Thursday, April 30, 2020

మా బానుమతి ఆంటీ కరోనా కష్టాలు (Episode-2)

(అన్ని Episodes ఇక్కడ దొరుకుతాయి.)
 
బిడ్డ పెండ్లి ఆలబము వచ్చినాల ముంచి, మా ఆంటీకి నిద్దర్రాడంల్యా. సందులోండే అందరికీ జూపిచ్చి, "బిడ్డా అల్లుడూ బాగొచ్చినార్లే" అనిపిచ్చుకోవల్లని ఇంతవరకూ ఆశగా ఎదురుజూచ్చా ఉన్న్యాది. పా.....పం, తీరా వచ్చినాక, ఎవురికి జూపీడానికీ కాడంల్యా. ఏమంటే, కరోనా. ఎవురూ యాడికీ పోగుడ్దని గవర్నమెంటోళ్లు మొత్తుకొని జెప్తాండారు.

పాపం, ఈ కాయలా వచ్చి మా ఆంటీకి కాళ్ళూచేతులూ కట్టేసినట్టుండాది. యవ్వారాలన్నీ ఏటికిబోయినాయి. పొద్ధచ్చం ఇంట్లోనే ఉండల్ల. అల్లుడు జెప్పినాడని పనిమంచినిగూడా రావాకన్న్యారు. ఇంగెవురికి జెప్పుకుంటాదీ వాళ్ల బడాయి? ఆయ్మ సావు సెప్పలేం. కడుపుబ్బి పోతాంటాది ఈమంతన.

ఎట్టుండేది; ఎట్టైపోయింది ఆంటీ! అప్పట్లో, ఆరుబయట సాయంత్రం యవ్వారం మొదులుబెడితే, పొద్దుగునికి ఇంటాయన పిల్చినా పట్టిచ్చుకునేది కాదు. ఆయప్ప సావు ఆయప్పదే, ఈయమ్మ యవ్వారం ఈయమ్మదే. ఎప్పుడో ఆయప్పకున్న సుగరు సంగతి గుర్తొచ్చే, "రైసు కుక్కరు ఆన్ జెయ్ బ్బ అట్ట"  అంటుంది. ల్యాకుంటే, అయప్పే రొండు సెపాతీలు తిరగేసుకుంటాడు. ఇంకొన్నిసార్లు, బాగా లేటయితే బయటికిబొయ్ ఇడ్లీలు కట్టిచ్చక రమ్మంటాది, అంతేగాని, యవ్వారం దగ్గర కాంప్రమైజే కాదు. "మొగుడు దొడ్డమంచి గాబట్టి ఈయమ్మ యవ్వారాలు సాగుతానయ్" అనుకున్న్యారు సందంతా.

మరిప్పుడో, పొద్దన ముగ్గేసే టైములో ఎవురన్నా కనబడితే యాడ మాట్టాడాల్సి వచ్చుందోనని బెరిగ్గెన ముగ్గుగీకి లోపలికి పోతాది. ఖర్మగాలి ఎవరన్నా ఎచ్చరిచ్చే, రొండు మూడు పొడి మాటలు, అంతే. "మాయల్లుడు జెప్పినాడు" అనుకుంట మూతికి కొంగు అడ్డం పెట్టుకుంటాది ఆ మాట్లాడిన రోంచేపూగుడ. ఎప్పుడన్నా సాయంత్రం, బిడ్డా అల్లుడు వీడియో కాల్ జేచ్చే, సందంతా ఇనపడాలని కావాలనే కాంపౌండు లోకొచ్చి గెట్టిగా మాట్లాడతాది. ఒక్కోరోజు, మిద్దెక్కి మాట్లాడతాది, ఎక్కువమందికి ఇనపడతాదని. జగనన్న ఇంటింటికీ మాస్కులిచ్చినాక, అల్లుణ్ణి impress జెయ్యడానికి ఓరోజు ఇంకా పొద్దుండగానే మిద్దెక్కి మాస్కు కట్టుకొని మాట్లాడతాంటే, జగ్గుగాడు చూసి నవ్వినాడంట. అంతేనా, సందంతా అంటిచ్చినాడు. బైటికిపోతే పెట్టుకోవల్లగాని, మిద్దెపైనగూడ పెట్టుకుంటే నగరామల్ల! మరుసటిరోజు పొద్దన ముగ్గేచ్చా, బయటికి పోడానికి బండితీచ్చున్న జగ్గుగాణ్ణి నిలబెట్టి అడిగింది ఆంటీ. మాస్కు మ్యాటర్ కాదులే, దుబాయిలో ఉన్న జగ్గు అక్కాబావల గురించి. బాగున్నారని జెప్పి, అడగకపోతే బాగుండదు గాబట్టి, ఆంటీ వాళ్ల బిడ్డ అల్లుడి గురించి జగ్గు అడిగినాడు రివర్సులో. ఎన్నాళ్లనుంచో ఊదుకొని ఉందేమో కడుపు, "వాళ్లకేం, లెస్సగుండారు! మాయల్లుడు తెల్లార్దాన్నే లేసి రొంచేపు ఆఫీసు పంజేసుకుంటాడు, మల్ల రడీ అయ్యి, అక్కనిలేపి కార్ను ఫ్లేక్సు కలిపిచ్చాడు టిఫిన్ జెయ్యమని" అని దినచర్య మొత్తం జెప్పడానికి రడీ అయ్యింది. ఆంటీ సంగతి బాగా తెల్సుగాబట్టి, జగ్గుగాడు, "ఇడ్లి, దోశ ఏసేది నేర్సుకోమను ఆంటీ బావను, ఎన్నాళ్లని తింటాది అక్క కార్ను ఫ్లేక్సు, పాపం బోరు గొట్టదూ?" అని కిక్కుకొట్టి సర్రన వచ్చినాడంట ఆన్నుంచి.

