేసి, అప్పటికి ఆరేళ్ల క్రితం (అంటే, రాజా బాబు పదవ తరగతి లో) interest ఉన్న ఇద్దరమ్మాయిల phone నంబర్లు అంది పుచ్చుకుని,
కాకినాడ రమణయ్య పేట లో రెండవ అంతస్తులో ఉండే మా రూం బయటకి వచ్చి, వాకాలపూడి మీదుగా ఉప్పాడ బీచ్ మీంచి వీచే గాలి పీలుస్తూ, వారసత్వంగా సీనియర్లనుంచి చదువుకోడానికని  సంక్రమించిన స్టడీ చైర్ మీద కూచుని, పిట్టగోడ మీద కాళ్లు పెట్టి, "ముందు ఎవరికి చేద్దామా ?" అని ఇస్రో వాళ్లు చంద్రయాన్ కి చేసినంత మేథో మథనం చేసి ఒక అమ్మాయ్ ని డిసైడ్ అయ్యాను.

ఈ particular పిల్ల గురించి కొంత చెప్పుకోవాలి. పాపకి పిల్లోలందరూ ఫాలోఅర్సే, పైకి చెప్పుకునేవారు కాదంతే, పిల్లతనానికే చిన్నతనం మరి. నాకైతే ఆడ పిల్లలు అందంగా కూడా ఉండగలరని(:P) ఆ ట్యూషన్ కెళ్లాకే అర్థమైంది. ఒకసారి నేర్చుకుంటే ఇక మర్చిపోలేరు, అలాంటి పాఠమా పిల్ల.
ఇంతకీ ఆ ట్యూషన్ మా పక్కూర్లో. అది మా మండల కేంద్రం. ఆ ట్యూషన్ మాష్టారు మా ఉళ్లో ఉన్న పదవ తరగతి పిల్లల ఇళ్లకొచ్చి, చేర్పించమని వాళ్ల పెద్దలని అడిగి మరీ పట్టుకెళ్తున్నాడు. అలా మా ఇంటికొచ్చినపుడు, 500 మార్కులు  (600కి) గ్యారెంటీగా తెప్పిస్తామని మా నాన్నతో చెప్పి, సరదగా Englishలో ఒక active voice sentence చెప్పి, passiveలో చెప్పమన్నారు. నేను చెప్పలేక పోయాను. అది చూసి ఆ మాష్టారు మా నాన్నకి బంపర్ ఆఫర్ ప్రకటించాడు పాస్ ఐతేనే ఫుల్ ఫీ, లేకపోతే సగమే చాలన్నాడు. అని వెళ్లిపోయాక, నన్నెప్పూడూ ఒక్క మాట కూడా అనడానికి ఇష్టపడని మా నాన్న "అది కూడా చెప్పకపొతే ఎలాగరా?" అని కొద్దిగా కోపం (బాధ?) పడ్డాడు, మరి ఆయన ఒక స్కూల్ టీచరు, పైపెచ్చు నాకు సెవంతు క్లాసులో English కూడా చెప్పాడు. మొత్తానికి నన్ను ఆ ట్యూషన్ కి వెళ్లమన్నాడు. అక్కడ నేర్చుకున్న పాఠాల్లో ఒకటి  పైన్నే మీకు ఒప్పజెప్పాను.

కొన్నాల్లకి నేను ఆ ట్యూషన్ మానేసి,వేరే స్కూల్లో చేర్తున్నానని తెలిసి ఆ ట్యూషన్ మాష్టారు , మా ఇంటికొచ్చి, మా నట్టింటికొచ్చి, నాన్నకి నచ్చజెప్పి అక్కడే ఊంచుకుందామని విశ్వ ప్రయత్నాలూ చేశి, వీలుకాక వెళ్లి పోయాడు. అది వేరే విషయం.
అయినా కానీ ఆ particular పిల్ల తో కలిసి కొన్నిcompititive examలు రాసే అవకాశం దొరకడం చేతనూ, కొన్ని ప్రయాణాలు కలిసి (వాళ్ల HM కూడా ఉన్నాడు లెండి) చేయడం చేతనూ, బాగా చదువుతానని (అప్పుడు లెండి) మా మండలమంతా (అంటే 5 హైస్కూల్లనమాట) పేరుండడంచేతనూ, పెద్ద బాధపడ లేదులెండి.
