Wednesday, November 28, 2012

ఒక particular చూపు


నాకదేంటో మాంచి peak timeలో ఉన్నపుడే, off the track వెళ్దామని అన్నీ లాగుతుంటాయ్, అంటే ఒక్కోసారి ఒక్కోటనమాట లెండి.
మచ్చుక్కి మూడొదలమంటారా,
సరే సరదాగా ముడున్నర్రేల్లు ఎనక్కెళ్తే, 2009 Feb 5, evening 5PM, అదేదో కాకినాడ మొత్తం మునిగి పోతున్నట్లు, అప్పటికప్పుడు mobileలో ఉన్న ఒక్కగానొక్క ఆడ నంబర్ కి కాల్ చేసి, అప్పటికి ఆరేళ్ల క్రితం (అంటే, రాజా బాబు పదవ తరగతి లో) interest ఉన్న ఇద్దరమ్మాయిల phone నంబర్లు అంది పుచ్చుకుని,
కాకినాడ రమణయ్య పేట లో రెండవ అంతస్తులో ఉండే మా రూం బయటకి వచ్చి, వాకాలపూడి మీదుగా ఉప్పాడ బీచ్ మీంచి వీచే గాలి పీలుస్తూ, వారసత్వంగా సీనియర్లనుంచి చదువుకోడానికని  సంక్రమించిన స్టడీ చైర్ మీద కూచుని, పిట్టగోడ మీద కాళ్లు పెట్టి, "ముందు ఎవరికి చేద్దామా ?" అని ఇస్రో వాళ్లు చంద్రయాన్ కి చేసినంత మేథో మథనం చేసి ఒక అమ్మాయ్ ని డిసైడ్ అయ్యాను.

ఈ particular పిల్ల గురించి కొంత చెప్పుకోవాలి. పాపకి పిల్లోలందరూ ఫాలోఅర్సే, పైకి చెప్పుకునేవారు కాదంతే, పిల్లతనానికే చిన్నతనం మరి. నాకైతే ఆడ పిల్లలు అందంగా కూడా ఉండగలరని(:P) ఆ ట్యూషన్ కెళ్లాకే అర్థమైంది. ఒకసారి నేర్చుకుంటే ఇక మర్చిపోలేరు, అలాంటి పాఠమా పిల్ల.
ఇంతకీ ఆ ట్యూషన్ మా పక్కూర్లో. అది మా మండల కేంద్రం. ఆ ట్యూషన్ మాష్టారు మా ఉళ్లో ఉన్న పదవ తరగతి పిల్లల ఇళ్లకొచ్చి, చేర్పించమని వాళ్ల పెద్దలని అడిగి మరీ పట్టుకెళ్తున్నాడు. అలా మా ఇంటికొచ్చినపుడు, 500 మార్కులు  (600కి) గ్యారెంటీగా తెప్పిస్తామని మా నాన్నతో చెప్పి, సరదగా Englishలో ఒక active voice sentence చెప్పి, passiveలో చెప్పమన్నారు. నేను చెప్పలేక పోయాను. అది చూసి ఆ మాష్టారు మా నాన్నకి బంపర్ ఆఫర్ ప్రకటించాడు పాస్ ఐతేనే ఫుల్ ఫీ, లేకపోతే సగమే చాలన్నాడు. అని వెళ్లిపోయాక, నన్నెప్పూడూ ఒక్క మాట కూడా అనడానికి ఇష్టపడని మా నాన్న "అది కూడా చెప్పకపొతే ఎలాగరా?" అని కొద్దిగా కోపం (బాధ?) పడ్డాడు, మరి ఆయన ఒక స్కూల్ టీచరు, పైపెచ్చు నాకు సెవంతు క్లాసులో English కూడా చెప్పాడు. మొత్తానికి నన్ను ఆ ట్యూషన్ కి వెళ్లమన్నాడు. అక్కడ నేర్చుకున్న పాఠాల్లో ఒకటి  పైన్నే మీకు ఒప్పజెప్పాను.