సాయంత్రం సందుచివర క్రికెట్టు ఆడతా, మాకుజెప్పి భయపడినాడు పాపం, ఆంటీ వానిమింద కచ్చకట్టింటాదని. మొత్తానికి, మా జగ్గుగాడు వాళ్ల కారుని బుడ్డ కారు అన్నందుకు ఆంటీమింద ప్రతీకారం తీర్చుకున్న్యాడు. ఆంటీ మాత్రం ఎప్పుడు lockdown ఎత్తేచ్చారా, ఎప్పుడు యవ్వారాలు మొదలుపెడదామా అని ఎదురు జూచ్చాంది. సందులో జనమేమో lockdownలో కాలుష్యం, రొద ల్యాక బాగుపడ్డ సిటీల మాదిరి ఆయ్మ బెదడలేక బా...గుండారు. 

Tuesday, April 7, 2020

నవోఢోల్లస దిందిరా పరిచరిష్ణు

"ఏమిరా, ఏంజేచ్చానవ్ ?" phoneలో నా ప్రశ్న.

స్నేహితుడి సమాధానం, "ఏం జెప్పమంటావ్ లేరా, ఈ lock down వల్ల రాత్రి దూల తీరింది. motor cycle మీద కాసేపు, highway లో lorry మీద కాసేపు, private busలో ఇంకాసేపు, ఆ తర్వాత అర్ధరాత్రి mobile flash వెలుగులో రెండు గంటలు కాలినడక చేసి తెల్లవారుఝామున ఎప్పుడో ఇల్లు చేరారా నాయనా! పులుసు కారిపోయింది. ఇదిగో ఇప్పుడే లేశా."

"ఏమిరా అయ్యా, అంత వరకూ ఎందుకున్నావ్? college కూడా నడవడం లేదుగా, ముందే పోవాల కదా ఇంటికి!" మావోడూ సదువుజెప్పే ఉద్యోగమే.

"పొయ్యి ఉండాల, కానీ పోలేదు, ఇలా అవుతుందని అనుకోలేదులే."

"అయినా రెండు గంటలేగారా ఇంటికి ? అంతసేపు ఎందుకు పట్టింది?"

"మన ఇంటికి కాదురా, home minister ఇంటికి వచ్చా!" సిగ్గైపోయినాడు మనోడు. Cabinet minister అనుకునేరు, కాదు, వాడితో కాపురంచేసే minister.

"ఓ...హో! అదీ సంగతి. పోతావ్, నడ్సుకుంటూ అయినా  పోతావ్, దేక్కుంటూ అయినా పోతావ్! భరించలేని విరహం అసుమంటిది మరి."

 "ఆపరా రేయ్, కుక్కలు తోలుకుంటూ నడిసినా రా రాత్రి, bypass నుంచి ఇంటికి, పెద్ద సాహసమే చేశా."

"అవునా, 'చెలియా, చెలియా చెయ్ జారివెళ్లకే' అంటూ నాగార్జున లాగా పాట పాడుకుంటూ వెళ్ళావ్ అనమాట!"

"అంత లేదు, అదృష్టం బాగుండి ఏమీ కరవలేదు, safeగా చేరా, ఏమైనా అయ్యుంటే ఈ lock down timeలో పెద్ద ఇబ్బందయ్యేది. తెల్లవారుఝామున ఇల్లుచేరి door కొట్టేంతవరకూ కుదురులేదు ప్రాణానికి"

"ఎవరి ప్రాణానికో?"

"చెప్పకుండా వచ్చాగా, నా ప్రాణానికేలే. చెప్పుంటే ఇలా ఎందుకు రానిస్తారు ?"

"ఆ..హా! కొంచెం surprisinguu, ఇంకొంచెం thrilluu .... పులుపు తగ్గలేదురా నీకు, ఐదు quarterలయ్యాక కూడా (తాగేవి కాదులే) బానే maintain చేస్తున్నావ్."

"పూలుపూ సలుపూ కాదులేరా, lock down వల్ల అన్ని పనులూ వాయిదా పడ్డాయిగా, చేసేదేం లేదింక. "

"అందుకని వచ్చానంటావ్ అత్తారింటికి? నేనింకా, చాన్నాళ్లయిందిగా, చూడకుండా ఉండలేక వచ్చావ నుకున్నాలే; అదే, మీ అత్తమామల్ని."

"ఏడిశావ్ లే గానీ, నీకంతా బానేఉందా లేక అంటుకుందా ఈ కరోనా?"

"ఇప్పటికైతే no symptoms. Right timeలో వచ్చేసాం, ఈ రెండు వారాలు అక్కడ (UKలో) ఇరుక్కొని ఉండుంటే అంతే సంగతులు."

"హ్మ్, ఎక్కడున్నావ్ మనింట్లోనేనా? జాగ్రత్తగా ఉండరోవ్, పెద్దోళ్ళకి దూరంగా ఉండు కొన్నాళ్లు"

"మనింట్లో కాదుగా నేనుండేది" నేనైతే సిగ్గుపడలేదు.

"ఓ..హో! అంతా అత్తారిల్లే అనమాట! సర్లే, మొత్తానికి అలా plan చేశాం ఇద్దరం ఈ  lock down period. అత్తారింట్లో అల్లుళ్ళకి ఉండే treatment అసుమంటిది మరి. అయినా, నా సంగతి అటుంచు, మేము పాతబడి పోయాంలేగాని, నీకెలా సాగుతోందో చెప్పరా కొత్తపెళ్ళికొడకా? ఇలాగన్నా అల్లెం తినే అవకాశం దొరికిందిలే, enjoy చెయ్. లేకపోతే jobలు, projectలు అనుకుంటూ ఈ ముచ్చట్లేవి అయ్యేవికాదు, మొత్తానికి ఈ కాలానికి సుడిగాడివే, కరోనా కలిసొచ్చింది నీకలాగా."

"బాగుందిరోవ్, తిండి ఎక్కువ అవడం ఒకటి, home quarantine వల్ల బయటికి వెళ్లలేక పోవడం ఒకటి తప్ప rest all రమ్యంగా ఉందిరా అబ్బాయ్"

"ఉంటుందుంటుంది. అలాకాదూ, home quarantineలో కూడా ఒక roomకే పరిమితం అయ్యి, అందరికీ దూరంగా ఉండట్లేదా, government instructions అనుసారం. ఇలాంటి over action బానే చేస్తావుగా నువ్వు"

"ఎక్కడా? వీళ్లు, 'ఆఁ , ఏముందిలే, నువ్వు గిలి గట్రా ఏం పెట్టుకోవద్దు. ఏమేం కావాలో మొహమాట పడకుండా అడిగి చేయించుకో హాయిగా!' అని పిచ్చ light తీసుకున్నారు. రెండు మూడు రోజులు resist చేసే ప్రయత్నం చేశాగాని, అబ్బే, కుదర లేదు, విష్ణు అవతారం ఎత్తించారు మనచేత"

"విష్ణు అవతారమా?"

"ఆ, నవోఢోల్లస దిందిరా పరిచరిష్ణు, అని శ్రీమహావిష్ణువుకు పోతన వాడిన ఒక adjective.

నవోఢోల్లస దిందిరా పరిచరిష్ణు --> నవ + ఊఢ + ఉల్లసత్ + ఇందిరా + పరిచరిష్ణు
నవ = కొత్త, ఊఢ = వివాహిత, ఉల్లసత్ = ఉల్లసించు, ఇందిర = లక్ష్మీదేవి, పరిచరిష్ణు = పరిచరించ బడేవాడు[1]

కొత్త పెళ్ళికూతురికి మల్లే నిత్యం ఉల్లాసంగా ఉండే లక్ష్మీదేవిచేత  పరిచరించ (సేవించ) బడే వాడు అని అర్థం. ఆరకంగా, ఆయన భూలోకంలో అవతారాలు తీసుకోవడం కాదు, మనమే పెళ్ళైన కొత్తలో నవ వధువూ and family చేసుకునే సేవలందుకోవడం ద్వారా ఆ కొన్నాళ్ళూ ఆయన అవతారం స్వీకరిస్తాం అనమాట."

"దేవుడా! ఇంకేం, మొదలుపెట్టు నీ అవతార ప్రయోజనం. sorry, already పెట్టావ్ కదూ, కొనసాగించు సాగినన్నాళ్లు." అని కర్తవ్యబోధ చేసి call cut చేసాడు.
----------------------------------------------------------------------------------------------------------------
[1] కొంతమంది "పరిచరించే వాడు" అనే అర్థం అన్వయిస్తారు, అయినా ఆ పద్యం భావంలో పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే, ఈ సందర్భంలో సేవల స్వభావాన్ని (nature of the services) అర్థం చేసుకుంటే, సేవించడం, సేవించబడటం రెండూ సుఖదాయకములే, కాబట్టి అర్థం చెడదు.

Thursday, April 2, 2020

యోగః కర్మసు కౌశలం!

అవి BTech అయ్యాక, కొత్తగా IITలో చేరిన రోజులు. Kharagpurలో అన్నిటికంటే ముందు appreciate చేసినది high speed internet and huge LAN sharing (ఆ, అదే అదే, DC++!). అవునుమరి, నా BTech పూర్తయ్యేసరికి నేను internet illiterate అనే చెప్పుకోవాలి. మొత్తం BTech అంతా కలిపి చూసినా 2-3 గంటలకంటే internet వాడిఉండను, ఆ రకంగా నా పట్టా (degree) offlineలోనే పూర్తి అయినట్లు. ఇదంతా చదివి ఎప్పుడో భూమిపుట్టినపుడు చేశానని అనుకునేరు, కాదు, మొన్నామధ్య వైస్సార్ CM అయిన తర్వాతే మొదలయ్యింది నా BTech . అప్పటికి నాకున్న internet craze వల్ల Kharagpurలో full time onlineలోనే బతికేసే వాణ్ణి. Orkut, facebook, blogging అన్నీ అక్కడే మొదలు.

వీటన్నికంటే, విపరీతంగా ఆకట్టుకున్నది అక్కడి LAN sharing, DC++.  అంటే ఏంటంటే, Simple గా, campusలోని computersని connect చేసి, అందరూ తమ తమ computersలో నుంచి, ఎంపిక చేసిన సమాచారం (files) అందరితో పంచుకునే ఒక వెసులుబాటు. ఈ వ్యవస్థ అప్పటికే చాలా పకడ్బందీగా నడుస్తూ ఉండేది. అలాగే, కొన్ని సంవత్సరాలుగా accumulate అయిన వివిధ రకాల సమాచారం sharingలో ఉండేది. ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిందంటే, అక్కడలేనిది ఏమీ లేదనేంత rich database అనమాట అది. అన్ని భాషల నవలలు, కథలు, సినిమాలు (national, international, regional) , పాటలు, పాఠ్య పుస్తకాలూ, documentaries, pdfలోకి మార్చబడిన ప్రాంతీయ మేగజైన్లు (చందమామ నుంచి స్వాతి వరకు దాదాపు అన్ని తెలుగు magazines, అన్ని సంచికలు దొరికాయి నాకు అక్కడ), cricket videos, cartoons, video lectures, ఇంకా ఎన్నెన్నో లభించేవి. సినిమాల మీద PhD చేసే ఒకాయన అక్కడ ఉన్న తన friend hostel roomలో unofficialగా ఉంటూ, తనకి కావాల్సిన సినిమాలని collect చేస్కుంటూ కొన్ని నెలలు campusలోనే  ఉన్నాడంటే అర్థంచేసుకోవచ్చు అక్కడి collection size గురించి. వీటన్నికన్నా ఎక్కువ porn కూడా దొరికేది, అది వేరే విషయం. నిజానికి ఇన్ని ఉన్నపుడు ఏం చేయాలో, ఎక్కడినుంచి మొదలు పెట్టాలో తెలియక తబ్బిబ్బయినంత పనైంది. సినిమా అంటే ఉన్న ప్రత్యేకాభిమానం వల్ల world cinemaలోకి తొంగిచూసే కిటికీ దొరికినందుకు సంతోషించి, వాటితోనే మొదలు పెట్టా. IMDB top 200 listతో మొదలైన ఆ సినిమోత్సవం రెండేళ్ల తర్వాత Kharagpur నుంచి వచ్చేవరకూ కొనసాగిందనే చెప్పాలి. అలా ఒకరోజు నేను ఎంపిక చేసి చూసిన సినిమా Philadelphia. USAలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అది. Unfairగా fire (wrongful dismissal) చేశారని ఒక lawyer (Andrew) తాను పనిచేసిన law firm మీద caseపెట్టి గెలుస్తాడు. చాలా అద్భుతమైన, తప్పకుండా చూడాల్సిన సినిమా.

ఇలాంటి హత్తుకునే సినిమాలు చూసినప్పుడు intensityని బట్టి కొంత సమయం కోల్పోతూ ఉంటాను, ఆ spell అంతా పోయి తిరిగి మాములు మనిషిని  అవడానికి 1-2 రోజులు కూడా పడుతుంది ఒక్కోసారి. "అబ్బా! ఏమన్నా చెప్పాడా? అంతకన్నా గొప్పగా నటించాడుగా!" అనుకుంటూనే మరుసటిరోజు Embedded systems labకి వెళ్ళా. 3 గంటల తర్వాత కూడా ఆవాల్టి experiment పూర్తవలేదు. తీసుకున్న components అన్ని return చేస్తున్నపుడు అక్కడి lab technician అన్నాడు, "రేపు ఉదయం 11 నుంచి lab ఖాళీగా ఉంటుంది, నేను కూడా freeగానే ఉంటాను. కావాలంటే అప్పుడు వచ్చి పూర్తి చేస్కోండి" అని. అరే, ఈయన గమనిస్తూ ఉన్నాడన్నమాట. అయినా, experiment పూర్తిచేస్కోడానికి మేము ఆయన్ని అడగాలి కదా, ఎప్పుడు వచ్చి extra time చేస్కోవచ్చు అని, కానీ, ఆయనే చెబుతున్నాడు అడగకుండానే. ఆయనకేంటి అవసరం, అయన కేవలం technician, కావాల్సిన electronic componentsని studentsకి ఇవ్వడమే ఆయన బాధ్యత. అప్పటివరకు నేను చూసిన lab technicians అందరూ వాళ్ల బాధ్యతలే సరిగ్గా నిర్వర్తిస్తారని చెప్పలేని రకం. సాధారణంగా labs మధ్యాహ్నాలు ఉంటాయి. కాబట్టి, అయ్యేసరికి, ఈ technicians ఇంటికెళ్లే హడావుడిలో అందర్నీ తొందర పెడుతూ ఉంటారు. Experiment పూర్తయినా, కాకపోయినా, తొందరగా componentsని return చేయడమే వాళ్ళకి కావాలి. కానీ ఈయన మాత్రం differentగా ఉన్నాడు. Time అయ్యాక మేమే return చేసేవరకూ ఉండి, తర్వాత కూడా extra time మాకోసం ఇస్తా అంటున్నాడు. చెప్పడంకూడా ఎలాగ, సంతోషంగా నవ్వుతూ చెబుతున్నాడు. "తన jobని మరీ ఇంత seriousగా తీసుకుంటున్నాడేంటి ? ఈయన కూడా an excellent lab technician కదా!" అనుకుంటూ hostelకి బయల్దేరా. cycle తీసుకుంటూ ఆలోచిస్తున్నా, what makes us good at something? అని.  Am I a good _____? ఏదైనా సరే, Am I a good Son? Am I a good Engineer? Am I a good Farmer? Am I a good boyfriend? Am I a good Cricketer? Am I a good Scientist? Am I a good citizen? Am I a good Plumber? Am I a good Student?
 How to answer?

ముందురోజు చూసిన సినిమాలోని సన్నివేశం ఒకటి గుర్తొచ్చింది. Wrongful dismissalకి సంబంధించిన వాదప్రతివాదాల్లో, కింది సంభాషణ జరుగుతుంది. case పెట్టిన వ్యక్తి Andrewకి, తన తరపున వాదించే lawyer Joeకి మధ్య (courtలో అందరి ముందు) నడుస్తుంది.

Joe: Are you a good lawyer, Andrew?
Andrew: I am an excellent lawyer. (చాలా ధీమాగా, తృప్తిగా చెబుతాడు.)
Joe: What makes you an excellent lawyer? (అంతే ఇష్టంగా అడుగుతాడు Denzel Washington, భవిష్యత్తులో ఈ సన్నివేశాన్ని అసంఖ్యాకులు పదే పదే చూస్తారని ముందే తెలిసినట్లు!)
Andrew: I love the law. (small silence). I know the law. (small silence). And I excel at practicing it. (తప్పకూండా చూడండి, Academy Award వచ్చింది ఆ పాత్ర వేసిన Tom Hanksకి. ఈ scene మాత్రం కావాలంటే ఇక్కడ చూడొచ్చు)

Competent అయినప్పటికీ వేరే కారణం (Homosexuality and AIDS ) వల్ల unfairగా fire చేశారని నిరూపించేలా, చాలా సామాన్యమైన సన్నివేశంలా అనిపించినా, చాలా సార్వత్రికమైన సందేశం ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. తాను law studentగా సాధించిన ఘనతలు, medals, grades, ఆ తర్వాత careerలో గెలిచిన గొప్ప caseలు, సాధించిన achievementsని అర్హతలుగా చూపించి తానొక గొప్ప lawyer అని చెప్పుకోకుండా, అంతకంటే చాలా fundamental ingredients వల్ల తనకా యోగ్యత ఉందని చెప్పుకుంటాడు Andrew.

అవును,  ఆ lawyer సమాధానంలో స్పష్టంగా ఉంది, అన్ని ప్రశ్నలకి సమాధానం. మొదట మనం చేస్తున్న పనిని ప్రేమించాలి. అంతేకదా!, ఇష్టంలేకుండా చేస్తున్న పనిలో గొప్ప achiever అవడం చాలా కష్టం, అరుదు. కేవలం ఇష్టం ఉన్నా సరిపోదు. చేస్తున్న పని గురించి పూర్తి అవగాహనా ఉండాలి. బాధ్యతలనెరిగి నడుచుకోవాలి. అప్పుడే ఆ పాత్రని సమర్థవంతంగా పోషించగలుగుతాం. ఇష్టమూ, అవగాహనా ఉన్నా సరిపోదు, అనుభవం పెరుగుతన్న కొద్దీ, ఆపనిలో మన నైపుణ్యం మెరుగవుతూ ఉండాలి కూడా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండకుండా, దినదిన ప్రవర్ధమానం చెందాలనమాట.  అప్పుడే, one can become good at something, in fact anything. ఆ lab technician కూడా, తన పనిని ప్రేమించబట్టి proactiveగా ఉండి మమ్మల్ని గమనించడం, పిల్లలు మొహమాట పడే అవకాశముంది అని, extra time and help తానే offer చేయడం అనేవి automaticగానే అలవడి ఉండొచ్చు. అవే ఆయన్ని ఒక మంచి lab technicianగా (కనీసం నాకు) గుర్తుండిపోయేలా చేశాయి.

అలా ఆలోచించుకుంటూ hostel వైపు వెళ్తున్న నాకు, ఒకవారంలో జరగబోతున్న స్నాతకోత్సవం (convocation) కోసం ఏర్పాటుచేసిన పెద్ద posterలో, IIT Kharagpur logo ఎదురయ్యింది. అప్పటికే తెగ చూసేసి మురిసిపోయి ఉన్నా, ఈసారి  కిందున్న motto "యోగః కర్మసు కౌశలం" ఒకసారి అలా తళుక్కున మెరిసింది. ఆహా! "చేసే పనుల (కర్మల) యందు కుశలత (skill, నైపుణ్యము) కలిగిఉన్నవాడే యోగి" అని భగవద్గీతలో పెద్దాయన చెప్పే ఉన్నాడుకదా అని గుర్తొచ్చి, "అయితే ఇవాళ అలాంటి ఒక కర్మయోగిని కలుసుకున్నా అనమాట" అనుకున్నా. ఆ mottoని అర్థంచేసుకోడం కోసం అప్పుడెప్పుడో ప్రయత్నం చేసినా, ఇప్పుడీ దెబ్బతో బాగా అర్థమైందనమాట. ఇంతకీ, "అప్పుడంటే ఎప్పుడు?" అనుకుంటున్నారా, ఎప్పుడంటే, offline  పట్టా రోజుల్లో. ఎందుకంటే, నా previous university motto కూడా చాలా యాదృశ్చికంగా అదే!