Tuesday, December 11, 2012

అలిగావా...?


ఒకసారేమో అవసరం;  బాధ పడ్డప్పుడు వెళ్లి బోరుమన్నావ్ చూడు, అపుడు;
ఒకసారేమో ఇష్టం;  సంతోషంలో చెవిలో చేరి జోరీగవైనావు చూడు, అపుడు;
ఇంకోసారి వ్యసనం; అదే weakness, అశక్తత;

అన్నీ నీవే;
బాగా ఆలోచించు,
నీ బాధలోనే,  నీకవసరమయ్యారు;
నీ సంతోషంలోనే,  నీకిష్టమయ్యారు;
నీ weakness వల్లే, నీకు వ్యసనమయ్యారు;
అంతా నువ్వే,  అన్నీ నీవే;

ఆమాత్రం దానికి,  అలక దేనికి?
అలిగేది ఆడోళ్లు కాదు. అబలులు;
బలం లేని మనసులు;
స్వార్థంతో శుష్కించిన మనసులు;
తేల్చుకో మరి నువ్వెవరో...!

Wednesday, November 28, 2012

ఒక particular చూపు


నాకదేంటో మాంచి peak timeలో ఉన్నపుడే, off the track వెళ్దామని అన్నీ లాగుతుంటాయ్, అంటే ఒక్కోసారి ఒక్కోటనమాట లెండి.
మచ్చుక్కి మూడొదలమంటారా,
సరే సరదాగా ముడున్నర్రేల్లు ఎనక్కెళ్తే, 2009 Feb 5, evening 5PM, అదేదో కాకినాడ మొత్తం మునిగి పోతున్నట్లు, అప్పటికప్పుడు mobileలో ఉన్న ఒక్కగానొక్క ఆడ నంబర్ కి కాల్ చేసి, అప్పటికి ఆరేళ్ల క్రితం (అంటే, రాజా బాబు పదవ తరగతి లో) interest ఉన్న ఇద్దరమ్మాయిల phone నంబర్లు అంది పుచ్చుకుని,
కాకినాడ రమణయ్య పేట లో రెండవ అంతస్తులో ఉండే మా రూం బయటకి వచ్చి, వాకాలపూడి మీదుగా ఉప్పాడ బీచ్ మీంచి వీచే గాలి పీలుస్తూ, వారసత్వంగా సీనియర్లనుంచి చదువుకోడానికని  సంక్రమించిన స్టడీ చైర్ మీద కూచుని, పిట్టగోడ మీద కాళ్లు పెట్టి, "ముందు ఎవరికి చేద్దామా ?" అని ఇస్రో వాళ్లు చంద్రయాన్ కి చేసినంత మేథో మథనం చేసి ఒక అమ్మాయ్ ని డిసైడ్ అయ్యాను.

ఈ particular పిల్ల గురించి కొంత చెప్పుకోవాలి. పాపకి పిల్లోలందరూ ఫాలోఅర్సే, పైకి చెప్పుకునేవారు కాదంతే, పిల్లతనానికే చిన్నతనం మరి. నాకైతే ఆడ పిల్లలు అందంగా కూడా ఉండగలరని(:P) ఆ ట్యూషన్ కెళ్లాకే అర్థమైంది. ఒకసారి నేర్చుకుంటే ఇక మర్చిపోలేరు, అలాంటి పాఠమా పిల్ల.
ఇంతకీ ఆ ట్యూషన్ మా పక్కూర్లో. అది మా మండల కేంద్రం. ఆ ట్యూషన్ మాష్టారు మా ఉళ్లో ఉన్న పదవ తరగతి పిల్లల ఇళ్లకొచ్చి, చేర్పించమని వాళ్ల పెద్దలని అడిగి మరీ పట్టుకెళ్తున్నాడు. అలా మా ఇంటికొచ్చినపుడు, 500 మార్కులు  (600కి) గ్యారెంటీగా తెప్పిస్తామని మా నాన్నతో చెప్పి, సరదగా Englishలో ఒక active voice sentence చెప్పి, passiveలో చెప్పమన్నారు. నేను చెప్పలేక పోయాను. అది చూసి ఆ మాష్టారు మా నాన్నకి బంపర్ ఆఫర్ ప్రకటించాడు పాస్ ఐతేనే ఫుల్ ఫీ, లేకపోతే సగమే చాలన్నాడు. అని వెళ్లిపోయాక, నన్నెప్పూడూ ఒక్క మాట కూడా అనడానికి ఇష్టపడని మా నాన్న "అది కూడా చెప్పకపొతే ఎలాగరా?" అని కొద్దిగా కోపం (బాధ?) పడ్డాడు, మరి ఆయన ఒక స్కూల్ టీచరు, పైపెచ్చు నాకు సెవంతు క్లాసులో English కూడా చెప్పాడు. మొత్తానికి నన్ను ఆ ట్యూషన్ కి వెళ్లమన్నాడు. అక్కడ నేర్చుకున్న పాఠాల్లో ఒకటి  పైన్నే మీకు ఒప్పజెప్పాను.

కొన్నాల్లకి నేను ఆ ట్యూషన్ మానేసి,వేరే స్కూల్లో చేర్తున్నానని తెలిసి ఆ ట్యూషన్ మాష్టారు , మా ఇంటికొచ్చి, మా నట్టింటికొచ్చి, నాన్నకి నచ్చజెప్పి అక్కడే ఊంచుకుందామని విశ్వ ప్రయత్నాలూ చేశి, వీలుకాక వెళ్లి పోయాడు. అది వేరే విషయం.
అయినా కానీ ఆ particular పిల్ల తో కలిసి కొన్నిcompititive examలు రాసే అవకాశం దొరకడం చేతనూ, కొన్ని ప్రయాణాలు కలిసి (వాళ్ల HM కూడా ఉన్నాడు లెండి) చేయడం చేతనూ, బాగా చదువుతానని (అప్పుడు లెండి) మా మండలమంతా (అంటే 5 హైస్కూల్లనమాట) పేరుండడంచేతనూ, పెద్ద బాధపడ లేదులెండి.
రోజులు అలా గడుస్తున్న సమయంలో, ఒకానొక ఆదివారం అల్లాంటి ఒక exam రాయడానికి పులివెందుల వెళ్లాం, మా ఇద్దరితో పాటూ నాకు బాగా ఇష్టమైన ఇంకో ఫ్రెండూ (ఆ పిల్ల వాళ్ల ఊరివాడే), వాళ్ల HM కూడా ఉన్నారు (అంట!)  నాకు వాళ్లేం కనిపించలేదు, అప్పుడప్పుడూ వినిపించే వాళ్లు అంతే. ఆరోజు ఆపిల్ల్ల అల్లుకొచ్చిన జడ చూసి ( ఒక డీప్  breath ) జిల్లుమన్నాను, కానీ మా స్కూల్ టీచర్లే ఘొల్లుమన్నారు, తాలుకాలో సెకండ్ వచ్చినాగానీ, ఒక్క మార్కులో ఫస్టు పోయిందనీ వాళ్ల ఏడుపు. నేనవేం పట్టీంచుకునే స్థితిలో లేను.
ఇంటికెళ్లిన నేను, సాయంత్రం అమ్మతో కలిసి గేదెలకి గడ్డికోసుకు రావడానికి వెళ్లాను. నల్లరేగడి చేలల్లో మట్టినిచూసి, దీన్ని మంచి నూనెతొ తడిపి, అమ్మ చపాతికి గోధుమ పిండిని కలిపినట్లు కలిపి సాగదీసి, లేపాక్షి నుంచి కళాకారుల్ని రప్పించి (లక్షINR అయినా), దానిమీద కురుల పాయలు చిత్రించినా ఆపిల్ల జడకి సాటి రాదని డిసైడ్ అయ్యాను. అంతలో ఆగెట్టు నుంచి అమ్మ పిలిస్తే,కాదు కాదు అరిస్తే, కోసిన గడ్డి సందిట్లో ఎత్తుకుని పరుగెత్తుంటూ వెళ్లాను. ఎంత గడ్డి కోసినా మొత్తం తనే ఎత్తుకొచ్చేది ఇంటిదాకా, నన్ను అస్సలు మోయనిచ్చేదికాదు అమ్మ. కానీ, దార్లో వచ్చేటపుడు ఊపుకుంటా రావడం నాకు నచ్చక, ఆపై వారం అమ్మతో వాదించైనా ఒక సందెడు మోసుకొద్దామని అనుకున్నా. కానీ ఆపై వారమ్ నుంచీ అటువైపెళ్లడమే మానేశాను, పబ్లిక్ పరీక్షల్లో మండలం ఫస్టు రావాలని, ఆదివారంకూడా extraగా లెక్కలు చెప్పించేవాడు మా శ్రీనివాస రెడ్డి (మా కరెస్పాండెంట్ లెండి).

ఇంతలో వచ్చిన SMS సౌండ్ కి, మా ఊళ్లో ఉన్న నేను కాకినాట్లో మేల్కొన్నాను. ఒక చిరునవ్వుకుని, ఆ particular పిల్లకి కాల్ చేశాను. మోగుతోంది. కొన్ని క్షణాల్లో ఆ routine ట్రింగ్ ట్రింగ్ కి బదులు మెత్తని మెలోడి వింటానని ఉర్రూతలూగిపోతున్నాను.
ఇంతలో "హలో", ఆ particular పిల్లే
"Hi, ఎలా ఉన్నావ్?", అదేదో నా కాల్ కోసం ఎదురుచూస్తున్నట్లు.
"ఎవరు?"
"<నా పేరు> ని"
"ఆ..,ఎవరు?" , పావు ప్రాణం పైకెళ్లి పోయింది.
పిట్టగోడ మీది కాళ్లు కిందకి దిగినయ్, చైర్లోని వీపు విశ్రాం నుచి సావధన్ లోకి వచ్చింది.
"నేను,<మల్లి  నాపేరు>ని,టెంత్ క్లాస్, ట్యూషన్,....."ఇలా చెప్పుకుంటూ ఒక 2 నిముషాలు నన్ను నేను బ్రతికించు కునే ప్రయత్నం చేశాక కూడా గుర్తురాలేదు, నిముషానికి పావు చొప్పున మొత్తం ముప్పావు ప్రాణం పోయింది(తీసేసింది). అయినా సరే, until my last blood drop goes blue అనుకుంటూ టెంత్ క్లాస్లో ఎవరూ touchలో లేరా అని అడిగా.
"ఆ, <ఒక పేరు>ఒక్కడితోనే అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉంటా"నంది.
ఆ ఒక్కణ్ణి నాకు bold, italicలో వినిపించి, మొత్తం ముగించేసింది (మిగిలిన పావు ప్రాణం).
సర్లే ఇంకెప్పుడైనా చేస్తానని చెప్పి cut చేసి, నా గర్వము సర్వమూ ఖర్వము అయినందుకు బాధపడి, ఆ ఒక్కణ్ణి తలచుకున్నాను. వాడెవరనుకున్నారూ, మాతో పాటూ ఆ exams రాయడానికొచ్చిన వాళ్ల స్కూల్ టాపర్. (వీడెవడోగాదు, విష్ణు భక్తుడే, విజయుడే అన్నట్లు). మంచోడు, మనలాగ్గాదు. వాళ్లూరెల్లినపుడు వాళ్లింటికి కూడా వెళ్తూంటాను (అతనొక Doctor ఇపుడు), కానీ ఎప్పుడూ ఆ particular పిల్ల ప్రస్తావన మాత్రం తేలేదు, పూర్తిగ చచ్చేక ఇంకా suicide ఎందుకని.

ఇంతలో మెట్లమీంచి "అయ్యకి తెలియకుండ అమ్మా అనిపిస్తవా, వస్తవా, వస్తవా"  అనుకుంటూ పైకొచ్చాడు, మా రూమ్మేట్ (మా వాడు విక్రమార్కుడు, అనుకుంటున్నారా, అదేంగాదు ఆ cinema ని 5సార్లు చూశాడు anand complexలో). "ఏంట్రా exam దగ్గరికొచ్చేసరికి భయం పెరిగిందా ఏంటి? face లో ప్రేతకళ తాండవిస్తొంది" అని అడిగాడు.
"మరి చచ్చిపొతే అంతే కదరా" అన్నాను మొహం మాసిపొయి ఉన్న నేను.
చేతిలో ఫోనూ, మొఖంలో బాధ, నోట్లో ఇలాంటి పదాలూ  చూసి, ఊర్లో ఎవరో ఉష్ ఫటాక్ అనుకుని "ఏమైందిరా?" అని మెల్లిగా అడిగాడు మావాడు. ఆ యొక్క telephone episode మొత్తం telecast చేశాక, "థూ, నువ్వూ నీ కామం, మూర్రోజుల్లో (Feb 8) GATE పరీక్ష పెట్టుకుని, ఏంట్రా నీ కుప్పిగంతులు? కరువు నా ....." (తర్వాత వినిపించలేదు), అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్లి పొయాడు. నామీద నాకే చిరాకేసి వెళ్లి, ACE material ముందు కుర్చున్నాను.మొహం తుడుచుకుంటూ బయటికొచ్చిన మావాడు, "నిజంగానే గుర్తు పట్టలేదంటావొరే ఆ పిల్ల??" అని అన్నాడు. "ఏమో లేరా ఇంకా అదెందుకు, ఉంకో నంబర్ ఉంది దానికి చేద్దామేంటి?" అని వాడి వైపు చూశాను.
నవ్వాలో ఏడవాలో తెలీక వాడు నన్ను చూసిన ఒక particular చూపు ఉంది చూశారూ,అదే ఈ post కి title అనమాట. ఆయ్ ఉంటానండి, మిగిలిన అరెండూ ఇంకెప్పుడైన చెప్పుకుందాం.

Monday, November 26, 2012

మనో సాంత్వనము

 తనని మోసే మాటలు పుట్టక
మౌనంగా కూలబడింది మనసొక మూలగా...!
-----------------------------------------------------------------------
రాయవలెనుగానీ, ఇదిగూడ నొక రాధికా సాంత్వనమే.

మనో పరిమళాన్ని మానవోత్తమునికి ముట్టజెబుదామనుకుంటిమి, మాటల మాలగా,
ఏదీ పలకదే, పదఝరి పారదే, ప్రభువుని చేరదే;

స్వామి సంకేతమేమైన చిక్కెనా, సుర నర లోకముల మధ్యన,
దేవేరి మంజుల మంజీరజముల బడి, నా మొర వినగలేదో,
వినిగూడ ఊరకనుండినాడో, లేక విసిగినాడో ;
-----------------------------------------------------------------------

వలదు, వలదు
వరములెవరడిగిరి నిను, వాక్కులు గాని; కనకములెవరడిగిరి నీ కృతులుగాని.

Friday, November 2, 2012

తపనలకేం లే, చాలా తేలిక.....!


నువంత easyగా నవ్వవని తెలిశాక, నిన్ను నవ్వించాలనే..... నాతపన.
నిన్న నువు రాకపొతే, ఎందుకు రాలేదని అడుగుదామని,
          నిన్నంతా నిన్నే తలచుకున్నానని చెప్పాలని, నాతపన.
ఎదో వంకతో నిన్ను చూడాలని,
          ఆ నా ప్రయత్నాలలో ఎదోసారి నీకు దొరికిపోవాలని, నాతపన.
ప్రతి రోజు నువు తొందరగా రావాలని, రాగానే నన్ను చూసి కళ్లతోనే కొంటెగా నవ్వాలని, నాతపన.
మెట్లమీద ఒక్కసారైనా ఎదురవ్వాలని,
          కలిసొక్కసారైనా కాఫీ తాగాలని, నాతపన.

నాకు తెలీకుండానే వింటున్నావని నువు అనుకునేలా, నేనో విరహగీతం hum చెయ్యాలని,
         తరువాతెప్పుడో, lunch చేస్తూ "నువు వినాలనే పాడా"నని ఒప్పుకోవాలని, నాతపన.

జంకుతూనైనా, "జుట్టు జడవేసుకున్నపుడు బావుంటా"వని చెబుదామని, నాతపన.

ఇదంతా, కేవలం నువ్వు వినేలా చెప్పాలని,
                 కానీ అం...దరూ చదివేలా రాయాలని, నాతపన.

Saturday, October 27, 2012

Mi Ti Amo...!


నీ అరచేతులు అద్దెకిస్తావా?
కాసేపు నా కొనవేళ్లు దాచుకుంటాను.
---------------------------------------------------
మరికాసేపు మెదలకుండా కూచుంటావా?
మదినిండా నీ మౌనం నింపుకుంటాను.
----------------------------------------------------------------
పోనీ పెళ్లి చేసుంటావా?
ప్రాణం పెనవేసుకుంటాను.

Simple and Charming-3


అంతందమేంటే,
ద్దూపద్దూ లేకుండా, బ్బాయిలంటే జాలీ దయా లేకుండా.
అంతేనా? అంతకన్నా  ఎక్కువ,
లవిమాలిన భిజాత్యం,మరి రాల్తీకుండా ఎలా ఉంటాం?
క్కడితో గితేనా,
డవిపూల మాయకత్వం, టికి Unileverలు, P&Gలు వసరం లేదు గదా!
సలే, ర్డినరి మ్మాయిల్ని, అంతరించిపోతున్న రుదైన జాతుల్లో చేర్చేశారు.(నైక్య బ్బాయిల సమితి వారు.)
టువంటి సమయంలో, మొన్నామధ్య మన పూరి గారిని కలిసి వేర్నెస్ కల్పించమని శ్వేతపత్రం సమర్పిస్తే, నిన్న మన Power Star గారితో పలికించారు, ది వేరె విషయం.
యినా, కృష్ణ శాస్త్రి కవిత్వానికి కాసులపేరెందుకు?  ఖర్చుదండగ కాకపోతే..!
దే కారణంచేత, నువు కేవలం కాశీతాడు కటుకొచ్చినా, చూసిన నా కళ్లు సల్లబడుతున్నాయి.

అండర్ వాటర్ ఆక్సిజన్ ఎలాగో, స్తమానం నువు నాకలాగ.
ర్థం జేసుకోవు,
యినా బాధలేదు, దో Optimism. 

Wednesday, October 17, 2012

Man Vs. Himself : Being a Man


"రాగ రాహిత్యం" అని మనసు రోదించి నపుడల్లా,
కాదు కాదు, కేవలం "మోహపు Manifestation" అని మెదడు మొత్తుకుంటూనే ఉంది.
అదేంటో, ఎప్పుడూ ఏదీ గెలిచినట్లు అనిపించదు.

<ఒకానొకప్పుడు>
మనసు: ప్రపంచం మొత్తం జయించి తన పాదాల నలంకరించాలనుంది.
మెదడు: Just to feel the smoothness of her skin?
<------------->

----:   Isn't that being a Man ?

Thursday, September 20, 2012

Simple and Charming-2


(ఈసారి కొద్దిగా Seriousగా)
మరీ మిగిలిన ప్రపంచం మొత్తం పట్టించుకోకూడదంటే ఎలాగరా?
ఎటేపు తిరిగినా తనేనంట,
తనెళ్లే timeకి నేను start అవ్వాలంట,
ఎప్పుడు ఏదార్లో వెళ్తుందో గుర్తుంచుకోవాలంట,
తనెప్పుడు చెప్పిందో..., నేనెలా విన్నానో..., అన్నీ అచ్చం అలానే జరిగిపోతున్నాయ్ రా.
బాబోయ్, నేను నామాటే వినకుండా చేసేసింది.
మనలో మన మాట, మానాన్న మాట కూడా ఇలా వినిపించుకుంది లేదు.ఇది మరీ దారుణం.
అదో నడిసే నయాగరా సిన్నా, తడిపేసేలోపు ముంచేసిద్ది, మరింకేం మిగలం, మనకిమనం.
Suddenగా Newton గుర్తొచ్చాడు, వీడి 3వ మాటని భయంకరమైన Rocket లైనా వింటాయ్ గానీ,అందమైన అమ్మయిలు మాత్రం అస్సలు ఆలకించవు.
పొగురు, బలుపు, కొవ్వు, బిరుసు, ఇంకేదైనా. కాకపొతే ఏంట్రా, ఇక్కడింత contaminationతో కొట్టుమిట్టాడుతోంటే కొద్దిక్కూడా reactionలేదు.
పైగా hi చెబితే "optimization class మీకు అర్థమౌతోందా?" అనడుగుతుంది. అవదు, దీనికి మన బాధ అస్సలు అర్థమవదు.
అవయవాల అమరిక అద్భుతంగా కాకపోయినా, అందంగానే ఏడ్చింది గదా(అదిన్నూ ,అందరికి అర్థమయ్యే అందం కూడా కాదుగదా, అదో Esoteric Aesthetics), లోపల Hormoneలే సరిగ్గున్నట్లు లేవు దీనికి.  
తెలీట్లా దానికి...., ఒక్కసారి సరిగ్గా నాకళ్లలోకి తొంగిచూస్తే, తెలిసొచ్చి తరిస్తుంది బుజ్జిముండ.
పోనీ భగవంతున్నేమన్నా బతిమాలుకుందామా అంటే, లోక కళ్యాణం కోసమే....కోరుకోమంటాడాయన,
మా కళ్యాణనికే దిక్కులేదు, తొక్కలోది లోకకళ్యాణం ఎవడిక్కావాలి?
(సశేషం).

Wednesday, September 19, 2012

పాపం, పుణ్యం ఏమీ కాను.

పా....పం నేను,  ఎవరి పుణ్యమూ కాను,
పర్లేదు నేను,  ఎవరి పాపమూ కాను.

Tuesday, August 28, 2012

Simple and Charming-1


కొత్త పుస్తకంలో రాసేప్పుడు మొదటి పేజీ వదిలేసినట్టు, తెలీ...కుండానే, చాలా తే...లిగ్గా జరిగిపోయిందిరాబ్బాయ్..!
ఇది వరకు mess కెళ్తే, ఎన్ని జీన్సులు, ఎన్ని టాప్ లు, అబ్బో....టాపు లేచిపోయేది, అదో రాయలనాటి రసికత.
మరిప్పుడో...., ఒక్కటంటే ఒక్కటే, అదీ చూడీదార్.
దీన్నేమంటారా.........? ఇదో కవి హృదయపు కటకట.
           అంటే నా ఏడుపు నేనేదో miss అవుతున్నానని కాదు.
అదేంటో, "నేను, దాన్ని వెదకడమేంటి?" అనుకుంటూ mess మెట్లు ఎక్కుతూ ఉంటానా,
కానీ ఆపాటికే నా కళ్లు mess అంతా కలియతిరుగుతూ ఉంటాయ్, ఆకలిగా.
ఇదిగో ఇలాగే, మన ego దెబ్బ తింటోంది. అదీ మన బాధ.
ఆ పై lineలో , "దాన్ని"  అని రాయడానికి లోపల ఎంత రచ్చ జరిగిందో నేనిక్కడ రాయలేను.
       నాకీ మధ్య రోజూ హోలీ యే. మరది రోజుకో రంగుతో కొడుతోందిగా.
ఎన్ని చూడీదారులు చూడలేదు మనం,...... ఏదీ కళ్లను దాటెల్లి ఇంత కల్లోలం జెయ్యలేదే.
అందమంతా దాని అమాయకత్వంలో ఉందిరా. ఆ క్యారీ...యింగ్ ఉంది జూశావు, కళ్లప్పగించవ లిసిందే చిన్నా. సితక్కొట్టేంత సింపులెహె, కాని సంపేసేంత శార్మింగ్(charming) రోయ్.
నడక, ప్చ్, ఇది నికోటిన్నే(nicotine) నాకించ్చేద్ది, నాడీమండలం రిలాక్సయ్యేంత నాజూగ్గా ఉంటది నాయనా,
చాలా నెమ్మదిగా, ఉప్పుడు ...మందగమనం అంటారు సూడు అద్గదే,
 శాస్త్రి గారు తప్ప, సమకాలీనులెవరి సేతా కాదురా, సెప్పాలంటే. మరది.
మొన్నోరోజు, Gulmohar Roadలో అగుపడింది, ఒంటరిగా. అదలా నడుస్తుంటే BP పడిపోయింత స్పీడ్ గా, Frame Rate పెరిగిపోయి, Vertigo effect లో ఊపేసిందంతే. ఊపిరి ఆగిపోయింది కాసేపు. కానే...మి జరగనట్లు, మెల్లిగా Meditate చేస్తున్నట్లుగా ఎళ్లిపోయిందంతే. మతొచ్చాక చూసుకుంటే ముర్తి గారి Matrix Theory క్లాసైపోయింది.
(సశేషం).

