Tuesday, December 20, 2011

మరుజన్మకైనా మరువగలేను


వీడిపొతూ నువు విసిరిన చూపు, నీ చేతి స్పర్శ
                       వెయ్యేళ్లైనా నను వీడిపోవు;
కలత నిండిన నీ కళ్లను కప్పిన కన్నీటి తెర
                    మరుగున నువు మోసిన మాటల మూటలు,
నీ చల్లని మునివేళ్లు నా అరచేతిలో మాట్లాడిన మెత్తని మౌనం,
                    మరుజన్మకైనా మరువగలేను;

Monday, December 12, 2011

క్షణమొక కావ్యం....!


సందెలో,
నే సవరించిన సిగపూల సావాసంలో,
గతించిన ప్రతిక్షణమూ, సలిపిందొక సరస కావ్యం...!

Thursday, November 17, 2011

నేనింకా పుట్టలేదు..!


నేనింకా పుట్టలేదు,
నీవైన నా రోజులే నా వయసు;

నీ వలపుసోకి వికసించాలి ఓ వెయ్యేళ్లు,
నీ పిలుపు తడికి పల్లవించాలి ఆ అన్ని పగళ్లూ;

Tuesday, October 4, 2011

అంతే...!


నియమాదుల నిన్నర్చించ, నిగమాదుల నెయ్యము నేనెరుగను,
లతాంగాల తుంచి, లోహాలనొంచి నిన్నలంకరించగలేను,
త్యాగరాజుల వలె, రాగరాజముల రంజింప, రవ్వంత రసఙ్ఞతకైన రాసి లేను,
మహా.....యనిన, మేనున్నంతవరకు మానసంబున నిను మోయగలను.....!

Monday, September 26, 2011

తన లెక్కలు


కంటి నవ్వులు > వెన్నెల వరదలు,
పెదవి పలుకులు - చిలిపి చిలుకలు=0,
కాలి అడుగులు ≃ వలపు పిలుపులు,
మేని సొగసులు ≡ విరగబూసిన అడవి పూలు.

Wednesday, September 21, 2011

ఇక్కడంతే, ఇది బెంగుళూరు...!


వెలసి పోయిన వరుస రోజులు,
కురిపించును కరెన్సీ రాశులు;
పనితోనే పరిగెత్తును పగళ్లు,
మనకైనా పట్టదు మన ఒళ్లు;
ఏమంటే,
ఇక్కడంతే, ఇది బెంగుళూరు...!

Tuesday, September 20, 2011

కళకళ-విలవిల


ఎలుగెత్తి చాట ఏమున్నది ?
పేట పేటకో అవినీతి పాటగాక,
పూటపూటకో పాపపు మూటగాక;
ఓహో.....,
మనచరితపు ఘనకీర్తుల...., ఘనుల భుజకీర్తుల కళకళలా ?
మానహీన వర్థమానపు వర్తులంలో(ఇవాల్టికి ఓఎంసి గనులల్లో)  చూడు వాటి విలవిలలు....! 

Tuesday, August 9, 2011

నీతో....!

నీతో స్నేహం, మనసుకు ఓ వరం
నీతో సమయం, తనకో సంబరం;
నీతో మాటలు, మదిలో మూటలు,
తెలుసో లేదో, తనలో పాటలు;
నీతో అడుగులు, మదిలో కవితలు,
తెలుసో లేదో, కరిగే కలతలు;

కలలన్నీ కవలలే, కేవలం నీవల్లే...!

Tuesday, April 19, 2011

కవిత, నాకు......


కవితంటే ఒక అందం,
ఒక ఆనందం,
ఒక అనుబంధం,
ఓ అద్భుతం;

కవితంటే ఒక అతిశయం,
ఒక పరిమళం,
ఒక పరవశం,
ఒక నేస్తం,
ఒక అవసరం,
ఓ వ్యసనం;

కవితంటే ఒక వరం,
ఒక కలవరం,
ఒక కలకలం,
ఓ కకావికలం;  

Sunday, April 3, 2011

వీలైతే నాలుగు కవితలు, కుదిరితే ఓ నవల.....!


ఎందుకో
పదాలంటే మోహం,
పదార్చంటే వ్యసనం;
అనిపిస్తుంది,
ఈ పానమొక వరం,
పేర్పొక పరవశం;
పద్యమో, గద్యమో,
ఎక్కితే హృద్యమే;
భవమో, అనుభవమో,
అంతా అతిశయమే;
భక్తి, రక్తి
మానవాళికి శక్తి,
యే...దైనా మొత్తానికో మంచి భుక్తి;
చలమో, చేతన్ భగతో,
కుటుంబరావో, కీట్సో,
ఓ హెన్రీ యో, యుద్దనపూడో,
R K నారయణో, ఆదివారం అనుబంధమో....
మీరు చదివి చూడండి
వీలైతే నాలుగు కవితలూ, కుదిరితే ఓ నవల....!

Monday, March 21, 2011

పండుగ రోజు....!


కలికి కులుకుల చిలక దివి దిగిన రోజు,
నా ప్రణయ గీతం పల్లవించిన రోజు,
మది వెదకిన వెలుగు ఉదయించిన రోజు,
నా జన్మజన్మల తోడు జనియించిన రోజు,
నాకిదే పండుగ రోజు....!

Monday, February 14, 2011

నువ్వే.....,నీ నవ్వే.......!

కురిసిన మేఘంలా, ముందెప్పుడో మనసంతా తడిపేశావు,
అంతటితో అయిపోయిందనుకున్నాను,
కానీ, మొలకెత్తిన ప్రతి పువ్వులోనూ నువ్వే.....,నీ నవ్వే.......!

Thursday, February 10, 2011

పుడమి విడిగింది.......!


కదలని అనలము మెదలి కదిలింది,
కరగని అభ్రము కరిగి తరిగింది,
తడవని పుడమి తడిసింది,
మురిసి, తనువంతా సిరులతో విరిసింది....!

Wednesday, February 9, 2011

నీ ఊహ..., అబ్బో కేక...!


నిన్ను తలచుకున్నప్పుడల్లా వింత వింతగా ఉంటుంది. ( అంటే..., కొత్త గదా....! )
మనసంతా భారంగా ఉంటుంది . ఎందుకో అడుగుదామంటే, నిన్ను వదలి రానంటుంది( I know, you can't help it ).
నీ ఊహ భారం భూగోళమంత( I can bear, though.. ) , మధురం వెగటు కానంత( Again, కొత్త గదా....!).
నీ ఊహ నా మదిలో మెదలినపుడల్లా గుండెల్లో కొత్త రక్తం పుడుతుంది( పోనీ At least, అనిపిస్తుంది..!),
స్వాతంత్ర్యం కోసం పోరాడే సైనికుల్లా నాళాలు పగిలి పోయేలా పరవళ్లు తొక్కుతుంది( to and fro....!),
కానీ చాలా బావుంటుంది( yeah..., you must try it ).
UHF signals నరాల్లో నాట్యం చేస్తాయి( true..., I saw with my eyes closed ).
Body భూమ్మీద ఆగదు( See the pic above ).
భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడి విశ్వరూప సాక్షాత్కారం అయినట్లు నీ రూపం నాకు కనిపిస్తుంది( You were smiling then... ).
నువ్వు తప్ప మిగిలిన లోకమే కనిపించదు.
అలా కొన్నిసెకన్లు మనసుకున్న శరీరమనే తొడుగు అదృశ్యమవుతుంది, కాసేపు Free గా అంతరిక్షయానం చేసి వస్తాను( Of course, you came too...! ).
నువ్వున్నావన్న నీ ఊహ చాలు, ప్రపంచమంతా రంగులమయమవుతుంది( Colorful, you know).
నాలో కొత్త శక్తి ఉత్సాహం రూపంలో ఉరకలేస్తుంది.
తర్వాత పడుకునే ముందు ఇలా నీ రచ్చనంతా paper మీద ( మధ్య Blog లో కూడా) పెట్టకపోతే నిద్ర పట్టనివ్వదు, నాకెంతో ఇష్టమైన నీ ఊహ.....!

Friday, February 4, 2011

ఏమిటి దీనికే.........!

ఇదేమిటి లోకమింత అందంగా ఉంది..?
వర్షం కురవకుండానే కడిగినట్టు...., Neat గా Nerolac రంగులేసినట్టు;
జనాలంతా కళకళా నవ్వుతున్నారు కళ్ళతోటి...., భయాలు, బాధలూ ఏమీ లేనట్టు;
మొహాలు ముద్దబంతుల్లాగా మెరిసిపోతున్నారు....., జగమంతా జాతరైనట్టు;
చెట్టు చేమా చిందులేస్తున్నాయి, చిలిపి చిరుగాలేదో చక్కిలిగింతలు పెడుతున్నట్టు;
ఇదేమిటి ఇంత చల్లగా...?
మార్తాండుడు మబ్బుల మడుగులో మునిగినట్టు;
శీతల శీకరాలు గాలిలో షికారుకొచ్చినట్టు;
CO2 సగమైనట్టు;
ఎప్పుడూ పట్టించుకోనుగూడా లేని పరిసరాలు, పడిపడి పలుకరిస్తున్నాయి,
బాగా పరిచయమున్నట్టు;
ఇదేమిటి అందరూ నన్నే చూస్తున్నారు....., అదేదో అంతరిక్షం నుంచి కొత్తగా Arrive అయినట్టు;
ఏమిటిదంతా ఒక్క FULL కే......!

Tuesday, January 25, 2011

శ్రీరామము....!


నీ తలపు తలపూ, తనువు మనసూ పులకరింతే గదా......!
ఏమి నీ కథా మాధుర్యము.
మరొక్కమారు కని, విని నా జన్మ పునీతమాయెను గదా......!
రాతిని సైతం నాతిగ మార్చిన నీవే నరవరేణ్యుడవు గదా.....!
జాతినే యశశ్వీకరించిన నీది గదా జన్మము.
ఇహాలకు, అహాలకు లొంగని నీది గదా ధర్మము.
నిను పలుకని నాలుకుండునా, నీది గదా నామము. శ్రీరామము....!