Sunday, June 27, 2010

ఎప్పుడు...?




నిర్దాక్షిణ్యమైన నీ నిర్దయతో శుష్కించిన నన్నెప్పుడు ఆదరిస్తావు ?
నాలోని నీకైన వ్యథను వేనోళ్ల వెళ్లగక్కమంటావా ?
నా ఘోషని అంతరిక్షపు అంచులదాకా ఘీంకరించమంటావా?
నడిరేయి చల్లగాలి నన్ను మీటుతూ పాడే జోలపాటను సైతం తుచ్చపరచి నేచేసిన తపస్సులు నిన్ను కరిగించలేదా ?
విను వీథుల్లో విహంగమై విహరిస్తూ, ఇలమీది నన్నలరిస్తూ, అందినట్లే అంది, అందనంత ఎత్తుకెగిరే నిన్నెప్పుడు నేనందుకునేది ?
పాతాళ మంతటి నీ లోతును నేనెప్పుడు చూసేది ?
మహోత్కృష్ట మేరుపర్వతమంతటి నిన్నెప్పుడు నే అధిరోహించేది ?
మగువ మనో ఫలకమందలి రాతలాగా నిన్నెప్పుడు నే నెరిగేది ?
మధువు, మగువ అధరాలు,మధుర ఫలాలు సైతం సరితూగలేని నీ మాధుర్యాన్ని నేనెప్పుడు ఆస్వాదించేది ?
విరగ కాచిన నీ వెన్నెల్లో నేనాడుకునేదెప్పుడు ?
వసంతంలా విరగబూసిన నీ వనంలో నే విహరించేదెప్పుడు ?
నయనానందకరములు, మనో రంజకములు, భగవదనుగ్రహాలు అయిన సృష్టి సౌందర్యాలను నీ వగలు, నగలుగా చేసి, చూసి తరించేదెప్పుడు ?
సర్వకాల సర్వావస్థలయందూ,నీకై తపించి, నిన్నే జపించి, స్మరించే నాపైన నీవాన కురిసేదెప్పుడు ?
తీరని దాహము గల సముద్రుని దాహము వంటి నా కళాదాహాన్ని నా కల ప్రభంజనంతో తీర్చుకునేదెప్పుడు ?
నన్ను నీకర్పించుకునేదెప్పుడు ?
నీలో జలకాలాడేదెప్పుడు ?మునకలు వేసేది మరెప్పుడు ?
నేను నువ్వయ్యే దెప్పుడు ? నువ్వు నేనయ్యేదెప్పుడు ?

నాకు ఇష్టం....!


నల్ల రేగడి నేలన్నా, నల్ల తుమ్మ నీడన్నా
సంపంగి పూవులన్నా, సొంపైన వంపులన్నా, కెంపైన చెంపలన్నా
Black pulsar రైడన్నా, Black pants తోడన్నా
అమ్మ చేతి వంట తినడమన్నా, నాన్న వేలు పట్టుకు తిరగడమన్నా
కమ్మని కాఫీ అన్నా, కామెడీ కంపెనీ అన్నా
శనివారం పార్శిల్ అన్నా, ఆదివారం పేపరన్నా
చిరంజీవి పాత సినెమా అన్నా, కొత్త పార్టీ అన్నా
సచిన్ సిక్సరన్నా, బ్రెట్ లీ బౌన్సరన్నా
Morning రీడింగన్నా, Evening రైటింగన్నా
శ్రీ రాముని కథలన్నా,శ్రీ కృష్ణుని లీలలన్నా
ఆవకాయ జాడీ అన్నా, John cena బాడీ అన్నా
Jackie Chan ఫైట్లన్నా,Holly wood సెట్లన్నా
వేటూరి పాటన్నా, వివేకానందుని మాటన్నా
బడులన్న, గుడులన్న
కవులన్నా,కవితలన్నా, జనులన్నా, జాతర్లన్నా నాకు చాలా ఇష్టం....!

Friday, June 25, 2010

కవిత...!