రోజులు అలా గడుస్తున్న సమయంలో, ఒకానొక ఆదివారం అల్లాంటి ఒక exam రాయడానికి పులివెందుల వెళ్లాం, మా ఇద్దరితో పాటూ నాకు బాగా ఇష్టమైన ఇంకో ఫ్రెండూ (ఆ పిల్ల వాళ్ల ఊరివాడే), వాళ్ల HM కూడా ఉన్నారు (అంట!)  నాకు వాళ్లేం కనిపించలేదు, అప్పుడప్పుడూ వినిపించే వాళ్లు అంతే. ఆరోజు ఆపిల్ల్ల అల్లుకొచ్చిన జడ చూసి ( ఒక డీప్  breath ) జిల్లుమన్నాను, కానీ మా స్కూల్ టీచర్లే ఘొల్లుమన్నారు, తాలుకాలో సెకండ్ వచ్చినాగానీ, ఒక్క మార్కులో ఫస్టు పోయిందనీ వాళ్ల ఏడుపు. నేనవేం పట్టీంచుకునే స్థితిలో లేను.
ఇంటికెళ్లిన నేను, సాయంత్రం అమ్మతో కలిసి గేదెలకి గడ్డికోసుకు రావడానికి వెళ్లాను. నల్లరేగడి చేలల్లో మట్టినిచూసి, దీన్ని మంచి నూనెతొ తడిపి, అమ్మ చపాతికి గోధుమ పిండిని కలిపినట్లు కలిపి సాగదీసి, లేపాక్షి నుంచి కళాకారుల్ని రప్పించి (లక్షINR అయినా), దానిమీద కురుల పాయలు చిత్రించినా ఆపిల్ల జడకి సాటి రాదని డిసైడ్ అయ్యాను. అంతలో ఆగెట్టు నుంచి అమ్మ పిలిస్తే,కాదు కాదు అరిస్తే, కోసిన గడ్డి సందిట్లో ఎత్తుకుని పరుగెత్తుంటూ వెళ్లాను. ఎంత గడ్డి కోసినా మొత్తం తనే ఎత్తుకొచ్చేది ఇంటిదాకా, నన్ను అస్సలు మోయనిచ్చేదికాదు అమ్మ. కానీ, దార్లో వచ్చేటపుడు ఊపుకుంటా రావడం నాకు నచ్చక, ఆపై వారం అమ్మతో వాదించైనా ఒక సందెడు మోసుకొద్దామని అనుకున్నా. కానీ ఆపై వారమ్ నుంచీ అటువైపెళ్లడమే మానేశాను, పబ్లిక్ పరీక్షల్లో మండలం ఫస్టు రావాలని, ఆదివారంకూడా extraగా లెక్కలు చెప్పించేవాడు మా శ్రీనివాస రెడ్డి (మా కరెస్పాండెంట్ లెండి).

ఇంతలో వచ్చిన SMS సౌండ్ కి, మా ఊళ్లో ఉన్న నేను కాకినాట్లో మేల్కొన్నాను. ఒక చిరునవ్వుకుని, ఆ particular పిల్లకి కాల్ చేశాను. మోగుతోంది. కొన్ని క్షణాల్లో ఆ routine ట్రింగ్ ట్రింగ్ కి బదులు మెత్తని మెలోడి వింటానని ఉర్రూతలూగిపోతున్నాను.
ఇంతలో "హలో", ఆ particular పిల్లే
"Hi, ఎలా ఉన్నావ్?", అదేదో నా కాల్ కోసం ఎదురుచూస్తున్నట్లు.
"ఎవరు?"
"<నా పేరు> ని"
"ఆ..,ఎవరు?" , పావు ప్రాణం పైకెళ్లి పోయింది.
పిట్టగోడ మీది కాళ్లు కిందకి దిగినయ్, చైర్లోని వీపు విశ్రాం నుచి సావధన్ లోకి వచ్చింది.
"నేను,<మల్లి  నాపేరు>ని,టెంత్ క్లాస్, ట్యూషన్,....."ఇలా చెప్పుకుంటూ ఒక 2 నిముషాలు నన్ను నేను బ్రతికించు కునే ప్రయత్నం చేశాక కూడా గుర్తురాలేదు, నిముషానికి పావు చొప్పున మొత్తం ముప్పావు ప్రాణం పోయింది(తీసేసింది). అయినా సరే, until my last blood drop goes blue అనుకుంటూ టెంత్ క్లాస్లో ఎవరూ touchలో లేరా అని అడిగా.
"ఆ, <ఒక పేరు>ఒక్కడితోనే అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉంటా"నంది.
ఆ ఒక్కణ్ణి నాకు bold, italicలో వినిపించి, మొత్తం ముగించేసింది (మిగిలిన పావు ప్రాణం).
సర్లే ఇంకెప్పుడైనా చేస్తానని చెప్పి cut చేసి, నా గర్వము సర్వమూ ఖర్వము అయినందుకు బాధపడి, ఆ ఒక్కణ్ణి తలచుకున్నాను. వాడెవరనుకున్నారూ, మాతో పాటూ ఆ exams రాయడానికొచ్చిన వాళ్ల స్కూల్ టాపర్. (వీడెవడోగాదు, విష్ణు భక్తుడే, విజయుడే అన్నట్లు). మంచోడు, మనలాగ్గాదు. వాళ్లూరెల్లినపుడు వాళ్లింటికి కూడా వెళ్తూంటాను (అతనొక Doctor ఇపుడు), కానీ ఎప్పుడూ ఆ particular పిల్ల ప్రస్తావన మాత్రం తేలేదు, పూర్తిగ చచ్చేక ఇంకా suicide ఎందుకని.

ఇంతలో మెట్లమీంచి "అయ్యకి తెలియకుండ అమ్మా అనిపిస్తవా, వస్తవా, వస్తవా"  అనుకుంటూ పైకొచ్చాడు, మా రూమ్మేట్ (మా వాడు విక్రమార్కుడు, అనుకుంటున్నారా, అదేంగాదు ఆ cinema ని 5సార్లు చూశాడు anand complexలో). "ఏంట్రా exam దగ్గరికొచ్చేసరికి భయం పెరిగిందా ఏంటి? face లో ప్రేతకళ తాండవిస్తొంది" అని అడిగాడు.
"మరి చచ్చిపొతే అంతే కదరా" అన్నాను మొహం మాసిపొయి ఉన్న నేను.
చేతిలో ఫోనూ, మొఖంలో బాధ, నోట్లో ఇలాంటి పదాలూ  చూసి, ఊర్లో ఎవరో ఉష్ ఫటాక్ అనుకుని "ఏమైందిరా?" అని మెల్లిగా అడిగాడు మావాడు. ఆ యొక్క telephone episode మొత్తం telecast చేశాక, "థూ, నువ్వూ నీ కామం, మూర్రోజుల్లో (Feb 8) GATE పరీక్ష పెట్టుకుని, ఏంట్రా నీ కుప్పిగంతులు? కరువు నా ....." (తర్వాత వినిపించలేదు), అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్లి పొయాడు. నామీద నాకే చిరాకేసి వెళ్లి, ACE material ముందు కుర్చున్నాను.మొహం తుడుచుకుంటూ బయటికొచ్చిన మావాడు, "నిజంగానే గుర్తు పట్టలేదంటావొరే ఆ పిల్ల??" అని అన్నాడు. "ఏమో లేరా ఇంకా అదెందుకు, ఉంకో నంబర్ ఉంది దానికి చేద్దామేంటి?" అని వాడి వైపు చూశాను.
నవ్వాలో ఏడవాలో తెలీక వాడు నన్ను చూసిన ఒక particular చూపు ఉంది చూశారూ,అదే ఈ post కి title అనమాట. ఆయ్ ఉంటానండి, మిగిలిన అరెండూ ఇంకెప్పుడైన చెప్పుకుందాం.