రిలీజ్ రోజునే సినిమా చూడ్డం మానేసి కొన్నేళ్ళయింది, పెద్దోళ్లం అయిపోయంగా. కానీ ఈ మధ్యనే ఆ పనిచేసి మళ్ళీ బాల్యంలోకెళ్ళొచ్చా. అంతా ఆ దేవుడి దయ!
అందరూ కేరళ వెళ్లి FBలో post చేస్తారు, "Landed in God's own country!" అని. కానీ, నేను, Mumbai వెళ్ళినపుడు చెప్పా, "God's own cityలో ఉన్నా" అని. ఈపాటికి అర్థమై ఉంటుంది మీకు, ఆ నా దేవుడు సచిన్ టెండూల్కర్ అని.
ఇప్పటికే చాలామంది చెప్పేసున్నారు, ఆయనెందుకు దేవుడో. కానీ ఈ రోజు నేను కూడా చెబుతా. మరి మనకి కొన్ని వందల రామాయణాలున్నాయిగా, ఎవరి భక్తి వారిది. సరే ఇలా మొదలుపెట్టాం కనక, ఇలానే continue అవుదాం. Sachinకి, రాముడికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని నా గట్టి నమ్మకం. మొన్నే ఓ friendతో అంటే, "అవునా, ఎలాగా?" అని వేళ్ళు మడిచి, లెక్క పెట్టడానికి ready అయిపోయాడు, వెటకారంగా. అప్పుడే చెప్పా, "నువ్వు కంగారుపడకు, పెద్ద article రాసి మరీ చెబుతా!" అని. ఇది నా రామాయణానికి పీఠిక.
నామటుకి, sachin ఈ యుగంలో పుట్టిన రాముడే. అక్కడా అంతే, రాముడిలాంటి ఓ అద్భుతం జరగడానికి ఓ పెద్ద కాన్స్పిరేషనే జరిగింది. దేవదేవుడు దిగిరావడం అంటే మాటలా? దేవతలంతా directగా, indirectగా కిందకొచ్చి అంతా సిధ్ధం చేశారుకదా! ఇక్కడా, రెండున్నర దశాబ్దాల పాటు చోటుచేసుకున్న ఓ అద్భుతం కోసం జరిగిన arrangements చర్చించి, నాకు నేనే promotion ఇచ్చుకుంటా.
రాముడికి ఎన్నో పేర్లున్నా, దాశరథి అంటేనే ఇష్టపడతాడు, అది ఆయనకి తండ్రి మీద ఉన్న భక్తి, ఇష్టం. sachinకి కూడా అంతే, 50గానీ, 100గానీ అయిన వెంటనే, ఆకాశం వంక చూసి, తన తండ్రికి అంకితమిస్తాడు. ఎన్నిసార్లు? ప్రతీసారి. అది మన సచిన్ "రమేశ్ " టెండూల్కర్.
రాముణ్ణీ, సోదరుడు లక్ష్మణున్నీ విడదీసి చెప్పడం వీలుకాదంటే అతిశయోక్తి కాదు. దశరథుడు చనిపోయాడని తెలిసాక, అడవిలో ఉన్న రాముడు, లక్ష్మణుడితో అంటాడు "తమ్ముడూ , నీకింక తండ్రి లేడు!" అని. మరి ఆయనకో? లక్ష్మణుడు ఉన్నాడుగా, తండ్రిలాగా కాపాడుకోవడానికి. సచిన్ లాంటి ఓ అద్భుతాన్ని create చేసిందీ, అన్ని సమయాల్లో తోడుండి ముందుకి నడిపింది, సోదరుడు అజిత్ టెండూల్కర్. కోచ్ దగ్గరికి తీసుకెళ్లడం దగ్గరి నుంచి, పాకిస్థాన్ పేస్ బౌలింగుకి ముక్కు చితికిపోయినప్పుడు, career ని దెబ్బతీసే గాయాల బారినపడినప్పుడ్డు, ఇలా ఎన్నోసార్లు. వీళ్ళని కూడా లోకంలోని సోదరులకు ఆదర్శం అనడంలో అతిశయోక్తిలేదు.