హృదయాలను రంజింపజేసేదీ, రగిలించేదీ కవిత
వినోదాన్ని కలిగించేది కవిత,
విప్లవాన్ని సృష్టించేదీ కవితే,
కళాత్మకమైన కళ కవిత్వం, కళలకే కళ కవిత్వం.

శోక తప్త హృదయాలలో చిగురించే బాధ కవిత,
హర్ష వర్షంలో వినిపించే హృదయాలాపన కవిత,
ఆవేశాగ్ని పర్వతపు లావా కవిత,
రస సాగర విహారపు స్మృతి కవిత,
కవి కలము, జన గళమూ కవితే.

Wednesday, June 23, 2010

ఇలా ఎంత కాలమో.....?


అటు సొంతఊళ్లో, తల్లి మనసు ఎంత సొమ్మసిల్లెనో, తల్లడిల్లెనో
చదువు సంధ్యలకై పరదేశమొచ్చిన
కన్న కొడుకుని గూర్చి ఎంత కలవరించెనో, పలవరించెనో
పాపం పిచ్చి తల్లి....!
ఇటు వంగ దేశాన ఇంటి మీద బెంగతో కొడుకెంత కృంగెనో,
మనసు ముక్కలై ఇంటి చుట్టు మూగెనో, మూగదై రోదించెనో
అన్నదమ్ముల, అకచెల్లెల తలచి కన్నులు కరిగెనో,
లేని లేత చింత పల్లవించెనో, ప్రజ్వళించెనో
పాపం కన్న కొడుకు..!
చదువు సంధ్యల మనసు మూగక, భాధ్యతలు బాకులై,
అనురాగాలు అమ్ములై, కాలం కుంటిదై, బాధలే భావాలై, రోదనే రాతలై, కన్నీళ్లే కవనాలై
ఇలా ఎంత కాలమో.....?

నే వగస్తున్నాను...!


నీ చిరునవ్వు వెన్నెల్లో సేదతీరలేనందుకు చింతిస్తున్నాను,
నీ కొరచూపు చురుక్కు నను తాకనందుకు చింతిస్తున్నాను,
నీ వగలమారి వాల్జడ నాపై విసరనందుకు,
నీ వాలు చూపు వాడి నన్ను కోయనందుకూ వగస్తున్నాను.
నీ పెదవుల పదఝరిలో నే లేనందుకు,
నీ పూరేకు పాదాలకు పారాణి పెట్టలేనందుకు,
నీ నిశ్వాసల వేడిమి నను తడమనందుకు,
నీ కౌగిట వలపు వానలో తడవనందుకు,
నీ సొగసుల సిరి ( అరవిరిసిన అందాల విరి) నను వరించనందుకు

నే వగస్తున్నాను...!

 

వస్తుంది, ఆ రోజొస్తుంది...!



వస్తుంది, ఆ రోజొస్తుంది. నాలో ఆనందం పురివిప్పి, దిక్కులన్నీ కప్పుతుంది.
ఆ రోజు, ఆ నాదైన రోజు, విశ్వాంతరాలన్నీ దొర్లివస్తాను.
వస్తూ వస్తూ నాలోని నిస్సత్తువని, నిస్పృహని పాతాళంలో పాతో, వైతరణిలో విసిరో వస్తాను.
అంతవరకు నన్నంటుకొని ఉన్న వైకల్యాల్ని విదిలించుకొస్తాను.
నేనుసైతం ఆ క్షణం ఆకాశాన్నంటుతాను. అంబరాన సంబరాలు చేస్తాను.
విను వీధుల్లో విహంగమై విహరిస్తాను, విజయాన్ని వరించిన ఆ రోజు.
తొలకరి వర్షం లాంటి హర్షంతో హసిస్తాను...!

ఏదీ..!

పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లికన్న మనసేది,
తాగనీరునియ్య పరుగెత్తే గంగ తల్లికన్న గమనమేది,
నిలువ నీడనియ్య (నిరంతరం)చిగురించే చెట్టుతల్లి కన్న చలవేది,
పాడిపంటలిచ్చి దీవించే మేఘమమ్మ కన్న మమతేది,
పేగుతెంచుకొని పాలిచ్చే కన్నతల్లికన్న కరుణేదీ...లోకాన...!