Saturday, March 7, 2020

మా బానుమతి ఆంటీ బడాయి (Episode-1)

(అన్ని Episodes ఇక్కడ దొరుకుతాయి.)
 
 మా సందులో ఒగ ఆయ్మ ఉండాది, ఆయ్మ పేరు బానుమతి. మేమంతా బానుమతి ఆంటీ అంటాం. ఆయ్మ బడాయి బండ్లమీద పోతాదనుకో. అంటే, ఆంటీ శానా బడాయి పడ్తాది అని అర్తం.  గోరోజనం అంటారుజూడు అది. ఈపుద్దు ఆయ్మ కత జెప్తా, బో... కామెడీగుంటాది. తులసి సిన్మాలోండే  కోకాపేట ఆంటీకి యామాత్రం తగ్గదు మాంటీగూడ. జీవిత చెరిత్ర మాదిరిగాకుండా, నాకు మతికుండే తమాసలు మాత్తరం మాట్టాడుకుందాం.

ఈమద్యనే వాల్ల పెద్దబిడ్డ  రింకూ రెడ్డి పెండ్లి ఐంది. ఓయ్మ! సెప్పవట్టదులే ఆయ్మ సెకలూ, ఆయ్మ బిడ్డ సెకలు.  ఓ రెణ్ణెల్ల ముందర మాసందులో ఇంగో పాప పెండ్లిగుడక ఐంది. ఆ పాప పేరు బుజ్జి. ఇంగజూడు, వాల్ల దగ్గరకే పొయ్ వీల్ల పెండ్లి గురించి బడాయి పడ్తాంది. ఆంటీ వాల్లు బానే ఉన్నోల్లేగాని, బుజ్జి వాల్లు ఇంగా రొంత ఎక్కువ ఉన్నోల్లు, కాబట్టి పెండ్లి గ్రాండుగా జేసినారు. బుజ్జి పెండ్లిలో బాగా పిల్సుకున్న్యారు గాబట్టి దగ్గరదగ్గర ఓ మూడువేల మంది కల్సినారు. అంతగాకపోయినా రింకూ రెడ్డి పెండ్లికి కూడా బానే వచ్చినారు జనం. ఐనాగాని, బానుమతి ఆంటీ "బుజ్జి పెండ్లి కంటే మా రింకూ పెండ్లికే బాగా వచ్చినారుగదా!" అని బుజ్జి వాల్లనే అడుగుతుంది. మరి తెల్సి అడుగుతుందో, తేలీక అడుగుతుందోగానీ, ఆంటీకి గట్స్ ఎక్కువేబ్బ. 'ఆయ్మతో ఎందుకులేబ్బా, తలకాయ నొప్పి' అని, "వచ్చిన్న్యారులే ఆంటీ" అని సెప్తారు.

ఆఁ, అసలీ సంగద్దెలిస్తే బానుమతి ఆంటీ ఎంత కామెడీ విలనో అర్తమైతాది మీకందరికి.  బుజ్జి పెండ్లి ముందురోజు ఇంటికొచ్చిన బందువులతో "రిసెప్షన్ లో  ఏస్కోడానికి గిల్టు నగల సెట్టు తెచ్చుకుంటాననిందే బుజ్జి, తెచ్చుకుందా?" అని అడిగిందట. అసలు విసయమేందంటే, ఆ పాప, పెండ్లికని బెంగుళూరుకుబొయ్, పద్నాలుగు లచ్చలు పెట్టి డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ కమ్మలు, గాజులు తెచ్చుకుందని తెలిసి, ఓర్సలేక, ఎట్టైన గబ్బుపట్టిచ్చాలని పతకం పడిందనమాట ఆంటీ. సూసినారా, పెద్ద కంచు గదా!

జగ్గూ వాల్లక్క మొగుడు దుబాయిలో పన్జేచ్చాడు, రింకూ మొగుడు అమెరికాలో జేచ్చాడు. దాన్నిగూడ వదల్లేదు ఆంటీ. "బొంగులే, దుబాయేముంది, ద.....గ్గెర, అమెరికాకు పొయ్యే ఇమానాలన్నీ దుబాయిమీదనే పోవాలంట" అని సందులో వాల్లకు ప్రపంచపటం జూపిచ్చింది. అల్లుడు ఎంత దూరంలో పన్జేచ్చే అంత గొప్ప, మా ఆంటీకి.

తల్లే అనుకుంటే, బిడ్డ ఇంగొగాకు ఎక్కువే సదివింది, బడాయిలో. మొగం మీదుండే గుల్లలు దాసిపెట్టడానికి దిన్నం బెత్తెడెత్తు ఏస్కుంటుంది మేకప్పు. సందులోకి వొచ్చిందంటే గుప్పున కొట్తాది సందంతా సెంటువాసన. మొన్నటిదాకా హై హీల్స్ ఏసుకుంటాన్న్యాది, రొంత ఎత్తు తక్కవలే. పెళ్లికి ముందు సడెన్గా ఓరోజు సందులోకొచ్చి "హై హీల్స్ ఆరోగ్యానికి మంచివి కాదంట, మానేద్దామనుకుంటాన" అనింది. 'ఈమ్మికి ఇంత సడెన్గా ఆరోగ్యమెందుకు గుర్తొచ్చిందబ్బా?' అని ఆలోచిస్తే తెల్సింది మరుసటి రోజు, 'రింకూ రెడ్డేగాదు, కాబోయే మొగుడుగూడ పొట్టేనని'. 'ఓరి నీ ఏషాలో!' అనుకున్నాం మా సందంతా.

ఆంటీ వాల్ల కుండేది సిన్న ఆల్టో కారు. జగ్గూ వాల్ల కారు పెద్ద SUV. అయినాగాని మన అంటీ, "ఆఁ, మన కార్లేముందిలే జగ్గూ, బుడ్డ కార్లు!" అని మూడు లచ్ఛల ఆల్టోని, పదమూడు లచ్చల SUVని  ఒకగాటికే కట్టేసింది. జగ్గూ గానికి యాన్నో కాలిందిగానీ, పాపం ఏమంటాడు, "నీకు బాతెల్సు ఆంటీ కార్ల గురించి" అని ఊరకున్న్యాడు.

పాపం, ఆ మద్య మాసిన్నమ్మ బిడ్డ రమ్య, డ్రస్ మెటీరియల్ తెచ్చుకోంటే సూసి, "ఇంగా ఎవరేసుకుంటానారు రమ్యా ఇట్లా, ఇప్పుడందరూ టాపులేసుకుంటాంటే!" అనింది. 'అందరూ' అంటే ఆయ్మ కూతుర్లు అని అర్తం. ఇట్లుంటాయి మా బానుమతి ఆంటీ లీలలు.

ముద్దుగా మా సందులో "News channel" అని పిల్చుకుంటారు మా బానుమతి ఆంటీని. ఎందుకంటే అందరి యవ్వారాలు ఆయ్మకే గావల్ల. అంతేనా, నాన్స్టాపుగా నస కూడా పెడ్తాంటాది కాబట్టి.

మీసందులో గుడక ఓ బానుమతి ఆంటీ ఉండాది గదా! 

1 comment: