Monday, March 29, 2010

నువ్వే నువ్వే........


నను నడిపే ఆశవి నువ్వే

నను నిలిపే శ్వాసవి నువ్వే
నన్నూరించే రేపువి నువ్వే
నన్నలరించే నేటివి నువ్వే
నను పిలిచే గెలుపువి నువ్వే
నన్నొదార్చే తలపువి నువ్వే
నాకైన పిలుపువి నువ్వే
నాదైన వలపువి నువ్వే
నను తొలిచే బాధవి నువ్వే
నే తలచే(వలచే) రాధవి నువ్వే
నాలోని ప్రాణం నువ్వే
నాలోని బాణం నువ్వే
నాకున్న మోహం నువ్వే
నాదైన మోదం నువ్వే
నాలోని భారం నువ్వే
నేకన్న కల,
నాకన్నుల అల,
నేనున్న వల నువ్వే ......
నను వెదకడం లోనే నేను తప్ప, వెదకిన నేనంతా నువ్వే.. ...

Wednesday, March 24, 2010

రాలేవా ?

రాగాలు పల్లవించ రాలేవా నాలో
భావాలు బాధించ చెబుతున్న నీతో
బతుకు బంధాలు నెరపగ ఆశ నాలో
గేయాన్ని స్రవించు గాయనివైనావె, వలపు గానానివి కాలేవా నాకై
రాలేవా ? ఉండి పోలేవా మనమై.....?

మా తరం



కులం గోడల రాతి సరం కూలగొట్టే మోటుతనం, మా తరం
అఙ్ఞానజాచారపు అంతు చూసే ఆత్రం,మా తరం
ధరాభారాన్ని సైతం మోయగల మొండితనం,మా తరం
లోపాలకు శాపం,మా తరం
నిర్విద్యా అనారోగ్యపు అంతం,మా తరం
పేదరికం పారద్రోలు పంతం,మా తరం
అవినీతిని ఆరబెట్టు యంత్రం,మా తరం
తరతరాల అసమర్థతను అంతమొందించు అస్త్రం,మా తరం
ఇలాతలాన ఇనకులేశు శస్త్రం,మా తరం
నేర్పుల నేటితనం,మా తరం
ఓర్పుల హుందాతనం,మా తరం
విజయపు వేదికకు వన్నె తెచ్చు కేతనం,మా తరం
చావు చింత లేని చకోరం,మా తరం
శౌర్యం శోభిల్లు శాంతం,మా తరం

Sunday, March 21, 2010

ఏల


ఏల ఈ వేళ ఆ పూల తావి తీరిక చేసుకొని నను చేరింది..
పిల్లగాలి పిలవకుండానే పలుకుతోంది, తన పరిమళంతో...
సగం ధాత్రిని జయించిన ఈ రాత్రి, రేపనే తీపిని చూపుతోంది కైపుగా
ఏల మనోమౌనంలో ఈ అశల గుసగుసలు, అశయాల అల్లర్లు(అలరులు)

రేపటి కాపు తీపి కాబోలు...!

కవితా..ఓ నా ప్రియ భవితా... !



కవితా..ఓ నా ప్రియ భవితా...అందుకో నా ఈ జ్యోత...!
నా ఈ కేకలతో, నీ కాకలు తీరవా.....?
నా కూర్పుల కైమోడ్పు నిను కరిగించలేదా,
లేక నా పదముల పాన్పున పవళించలేదా...?
నా పేర్పును ప్రేమించలేదా ..?
ఐనా
కవితా..ఓ నా ప్రియ భవితా...అందుకో నా ఈ జ్యోత..!

వ్యర్థమేనా...?




తన అనురాగాన్ని అర్థించలేని నీ మౌన వేదన
తనకు కానరాని విరహ రోదన
తనను చేరలేని రాగాలాపన
తన ఎరుకకు రాని యాతన
తన కౌగిట(కొంగింట) చేర్చగలేని నీ కాలయాపన

వ్యర్థమేనా...? అవునేమో....!

Monday, March 8, 2010

విరహం




మనసు ప్రసవ వేదనతో జన్మనిచ్చిన విరహ వాక్యాలు......
ఏ వేల్పు కి వివరించను ఇంతైన నా విరహాన్ని...?
నీ ప్రియరాగాలు లేని నా జీవన సంగీతానికిక సంస్కారాలు సలుపనా...?
నీ ప్రతిష్ఠ కాని నా ప్రణయాళయాన్నిక పెకలింతునా...?
నీ పరవశాలనొడిసి పట్టుకోలేని నా మనోఫలకాన్ని వ్రయ్యలు సేతునా...?
నా నెచ్చెలి చెలిమి చాయలో మసలి, మసి చేయదలచిన వైరి వరుసలనేమి సేతును...?
నీ అధర మధురాక్షరాల గ్రోల లవలేశ భాగ్యమైనా లేని మత్ కర్ణపటములకెంతటి ఖర్మము..?
కాకేమి....?
నా ఏ గత కృతము నన్నీగతి గురి చేసెనో కదా..!

కరుణిoపుము మాతా..!



భవదీయ భానుప్రియా భాసిత
పండిత ప్రియ పదములు పరిమళింపగ పద పుష్పార్చన ప్రియముగ సలుప
మత్ మనో మర్కటమును మచ్చిక జేయ
కించిత్ కృపను కరుణిoపుము మాతా!
నా కవన వన విహారమున మోదము బడసి
మేమానందింప కించిత్ కృపను కరుణిoపుము మాతా..!
( భవదీయ విహారమున నా కవన వనమును వసంతం వరియింపగ కించిత్ కృపను కరుణిoపుము మాతా..!)

భయం




భయం! మనో భూమిలోని భవనాలకది భూకంపం...
పెరుగును లోన భారం,కదలదు కాలం,
నేడు నిన్ను వినదు,రేపు రాక మానదు
సన్నగిల్లును నమ్మకం,పెచ్చరిల్లును అభధ్రతాభావం,
దరిజేరవు కలలు,నిను వీడును కళలు,
కనలేవు కలిమి,బడయగ లేవు బలిమి,చేయలేవు కూరిమి,
కనెదవపాయం,కనలేవు తరుణోపాయం,
భయం..!
అదే ఒక భయంకరం..!
వరించదు విజయం,సంభవించును శీల దారిద్ర్యం,
భయం..!
చేస్తుంది నిన్నది సగం, ఆపై శూన్యం..!