ఇప్పుడు అమ్మవారి గురించి. ఈ part నాపాలిటి "సౌందర్యలహరి". అంజలి. నిజంగానే దండం పెట్టాలి, తల్లికి. "మన పెళ్లి గురించి మా ఇంట్లో నేను మాట్లాడలేను, నువ్వే వెళ్లి అడగమంటే", వెళ్ళిపోయి అడిగేసిందంట, "మీ అబ్బాయీ , నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం " అని. అలా....ఒప్పేసుకున్నారు, మరెందుకు ఒప్పుకోరు? మాలక్ష్మి, తానే, "మీ ఇంటికొద్దామనుకుంటున్నాను" అంటే. ఈ particular సంగతి వినగానే, నాకు వనవాసం ముందు scene గుర్తొచ్చింది. కైకమ్మ మందిరం నుంచి వార్త తెలుసుకొన్న రాముడు, సీతమ్మ దగ్గరకి వచ్చి, "నేను వనవాసం కోసం వెళ్తాను" అని చెబుతాడు. "సరే పదండి, నేనూ వస్తాను" అంటుంది. "నువ్వెందుకు ? అక్కడ చాలా కష్టం, క్రూర మృగాలు కూడా ఉంటాయి, వద్దు" అని వారిస్తాడు. "క్రూరమృగాలా?, మా నాన్న, నన్ను ఒక మగాడికిచ్చి చేశాడనుకున్నానే ?" అంటుంది. "అనగలుగుతుంద"నమాట. సాక్షాత్తూ, వాల్మీకి మహర్షే ఇలా రాశాడని చెబితే మనలో చాలామంది నమ్మలేరేమో.
"రామో విగ్రహవాన్ ధర్మః" అన్నాడు రాక్షసుడైన మారీచుడు, రాముడి గురించి. 'రా'తో మొదలయ్యే పదం వినపడగానే, భయపడిపోయేవాడు. ఎంతో విధ్వంసకరంగా batting చేయగలిగిన batsmen చరిత్రలో చాలా మందే ఉన్నా, ఇలాంటి సంఘటనలు మాత్రం సచిన్ గురించే చెప్పుకున్నాం, shane warne సహకారంతో. Hayden ఐతే, ఏకంగా "ఇండియా వెళ్లి దేవున్ని చూసొచ్చాను, 4లో batting ఆడుతున్నాడు అక్కడ" అన్నాడంట.
ఆ కాలంలో, పూర్వభాషి అని చెప్పుకున్నా, సత్యమే పలికాడని చెప్పుకున్నా, దయాళు అన్నా, పరాక్రమశాలి అన్నా, ఏకపత్ని కలిగిన రాజు అన్నా, ఈ కాలంలో Alcoholని endorse చేయకుండా చాలా నష్టపోయాడనుకున్నా, controversy లేకుండా క్రమశిక్షణతో సుదీర్ఘమైన careerని కట్టుకున్నాడన్నా, ఉదాత్తమైన నడవడితో ఆదర్శంగా నిలిచాడన్నా, కాలాన్ని, కదిలే రైళ్లని, పెరిగే వయసుని (తనది, మనది కూడా) ఆటతో ఆపాడన్నా, వేరు కాదేమో!
మనిషి అనే ప్రక్రియకి, జీవితం అనే processకి, రాముడు ఒక ప్రమాణం. ఎలాగా? "ఔను మరి, ఈయనో శ్రీరామ చంద్రుడు", ఎన్నిసారు వినలేదు ఈమాటని? సచిన్ కూడా అంతే. ఇక మీద బాగా ఆడగలిగిన, ఆడుతున్న cricketers అందరికీ, ఈ దేవుడే ప్రమాణం. For example, ఈమధ్య, కోహ్లికి, సచిన్‌కి రోజూ జరుగుతున్న పోలిక మనకు కొత్తదేం కాదు.