Wednesday, June 23, 2010

వస్తుంది, ఆ రోజొస్తుంది...!



వస్తుంది, ఆ రోజొస్తుంది. నాలో ఆనందం పురివిప్పి, దిక్కులన్నీ కప్పుతుంది.
ఆ రోజు, ఆ నాదైన రోజు, విశ్వాంతరాలన్నీ దొర్లివస్తాను.
వస్తూ వస్తూ నాలోని నిస్సత్తువని, నిస్పృహని పాతాళంలో పాతో, వైతరణిలో విసిరో వస్తాను.
అంతవరకు నన్నంటుకొని ఉన్న వైకల్యాల్ని విదిలించుకొస్తాను.
నేనుసైతం ఆ క్షణం ఆకాశాన్నంటుతాను. అంబరాన సంబరాలు చేస్తాను.
విను వీధుల్లో విహంగమై విహరిస్తాను, విజయాన్ని వరించిన ఆ రోజు.
తొలకరి వర్షం లాంటి హర్షంతో హసిస్తాను...!

ఏదీ..!

పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లికన్న మనసేది,
తాగనీరునియ్య పరుగెత్తే గంగ తల్లికన్న గమనమేది,
నిలువ నీడనియ్య (నిరంతరం)చిగురించే చెట్టుతల్లి కన్న చలవేది,
పాడిపంటలిచ్చి దీవించే మేఘమమ్మ కన్న మమతేది,
పేగుతెంచుకొని పాలిచ్చే కన్నతల్లికన్న కరుణేదీ...లోకాన...!

కడకేగలేదేమో స్వామీ...!


కడకేగలేదేమో స్వామీ,
నీ చరితము పొగడగ నే సలిపిన ఈ కృతి కడకేగలేదేమో స్వామీ;

నీ మగటిమి మెరువగ మెరుపులు సలుపజాలని ఈ కృతి కడకేగలేదేమో స్వామీ;
నీ శౌర్యము శ్లాఘగ సత్తువ జాలని,
నీ సౌరును చూపగ శబ్దములేరలేని,
నీ కరుణను కొనియాడగ ఇంపైన వాక్కెంపులాలంకృత గాని
ఈ కృతి కడకేగలేదేమో స్వామీ;
నీ పరమ పవిత్ర పదాబ్జముల అమరగ పరుగెత్తలేని పసిపాప
ఈ నా కృతి కడకేగలేదేమో స్వామీ;

కలగన్నానుగానీ....!


రాధ లాంటి రాగబంధమౌతావని కలగన్నానుగానీ,
ఇలా బాధ మిగుల్చు వాస్తవానివౌతావను కోలేదు;
నీ ప్రేమ చినుకులకు పల్లవించు కొత్త జన్మనౌతానను కున్నానుగానీ,
అవిలేక ఇలా మోడువారుతానను కోలేదు;
ప్రతిదినం నీ పరిష్వంగాన పసిపాప నౌదామనుకున్నానుగానీ,
ఇలా పరితపిస్తానను కోలేదు;
అనుక్షణం నీ అనురాగా న్నాస్వాదిస్తాననుకున్నాను గానీ,
ఇలా అలమటిస్తానను కోలేదు;
మనోవేదికపై నా అభిమానార్చనల నిన్నలరిస్తానని కలగన్నానుగానీ,
ఇలా మౌనంగా రోదిస్తానని కాదు...!

నీవేలే...!


రాయనా తియ్యగా కమ్మని ఒక కవిత,
పాడనా మెల్లగా నిన్నటి నా భవిత,
ఆశలే శ్వాసగా అల్లిన ఆత్మీయత;

అనురాగమే అందిన వరమని అనుకున్నా,
ఆలాపనలో మిగిలిన శేషం చూస్తున్నా,
ఈ కవనమాగదు లే, ఇక ఈ పవనమాగదు లే;

యెదసడిలో అలజడి ఎరిగిన వేళలో
పూలన్నీ పిలిచెనులే, గాలే నను మోసెనులే
అంబరమే అందెనులే, అంతటా అందమెలే,
వలపంటే తెలిసిన ప్రతి మనిషి పొందిన పరిచయమే;
అయినా చేరని ఆ తీరం శాపమౌతున్నా,
అనురాగాల ఆ రూపం మాసిపోతున్నా,
నను వెలిగించిన ఆ దీపం దూరమౌతున్నా,

ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే,
ఈ హృదయం వెనక ఉన్నది నీవేలే..!
నా రేపటి గీతం ఎపుడూ నీదేలే..!
తన లోపలి భావం ఎపుడూ నీవేలే...!

Saturday, May 29, 2010


It's not that i'm on the brink
to put all this ink
but for us to make a link
for you are there, in my every blink
and it's just you, all that i think
but the strength in me, is going to shrink
that day, they'll have me to sink
till then, i'm there, in the days you painted pink....!

Tuesday, May 18, 2010

నువ్వే.....!


నిను పిలిచే భాష రాక,
నీకై చెప్పే ఊసులు లేక,
నిన్నలరించే విధములు తెలియక
నాలో నేనె నీకై రాసుకున్న కవితవు నువ్వే.....!