Tuesday, December 20, 2011

మరుజన్మకైనా మరువగలేను


వీడిపొతూ నువు విసిరిన చూపు, నీ చేతి స్పర్శ
                       వెయ్యేళ్లైనా నను వీడిపోవు;
కలత నిండిన నీ కళ్లను కప్పిన కన్నీటి తెర
                    మరుగున నువు మోసిన మాటల మూటలు,
నీ చల్లని మునివేళ్లు నా అరచేతిలో మాట్లాడిన మెత్తని మౌనం,
                    మరుజన్మకైనా మరువగలేను;

Monday, December 12, 2011

క్షణమొక కావ్యం....!


సందెలో,
నే సవరించిన సిగపూల సావాసంలో,
గతించిన ప్రతిక్షణమూ, సలిపిందొక సరస కావ్యం...!

Thursday, November 17, 2011

నేనింకా పుట్టలేదు..!


నేనింకా పుట్టలేదు,
నీవైన నా రోజులే నా వయసు;

నీ వలపుసోకి వికసించాలి ఓ వెయ్యేళ్లు,
నీ పిలుపు తడికి పల్లవించాలి ఆ అన్ని పగళ్లూ;

Tuesday, October 4, 2011

అంతే...!


నియమాదుల నిన్నర్చించ, నిగమాదుల నెయ్యము నేనెరుగను,
లతాంగాల తుంచి, లోహాలనొంచి నిన్నలంకరించగలేను,
త్యాగరాజుల వలె, రాగరాజముల రంజింప, రవ్వంత రసఙ్ఞతకైన రాసి లేను,
మహా.....యనిన, మేనున్నంతవరకు మానసంబున నిను మోయగలను.....!

Monday, September 26, 2011

తన లెక్కలు


కంటి నవ్వులు > వెన్నెల వరదలు,
పెదవి పలుకులు - చిలిపి చిలుకలు=0,
కాలి అడుగులు ≃ వలపు పిలుపులు,
మేని సొగసులు ≡ విరగబూసిన అడవి పూలు.

Wednesday, September 21, 2011

ఇక్కడంతే, ఇది బెంగుళూరు...!


వెలసి పోయిన వరుస రోజులు,
కురిపించును కరెన్సీ రాశులు;
పనితోనే పరిగెత్తును పగళ్లు,
మనకైనా పట్టదు మన ఒళ్లు;
ఏమంటే,
ఇక్కడంతే, ఇది బెంగుళూరు...!

Tuesday, September 20, 2011

కళకళ-విలవిల


ఎలుగెత్తి చాట ఏమున్నది ?
పేట పేటకో అవినీతి పాటగాక,
పూటపూటకో పాపపు మూటగాక;
ఓహో.....,
మనచరితపు ఘనకీర్తుల...., ఘనుల భుజకీర్తుల కళకళలా ?
మానహీన వర్థమానపు వర్తులంలో(ఇవాల్టికి ఓఎంసి గనులల్లో)  చూడు వాటి విలవిలలు....!