Sunday, June 27, 2010

ఎప్పుడు...?




నిర్దాక్షిణ్యమైన నీ నిర్దయతో శుష్కించిన నన్నెప్పుడు ఆదరిస్తావు ?
నాలోని నీకైన వ్యథను వేనోళ్ల వెళ్లగక్కమంటావా ?
నా ఘోషని అంతరిక్షపు అంచులదాకా ఘీంకరించమంటావా?
నడిరేయి చల్లగాలి నన్ను మీటుతూ పాడే జోలపాటను సైతం తుచ్చపరచి నేచేసిన తపస్సులు నిన్ను కరిగించలేదా ?
విను వీథుల్లో విహంగమై విహరిస్తూ, ఇలమీది నన్నలరిస్తూ, అందినట్లే అంది, అందనంత ఎత్తుకెగిరే నిన్నెప్పుడు నేనందుకునేది ?
పాతాళ మంతటి నీ లోతును నేనెప్పుడు చూసేది ?
మహోత్కృష్ట మేరుపర్వతమంతటి నిన్నెప్పుడు నే అధిరోహించేది ?
మగువ మనో ఫలకమందలి రాతలాగా నిన్నెప్పుడు నే నెరిగేది ?
మధువు, మగువ అధరాలు,మధుర ఫలాలు సైతం సరితూగలేని నీ మాధుర్యాన్ని నేనెప్పుడు ఆస్వాదించేది ?
విరగ కాచిన నీ వెన్నెల్లో నేనాడుకునేదెప్పుడు ?
వసంతంలా విరగబూసిన నీ వనంలో నే విహరించేదెప్పుడు ?
నయనానందకరములు, మనో రంజకములు, భగవదనుగ్రహాలు అయిన సృష్టి సౌందర్యాలను నీ వగలు, నగలుగా చేసి, చూసి తరించేదెప్పుడు ?
సర్వకాల సర్వావస్థలయందూ,నీకై తపించి, నిన్నే జపించి, స్మరించే నాపైన నీవాన కురిసేదెప్పుడు ?
తీరని దాహము గల సముద్రుని దాహము వంటి నా కళాదాహాన్ని నా కల ప్రభంజనంతో తీర్చుకునేదెప్పుడు ?
నన్ను నీకర్పించుకునేదెప్పుడు ?
నీలో జలకాలాడేదెప్పుడు ?మునకలు వేసేది మరెప్పుడు ?
నేను నువ్వయ్యే దెప్పుడు ? నువ్వు నేనయ్యేదెప్పుడు ?

No comments:

Post a Comment