(అన్ని Episodes ఇక్కడ దొరుకుతాయి.)
పక్కనింట్లో రోంత సప్పుడొచ్చినా, కొత్త కారు గేటుముందర ఆగినా మా ఆంటీ సేచ్చాండే పని ఆపేసి మరీ కిటికీలోంచి తొంగిసూడాల్సిందే. అందికే పక్కింట్లోకి వొచ్చిన బంధువులుగూడ ఆయమ్మను ఎచ్చరిచ్చారు 'బాగుండావా?' అని. ఆమద్య, జగ్గూ గాడి అక్కాబావ వాళ్లు రింగురోడ్డు పైన రోంత స్థలం కొన్న్యారని తెల్సింది మా అంటీకి, వాన్నే అడిగి కనుక్కుందిలే, 'పొద్దన్నుంచి యాడికో తిరుగుతానారే?' అని. 'కలుగులోంచి ఎలక చూసినట్లు చూసింటాది ఆంటీ' అనుకున్న జగ్గూకి సెప్పక తప్పలేదు, ఎక్కడ కొన్న్యారో, ఎంతకి కొన్న్యారో.
అప్పుడు కొట్టడం మొదులు బెట్టింది సుత్తి, వాడి నెత్తిమింద. వాళ్ల అల్లుడు వాళ్లకి శా...నా ఆస్తులు ఉండాయంట. మొత్తం ఎన్నుండాయో కూడా చెప్పలేమంట. Income tax వాళ్లు వొచ్చారని ఆస్తుల లెక్కలు ఎవురికీ చెప్పరంట, ఆఖరికి పిల్లనిచ్చిన వీళ్లకు కూడా. అంతా ఇన్న్యాక, జగ్గూ గాడు "ఎన్నుండాయో, యాడుండాయో గూడా తెలీకుంటే ఎట్ల ఆంటీ, మట్టసంగ అడగండి, మీకేమన్నా టోకరా ఏసినారేమో అనిపిచ్చాంది సూచ్చాంటే" అన్న్యాడంట. ఆంటీకి కాల్తుంది కదా మరి, "Income tax గురించి మనకేం తెలుచ్చాదిలే జగ్గూ, వాళ్లకు దండిగా లెక్కుండాది గాబట్టి తెలుచ్చాది గాని" అనిందంట మూతిముడుసుకుంటా. 'నీ బడాయి బండ్లకెత్త' అనుకొని, "నాకు పనుండాదిలే ఆంటీ" అని ఆన్నుంచి లేసొచ్చినాడంట జగ్గూ గాడు.
ఇది జరిగినాక రెండు వారాలకు జగ్గూ వాళ్ళక్కకి సీమంతం చేసినారు. బానుమతి ఆంటీ వచ్చిందిగానీ, శానా సైలెంటుగా ఉన్నింది. భోజనాల దగ్గరకూడా పేరు పెట్టకుండా తినింది అన్నీ. 'ఏమైందిబ్బా ఆంటీకి?' అనుకున్న్యారు సందులోని వాళ్లంతా. మరుసటిరోజు సాయంత్రం మిక్చరు కొండయ్య దగ్గర పార్సిల్ కట్టించుకుంటాంటే జగ్గూకి వాళ్ళ స్కూలు ఫ్రెండు తగిలి, ఒక వార్త చెప్పినాడు. జగ్గూ వాళ్ళ కాలనీలో ఉండే కాంట్రాక్టరు ఒకాయప్పకి ఈ ఫ్రెండు వాళ్ళు అప్పిచ్చారంట, ఆయన IP పెట్టి పరారయినాడంట. జగ్గూ వాళ్ళకేమైనా ఆ కాంట్రాక్టరు వాళ్లు తెల్సునేమోనని ఆ ఫ్రెండు అడిగినాడు, మరి రాబట్టుకోవల్ల కదా ఎంతోకొంత. తెల్దని చెప్పి ఇంటికొచ్చినాడు జగ్గూ. ఇంటికొచ్చేసరికి, హాలుమద్యలో పనిమనిషి పరక పట్టుకొని ఏదో చెబుతాంటే ఇంట్లోని అందురూ చాగంటి చెప్పే ప్రవచనం విన్నట్లు వింటానారు. తీరా చూస్తే, మిక్చరు అంగడికాడ జగ్గూ విన్న వార్తలే ఇక్కడకూడా వినపడతానాయ్. తనుకూడా వాళ్లతో కలిసి కూర్చున్న్యాడు జగ్గూ. TV9 దేవీ నాగవల్లిని మించిపోయిన ఈ పనిమంచి సంబరమెందిరా అంటే, మన బానుమతి ఆంటీ గూడ ఓ పదహైదు లచ్చలు ఇచ్చిందంట ఆ కాంట్రాక్టరుకి. 'ఓహో! ఆంటీకి పెద్ద టోకరా ఏసినారే' అనుకున్న్యాడు మన జగ్గూ. అసలే తనని పనినుంచి తీసేసినప్పటినుంచి ఈ పనిమంచికి బానుమతి ఆంటీ అంటే శానా కచ్చ. అందుకనే, ఆయమ్మ ఆనందానికి హద్దూపద్దూ లేకుండాపోయింది. 'ఇంగ సాల్లే పొయ్ పని చుస్కోపొమ్మని' చెప్పినా ఆయమ్మకి పోవాలని లేదు, కానీ, తొందరగా ఇక్కడ పని అయిపోజేసుకుంటే వేరే ఇండ్లల్లో కూడా చాటింపు వెయ్యొచ్చని గుర్తొచ్చి, ఆయమ్మ పనికి వంగింది.
మిక్చరుతిని, టీతాగి, సందు చివర జనాలు షటిల్ ఆడుతూ కనపడితే వెళ్లి కూచున్నాడు జగ్గూ. ఆంటీకి కాంట్రాక్టరు టోకరా వేసిన సంగతి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తానాడు. కానీ, వాళ్ళింట్లో కూడా పనిమంచి చదివిన వార్తలు విన్న జగ్గూ ఫ్రెండుగాడు ఒకడు ఇదే విషయం మొదలుపెట్టినాడు, పోన్లే అని జగ్గూ కుదుటపడినాడు. ఆడుతున్న జనాలు కూడా ఆపేసిమరీ విన్నారు ఆ వార్తలు.
'అందుకేరా మొన్న మీ ఫంక్షన్లో సైలెంటుగా ఉన్నింది ఆంటీ' అన్నాడొకడు జగ్గూతో.
'ఎందుకుండదు మరి, అంకుల్ కి కూడా తెలీకుండా వడ్డీకి తిప్పిన లెక్కంటరా' ఇంకోడు చెబుతున్నాడు.
'పాపంరా, ఎవురితో చెప్పుకుని బాధపడుతుందో ఆంటీ?'
'అంకుల్ కి చెప్పుకోలేకపోతే, అల్లుడితో చెప్పుకుంటుందిలేరా!'
'రేయ్ జగ్గూ, ఈసారి కలిసినప్పుడు, income tax గురించి కాదు, IP గురించి అడుగురా ఆంటీని'.
* రోంత = రవ్వంత
**ఎచ్చరించు = పలకరించు (e.g. బాగున్నారా? ఇదేనా రావడం? etc. )