కొన్నాల్లకి నేను ఆ ట్యూషన్ మానేసి,వేరే స్కూల్లో చేర్తున్నానని తెలిసి ఆ ట్యూషన్ మాష్టారు , మా ఇంటికొచ్చి, మా నట్టింటికొచ్చి, నాన్నకి నచ్చజెప్పి అక్కడే ఊంచుకుందామని విశ్వ ప్రయత్నాలూ చేశి, వీలుకాక వెళ్లి పోయాడు. అది వేరే విషయం.
అయినా కానీ ఆ particular పిల్ల తో కలిసి కొన్నిcompititive examలు రాసే అవకాశం దొరకడం చేతనూ, కొన్ని ప్రయాణాలు కలిసి (వాళ్ల HM కూడా ఉన్నాడు లెండి) చేయడం చేతనూ, బాగా చదువుతానని (అప్పుడు లెండి) మా మండలమంతా (అంటే 5 హైస్కూల్లనమాట) పేరుండడంచేతనూ, పెద్ద బాధపడ లేదులెండి.
రోజులు అలా గడుస్తున్న సమయంలో, ఒకానొక ఆదివారం అల్లాంటి ఒక exam రాయడానికి పులివెందుల వెళ్లాం, మా ఇద్దరితో పాటూ నాకు బాగా ఇష్టమైన ఇంకో ఫ్రెండూ (ఆ పిల్ల వాళ్ల ఊరివాడే), వాళ్ల HM కూడా ఉన్నారు (అంట!)  నాకు వాళ్లేం కనిపించలేదు, అప్పుడప్పుడూ వినిపించే వాళ్లు అంతే. ఆరోజు ఆపిల్ల్ల అల్లుకొచ్చిన జడ చూసి ( ఒక డీప్  breath ) జిల్లుమన్నాను, కానీ మా స్కూల్ టీచర్లే ఘొల్లుమన్నారు, తాలుకాలో సెకండ్ వచ్చినాగానీ, ఒక్క మార్కులో ఫస్టు పోయిందనీ వాళ్ల ఏడుపు. నేనవేం పట్టీంచుకునే స్థితిలో లేను.
ఇంటికెళ్లిన నేను, సాయంత్రం అమ్మతో కలిసి గేదెలకి గడ్డికోసుకు రావడానికి వెళ్లాను. నల్లరేగడి చేలల్లో మట్టినిచూసి, దీన్ని మంచి నూనెతొ తడిపి, అమ్మ చపాతికి గోధుమ పిండిని కలిపినట్లు కలిపి సాగదీసి, లేపాక్షి నుంచి కళాకారుల్ని రప్పించి (లక్షINR అయినా), దానిమీద కురుల పాయలు చిత్రించినా ఆపిల్ల జడకి సాటి రాదని డిసైడ్ అయ్యాను. అంతలో ఆగెట్టు నుంచి అమ్మ పిలిస్తే,కాదు కాదు అరిస్తే, కోసిన గడ్డి సందిట్లో ఎత్తుకుని పరుగెత్తుంటూ వెళ్లాను. ఎంత గడ్డి కోసినా మొత్తం తనే ఎత్తుకొచ్చేది ఇంటిదాకా, నన్ను అస్సలు మోయనిచ్చేదికాదు అమ్మ. కానీ, దార్లో వచ్చేటపుడు ఊపుకుంటా రావడం నాకు నచ్చక, ఆపై వారం అమ్మతో వాదించైనా ఒక సందెడు మోసుకొద్దామని అనుకున్నా. కానీ ఆపై వారమ్ నుంచీ అటువైపెళ్లడమే మానేశాను, పబ్లిక్ పరీక్షల్లో మండలం ఫస్టు రావాలని, ఆదివారంకూడా extraగా లెక్కలు చెప్పించేవాడు మా శ్రీనివాస రెడ్డి (మా కరెస్పాండెంట్ లెండి).