Wednesday, July 11, 2012

మనం కొద్దిగా మార్చలేమా?


పిలవలేదని, పలగ్గూడదా?
మరి శాస్త్రి గారు వనాలూ, వసంతం అని వక్కాణించారు, అంతా వొట్టిదేనా?  (అయుండదే.....)
...............................................
తరుముతున్న తాపైకం తమరేనని, (కేవలం) వాచా విన్నవించుకోలేదని, అలా వొదిలేస్తావా?
.......................................................
అలాక్కాదే,
ఆపలేదని, ఆగకూడదా?
పొనీ, అలక్కూడదూ...!
..............................................................
ఐనా, అన్ని కథలూ అలాగే ఉండాలా?
మనం కొద్దిగా మార్చలేమా?...... అంటే, మనకొసమే కదా...!
అబ్బా,,,,,, నువ్వు మరీ Ragging చేస్తున్నావే....!
అలా చూడకు, ఆపేశాలే......!

Saturday, May 5, 2012

సర్రియలిజం, నాది.....!



మెదడు, మనసు సరిహద్దులో,
ఇప్పుడే పుట్టి, ఆదరించే అండ లేక, అప్పుడే చచ్చిన
అనాథ ఉహల అడుగుజాడలు.....,
అదో సర్రియలిజం.

Friday, February 24, 2012

ఓ మిట్టమధ్యాహ్నపు మైమరపు....!




ప్రదేశము: PDC ప్రయోగశాల (అనియే ఙ్ఞాపకమున్నది, కానియెడల మాకు తెలుపుటకు, మమ్మానందింపుటకు(ఇచ్చట   మేము సిగ్గువడితిమి, మీరు నవ్వుతుండిరని మా మధురోహ) బిడియము వలదని మనవి).

సమయము: క్రీ.శ. 2005-09 మధ్య ఓ మాఘమాసానంతరం, మండు వేసవిలో ఓ మంగళవారం( పై మనవిని ఇక్కడకూడా మన్నింపగలరు )


విషయం, విశేషం: కళాశాల వారికి ఆ యొక్క గణనయంత్రముల మీదుండెడి కనికరమైననూ మా మీదుండెడిదిగాదు, మేమా ఎండలకి అటులనే మాడుచుంటుమి. కోవెలయందలి మూర్తిని పూజారులు వింజామరలతో సేవించినట్లు, అ నిర్జీవ రాశులకు చలువమరలతో సేదతీర్చెడి వారు. అవియిన్ను ఆ పెరుమాళ్లకు మల్లే; వారానికో మారు అర్చించినా, అఖరకు విధి పేర వంచించెడివి.
అట్టి ఓ మిట్ట మధ్యాహ్న సమమున, చేయడమేమో తెలియక, పరిశీలనా పుస్తకము పట్టుకుని కొట్టుమిట్టాడుచుండ......
హిమాలయాన ప్రవరాఖ్యుని పలుకరించిన వింత పరిమళమోలె,
ప్రేమపాటల పల్లవులన్నీ పనిగట్టుకొని మరీ మమ్ములను పలుకరించగా,
మేము పరవశ ప్రపంచమున ప్రవేశించబోతూ.....ఉన్నాము.
అంతట ఓ దుష్ట మానవుడు (ఆతనిని ఆంగ్లమున friend అందురు, హతవిధీ!) ఒకింత విసుగుతో(అది వాని ఏడ్పు వలన సంభవించెనని మా ఘట్టి విశ్వాసము), మీరెందులకో మము పిలుచు చున్నారని మాకందించెను. అది మేమురగమనా? ఆ మూర్ఖుడి మూఢత్వముగాక. పోనిమ్ము, ఆతని మస్తిష్కమున ప్రణయ ప్రదేశము బహు పల్లముగాబోలని పరిత్యజింతిమి. జింతి, మేము మళ్లీ ఆ ప్రపంచ ప్రవేశద్వారమున చొరబడుటకు సకల యత్నములు సలుపుచుంటిమి.
మెదలని మమ్ము, ఈమారు వాడు మరింత ఆవేశముతోడ, చేయిపట్టి కుదిపెను. అతగాణ్ణి అలరించుట అంతటితో ఆపి, "ఏమని" విసిగితిమి. వాడు, విలయ కాలపు వయోలిన్ వలే వెర్రి నవ్వోటి నాపై రువ్వి,అధ్యాపకురాలి వైపు దారిచూపెను. అప్పుడర్థమాయెను మాకసలు సన్నివేశము. పిలిచినదెవరో, పలకనిదెవరో. ఆ సమయమున ఆ ప్రాంగణమంతయూ యమలోకము వలే, త్రోవజూపిన ఆనా మిత్రుడు యమునిముందుకి తోసిన చిత్రగుప్తులవారి వలే తోచెను. ఆ పాలరాతి గచ్చుపై వణుకుచున్న మదీయ స్వరుపము, అంకాళమ్మ చుట్టు ప్రదక్షిణలు సమర్పించు మేకపొతునే స్ఫురింపజేసెను. దానికితోడు, క్రితము దినము ఆమె ఫెట్టిన పరీక్ష ఎగ్గొటితిమని ఙ్ఞప్తికి వచ్చి చచ్చెను. ఆమెకి మాత్రము రావలదని ఇష్తదైవము రాముల వారిని వేడితిమి. ఆయన కష్టము తప్పదనెను.అంతేనా యంటిమి(ఇంకేం కావలని అడుగుతారని)."కాక, మీ కేశసంపదపై మాకేమాత్రము వ్యామోహము లేద"నెను, నిర్దక్షిణ్యముగా. అని, ఆమె చేత అదియే అడిగించెను.
తడుముకొనుట మాకవమానముగాన, టక్కున ఉత్తరమిచ్చితిమి "చదువని కారణాన, పరీక్షకి హాజరు కాలేకపోతిమని". అందులకామె కళ్లు కాసారములవలే విచ్చుకొన, "ఇప్పుడిటుల కూడా సమాధానములు(సాకులని కాబోలు) చెప్పుచుండిరా" యనెను. "కాక, ఇంకనూ అనారోగ్యమనియో, ఊరేగితిమనియో, అని చెప్పెదమనుకొంటిరా" అనుకుని మా సృజనని మేమే మెచ్చుకొంటిమి.అంత ఇంకొక అధ్యాపకుడు వచ్చి పిలువగా,చెరనుండి నన్ను విముక్తుని గావించి, ఆమె ఆతనితో చనెను(బహుశా, మేయుటకని మేమనుకుంటిమి). మేము విజయగర్వాన, సహాధ్యాయీల (అసూయతో అలంకరింపబడిన)చిరునవ్వుల నడుమ మా మేజా చేరితిమి. విజయొత్సవాలు సలిపితిమి.


మీకు మాత్రమే(ఆంతరంగికులైననూ, అనుంగులైననూ వారి సమక్షమున మీరిది చదువుట మాకసమ్మతము): కానీ, మునుపటి మా మైమరపుకి కారణమైన మీ చుర చూపు మాత్రము, మా కళ్లను చీల్చుకుని, మనసును చేరి, మధుర ఙ్ఞాపకమై నిలిచెను. అప్పుడప్పుడు మా మనోఫలకమందు ప్రదర్శింపబడు ఈ చిత్రరాజమును మీకీదినము మిక్కిలి మక్కువతో ప్రదర్శించితిమి. మ్మిమ్ములను మీరు కాంతురని.

Wednesday, January 4, 2012

దీనమ్మ జీవితం....!


దీనమ్మ జీవితం....,
ఇది కుడా ఆడదే, ప్రతిక్షణం దీన్ని ప్రేమిస్తున్నట్లు proove చెయ్యాలి.....!
(ఆడవారికి క్షమాపణలతో....)