Friday, April 14, 2017

మంచింగ్ మాటలు - మూడో పొట్లం !!!



ఒకడు    :  ఓరి బాబో, next week నుంచి వీణ్ని పిలవద్దురా. "అమ్మాయి", "అమ్మాయి" అని అస్తమానం bore కొడుతున్నాడు.

ఇంకోడు :  భయ్యా, నీకర్థం కావడం లేదు భయ్యా!

ఇప్పుడూ, అమ్మాయి లేని జీవితం అంటే, tune చేయని lyric లాంటిది; నీకంత రసం లేదుగదా!
పోన్లే, సచిన్ లేని cricket లాంటిది భయ్యా; నీకదిగూడా తెలీదు కదా!

అయ్యో!
ఇలాగాదుకానీ, water కలపని పెగ్‌లాంటిది భయ్యా, అమ్మాయి లేని జీవితం.

ముందోడు : ఇదిగో ఇలాంటి సొల్లు చెప్పుకోడానికి తప్ప ఇంకెందుకూ పనికిరారు భయ్యా అమ్మాయిలు. వాళ్లు బొక్క భయ్యా అంటే వినరేందిరా మీరు!

అందరూ ఒకేసారి: next week నుంచి వీణ్ని రానివ్వద్దురా.

-----------------------------------------------------------------------------------------------------1

"ఎర్ర జాబిలి చేయి గిల్లడాలూ", "పిల్ల గాలి బుగ్గ నిమురడాలు" మీకున్నట్టే, "గళ్లసొక్కాలు గుండె నొక్కడాలు" మాకూ ఉంటాయ్.

-----------------------------------------------------------------------------------------------------2

ఒకడు     :  ఏరా, ఆ పిల్లతో మాట్లాడతా అన్నావ్ గా, మాట్లాడావా?
నేను       :  ఆ, మాట్లాడారా.
అందరు :  మాట్లాడావా? ఏం మాట్లాడావ్?

నేను :  హాయ్!
తను :  హాయా? ఎవరు మీరు? ఏం కావాలి?
నేను :  నేనా, నేను, నేనో స్వరపరచని సిరివెన్నెల సాహిత్యాన్ని, మీలాంటి ఓ మాంచి మెలడి కోసం వెయిటింగ్.

అందరు   :  ఆ, తనేమంది ?
నేను         :  ఏమంటుంది, నన్ను పైకి, కిందకి చూస్తూ వెళ్లిపోయింది.

-----------------------------------------------------------------------------------------------------3

అవునా?

దేశ భాషలందు తెలుగు లెస్స!

ఎన్నోసార్లు విన్నా, అన్నేసార్లు గర్వంగా చెప్పుకున్నా (జనాలకి). అసలింతకీ, అది నిజమేనా? లేక, కావ్యానుసారంగా చెప్పినదేనా?  ఆ చెప్పిన కృష్ణదేవరాయలకైనా దేశంలోని అన్ని భాషలూ తెలుసా? ఆయన దేశంలో నాలుగైదు కంటే ఎక్కువ భాషలు లేవనుకుంటా, కానీ ఇప్పుడో? ఇప్పుడు లోకమంతా ఒకే భాషనుకుంటాగా! ఇప్పుడు కూడా తెలుగు భాషే లెస్సా? ఎవరి మాతృభాష వారికి తీపి కాదా?


అసలు, ఏ భాషైనా ఎందుకు గొప్పదవుతుంది? మిగిలిన భాషలు నాకెన్ని తెలుసనీ, వాటి గురించి నాకేంతెలుసనీ, నేనిన్నాళ్లు గర్వంగా చెప్పుకున్నా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడం వల్ల నాకేంటి ఉపయోగం, లేకపొతే ఏంటి నష్టం? తెలుగు చదివేంత, తెలుగు సినిమాలు చూసేంత మరియు తెలుగు రాష్ట్రాల్లో బ్రతకడానికి సరిపడేంత తెలుగు తెలిస్తే చాలదా? పండితుడు అనిపించుకునేంత తెలియాలా? కాలానుగునంగా, మారుతున్న అవసరాలకి తగ్గట్లు, తెలుగు కూడా మనకేమైనా ఉపయోగపడగలదా? లేదా, ఇంగ్లీషు రాని తెలుగువారితో మాట్లాడేందుకేనా? ఇంతకీ, ఇవాళ మన జీవితాల్లో తెలుగు పాత్ర ఎంత? అది క్రమేనా తగ్గుతోందా?


ఒకవేళ ఏ కారణం చేతనైనా, తెలుగు వాడకం నశించి, ఒక నాలుగైదు దశాబ్దాల తర్వాత తెలుగు మాట్లాడేవారే ఉండరనుకుంటే, అప్పుడు కలిగే నష్టాలేంటి? ప్రంపంచంలోంచి ఒక సంస్కృతి మాసిపోతుందా ? కొంత(ఎంత?) సాహిత్యం చనిపోతుందా ? మన భావితరాల మనుగడకేమైనా ముప్పు వాటిల్లనుందా? ఎందుకీ ప్రభుత్వాలూ, నేతలు, భాషావేత్తలూ మొత్తుకుంటున్నారు? అదంతా ఏంలేదు నాదంతా అక్కర్లేని కంగారా?


శోధించడమే జీవన విధానంగా అలవరచుకుంటున్న మనం, ఈ ప్రశ్నలకి జవాబులు సాధించగలమా?  తెలుగు భాష గొప్పదనాన్ని నిలదీయటం మా ఉద్దేశం కాదు, దాన్ని ఎరిగి ఉండటం మన బాధ్యత అని గుర్తుచేయడమే మా ఉద్దేశం.

(తెలుగుతోట 2017 సంపాదకీయం, TSS, IISc, Bangalore)