Tuesday, January 25, 2011

శ్రీరామము....!


నీ తలపు తలపూ, తనువు మనసూ పులకరింతే గదా......!
ఏమి నీ కథా మాధుర్యము.
మరొక్కమారు కని, విని నా జన్మ పునీతమాయెను గదా......!
రాతిని సైతం నాతిగ మార్చిన నీవే నరవరేణ్యుడవు గదా.....!
జాతినే యశశ్వీకరించిన నీది గదా జన్మము.
ఇహాలకు, అహాలకు లొంగని నీది గదా ధర్మము.
నిను పలుకని నాలుకుండునా, నీది గదా నామము. శ్రీరామము....!

Friday, December 31, 2010

'విరి'గా, విడతలగా....!




కోవెల ముందు కోనేటి కలువల వంటి నీ కనులు కని కదా,
నే కవినైంది.
ఆ నీ కన్నె కలికి కులుకులు తరిమి కదా,
ఈ నా కలము కదిలినది.
వన్నెలీను నీ వెన్నబొమ్మ విగ్రహం వీక్షించి గదా,
నాకీ వేయితలల వెర్రి పుట్టినది.
మధువులొలుకు నీ మృదు మధుర రూపం మరల మరల తలచి కదా,
నాలో మరులు వేర్ల తరువు పెరిగినది.
తను పెరిగి, తను విరిగి, మది మరిగి, కల కరిగి ,
విడిగా, విడతలగా,
'విరి'గి, ఒరిగా నేనొంటరిగా .........!

Thursday, November 11, 2010

తండ్రీ..!



తండ్రీ..!
వివేకపు అంధకారంలో ఆదమరచి తూలుతున్న నా తమ్ముల,
వేశపు వేషంలో అసలు విషయం విస్మరిస్తున్న నా అన్నల,
నకులేశు పాదచరిత ఈ పవిత్ర పుడమిలో మిడిఙ్ఞాన పీడిత నీ పుత్రుల
సడించక,మా మనోతిమిర సంహారివై,
దయ రవి స్ఖలిత పసిడి వర్ణ కాంతి పుంజమై ,
ప్రతి దినమూ పలుకరింపుము తండ్రీ, నీ పుత్రుల...!

వేదించకే.....!


బతకనీ నన్నిలా, ముంచకే తేనెల
వెతకనీ వేకువ, చాలు నీ వెన్నెల
తడి ఆరని నా కన్నుల, కడ ఎరుగని కలవై
ఒడి నిండిన నా వేదన, ఎటు వీడని వలవై
వేదించకే.....!

Friday, September 10, 2010

నేను సైతం....!




నేను సైతం, కాను శూన్యం
నాది సైతం, భావ లేశం;
నేను సైతం, వీడి వేషం
నేటి నుంచి, పూని రోషం
మొదలు పెడతా మేలు ధర్మం;
నాదు గానం, రాగ రహితం
వేగ సహితం, వెర్రి గానం;
విప్ర పుంగవ వేద నాదం కాదు గానీ,
నాది సైతం గాయమోడిన గేయరత్నం;

Sunday, August 22, 2010

మా స్వాగతం



జాతి జనోద్దరణకు నడుంకట్టి, ప్రేమే లక్ష్యంగా, సేవే మార్గంగా, సమసమాజ స్థాపనకై
మా ముందుకొచ్చిన తారకిదే మా స్వాగతం.
ప్రజారాజ్య అవతరణ కోసం, అవినీతి ప్రక్షాళనగావించి,
తెలుగు ప్రజల గుండెల్లో ధ్రువతారై నిలిచిపోయెందుకిదే మా స్వాగతం.
తెలుగునాట సౌభ్రాతృత్వపు పవనాలు వీయించేందుకు,
సమానత్వపు పూవులు పూయించేందుకు
సిద్ధమైన సిసలైన నాయకునికిదే ఇదే ఇదే మా స్వాగతం,
ఎన్నో జీవితాల్లో తనునింపిన వెలుగుల సాక్షిగా ఇదే ఇదే మా స్వాగతం.
హృదయాంతరాళలో సుప్తావస్థలో నున్న మానవత్వాన్ని, భావావేశాన్ని
తను పంచిన రక్తంతో మేల్కొల్పిన మానవతామూర్తికిదే మా స్వాగతం.
మాలో రగిలే ఈ భావావేశపు జ్వాలల సాక్షిగా ఇదే ఇదే మా స్వాగతం.
అవినీతి కోరల్లో నలిగి, రాజకీయ ఉచ్చులో బిగిసి, విసిగి వేసారిన
ఆర్తుల ఆర్తనాదానికి చలించి ఆదుకోడానికి వస్తున్న అందరివాడికి ఇదే మా స్వాగతం.
క్షుద్ర రాజకీయాలకు బలై, లంచగొండుల ఆట వస్తువులై,
పనిచేయని ప్రభుత్వలను పెంచి పొషించి, ఆకురాలి మోడువారి,మరణావస్తలోనున్న జీవితాల్లో
వసంతం వికసింప జేసేందుకు వడివడిగా వస్తున్న మా వేలుపుకిదే ఇదే ఇదే మా స్వాగతం.

Wednesday, July 14, 2010

దయజూపి పలికింపు...!


నా మానస వీణపై నీ పదనర్తనాన వెలువడు శబ్దములకై
కరమున కలము వేచి యున్నది,
ఆ నీ తాండవము ధరియింప ధవళపత్రము దరి జేరినది,
దయజూపి పలికింపు,
జనగణమెల్ల పులకింప,
నా చేత పదమెల్ల.....!