Tuesday, December 3, 2019

Best scrap

"మనలోని వెధవని వెలికితీసి చూపించేవాళ్లే మన best friends" అని ఒక పెద్దాయన ఎపుడో చెబితే విన్నట్టు గుర్తు. ఆ వెధవని మనకే చూపిస్తారనుకున్నా, కాని, బయటి ప్రపంచానికని తెలీలేదు. Thanks to some of my scrap friends, నాకు బాగా కావాల్సినవారి ముందు (మరి వారేగా మన ప్రపంచం) బాగా embarrass అయిన సందర్భాలు కొన్నున్నాయి. అందులో కొన్ని comedyగా ఉన్నవి చెప్పుకుందాం.

సన్నివేశం-1

ఆ మధ్య PhD రోజుల్లో, ఏదోపని మీద బెంగుళూరొచ్చిన మా అన్న నన్ను కలిసి, ఒక రాత్రి IIScలో నాతో ఉండి పొద్దున్న ఇంటికి వెళ్లేలా plan చేసుకున్నాడు. అందరు తెలుగు యువకుల్లాగే, రాత్రి భోజనానికి దగ్గర్లోని మంచి బిర్యానీ దొరికే restaurantకి వెళదామని KKకి call చేసి రమ్మన్నా, మా home restaurant Akshaya Deluxeకి వెళదామని. బండేసుకుని వచ్చాడు. ముగ్గురం కలిసి, BEL roadలో traffic వాళ్ళకి కట్టిన చలానాలు బాగా గుర్తుండటం వల్ల, మత్తికేరే సందుల్లోంచి వెళ్ళాం, అదో సరదా.

అందరూ, ఆ వయసులో chic magnet అవ్వాలనుకుంటారు, అదేంటో నేను cop magnet అయ్యా. బెంగుళూరులో bike trip వెళ్లిన 90+% సమయాల్లో నేను నడిపిన బండిని traffic cops ఆపారు, (కనీసం) అన్ని వందలూ వదిలాయి, అంత కన్నడ practice కూడా అయింది. 5-6 bikes కలిసి వెళ్లినా, అందరూ తప్పించుకున్నా, నాకు మాత్రం hi చెప్పితీరే వాళ్లు మామలు.  అన్ని సరిగ్గా ఉన్న సందర్భాల్లో కూడా, insurance expire  అయిందని కొన్నిసార్లు,  అది కూడా సరిగ్గా ఉన్నపుడు, bike history check చేసి ఇంతకు ముందు మన వెధవలు చేసిన signal jumpsకి నాతో కట్టించుకునే వాళ్ళు fine. తిరుపతి దేవుడిలాగా  క్రితం జన్మలో ఏ cop దగ్గరో, అప్పుచేసి ఏదో ఘనకార్యం చేసినట్లున్నా, దాని వడ్డీ ఇప్పుకూడా కట్టించుకుంటున్నారు. అలా నేను మా జనాల్లో notorious అయ్యా, cop magnet లాగా.


Akshayaకి reach అయ్యి, ఎముకలు ఉండే బిర్యానీ, లేని బిర్యానీ, మిరియం chicken order చేసి కూచున్నాం. ఇంతలో మనవాడు KK మొదలు పెట్టాడు. మా అన్న doctor అని తెలిసి ఆ directionలో సంభాషణ మొదలుపెట్టడం మంచిదే, ఒక విధం. కానీ, మన వాడికి వాళ్ల నియోజక వర్గం doctor గారి అక్రమాలు, దారుణాలు పూనాయో ఏమో కానీ, ఇవాళ్టి సమాజంలో doctors చేస్తున్న మోసాలు, medical expenses మధ్య తరగతి సమాజంపై గుదిబండలా మారిన తీరు గట్రా మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడికి, మా అన్నే వెనకుండి అంతా నడిపిస్తున్నట్లు.  Hospital chains తో (నిస్సహాయ స్థితిలో కూడా కావొచ్చు) doctors కుమ్మక్కై జనాలని ఎలా ఇబ్బందికి గురిచేస్తున్నారో ఒక అర్ణబ్ గోస్వామి rangeలో దేశసేవ చేస్తున్నవాడిలా  feel అయ్యి వివరిస్తున్నాడు ఆయనకే.

"ఏందిరా అయ్యా ఇది, మొదటిసారి lifeలో కలవడం ఆయన్ని; మొదటి మాటలు  గొప్ప encouragingగా, memorableగా లేకపోయినా పర్లేదు, కానీ, పనిలేని TV channel వాళ్ళు పిలిచి చేసే పనికిమాలిన interviewకి ఏమాత్రం తీసిపోకుండా ఉందేంది సామి నీ పనితీరు" అని నేను  భయపడుతున్నా. అయినా, మన వాడు మెదడు ఇందాక వచ్చేప్పుడు labలోనే పెట్టివచ్చినట్లు  రెచ్చిపోతున్నాడు ferformanceతో. ఆపుదామని conversation divert చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తున్నాడు. అక్కడికి మా అన్నేదో ఇటీవలే అక్రమమేదో చేసి పట్టుబడినట్లు class పీకుతున్నాడు. Food వచ్చినా, నేను గిచ్చినా, వినే స్థితిలో లేడు. అసలు మేము కలిసేదే సంవత్సరానికి ఏ 3-4 సార్లో (PhD మరియు medicine పుణ్యమా అని). అలాంటిది, plan చేస్కోకుండా కుదిరింది కదాని కలవడానికి వస్తే, ఇదీ నా ద్వారా  ఆయన పొందిన welcome.

అప్పుడప్పుడే PG గట్రా అవజేస్కొని, "హమ్మయ్య! ఇప్పటికి కొంచెం free అయ్యాం" అనుకుంటూ పాపం మాములు సమాజంలోకి వస్తున్న time ఆయనకి. మనదేముంది భయ్యా, EAMCET రాస్తే చాలు Engineer అయిపోయినట్లే, అన్ని కాలేజీలు, సీట్లు, reimbursements. మధ్య తరగతిలో పుట్టి, Open categoryలో government medical seat సంపాదించి, doctor అవ్వాలంటే ఎంత కష్టమో ఎలా మరిచిపోయాడో మన scrap మచ్చా అని ఆలోచిస్తున్నా. అవునులే, 21 ఏళ్లకే డిగ్రీ తెచ్చుకొని, ఏ branchలో BTech చేసినా వచ్చే 30వేల software ఉద్యోగం ఒకటి తెచ్చుకుని, హైదరాబాద్, బెంగుళూరుల్లో ఆఫీసుల్లో కూచుని FBలో pics upload చేస్కుంటూ మర్చిపోయామేమోలే అనుకుంటున్నా. వెనక పుట్టిన పిల్ల బచ్చాగాళ్లందరూ engineering చేసి ఉద్యోగాలు చేస్తూ, పండగలకి ఇంటికొచ్చినపుడు పల్లెల్లో touch screen phonesతో హడావుడి చేస్తున్నా, పాపం ఆరేళ్ళ డిగ్రీ అవజేసుకుని, దానివల్ల గొప్ప పని (surgery), సంపాదన కుదరదని, కోటి రూపాయలు పోసి private PG seat కొనలేక, సమాజాన్ని, కుటుంబాన్ని, వెలివేసి, హైదరాబాద్ పద్మారావు నగర్లో తలుపులేసుకుని, entranceకి prepare అయ్యి seat కొట్టి, మూడేళ్ళకి ఆ torture కూడా అవజేసుకొని ఇంకో సంవత్సరం rural service పేర మళ్ళీ సమాజానికే almost free సేవ చేయడానికి రెడీ అవుతున్న అయన మనల్ని చూడటానికి వచ్చి, బిర్యానీ ఒకటి పెట్టించరా అంటే, నేనేమో మాంచి scrapని serve చేస్తున్నానా, ఛీ దీనమ్మ జీవితం! అనుకుంటున్నా. అబ్బే, మచ్చా ఇవేమి పట్టించునే స్థితిలో లేడు. అదేదో అమ్మాయి ముందర impression కోసం కష్టపడుతున్నట్లు లేని జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ పరువు తీస్తున్నాడు. తీరా చూస్తే, ఆ మధ్య health center కెళ్లడానికి G బద్ధకం వల్ల, 'మచ్చా మీ అన్నని అడిగి prescription కనుక్కో మచ్చా' అన్నపుడు మాత్రం ఈ so called doctors చేసే అక్రమాలు గుర్తురావు. ఇలా చెప్పుకుంటూ పోతే మచ్చా చేసిన చిల్లర చాలానే ఉంది, but point అర్థమైంది కదా!

సన్నివేశం-2

ఇంకొన్నాళ్ళకి, PhD చివరి రోజుల్లో, సరదాగా friendsని తీస్కుని ఇంటికి వెళ్దాం, సీమ చూపిద్దాం అనిపించి, దగ్గరే (200 Kms) కాబట్టి,  one dayకి zoom car ఒకటి book చేసి రచ్చ చేద్దాం అని decide అయ్యాం. అప్పటికి మా gangలో ఒక pro driver (BBT), ఒక amateur driver (Mehi), ఇంకో trainee driver (Shan), మరియు నేనూ ఉన్నాం.  ఒకానొక ఆదివారం అంతా సిద్ధం చేసుకొని, అనంతపురం మీదుగా వెళ్లాలని పొద్దున్నే start అయ్యాం. ఎందుకంటే, అప్పటికి అనంతపురం General Hospitalలో పనిచేస్తున్న మా అన్నని కూడా ఎక్కించుకొని, అందరం కలిసి మధ్యాహ్నం భోజనం timeకి మాఊరెళ్ళొచ్చని. హమ్మయ్యా, ఈసారి మన KK మచ్చా లేడులే అని కంగారులేకుండా వెళ్తున్నాం. అంతా బానే ఉంది, highwayలో lightగా మబ్బుకప్పిన environmentలో memorable trip సాగుతోంది. Pro-driver, amateur-driver ఎక్కువగా నడుపుతున్నారు, కొద్దిగా attitude ఉన్న trainee driver (shan) just కాసేపు నడిపి నాతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. మిగిలిన drivers rideని enjoy చేస్తున్నారు. ఇంతలో అనంతపురం వచ్చాం. అప్పుడేదో flyover construction జరుగుతోంది, రోడ్డుమీద traffic గట్టిగా ఉంది, ఇలాంటి conditionsలో practice చేస్తేనే improve అవుతాం అని Mehi కొంచెం risk ఉన్నా తానే drive చేస్తున్నాడు. పెద్దవాడు కాబట్టి, సాహసం కంటే consequence గుర్తొచ్చి BBT కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ, మేమందరం Mehiని support చేస్తూంటే కాదనలేక uncomfortableగానే ఒప్పుకున్నాడు. ఎటువంటి incidents జరగకుండానే hospital చేరుకున్నాం. Parkingలో car పెట్టి, మా అన్న luggage carలో నింపుకున్నాం. అంతా అయ్యాక, driver seat లో ఉన్న Mehi దగ్గరికొచ్చి BBT "ఇంక లే మచ్చా, నేను తీస్తా car" అని అడిగాడు. "లేదులే మచ్చా, నేనే continue చేస్తా బానే తీస్తున్నా కదా!' అన్నాడు Mehi. car parking నుంచి reverse చేస్తే guide చేయాలని అందరం బయట ఉన్నాం, ఇదంతా చూస్తూ. అక్కడ మొదలైంది రచ్చ. "కొత్త బిచ్చగాడు పొద్దెరగడ"నే చందాన driver seatలో settle అయిన Mehi excitedగా drive చేయాలనీ,  "ఇందాక cityలో driveచేయనివ్వడమే చాలా ఎక్కువ నీకు" అన్న ఉద్దేశంలో BBT, ఒకరంటే ఒకరు నేనే drive చేస్తా అని గొడవ start చేసారు. చిన్నపిల్లలు కొట్టుకున్నట్లు seriousగా పోట్లాడుకుంటున్నారు మాటలతో. బయటున్న trainee driver shan "come on Mehi, తగ్గొద్దు అస్సల!" అని serious గా encourage చేసి, కామెడీగా నా వైపు చూస్తూ, "సమ్మగుందా?' అని నాలుక బయటపెట్టి తల అడ్డంగా ఊపుతున్నాడు, silent గా నవ్వుతూ.

చూస్తుండగానే వాతావరణం వేడెక్కింది. ఇద్దరి దగ్గరికెళ్లి, వీలైనంత మెల్లిగా సర్ది చెప్పడానికి try చేశా. పిచ్చ light తీసుకున్నారు ఇద్దరు నన్ను. "అంతా చూస్తున్న అన్న ముందర Already  వీళ్ల పిల్లతనం వల్ల మన పరువు పోయింది, ఇప్పుడు సర్దిచెబుదాం అని వెళ్లి విఫలమై ఇంకా అయ్యాం" అని బాధ పడటం తప్ప అక్కడ నేను చేయగలిగేదేం లేదని అర్థమైంది. వీళ్ళు మాత్రం రచ్చ ఆపడం లేదు, ఉన్న పరువునైనా కాపాడుకోవాలంటే ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నా, shan మాత్రం encourage చేస్తూ ఇద్దరినీ ఎగదోస్తున్నాడు. ఇంతలో driver door దగ్గరున్న BBT carకి ఉన్న keys లాక్కొని Mehiని దిగమంటున్నాడు. "నువ్వు keys తీసుకుంటే మాత్రం నేను దిగుతాననుకున్నావా, పిచ్చ light, తీస్తే నేనే తియ్యాలి, లేకుంటే నువ్వు  keysతో, నేను steeringతో ఆడుకోవాల్సిందే" అంటున్నాడు Mehi. "ఓర్నీ పాసుకూలా, ఇదేం బేరం రా నాయనా! మిమ్మల్ని బెంగుళూరు నుంచి తెచ్చిమరీ మా సీమలో వెధవని అవుతున్నా" అనుకుంటూ ఓసారి మా అన్న వైపు చూసా, ఏ భావాలూ లేకుండా blank గా ఉన్నాడు, "మీరే తేల్చుకోండి" అన్నట్లు.  అప్పుడే, లోపల parkingలో ఉన్న car తీసుకోడానికి senior doctor ఒకాయన ఈ sceneని చీల్చుకుంటూ వెళ్తూ మా అన్నకి Hi చెప్పాడు. మిగిలిన వాళ్ళమెవరం అది పట్టించుకునే స్థితిలో లేము, అయన car బయటికి వెళ్ళడానికి మా car అడ్డంగా ఉంది, so మాదాకా వచ్చి wait చేస్తున్నాడు, తీస్తామని. మనవాళ్ళు coolగా "ఇంకా చర్చలు కొలిక్కిరాలేదు, నీ ఖర్మ, చావు అలాగే!" అన్నట్లు వదిలేసారు ఆయన్ని. ఇప్పటి వరకూ నన్నే ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మా అన్నని కూడా పెడుతున్నారు.  "ఏంది మచ్చా, ఇప్పుడేం చేయాలి?" అని shanని అడిగితే, "మనకున్న best chance Mehiనే" అన్నాడు. So, fastగా Mehi దగ్గరికెళ్లి, "మచ్చా, తప్పదు, పరిస్థితిని అర్థం చేస్కో"  అనంగానే, చాలా చిరాగ్గా driver seat లోంచి లేచి, fastగా వెనక్కెళ్ళి కూచున్నాడు పాపం. నా ఆరేళ్ళ పరిచయంలో, తనని అంత చిరాగ్గా నేనెప్పుడూ చూడలేదు. Sittingలో 9:45PMకి ఉన్నసరుకు సరిపోక ఇంకా తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు వద్దని ఆపినప్పుడు కూడా, ఉన్నదాన్నే మెల్లిగా తీసుకుందాంలే అనుకున్నాడు గానీ, ఇంత చిరాకు పడలేదు పాపం. మొత్తానికి, BBT car reverse చేసి ఆ doctorని పంపించాడు. అందరం car ఎక్కి కూచున్నాక మా ఊరికి ప్రయాణమయ్యాం. అన్న "దున్నపోతుల్లా ఎదిగినా పిల్ల చేష్టలు పోలేదు, ఎదవలకి" అనుకుంటున్నాడేమో అనుకుంటూ నేను BBTని guide చేస్తున్నా. ముందే మా అన్నముందు ఏమీ censor చేయాల్సిన అవసరంలేదని తెలుసుకున్న shan, ఇందాకటి గొడవ గురించి ఇద్దర్ని దొబ్బడం మొదలుపెట్టి sadistic pleasureని enjoy చేస్తున్నాడు. కాసేపటికి city దాటాక BBT car ఆపి, Mehi ని drive చేయమనేసరికి "హమ్మయ్యా, ఇద్దరి మొహాలు చూడలేకపోయాం, పోన్లే ఇప్పటికైనా రాజీ పడ్డార"ని ఉపిరిపీల్చుకున్నాం. వెనకాల చేరిన BBT, మగవాళ్ల సమస్యలైన prostate cancer గురించి చర్చించడం మొదలుపెట్టేసరికి, "నీకవసరమేలే మచ్చా" అని చురకేశాడు shan.

అరగంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకొని, చికెన్, మటన్, సంగటి, పూరీ, పులావ్ అన్నీ దొబ్బితిని, మాడీ (మేడ) పైకెళ్లి, పుచ్చకాయలు తినేసి, వెంటనే పక్కేసాం. అలసిపోయి ఉన్నాడేమో BBT తొందరగానే నిద్రపోయాడు. ఇంతలో మా family friend ఒకాయన వచ్చి, "పొలాల్లో కుంటలు అన్నీ నిండుగా, కళ కళ లాడుతున్నాయి, ఈత కొడతారా?"అని అడిగేసరికి, మాకు sugar ఆగలేదు. మరి BBT చూస్తే నిద్రపోతున్నాడు, ఇప్పుడెలా అని ఆలోచిస్తుండగా, return ప్రయాణం ఆరోజు రాత్రికే కాబట్టి, ఒక active driver అవసరం అనుకొని, ఆయన rest తీస్కోడమే మంచిదని, పైగా, BBTకి ఈత రాదని మాకు ఇదివరకే తెలుసు కాబట్టి, మేము మాత్రమే పొలాల్లోకి వెళ్లిపోయాం మా అన్నతో కలిసి. అరగంట తర్వాత మా family friend bike మీదనుంచి BBT ఆవేశంగా దిగుతూ కనిపించే సరికి, సర్లే చూద్దామని వచ్చాడేమో అనుకున్నాం. మగ సూర్యకాంతంలాగా మీదపడి మాటలతో కరిచేస్తున్నాడు. "ఏంది మచ్చా, నన్ను పడుకోబెట్టి మీరు మాత్రమే ఇలా enjoy చేయడానికి వచ్చేస్తారా?" అని కడిగేస్తున్నాడు. మేమనుకున్న reason చెప్పి, disturb చేయకుండా వచ్చాంలే అని చెబుతున్నా వినకుండా అవసరంలేనంత అల్లరి, scene create చేస్తున్నాడు. తీరా చూస్తే, తాను కూడా ఈత కొట్టడానికి, పెద్ద తాడు కూడా తెచ్చుకున్నాడు. 5 feet లోతులో నిల్చుని, మమ్మల్ని (particularగా నన్ను) ragging చేస్తున్నాడు. "సర్లే మచ్చా, మర్చిపో ఇంక, వచ్చావ్ గా happyగా enjoy చెయ్" అంటే వినడే, అరగంట దాకా, "నన్ను మోసం చేసారు, వదిలేసి వచ్చారు, నేనంటే మీకు లెక్కేలేదు, మీరంతా కుమ్మక్కయ్యారు" అంటున్నాడు. అందరూ కలిసి holidayకి friend ఊరికి వచ్చారు, వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ జనాల ముందు,  ఇంత రచ్చ బాగోదనే ఆలోచనే లేకుండా, సావగొట్టాడు. Hospital దగ్గర చిల్లర, ఇక్కడ అల్లరి కలిసి, మొత్తానికి, అన్న అనేసుకుని ఉంటాడు "వీడూ, వీడి friends, బాగున్నారా బాబు" అని సిగ్గుతో సచ్చిపోయినంత పనైంది నాకు. చివరికి, "మచ్చా, నన్ను క్షమించు, నీ కాళ్ళమీద పడమంటావా? అప్పుడైనా ఆపుతావా?" అంటే, అప్పటికి, అరవడం ఆపేసి, లోపల గొణగడం మొదలు పెట్టాడు మా నానమ్మ లాగ. అక్కడ కాసేపు ఆడుకొని, ఇంకో scenery దగ్గరికెళ్లి అక్కడ కూడా భవిష్యత్తులో post చేయడం కోసం ఇంకొన్ని pics తీసుకున్నాక కాస్త normal మనిషి అయ్యాడు. ఇంటికెళ్లి, coffee తాగుతూ, car hire duration extend చేసుకొని, మిగిలిన వంటలు దార్లో తినడానికి pack చేసుకొని కుండపోత వర్షంలో start అయ్యాం. 30Kms వరకూ, అస్సలు visibilityయే లేకపోయినా, BBT wonderfulగా drive చేసాడని Mehiనే compliment ఇచ్చాడు. అప్పటికి ఆ కథ సుఖాంతమైంది.

కానీ, నాకు మాత్రం 2008లో TCSలో select అయినప్పుడు, offer letter ఇస్తూ HR అన్న మాటలు గుర్తొచ్చాయి. "Welcome to TATA family, ఇవాల్టినుంచి మీరందరూ members of the TATA family. వీధిచివర అంగట్లో పాల pocket కొన్నపుడు, busలో conductor చిల్లర ఇచ్చినపుడు కూడా thanks చెప్పడం దగ్గర్నుంచి, professional and personal lifeలో మన valuesని reflect చేయాలి మీ behaviour" అన్నాడు. మరి మేమేం చేసాం, భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన పరిశోధనా సంస్థగా జనాల్లో తెలిసిన TATA Instituteని (IISc పాత పేరు) represent చేస్తూ కూడా చాలా scrapగా behave చేశామ్, చిల్లర రచ్చ చేశాం. ఇదంతా చెప్పాననుకో, "ticket ఇవ్వకుండా తక్కువ డబ్బులు తీస్కొని వాళ్ల జేబుల్లో వేసుకునే బెంగుళూరు conductorsకి చెప్పలేదేమోగానీ, complimentaryగా ఉంచుకోమని whiskey గ్లాసులిచ్చిన మత్తికేరే spirits వాడికి చెప్పాంలే మచ్చా Thanks!" అంటారు మావాళ్లు.

ఇంతకీ, best friends గురించి పైన చెప్పిన పెద్దాయన ఎవరోకాదు, మా అన్నే. So, problem లేదు, ఆయనకి తెలుసు best friends అంటే ఎలా ఉంటారో.