ఇంతలో వచ్చిన SMS సౌండ్ కి, మా ఊళ్లో ఉన్న నేను కాకినాట్లో మేల్కొన్నాను. ఒక చిరునవ్వుకుని, ఆ particular పిల్లకి కాల్ చేశాను. మోగుతోంది. కొన్ని క్షణాల్లో ఆ routine ట్రింగ్ ట్రింగ్ కి బదులు మెత్తని మెలోడి వింటానని ఉర్రూతలూగిపోతున్నాను.
ఇంతలో "హలో", ఆ particular పిల్లే
"Hi, ఎలా ఉన్నావ్?", అదేదో నా కాల్ కోసం ఎదురుచూస్తున్నట్లు.
"ఎవరు?"
"<నా పేరు> ని"
"ఆ..,ఎవరు?" , పావు ప్రాణం పైకెళ్లి పోయింది.
పిట్టగోడ మీది కాళ్లు కిందకి దిగినయ్, చైర్లోని వీపు విశ్రాం నుచి సావధన్ లోకి వచ్చింది.
"నేను,<మల్లి  నాపేరు>ని,టెంత్ క్లాస్, ట్యూషన్,....."ఇలా చెప్పుకుంటూ ఒక 2 నిముషాలు నన్ను నేను బ్రతికించు కునే ప్రయత్నం చేశాక కూడా గుర్తురాలేదు, నిముషానికి పావు చొప్పున మొత్తం ముప్పావు ప్రాణం పోయింది(తీసేసింది). అయినా సరే, until my last blood drop goes blue అనుకుంటూ టెంత్ క్లాస్లో ఎవరూ touchలో లేరా అని అడిగా.
"ఆ, <ఒక పేరు>ఒక్కడితోనే అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉంటా"నంది.
ఆ ఒక్కణ్ణి నాకు bold, italicలో వినిపించి, మొత్తం ముగించేసింది (మిగిలిన పావు ప్రాణం).
సర్లే ఇంకెప్పుడైనా చేస్తానని చెప్పి cut చేసి, నా గర్వము సర్వమూ ఖర్వము అయినందుకు బాధపడి, ఆ ఒక్కణ్ణి తలచుకున్నాను. వాడెవరనుకున్నారూ, మాతో పాటూ ఆ exams రాయడానికొచ్చిన వాళ్ల స్కూల్ టాపర్. (వీడెవడోగాదు, విష్ణు భక్తుడే, విజయుడే అన్నట్లు). మంచోడు, మనలాగ్గాదు. వాళ్లూరెల్లినపుడు వాళ్లింటికి కూడా వెళ్తూంటాను (అతనొక Doctor ఇపుడు), కానీ ఎప్పుడూ ఆ particular పిల్ల ప్రస్తావన మాత్రం తేలేదు, పూర్తిగ చచ్చేక ఇంకా suicide ఎందుకని.

ఇంతలో మెట్లమీంచి "అయ్యకి తెలియకుండ అమ్మా అనిపిస్తవా, వస్తవా, వస్తవా"  అనుకుంటూ పైకొచ్చాడు, మా రూమ్మేట్ (మా వాడు విక్రమార్కుడు, అనుకుంటున్నారా, అదేంగాదు ఆ cinema ని 5సార్లు చూశాడు anand complexలో). "ఏంట్రా exam దగ్గరికొచ్చేసరికి భయం పెరిగిందా ఏంటి? face లో ప్రేతకళ తాండవిస్తొంది" అని అడిగాడు.
"మరి చచ్చిపొతే అంతే కదరా" అన్నాను మొహం మాసిపొయి ఉన్న నేను.
చేతిలో ఫోనూ, మొఖంలో బాధ, నోట్లో ఇలాంటి పదాలూ  చూసి, ఊర్లో ఎవరో ఉష్ ఫటాక్ అనుకుని "ఏమైందిరా?" అని మెల్లిగా అడిగాడు మావాడు. ఆ యొక్క telephone episode మొత్తం telecast చేశాక, "థూ, నువ్వూ నీ కామం, మూర్రోజుల్లో (Feb 8) GATE పరీక్ష పెట్టుకుని, ఏంట్రా నీ కుప్పిగంతులు? కరువు నా ....." (తర్వాత వినిపించలేదు), అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్లి పొయాడు. నామీద నాకే చిరాకేసి వెళ్లి, ACE material ముందు కుర్చున్నాను.మొహం తుడుచుకుంటూ బయటికొచ్చిన మావాడు, "నిజంగానే గుర్తు పట్టలేదంటావొరే ఆ పిల్ల??" అని అన్నాడు. "ఏమో లేరా ఇంకా అదెందుకు, ఉంకో నంబర్ ఉంది దానికి చేద్దామేంటి?" అని వాడి వైపు చూశాను.
నవ్వాలో ఏడవాలో తెలీక వాడు నన్ను చూసిన ఒక particular చూపు ఉంది చూశారూ,అదే ఈ post కి title అనమాట. ఆయ్ ఉంటానండి, మిగిలిన అరెండూ ఇంకెప్పుడైన చెప్పుకుందాం.

Monday, November 26, 2012

మనో సాంత్వనము

 తనని మోసే మాటలు పుట్టక
మౌనంగా కూలబడింది మనసొక మూలగా...!
-----------------------------------------------------------------------
రాయవలెనుగానీ, ఇదిగూడ నొక రాధికా సాంత్వనమే.

మనో పరిమళాన్ని మానవోత్తమునికి ముట్టజెబుదామనుకుంటిమి, మాటల మాలగా,
ఏదీ పలకదే, పదఝరి పారదే, ప్రభువుని చేరదే;

స్వామి సంకేతమేమైన చిక్కెనా, సుర నర లోకముల మధ్యన,
దేవేరి మంజుల మంజీరజముల బడి, నా మొర వినగలేదో,
వినిగూడ ఊరకనుండినాడో, లేక విసిగినాడో ;
-----------------------------------------------------------------------

వలదు, వలదు
వరములెవరడిగిరి నిను, వాక్కులు గాని; కనకములెవరడిగిరి నీ కృతులుగాని.

Friday, November 2, 2012

తపనలకేం లే, చాలా తేలిక.....!


నువంత easyగా నవ్వవని తెలిశాక, నిన్ను నవ్వించాలనే..... నాతపన.
నిన్న నువు రాకపొతే, ఎందుకు రాలేదని అడుగుదామని,
          నిన్నంతా నిన్నే తలచుకున్నానని చెప్పాలని, నాతపన.
ఎదో వంకతో నిన్ను చూడాలని,
          ఆ నా ప్రయత్నాలలో ఎదోసారి నీకు దొరికిపోవాలని, నాతపన.
ప్రతి రోజు నువు తొందరగా రావాలని, రాగానే నన్ను చూసి కళ్లతోనే కొంటెగా నవ్వాలని, నాతపన.
మెట్లమీద ఒక్కసారైనా ఎదురవ్వాలని,
          కలిసొక్కసారైనా కాఫీ తాగాలని, నాతపన.

నాకు తెలీకుండానే వింటున్నావని నువు అనుకునేలా, నేనో విరహగీతం hum చెయ్యాలని,
         తరువాతెప్పుడో, lunch చేస్తూ "నువు వినాలనే పాడా"నని ఒప్పుకోవాలని, నాతపన.

జంకుతూనైనా, "జుట్టు జడవేసుకున్నపుడు బావుంటా"వని చెబుదామని, నాతపన.

ఇదంతా, కేవలం నువ్వు వినేలా చెప్పాలని,
                 కానీ అం...దరూ చదివేలా రాయాలని, నాతపన.